✝️ CHRIST TEMPLE-PRODDATUR
- కాకులు నేర్పించే పాఠం..
కాకుల సంగతి విచారించి చూడుడి...-లూకా 12:24
♻️ కాకులు ఐక్యతకలిగి వుంటాయి:
కాకులకు చిన్న ఆహారం కనిపించినా చాలు, వాటి స్వార్ధం కోసం చూచుకోకుండా, కావ్ కావ్... అంటూ మిగిలిన కాకులన్నింటిని పిలుస్తాయి. ఒక కాకికి నష్టం వాటిల్లితే, మిగిలిన కాకులన్నీ వచ్చి చేరుతాయి. మనము ఒక కాకికి హానితలపెట్టినా గాని, కాకులన్నీ గుంపు గూడి మన వెంటబడి తరుముతాయి. కావ్ కావ్ మంటూ పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తాయి. దీనినిబట్టి మనకు అర్ధమవుతుంది అవెంత ఐక్యంగా వుంటాయో! కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నానని చెప్పుకొనే మనిషి ఎంతటి దయనీయమైన స్థితికి దిగజారిపోయాడంటే? ప్రాణాపాయస్థితిలోనున్న మనిషిని సెల్ ఫోన్ లో చిత్రీకరించి పేస్ బుక్ లో పోస్ట్ చెయ్యడానికి ఆరాటపడుతున్నాడుగాని, సాటిమనిషిని పట్టించుకొనే స్థితిలో లేడు.
చిన్నప్పుడు మనమంతా పాఠ్య పుస్తకాలలో చదివినవాళ్ళమే. చలి చీమలన్నీ కలిస్తే సర్పాన్ని చంపేస్తాయి. గడ్డి పరకలన్నీ కలసి తాడుగా ఏర్పడితే, బలమైన ఏనుగును సహితం బంధించేస్తాయి. ఇట్లా కోకొల్లలు. పరిశుద్ధ గ్రంధములో కూడా ఐక్యతను గూర్చిన అనేకమైన అంశాలున్నాయి. నలుగురు కుష్టు రోగుల ఐక్యత, షోమ్రోను పట్టణానికి ఆహారం పెట్టడానికి కారణమయ్యింది.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! కీర్తనలు 133:1
♻️ఐక్యత లేదంటే?
(అది కుటుంబమైనా లేదా సంఘమైనా లేదా సమాజమైనా ఏదైనా కావొచ్చు! )
🔸ప్రేమ లేదు
🔸సమాధానం లేదు
🔸తగ్గింపులేదు
🔸క్షమించే మనస్సు లేదు
🔸ఒకరిపట్ల మరొకరికి గౌరవం లేదు
🔸ప్రేమ స్థానాన్ని అసూయ, ద్వేషాలు ఆక్రమించాయి.
🔸కక్ష్యలు కార్పణ్యాలు రాజ్యమేలుతున్నాయి.
అయితే,
🔸దేవుని పిల్లల్లో ఐక్యత వుండి తీరాలి.
🔸అది మంచిది
🔸మనోహరమైనది
🔸అది దేవుని ప్రేమ ఫలితం
🔸అది దేవుని సంకల్పం
♻️ ఐక్యతను జాగ్రత్తగా కాపాడుకోవాలి:
మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎఫెసి 4:1-3
♻️ ఐక్యత అనేది అహరోనును అభిషేకించిన తైలముతో పోల్చబడినది:
అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును. -కీర్తనలు 133 : 2
ప్రప్రథమమైన ప్రధాన యాజకునిగా అహరోను అభిషేకింపబడిన నూనె
🔸ప్రత్యేకమైనది
🔸పవిత్రమైనది
🔸పరిమళభరితమైనది
ఇట్లాంటివాటితో ఐకమత్యము పోల్చబడుతుందంటే? మన ఐక్యత క్రీస్తు ప్రేమలో ప్రత్యేకమైనదిగాను, పవిత్రమైనదిగాను, అనేకులకు పరిమళ వాసనగాను వుండగలగాలి. అనగా అనేకులను క్రీస్తువైపుకు ఆకర్షించాలి. అనేకులను సంతోషభరితులను చెయ్యాలి.
♻️ ఐక్యతనున్నచోట ఆశీర్వాదము
సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు. కీర్తనలు 133:3
సీయోను - ప్రేమ, సత్యాలలో ఐక్యమైన దేవుని ప్రజల మధ్య దేవుని దీవెనలు ఉంటాయి. అక్కడ దేవుడు శాశ్వత జీవాన్నిచ్చే తన కృపా ప్రవాహాలను ఉంచుతారు. ఎక్కడంటే? ఐక్యతనున్న చోట.
అశాశ్వతమైన లోకంలో జీవిస్తూ, కక్ష్యలు, కార్పణ్యాలతో ఐక్యతను కోల్పోయి, నిత్యమైన ఆశీర్వాదాలు కోల్పోవద్దు. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments