EVERYDAY WE ARE PRAYING for - CT ADS @ 8142229281 - ( @ Sri.B.Rajarao BA LLB., St.MARY'S INFANT school, near muncipal park, proddatur.) * ( @ SURI STICKER SHOP , Proprietor.Sri.B.Suresh Babu, Four road circle, Holmaspeta, Proddatur.) * ( @ Sri.B.Ramesh Babu B.Ed.,LLB., RSR UP ENGLISH MEDIUM SCHOOL, Vaddhiraala.) * ( @ CHRIST TEMPLE family) * ( @ KEERTHANA SEVA SAMITHI , President.Sri.Munagi Raju, Secreatary.Srikanth, Joint Secreatary.Narasimha, Vasanthapeta, Proddatur.) * ( @ AMARESHWAR CEMENT WORKS, Proprietor.Sri.K.Kondal rao, near kotthapally bypass road, mydukur road, proddatur ) * ( @ MALLEMU KONDA CEMENT WORKS, Proprietor.Sri.K.Shivayya, near reliance petrol bunk, teachers colony, mydukur road, proddatur ) *
...Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm in Proddatur. For more Details : +91 8142229281...

Tuesday, 30 November 2021

కయీను పశ్చాతాపం..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- కయీను పశ్చాతాపం..

🔸సృష్టిలో జన్మించిన మొట్టమొదటి మానవుడు 
🔸వ్యవసాయకుడు 
🔸మొట్ట మొదటి నరహంతకుడు 
🔸సహోదరుని ప్రేమించలేని వాడు 
🔸కోపం, ద్వేషం కలిగినవాడు 
🔸సత్క్రియలు లేనివాడు 
🔸దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణ అర్పించలేనివాడు. 
🔸దేవునిమీద ఎదురు తిరిగినవాడు 
🔸రక్తం ప్రార్ధించడానికి కారకుడు 
🔸నేల తన సారాన్ని కోల్పోవడానికి కారకుడు.
🔸దేవునిచే శపించబడినవాడు 
🔸దేశ దిమ్మరి 

సృష్టిలో అత్యున్నతమైన సృష్టముగా దేవుడు మనిషిని సృష్టించారు. తలిదండ్రుల జన్మనివ్వడం ద్వారా భూమిమీదకు ఏతెంచనున్న మొట్టమొదటి మనిషిగా కయీనును దేవుడు నిర్ణయించారు. అంటే, కయీనుపట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళికవుందనే విషయం సుస్పష్టం. అయితే దేవుడు అతనిపట్ల కలిగియున్న ప్రణాళిక నెరవేరకుండా, తనకివ్వబడిన స్వేచ్ఛను కయీను వాడుకొని, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు. తాను అర్పించిన అర్పణ ద్వారా దేవునిని సంతోషపరచలేక పోవడమే కాకుండా, తన 
సహోదరుడైన హేబెలును చంపి, తన పాపమును ఒప్పుకొనక, కప్పుకొని, తనను సృష్టించిన దేవునిమీదే తిరుగుబాటు చేసాడు. దాని ఫలితం శాపం. 

🍥దేవుని శాపము :

కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.  -ఆది 4 : 11,12

🍥కయీను ప్రార్ధన:

అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. (ఆది 4 : 14)

“నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది” అని కయీను ప్రార్ధిస్తున్నాడంటే? అతడు చేసినది దోషము అని అతనికి తెలుసు. దోషము అంటే? తప్పు అని తెలిసికూడా చెయ్యడం.  హేబెలును చంపడం దోషము అని, దానికి శిక్ష వుంటుందనే విషయం కూడా తన మనస్సాక్షికి  తెలుసు. తప్పును ఒప్పుకోలేకపోయినాగాని, శిక్షనుండి విడిపించబడుట కొరకు మాత్రం ప్రార్ధించగలిగాడు. 

🍥ప్రార్ధనా ప్రతిఫలం:

అందుకు యెహోవా అతనితో కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండున (ఆది 4 : 15)

కృపగలిగిన దేవుడు కయీను ప్రార్ధన ఆలకించారు. అతనిని బ్రతుక నిచ్చియుండుటకు గాను, అతనిని చంపినవానికి ఏడంతల శిక్షను విధిస్తూ, అతనికి ఒక గుర్తును వేశారు. ( అది నుదుట మీద ఒక మచ్చ అయ్యుండొచ్చు అనేది కొందరి అభిప్రాయం. గాని, బైబిల్ చెప్పని విషయాన్ని సమర్ధించలేము) ఏది ఏమైనా అతనిని చంపకుండా గుర్తుపట్టేందుకు ఒక గుర్తును వేశారు అనేది మాత్రం వాస్తవం. 

🍥 ముగింపు: 

నీ జీవితంలో ఎన్నిసార్లు దేవునితో ఎదురాడునప్పటికీ పశ్చాత్తాపముతో ఆయన శరణువేడితే నిన్నెంత మాత్రమూ త్రోసివేయరు. నీ ప్రార్థనకు ప్రతిఫలాన్నిస్తారు. ఆరీతిగా మనజీవితాలను సిద్ధపరచుకొని ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Monday, 29 November 2021

చచ్చిపోవాలని అనుకోవద్దు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- సమస్య వస్తే పోరాడాలి కాని..చచ్చిపోవాలని అనుకోవద్దు..

తాను ఒక దినప్రయాణము
 అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను. 1రాజులు 19 : 4

🔹ప్రార్ధించిన వ్యక్తి: ఏలియా
🔹దేనికొరకు : తన ప్రాణమును తీసుకొమ్మని 
🔹సందర్భము: యెజెబెలు తనను చంపజూచినప్పుడు 

కర్మెలు పర్వతం మీద 850మంది బయలు, అషారాదేవి ప్రవక్తలమీద సవాలు విసిరి, ఆకాశమునుండి అగ్నినిదింపి, నిజదేవుడెవరో నిరూపించి, ఆ ప్రవక్తలందరిని కీషోను వాగుదగ్గర వధించి, సర్వోన్నతుని శక్తిని లోకానికి చాటిన వ్యక్తి, నేటి దినాన్న, యెజెబెలుకు భయపడి, తన ప్రాణాన్ని తీసుకోమని దేవుని ప్రార్ధించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. 

