- పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని, మొబైల్ తీసుకొంటుందా ?

- పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని, మొబైల్ తీసుకొంటుందా ?

- నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. - కీర్తన 119:50

నీ యవ్వనంలో నీవు బైబిల్ మోస్తే? అది నీ వృద్ధాప్యమందు నిన్ను మోస్తుంది.

కానీ, నేటిదినాలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బైబిల్ స్థానాన్ని చాలా వరకు మొబైల్ తీసుకుందనే చెప్పాలి. దేవుని మందిరాలకు సహితం, బైబిల్ లేకుండా మొబైల్ తోనే వెళ్లేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది.

అదేంటి అంటే? మొబైల్ లో పరిశుద్ధ గ్రంధం యాప్ వుంది కదా? అంటూ వాదించేవారు కోకొల్లలు. అవును వున్న మాట వాస్తవమే. పరిశుద్ధ గ్రంధముతో పాటు, అపరిశుద్ధమైన అశ్లీల చిత్రాలు కూడా వున్నాయి. నీవు వద్దనుకున్నా యాడ్స్ రూపంలో అవి దర్శనమిస్తూనే ఉంటాయి. మొబైల్ ని ఒక స్టేటస్ గా చూడొద్దు. బైబిల్ ను మోయడానికి సిగ్గుపడొద్దు.
మొబైల్ నీచేతిలో ఉన్నంత మాత్రాన అది గర్వించదగిన విషయం కాదుగాని, పరిశుద్ధ గ్రంధం నీ చేతిలో వుంటే మాత్రం అది ముమ్మాటికీ గర్వించదగిన విషయమే.

🔅మొబైల్ లో బైబిల్ చదివితే ఏమవుతుంది? 

🔹అది పరిశుద్ధ గ్రంధము అనే అనుభూతి గాని, భయము గాని కలుగదు.
🔹తద్వారా దేవుని సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుభవించలేము.
🔹 ఉపయోగించే విధానం కూడా యాంత్రికంగానే ఉంటుంది. ఏ గ్రంధం తర్వాత ఏ గ్రంధం ఉంటుందో కూడా తెలుసుకోలేనంతటి అజ్ఞానానికి దారితీస్తుంది.
🔹మొబైల్ యాప్ లో కొన్ని పదాలు, కొన్ని వచనాలు కూడా మిస్ అవుతుంటాయి. తద్వారా ఆ లేఖనభాగము యొక్క అర్ధమే మారిపోతుంది.
🔹 మధ్యలో వచ్చే యాడ్స్ మన దృష్టిని, మనసును దేవునినుండి మళ్లించవచ్చు.
🔹మన హృదయానికి హత్తుకొనే విషయాలు అండర్ లైన్ చేసుకోవడానికి గాని, ప్రక్కన వ్రాసుకోవడానికి గాని అనుకూలం కాదు.
🔹ఒకవేళ అట్లాంటి సౌకర్యాలున్నప్పటికీ, ఆ మొబైల్ గాని, ఆ యాప్ గాని మన జీవితాంతం సవ్యంగా పనిచేయదు.
🔹 పరిశుద్ధ గ్రంథములో “ఆత్మ” అనే పదము ను చూచిన వెంటనే. ఏది పరిశుద్దాత్మ? ఏది కాదు? అనే విషయం గుర్తించగలం. మొబైల్ లో అట్లాంటి అవకాశం లేదు. 
🔹 పరిశుద్ధ గ్రంథములో కొన్ని పదాలపై సంఖ్యలిచ్చి వాటి అర్ధాలు, క్రింది భాగంలో వ్రాస్తారు. మొబైల్ లో నంబర్స్ మాత్రమే ఉంటాయి. వాటి అర్ధాలు వుండవు. 
🔹ఒక్కమాటలో చెప్పాలంటే, మొబైల్ పరిశుద్ధ గ్రంథ ధ్యానానికి అనుకూలం కాదు.

🔅మొబైల్ యాప్ ను ఎప్పుడు ఉపయోగించవచ్చు?

🔸ప్రయాణము చేస్తున్నప్పుడు
🔸ఏదైనా పనిమీద వెళ్ళినప్పుడు, అక్కడ కొంత ఖాళీ సమయం దొరికినప్పుడు.
🔸పరిశుద్ధ గ్రంధం దగ్గర లేనప్పుడు, వున్నా, ఓపెన్ చెయ్యడానికి పరిస్థితుల్లో అనుకూలంగా లేనప్పుడు.
🔸లేఖన భాగాలను ఎవరికైనా పంపించాలి అనుకున్నప్పుడు.

🔅పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానం చేస్తే?

🔹పరిశుద్ధ గ్రంధాన్ని చూస్తే భయం పుడుతుంది.
🔹ఆ భయము పశ్చాత్తాపములోనికి నడిపిస్తుంది.
🔹తద్వారా దేవునిపట్ల ఆరాధనా భావం కలుగుతుంది.
🔹బైబిల్ ను చదివేటప్పుడు మన హృదయానికి హత్తుకొనే విషయాలను అండర్ లైన్ చేసుకోవచ్చు.
🔹అవసరమైతే, దేవుడు మనతో మాట్లాడినట్లు అనిపించే విషయాలు అక్కడే వ్రాసుకోవచ్చు.
🔹మనకు కావలసిన వాక్యభాగాల కొరకు వెదకేటప్పుడు, మనకు తెలియకుండానే, మన కన్నులు వాటిమీదకి వెళ్లిపోతాయి. ( కారణం? మన బ్రెయిన్ లో ముద్రపడిపోతుంది. ఆ వాక్యభాగం క్రింద ఉందా, పైన ఉందా, ఎడమ వైపున ఉందా, కుడి వైపున ఉందా, మధ్యలో ఉందా అనేది మనకు అర్ధమవుతుంది.)
🔹మనము తలవని తలంపుగా బైబిల్ ఓపెన్ చేసినప్పటికీ, ఇట్లాంటివన్నీ మనకు కనబడి, గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తాయి.
🔹ఒక్కమాటలో చెప్పాలంటే, పరిశుద్ధ గ్రంథ ధ్యానానికి పరిశుద్ధ గ్రంధమే మిక్కిలి అనుకూలం. మొబైల్ కానేకాదు.

ప్రియ నేస్తమా!

బైబిల్ గ్రంధము బహిరంగముగా పట్టుకొని తిరగడానికి వీలులేని దినాలు అత్యంత సమీపముగానే వున్నాయి. ఆ దినాలలో మొబైల్ యాప్స్ కూడా బ్యాన్ చెయ్యొచ్చు. ఆ పరిస్థితులు రాకముందే పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, ప్రభువు రాకడకై సిద్ధపడు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Comments