పౌరుషం కలిగిన ప్రవక్త హృదయమంతా, నిరాశతో నిండిపోయిందా? తద్వారా, ఆయన మానసికంగా కృంగిపోయారా? అయితే, గొప్ప విజయం తర్వాత, ఇట్లాంటివి జరగవచ్చు కూడా. కొన్ని పరిస్థితులు ఎట్లాంటివారికైనా భయాన్ని కలిగించవచ్చు. ఆయనేమి మానవాతీతుడు కాదు. ఆయన కూడా మనవంటి స్వభావము కలిగిన మనుష్యుడే (యాకోబు 5:17). దేవుని సేవకులు దేవునిలో నిర్భయులై, ధైర్యవంతులై ఉన్నప్పటికీ, తమలో తాము పిరికివారును, బలహీనులునై యుండవచ్చు. గెత్సేమనే వనములో కత్తిదూసి ధైర్యాన్ని ప్రదర్శించిన పేతురుగారు, ఆ తరువాత ఒక చిన్నదాని మాటలకు భయపడి, ఆయనెవరో నాకు తెలియదన్నారు ( మత్తయి 26:69-74)

నా పితరులకంటే నేనెక్కువవాడను కానని ఆయన ప్రార్ధిస్తున్నారంటే? తన పితరులకంటే తాను గొప్పవాడిని అనే తలంపు ఆయనలో ఏదైనా మొలకెత్తిందేమో? దీనిని ఏలియా గారు గ్రహించాలని, ఈ పరిస్థితిని దేవుడు అనుమతించారేమో? తెలియదు. కొన్ని సందర్భాలలో దేవుని సేవకులకు నేను ఇతరులకంటే మంచివాడిని కాబట్టే, దేవుడు నాచే గొప్ప కార్యాలు చేయిస్తున్నారనే దుష్ ప్రేరణలు కలుగవచ్చు. 

ఏది ఏమైనా, ఏలియాగారి ప్రార్థనకు సమాధానం రాలేదు. దేవుని ఉద్దేశ్యమే నెరవేరింది. ఏలియా గారు తన ముందు పొంచియున్న ప్రమాదమునుండి తప్పించుకోవడానికి ప్రార్ధించారు గాని, తన శక్తికి మించిన ప్రయాణం ముందుందని ఆయనకు తెలియదు. నా ప్రాణమును తీసుకోమని ప్రార్ధిస్తే? యెహోవా దూతను పంపి ఆయన ప్రాణాన్ని బలపరిచారు. నా పితరుల దగ్గరకు నన్ను చేర్చు అని ప్రార్ధిస్తే? దేవుని పర్వతమైన హోరేబుకు చేర్చారు. 

అనుకూల పరిస్థితులను చూచి పొంగిపోకుండా,  అననుకూల పరిస్థితులను చూచి కృంగిపోకుండా, దేవునికి సలహాలిచ్చే విధంగా కాకుండా, ఆయన చిత్తమేదో మనజీవితాల్లో నెరవేరాలని ప్రార్ధిద్దాం! పొందుకుందాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

- కుటుంబ ప్రార్ధన..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 - కుటుంబ ప్రార్ధన..

మన ఇంటి చుట్టూ కాంపౌండ్ ఎందుకు వేసుకుంటాము? ఒక కంచెలాగా, భద్రత కొరకే కదా? ఇంటికి భద్రత వున్నది. మరి ఇంటిలో ఉన్న మనుషులకు భద్రత ఎట్లా? అది కుటుంబ ప్రార్ధన ద్వారానే సాధ్యం. మన కుటుంబాలలో, దేవునితో సాన్నిహిత్యం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచగలిగేది ఏదైనా ఉందంటే, అది “కుటుంబ ప్రార్ధనే”

క్రైస్తవ కుటుంబములో, కుటుంబ ప్రార్ధన అత్యంత ప్రాధాన్యమైనది. లేకుంటే, పైకప్పు లేకుండా, నాలుగు గోడల మధ్య నివాసం చేసే గృహము ఏ రీతిగా భద్రతలేకుండా ఉంటుందో, అదేరీతిగా కుటుంబ ప్రార్థనలేని గృహాలు, వారి ఆధ్యాత్మిక జీవితాలు అదే రీతిగా ఉంటాయి. కుటుంబ జీవితంలో అనేక సందర్భాలలో కొన్ని మనస్పర్థలు రావడం సహజమే. అయితే, కుటుంబ ప్రార్ధన కలిగిన కుటుంబాలలో ఇవి కొనసాగలేవు. కలసి  ప్రార్థిస్తే ద్వేషము, కోపము, అనుమానాలు తొలిగిపోయి వాటి స్థానంలో ప్రేమ వచ్చి చేరుతుంది. కలిసి ప్రార్థించకపోతే కలసి ప్రేమగా జీవించలేరు. 

ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు  నా నామమున కూడియుందురో  అక్కడ వారి  మధ్యలో నేను వుంటాను అని యేసయ్య చెప్పారు కదా? (మత్తయి ‪18 :20‬ ) మరి ఈరోజు కలిసి ప్రార్థించే మనసే మీకు లేనప్పుడు మీ మధ్యలో లేక మీ ఇంటిలో యేసయ్య ఎలా ఉంటారు? ఒక్కసారి  ఆలోచించండి?

నీ ఇంటిలో కుటుంబ ప్రార్ధన లేకపోవడానికి నీవెన్నో కారణాలు చెప్పొచ్చు. వ్యాపార, ఉద్యోగ బాధ్యతల వల్ల అలసిపోయి కుటుంబ ప్రార్ధన చేయలేకపోతున్నానని. అవి లేకుండా చేసేస్తే ? అప్పుడు ప్రార్ధిస్తావా? మన కుటుంబమును కట్టుకోవడము మనవల్ల కాదు. కానీ కుటుంబ వ్యవస్థను స్థాపించినవాడే కట్టగలడు! ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.

మన ఇంటిలో యేసయ్య వుంటే? మన యిల్లే ఒక చిన్న పరలోకం. లేకపోతే అది దయ్యాలకు నిలయమవుతుంది. 

(యేసయ్య ఉన్న ఇంటిలో పాపాము ఉండదు లూకా 19 ;1 -10) యేసయ్య ఉన్న ఇంటిలో రోగాలు వుండవు(మత్తయి ‪8 :14‬ ,15 )యేసయ్య ఉన్న ఇంటిలో కొదువలు వుండవు (యోహాను 2 :1 -10 ) అట్లా అని రోగాలు లేకుండుట కొరకు, ఏ కొదువ లేకుండుట కొరకు కుటుంబ ప్రార్ధన చెయ్యాలనేది నా ఉద్దేశ్యం కాదు. నిత్యమూ స్తుతి ధూపము మన ఇంటినుండి బయలువెల్లాలి. 

👉మీ ఇంట్లో కుటుంబ ప్రార్ధన ఉందా? లేకుంటే, నేడే నీవు ప్రారంభించాలి. 
👉అది కొంత మందితోనే కొనసాగుతుందా? సంపూర్ణ కుటుంబము ప్రభువు సన్నిధిలో మోకరించే రోజు కొరకు నీవు బహు భారంతో ప్రార్ధించాలి. 
👉ప్రారంభించి మధ్యలో ఆగిపోయిందా? నేడే పునః ప్రారంభం కావాలి. 

నేటి దినాన్న ఒక తీర్మానం చేసి, కుటుంబ ప్రార్ధన ప్రారంభించి చూడు. నిజమైన సమాధానం నీ కుటుంబములోనికి ప్రవేశిస్తుంది. అది అనుభవించే నీకు మాత్రమే అర్ధమవుతుంది. ప్రయత్నించి చూడు. తప్పక నిజమైన సమాధానమును అనుభవిస్తావు. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

- జ్ఞానులవలే నడుచుకొనుడి...

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- జ్ఞానులవలే నడుచుకొనుడి...

దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసి 5:15,16

జీవం, మరణం మన స్వాధీనంలో లేనప్పటికీ, గతించిన కాలంలో మనిషికివున్న బలాన్ని బట్టి, యవ్వనాన్ని  బట్టి, తన ప్రాణానికి కొంత భరోసా వున్నట్లుగా అనిపించేది. అయితే, నేటి దినాల్లో పైకి ఎదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, ప్రాణ భయం వెంటాడుతూనే వుంది. ఒకవైపు తెగుళ్లు మనిషిని వెంటాడుతుంటే, మరొక వైపు మనిషే మానవత్వం విడచి, మానభంగాలు, మారణహోమం సృష్టిస్తున్నాడు. ఏదిఏమైనా మన కళ్ళముందున్న పరిస్థితులు, మనము వింటున్న వార్తలను బట్టి, రాబోయే రేపటిదినం కంటే, గడచిన నిన్నటి దినమే మంచిదనిపిస్తుంది. కారణం దినములు చెడ్డవి. అట్లా అని చెడ్డదినాలను దేవుడు నియమించలేదు గాని, మనిషి జీవించే జీవితమే చెడ్డ దినాలకు కారణమవుతుంది. దినాలు చెడ్డవి అవుతున్నాయంటే, దేవుని కృప దూరమవుతుందనేది స్పష్టం. అంటే, కృపాకాలం ముగించబడితే, దేవుని రాకడ  సమీపమనేది మరింత స్పష్టం. 

💮  చెడ్డ దినములలో మనమేమి చెయ్యాలి?

దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, 
అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి. (ఎఫెసీ 5:15-18)

♻️ సమయాన్ని సద్వినియోగపరచాలి:

దేవుడిచ్చిన సమయం అదొక వరం. ఆ సమయాన్ని ఏ  రీతిగా ఉపయోగించుకొంటున్నామనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. (జెఫన్యా 2:1)
గాలికి ఎగిరిపోయిన పొట్టు అదెప్పటికీ మనకు కనబడదు. సమయం కూడా అంతే. గతించిపోయిన సమయం మరెన్నటికి తిరిగిరాదు. మనము గడిపే ప్రతీ క్షణం అత్యంత ప్రాముఖ్యమైనది. కొన్ని క్షణాలు ఎంతటి విలువైనవో, పరుగుపందెములో సిల్వర్ మెడల్ పొందిన వ్యకికి బాగా అర్ధమవుతుంది. దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని ఎట్లా టైం పాస్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాము తప్ప, ఎట్టిరీతిగా సద్వినియోగ పరచుకొంటున్నాము అనే కనీస తలంపులేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని. తర్వాత దానిని కొరకు కన్నీళ్లు విడచుచూ శ్రద్ధగా వెదకినాగాని, దానిని పొందుకోలేకపోయాడు. (హెబ్రీయులకు 12:17)
ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. (2 కొరింథీ 6:2) ఇక వాయిదాలు వెయ్యొద్దు. 

♻️ జ్ఞానులవలే నడుచుకోవాలి:

జ్ఞానులు అంటే? దేవుని నీతి, న్యాయములను అనుసరిస్తూ, ఆయన చిత్తానుసారం జీవించేవారు. 

జ్ఞానం అంటే? యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము (యోబు 28:28)

🔸యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము (సామెతలు 1:7)

🔸మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను,  (యాకోబు 1:5)

🔸పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది (యాకోబు 3:17)

 🔸జ్ఞానమును కొనియుంచు కొనుము. (సామెతలు 23:23)

🔸జ్ఞానము కలిగి నడుచు కొనుడి.(కొలస్సి 4:5)

♻️ ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి:

ప్రభువు యొక్క చిత్తమును ఎట్లా గ్రహించగలము? లోకమర్యాదను విడచిపెట్టి, సజీవయాగముగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించి, మనస్సు మారి, రూపాంతరము చెందాలి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
రోమీయులకు 12:1,2

♻️ మద్యముతో మత్తులు కావొద్దు:
🔸మద్యం వలన అల్లరి పుట్టును. సామెతలు 20:1
🔸మద్యం వలన జ్ఞానము లేనివారు 
అగును. సామెతలు 20:1
🔸మద్యం వలన శ్రమలు, దుఃఖము, గాయములు కలుగును. సామెతలు 23:29,30
🔸మద్యం వలన ఆజ్ఞలు మరతురు. సామె 31:4,5
🔸మద్యం వలన పరలోకం వెళ్లలేరు. 1కొరింది 6:10
🔸నరకానికి వెళ్లెదరు. మత్తయి 24:49-51, ప్రకటన 14:10
🔸త్రాగుబోతులకు శ్రమ. యెషయా 5:22
అందుచే, ఇటువంటి త్రాగుబోతులతో సహవాసము చేయకూడదు. (సామెతలు 23:20)

♻️ ఆత్మ పూర్ణులైయుండుడి.

ఆత్మతో నింపబడుట ప్రత్యేకమైన అనుభవం, ఆత్మతో నింపబడుటయే ప్రతీ విశ్వాసిపట్ల దేవుని చిత్తము. ఆత్మతో నింపబడిన వారు ఆత్మ ఆధీనంలో వుంటారు. అందుచే మన జీవితాంతం ఆత్మతో నింపబడుతూనే ఉండాలి. 

👉 యేసు ప్రభువు, యోహాను, స్తెఫను మరియు పౌలు మొదలగువారు ఆత్మతో నింపబడ్డారు. ( లూకా 4:1; 1:15 అపో. కా 7:55; 13:9; 4:1)
👉పరిశుద్ధాత్మ తో నిండినవారై ( అపో కా. 2:4)
👉ఆత్మతో నిండినవారై వాక్యమును ధైర్యముగా బోధించిరి ( అపో కా. 4:31)

ప్రియులారా! అంత్య దినాలలో, చెడ్డ దినాలలో జీవిస్తున్న మనము ఇట్లాంటి జీవితాన్ని జీవించగలిగితేనే తప్ప, శాశ్వతమైన, సమాధానకరమైన మంచి దినాలలోనికి ప్రవేశించలేము. వాక్యానుసారముగా మన జీవితాలను మలచుకొంటూ నిత్యమూ ప్రభువుతో జీవించెదము.  అట్టి కృప, ధన్యత ప్రభువు  మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

- కాకులు నేర్పించే పాఠం..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- కాకులు నేర్పించే పాఠం..

కాకుల సంగతి విచారించి చూడుడి...-లూకా 12:24

♻️ కాకులు ఐక్యతకలిగి వుంటాయి:

కాకులకు చిన్న ఆహారం కనిపించినా చాలు, వాటి స్వార్ధం కోసం చూచుకోకుండా, కావ్ కావ్... అంటూ మిగిలిన కాకులన్నింటిని పిలుస్తాయి. ఒక కాకికి నష్టం వాటిల్లితే, మిగిలిన కాకులన్నీ వచ్చి చేరుతాయి. మనము ఒక కాకికి హానితలపెట్టినా గాని, కాకులన్నీ గుంపు గూడి మన వెంటబడి తరుముతాయి. కావ్ కావ్ మంటూ పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తాయి. దీనినిబట్టి మనకు అర్ధమవుతుంది అవెంత ఐక్యంగా వుంటాయో! కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నానని చెప్పుకొనే మనిషి ఎంతటి దయనీయమైన స్థితికి దిగజారిపోయాడంటే? ప్రాణాపాయస్థితిలోనున్న మనిషిని సెల్ ఫోన్ లో చిత్రీకరించి పేస్ బుక్ లో పోస్ట్ చెయ్యడానికి ఆరాటపడుతున్నాడుగాని, సాటిమనిషిని పట్టించుకొనే స్థితిలో లేడు.

చిన్నప్పుడు మనమంతా పాఠ్య పుస్తకాలలో చదివినవాళ్ళమే. చలి చీమలన్నీ కలిస్తే సర్పాన్ని చంపేస్తాయి. గడ్డి పరకలన్నీ కలసి తాడుగా ఏర్పడితే, బలమైన ఏనుగును సహితం బంధించేస్తాయి. ఇట్లా కోకొల్లలు. పరిశుద్ధ గ్రంధములో కూడా ఐక్యతను గూర్చిన అనేకమైన అంశాలున్నాయి. నలుగురు కుష్టు రోగుల ఐక్యత, షోమ్రోను పట్టణానికి ఆహారం పెట్టడానికి కారణమయ్యింది.

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! కీర్తనలు 133:1

♻️ఐక్యత లేదంటే?
(అది కుటుంబమైనా లేదా సంఘమైనా లేదా సమాజమైనా ఏదైనా కావొచ్చు! )

🔸ప్రేమ లేదు
🔸సమాధానం లేదు
🔸తగ్గింపులేదు
🔸క్షమించే మనస్సు లేదు
🔸ఒకరిపట్ల మరొకరికి గౌరవం లేదు
🔸ప్రేమ స్థానాన్ని అసూయ, ద్వేషాలు ఆక్రమించాయి.
🔸కక్ష్యలు కార్పణ్యాలు రాజ్యమేలుతున్నాయి.

అయితే,
🔸దేవుని పిల్లల్లో ఐక్యత వుండి తీరాలి.
🔸అది మంచిది
🔸మనోహరమైనది
🔸అది దేవుని ప్రేమ ఫలితం
🔸అది దేవుని సంకల్పం

♻️ ఐక్యతను జాగ్రత్తగా కాపాడుకోవాలి:

మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎఫెసి 4:1-3

♻️ ఐక్యత అనేది అహరోనును అభిషేకించిన తైలముతో పోల్చబడినది:

అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును. -కీర్తనలు 133 : 2

ప్రప్రథమమైన ప్రధాన యాజకునిగా అహరోను అభిషేకింపబడిన నూనె
🔸ప్రత్యేకమైనది
🔸పవిత్రమైనది
🔸పరిమళభరితమైనది

ఇట్లాంటివాటితో ఐకమత్యము పోల్చబడుతుందంటే? మన ఐక్యత క్రీస్తు ప్రేమలో ప్రత్యేకమైనదిగాను, పవిత్రమైనదిగాను, అనేకులకు పరిమళ వాసనగాను వుండగలగాలి. అనగా అనేకులను క్రీస్తువైపుకు ఆకర్షించాలి. అనేకులను సంతోషభరితులను చెయ్యాలి.

♻️ ఐక్యతనున్నచోట ఆశీర్వాదము

సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు. కీర్తనలు 133:3

సీయోను - ప్రేమ, సత్యాలలో ఐక్యమైన దేవుని ప్రజల మధ్య దేవుని దీవెనలు ఉంటాయి. అక్కడ దేవుడు శాశ్వత జీవాన్నిచ్చే తన కృపా ప్రవాహాలను ఉంచుతారు. ఎక్కడంటే? ఐక్యతనున్న చోట.

 అశాశ్వతమైన లోకంలో జీవిస్తూ, కక్ష్యలు, కార్పణ్యాలతో ఐక్యతను కోల్పోయి, నిత్యమైన ఆశీర్వాదాలు కోల్పోవద్దు. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

మాంత్రికుల శక్తి v/s దేవుని శక్తి..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మాంత్రికుల శక్తి v/s దేవుని శక్తి..

మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా 
యెహోవా మోషే మాటచొప్పున చేసెను. (నిర్గమ 8:12,13)

ఐగుప్తు దాస్యములో మ్రగ్గిపోతున్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి మోషే, అహరోనులు దేవుడు పంపించారు. అయితే, దేవుడు ముందుగానే తెలియజేసారు, ఫరో అంత తేలికగా నా ప్రజలను పంపించడని. దేవుని మాట చొప్పన ఫరో ఎదుట, మోషే, అహరోనులు అద్భుతాలు చెయ్యడం మొదలుపెట్టారు. కర్రను పాముగా మార్చారు. ఐగుప్తు మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. చివరకు అహరోను కర్ర.  ఆ మాంత్రికులు కర్రలను మ్రింగివేసింది. రెండవసారి నీటిని రక్తంగా మార్చగా. ఆ మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. మూడవసారి నదిలోని కప్పలను ఐగుప్తీయుల ఇండ్లలోకి రప్పింపగా. ఐగుప్తీయుల మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. దేశమంతా కప్పలతో నిండిపోయాయి. చివరకు పిండి పిసికే తొట్లలోకూడా కప్పలు. అడుగుతీసి అడుగువేస్తే కప్పలే. మోషే, అహరోనులవలే మాంత్రికులు నదీలోనున్న కప్పలను భూమిమీదకు రప్పించగలిగారుగాని వాటిని చంపడానికి గాని, తిరిగి నీటిలోకి పంపించడానికిగాని వారికి శక్తి లేదు. అప్పటికే తాము ఆరాధించే ఐగుప్తు దేవతల శక్తి ఎంతో మాంత్రికులతోపాటు, ఫరోకు కూడా అర్ధమయ్యింది. ఇక చేసేది ఏమి లేక, మొట్టమొదటగా ఫరో కాళ్ళ బేరానికి వస్తున్నాడు. కప్పలను వెళ్ళగొట్టండి, ఈ ప్రజలను యెహోవాకు బలి అర్పించడానికి పంపిస్తానని. 

అందుకు మోషే ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును, మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లునూ ప్రార్థిస్తానని,  యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతని కొరకు మొఱ పెట్టగా యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయాయి. ఆ దినాలలో ఐగుప్తీయులు ఆరాధించే దేవతలలో కప్పలకు కూడా స్థానముంది. ఇప్పుడు యెహోవా, ఆ దేవతలకంటే శక్తిమంతుడని రుజువయ్యింది. 

అయితే ఫరో కూడా మనవంటి స్వభావం కలిగినవాడే. అవసరం తీరింది. ఉపశమనం కలిగింది. మరలా అతని హృదయం కఠినమయిపోయింది. ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో తీర్మానాలు చేసి, ప్రార్ధించి, పొందుకున్న తర్వాత, మనము తీసుకున్న తీర్మానాలే గుర్తులేకుండాపోయిన సందర్భాలెన్నో కదా? అయితే, వాటి ప్రతిఫలాలు అత్యంత బాధాకరం. 

ప్రియులారా! మనము ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త, సర్వాధిపతి, మన ప్రార్ధనలు ఆలకించి, ప్రతిఫలమిచ్చేవాడు. మోషేగారు కొన్నిసాకులు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసినప్పటికీ, చివరకు ఆయనకు లోబడ్డారు. ఆయనచేత ఆశ్చర్య క్రియలు జరిగించాడు దేవుడు. నీవునూ నేటికిని తప్పించుకొనే ప్రయత్నంలోనే వున్నావేమో? వద్దు, ఆయనకు లోబడి, ఆయనపై ఆధారపడి ప్రార్ధించు చూడు, నీ ప్రార్ధన దేవుని సన్నిధికి చేరి ఆశ్చర్య క్రియలు జరిగిస్తుంది. ఆరీతిగా మనజీవితాలను సిద్ధపరచుకొని ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Wednesday, 24 November 2021

- దేవునికి ఇచ్చుటలో నీ వైఖరి ఏమిటి ?

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- దేవునికి ఇచ్చుటలో  నీ వైఖరి ఏమిటి ?

👉 నేను కానుకలు సమర్పించకపోతే, సంఘము నడవదని, సేవకుడు పోషింపబడలేడని,  సంఘమంతా నాపైనే ఆధారపడివుందని నీవు అతిశయిస్తూ ఉన్నట్లయితే, నీయంతటి ఆధ్యాత్మిక దారిద్ర్యంలో కొనసాగుతున్న వ్యక్తి మరొకరు నీ సంఘములో లేరని గుర్తించు. 

-నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము. - సామెతలు 3:9

ఈ సందేశం చదువుతున్న ప్రియ సహోదరీ,సహోదరులారా మీ కోసం కన్నీళ్ళతో ప్రార్థన చేసిన సేవకుని క్షేమం గురించి ఎప్పుడైనా ఆలోచించావా ? పరిస్థితులు బాగులేనప్పుడు కన్నీళ్ళతో పాస్టరయ్య...అంటూ సేవకుడు, సంఘం గుర్తుకొస్తుంది , పరిస్థితులు చక్కబడిన తర్వాత సేవకుడు గుర్తు రారు, సంఘము గుర్తు రాదు కదా..చాలా మంది విశ్వాసులు ఇలాగే వుంటున్నారు. సంఘం అవసరతలు గురించి ఆలోచించావా ? మీ దశమ భాగం పురుగులు కు వెస్తున్నావా ? లేక సంఘానికి సేవ కోసం ఇస్తున్నావా ? ఆలోచించు..సేవకుడు సంఘంలో గుర్తు చేశాడంటే, సేవా అవసరత కోసం సేవకుడు నిన్ను ప్రత్యేకంగా నిన్ను అడిగాడంటే ఆ అవసరత గుర్తించు, చేతనైతే నీ సహాయం చెయ్యి..దేవుడు చెప్పినట్లు వాక్యానికి లోబడు.. అంతే కానీ సేవకుని, సంఘాన్ని బిచ్చగాడి వలె, చీప్ గా చూడకు...ఎందుకో తెలుసా సేవకులను దేవుడు అగ్ని దూతలుగా చేసుకున్నాడు. అందుకే వారు అడుగు పెడితే ఆశీర్వాదం..ఇది సేవకులకు దేవుడు ఇచ్చిన ధన్యత.

👉 “యేసు స్వామీ .... నీకు నేను నా సమస్త మిత్తును” అంటూ సాగడదీసుకొంటూ పాడి, ‘టంగ్ మంటూ’ ముష్టివానికేసినట్లు ఒక రూపాయి బిళ్ళ కానుక పెట్టెలో పడేస్తున్నావా ? నిజంగా నీదగ్గర లేకపోతే, రెండుకాసులు వేసి, ప్రభువు మెప్పును పొందిన విధవరాలివలే నీవునూ అట్టి మెప్పును పొందగలవు. అట్లా కాకుండా,  నోట్స్ అన్ని బీరువాలో దాచి,లాకర్ లో దాచి, రాయల్ గా వేలల్లో షాపింగ్స్, రాయల్ గా ఫ్యామిలీతో కాస్ట్లి హోటల్ డిన్నర్స్ చేస్తూ కాని చర్చి కి వచ్చేసరికి, సేవకుని ఇవ్వాలి అనేసరికి సనుగుతు, గొణుగుతూ మాత్రం ప్రభువుకు సమర్పించావంటే, నీవు పొందుకొనే ఆశీర్వాదాలు కూడా అట్లానే ఉంటాయి. నీవు ప్రేమించే నోట్స్ మాత్రం హాస్పిటల్ వైపు పరుగులు తీస్తానంటాయి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే నా జీవితంలో నేను నేను పరిపూర్ణంగా రక్షణ పొందనప్పుడు దేవునికి ఇవ్వకుండా దేవుణ్ణి ,సేవకుని మోసం చేసినప్పుడు ఎన్నో సమస్యలు, అనవసర ఖర్చులు చూసాను..అయ్యో పొరపాటు చేసానే..అని ఎంతో ఏడ్చాను కూడా..

👉 షాప్స్ అన్ని తిరిగేసి, ఇంకెక్కడా మారదని చెప్పిన నోట్ తీసుకొచ్చి, సీక్రెట్ గా చందా సంచిలో వేసేయ్యకు.. దేవునికి సమర్పించేదేదైనా శ్రేష్ఠమైనదే సమర్పించు. 

👉 కానుకలు సమర్పించే సమయంలో మెల్లగా లేచి బయటకు వెళ్లిపోవద్దు. నిజంగా సమర్పించడానికి నీ దగ్గరలేకపోతే ఆ విషయం ప్రభువుకు తెలుసు. కానుక వెయ్యడానికి డబ్బులు లేవు, వెయ్యకపోతే ప్రక్కవారు ఎదో అనుకుంటారని, మందిరానికి వెళ్లడం మానెయ్యొద్దు. 

👉 తప్పదు అన్నట్లు, ఇష్టం లేకుండా కష్టంగా ఏది దేవునికి సమర్పించొద్దు. కయీను , హేబెలు అన్నదమ్ముల అర్పణ లో ఎవరి కానుక దేవుడు అంగీకరించాడో గుర్తు చేసుకో...

👉 ఒకాయన మందిరానికి ఫ్యాన్ బహూకరించి, స్పీడ్ గా తిరగడానికి వీల్లేదన్నాడట. ఫ్యాన్ రెక్కల మీద వ్రాయబడిన తనపేరు కనబడదని. కుర్చీ వెనుక పేరు, బెంచీ వెనుకపేరు, చేతితో పట్టుకున్న మౌత్ మీద పేరు, ఏది యిస్తే దాని మీద పేరు. మనుష్యుల ఘనతను కోరుకొనే నీవు, దేవునినుండి పొందేదేమీలేదని గ్రహించు. 

చివరిగా ఒక్కమాట! 
నీ హృదయాన్ని దేవునికి సమర్పించకుండా, లక్షలు చెల్లించినాగాని అవి దేవునిచేత అంగీకరించబడవు అనే విషయం మాత్రం మరచిపోవద్దు. మొదట హృదయాన్ని తర్వాత శ్రేష్టమైన కానుక దేవునికి అర్పించి దీవెనలు పొందుదాము. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Tuesday, 23 November 2021

శత్రువులపై పగ...

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- శత్రువులపై పగ...

అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి (న్యాయాధి 16:28) 

సంసోను:
▫️నాజీరు చేయబడినవాడు 
▫️అత్యంత బలశాలి 
▫️సింహమును చీల్చివేసిన వీరుడు., 
▫️ఇనుప గుమ్మమును పెకలించి విసిరివేయగలిగిన వీరుడు.  
▫️౩౦౦ నక్కలను పట్టుకొని ఫిలిష్తీయుల పంటలను నాశనము చేసినవాడు. 
▫️పచ్చి గాడిద దవడ ఎముకచే వెయ్యి మందిని చంపిన ధీరుడు. 
▫️ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి 
▫️విశ్వాసవీరుడు (హెబ్రీ 11:32)

సంసోను ప్రార్ధించిన రెండు సందర్భాలను మాత్రమే లేఖనాలలో వ్రాయబడినట్లు గ్రహించగలము. 
1. పచ్చి గాడిద దవడ ఎముకచే వెయ్యి మందిని హతమార్చి, తాను దప్పికతో నున్నప్పుడు ప్రార్ధించిన సందర్భం. 
2. దాగోను దేవతా గుడి స్థంభాలకు వ్రేలాడుతూ, శత్రువులమీద పగ తీర్చుకొనుటకు తాను చేసిన చివరి ప్రార్ధన 

నేటి దినాన్న సంసోను ప్రార్ధించిన రెండవ సందర్భాన్ని ద్యానింతము. 

దేవుని కొరకు ప్రతిష్ట చేయబడిన సంసోను, వేశ్యా సాంగత్యంతో చివరికి శత్రువుల చేతికి చిక్కాడు. ఏ కన్నులైతే వేశ్యను చూచాయో ఆ రెండు కన్నులూ పెరికివేయబడి, గానుగ విసిరే దయనీయమైన స్థితికి చేరుకున్నాడు. మరికొద్దిసేపట్లో దాగోను దేవతకు బలిగా మారబోతున్నాడు. అయితే, సంసోను చేసిన రెండు ప్రార్ధనలో మొదటిది పరోక్షంగా తన ప్రాణమును శత్రువుల చేతికి అప్పగించొద్దని ప్రార్ధించగా, రెండవ సందర్భములో శత్రువుల ప్రాణాలను అప్పగింపమని ప్రార్ధిస్తున్నాడు. శత్రువులపై పగ తీర్చుకోవడానికి ఒక్క అవకాశం దయచేయమని దేవునిని ప్రార్ధిస్తున్నాడు. నా రెండు కళ్ళూ పెరికేసారు. అందుచే వారి ప్రాణాలను నాకప్పగించు అన్నట్లుగా వుంది, పగ, ద్వేషం తప్ప ఏ మంచి ఆ ప్రార్ధనలో కనబడదు. అయినప్పటికీ అతని ప్రార్ధన అంగీకరించబడింది. “ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను. (న్యాయాధి 16:28,29) 

ప్రియ నేస్తమా! మనలో ఏ మంచి లేనప్పటికీ మన ప్రార్థనలకు సమాధానం వస్తుందంటే? “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు”. (కీర్తనలు 103:14 ) అంతేగాని, మన పరిశుద్ధత, నీతి ఎంత మాత్రమూ కాదు. అట్లా అని, ఎట్లా జీవించినప్పటికీ మన ప్రార్థనలకు సమాధానం వస్తుందని తలంచడం మూర్ఖత్వం అవుతుంది. దేవుని కృపకు కూడా కొన్ని హద్దులుంటాయి. హద్దులు మీరితే కృప, ఉగ్రతగా మారబోతుంది జాగ్రత్త. ధర్మశాస్త్ర కాలంలో శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ప్రార్ధించడం న్యాయమైనదే. కారణం? వారు దేవుని పక్షముగా యుద్ధాలు చేశారు. అయితే, కృపాకాలంలో జీవిస్తున్న మనము మాత్రం పగ, ప్రతీకారం తీర్చుకొనే పనిని దేవునికి అప్పగించి, శత్రువులను క్షమించి వారి కొరకు ప్రార్ధించగలగాలి. ఆరీతిగా మనజీవితాలను సిద్ధపరచుకొని ప్రార్ధించి, ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Monday, 22 November 2021

- పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని, మొబైల్ తీసుకొంటుందా ?

- పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని, మొబైల్ తీసుకొంటుందా ?

- నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. - కీర్తన 119:50

నీ యవ్వనంలో నీవు బైబిల్ మోస్తే? అది నీ వృద్ధాప్యమందు నిన్ను మోస్తుంది.

కానీ, నేటిదినాలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బైబిల్ స్థానాన్ని చాలా వరకు మొబైల్ తీసుకుందనే చెప్పాలి. దేవుని మందిరాలకు సహితం, బైబిల్ లేకుండా మొబైల్ తోనే వెళ్లేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది.

అదేంటి అంటే? మొబైల్ లో పరిశుద్ధ గ్రంధం యాప్ వుంది కదా? అంటూ వాదించేవారు కోకొల్లలు. అవును వున్న మాట వాస్తవమే. పరిశుద్ధ గ్రంధముతో పాటు, అపరిశుద్ధమైన అశ్లీల చిత్రాలు కూడా వున్నాయి. నీవు వద్దనుకున్నా యాడ్స్ రూపంలో అవి దర్శనమిస్తూనే ఉంటాయి. మొబైల్ ని ఒక స్టేటస్ గా చూడొద్దు. బైబిల్ ను మోయడానికి సిగ్గుపడొద్దు.
మొబైల్ నీచేతిలో ఉన్నంత మాత్రాన అది గర్వించదగిన విషయం కాదుగాని, పరిశుద్ధ గ్రంధం నీ చేతిలో వుంటే మాత్రం అది ముమ్మాటికీ గర్వించదగిన విషయమే.

🔅మొబైల్ లో బైబిల్ చదివితే ఏమవుతుంది? 

🔹అది పరిశుద్ధ గ్రంధము అనే అనుభూతి గాని, భయము గాని కలుగదు.
🔹తద్వారా దేవుని సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుభవించలేము.
🔹 ఉపయోగించే విధానం కూడా యాంత్రికంగానే ఉంటుంది. ఏ గ్రంధం తర్వాత ఏ గ్రంధం ఉంటుందో కూడా తెలుసుకోలేనంతటి అజ్ఞానానికి దారితీస్తుంది.
🔹మొబైల్ యాప్ లో కొన్ని పదాలు, కొన్ని వచనాలు కూడా మిస్ అవుతుంటాయి. తద్వారా ఆ లేఖనభాగము యొక్క అర్ధమే మారిపోతుంది.
🔹 మధ్యలో వచ్చే యాడ్స్ మన దృష్టిని, మనసును దేవునినుండి మళ్లించవచ్చు.
🔹మన హృదయానికి హత్తుకొనే విషయాలు అండర్ లైన్ చేసుకోవడానికి గాని, ప్రక్కన వ్రాసుకోవడానికి గాని అనుకూలం కాదు.
🔹ఒకవేళ అట్లాంటి సౌకర్యాలున్నప్పటికీ, ఆ మొబైల్ గాని, ఆ యాప్ గాని మన జీవితాంతం సవ్యంగా పనిచేయదు.
🔹 పరిశుద్ధ గ్రంథములో “ఆత్మ” అనే పదము ను చూచిన వెంటనే. ఏది పరిశుద్దాత్మ? ఏది కాదు? అనే విషయం గుర్తించగలం. మొబైల్ లో అట్లాంటి అవకాశం లేదు. 
🔹 పరిశుద్ధ గ్రంథములో కొన్ని పదాలపై సంఖ్యలిచ్చి వాటి అర్ధాలు, క్రింది భాగంలో వ్రాస్తారు. మొబైల్ లో నంబర్స్ మాత్రమే ఉంటాయి. వాటి అర్ధాలు వుండవు. 
🔹ఒక్కమాటలో చెప్పాలంటే, మొబైల్ పరిశుద్ధ గ్రంథ ధ్యానానికి అనుకూలం కాదు.

🔅మొబైల్ యాప్ ను ఎప్పుడు ఉపయోగించవచ్చు?

🔸ప్రయాణము చేస్తున్నప్పుడు
🔸ఏదైనా పనిమీద వెళ్ళినప్పుడు, అక్కడ కొంత ఖాళీ సమయం దొరికినప్పుడు.
🔸పరిశుద్ధ గ్రంధం దగ్గర లేనప్పుడు, వున్నా, ఓపెన్ చెయ్యడానికి పరిస్థితుల్లో అనుకూలంగా లేనప్పుడు.
🔸లేఖన భాగాలను ఎవరికైనా పంపించాలి అనుకున్నప్పుడు.

🔅పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానం చేస్తే?

🔹పరిశుద్ధ గ్రంధాన్ని చూస్తే భయం పుడుతుంది.
🔹ఆ భయము పశ్చాత్తాపములోనికి నడిపిస్తుంది.
🔹తద్వారా దేవునిపట్ల ఆరాధనా భావం కలుగుతుంది.
🔹బైబిల్ ను చదివేటప్పుడు మన హృదయానికి హత్తుకొనే విషయాలను అండర్ లైన్ చేసుకోవచ్చు.
🔹అవసరమైతే, దేవుడు మనతో మాట్లాడినట్లు అనిపించే విషయాలు అక్కడే వ్రాసుకోవచ్చు.
🔹మనకు కావలసిన వాక్యభాగాల కొరకు వెదకేటప్పుడు, మనకు తెలియకుండానే, మన కన్నులు వాటిమీదకి వెళ్లిపోతాయి. ( కారణం? మన బ్రెయిన్ లో ముద్రపడిపోతుంది. ఆ వాక్యభాగం క్రింద ఉందా, పైన ఉందా, ఎడమ వైపున ఉందా, కుడి వైపున ఉందా, మధ్యలో ఉందా అనేది మనకు అర్ధమవుతుంది.)
🔹మనము తలవని తలంపుగా బైబిల్ ఓపెన్ చేసినప్పటికీ, ఇట్లాంటివన్నీ మనకు కనబడి, గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తాయి.
🔹ఒక్కమాటలో చెప్పాలంటే, పరిశుద్ధ గ్రంథ ధ్యానానికి పరిశుద్ధ గ్రంధమే మిక్కిలి అనుకూలం. మొబైల్ కానేకాదు.

ప్రియ నేస్తమా!

బైబిల్ గ్రంధము బహిరంగముగా పట్టుకొని తిరగడానికి వీలులేని దినాలు అత్యంత సమీపముగానే వున్నాయి. ఆ దినాలలో మొబైల్ యాప్స్ కూడా బ్యాన్ చెయ్యొచ్చు. ఆ పరిస్థితులు రాకముందే పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, ప్రభువు రాకడకై సిద్ధపడు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!