✝️ CHRIST TEMPLE-PRODDATUR
- కుటుంబ ప్రార్ధన..
మన ఇంటి చుట్టూ కాంపౌండ్ ఎందుకు వేసుకుంటాము? ఒక కంచెలాగా, భద్రత కొరకే కదా? ఇంటికి భద్రత వున్నది. మరి ఇంటిలో ఉన్న మనుషులకు భద్రత ఎట్లా? అది కుటుంబ ప్రార్ధన ద్వారానే సాధ్యం. మన కుటుంబాలలో, దేవునితో సాన్నిహిత్యం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచగలిగేది ఏదైనా ఉందంటే, అది “కుటుంబ ప్రార్ధనే”
క్రైస్తవ కుటుంబములో, కుటుంబ ప్రార్ధన అత్యంత ప్రాధాన్యమైనది. లేకుంటే, పైకప్పు లేకుండా, నాలుగు గోడల మధ్య నివాసం చేసే గృహము ఏ రీతిగా భద్రతలేకుండా ఉంటుందో, అదేరీతిగా కుటుంబ ప్రార్థనలేని గృహాలు, వారి ఆధ్యాత్మిక జీవితాలు అదే రీతిగా ఉంటాయి. కుటుంబ జీవితంలో అనేక సందర్భాలలో కొన్ని మనస్పర్థలు రావడం సహజమే. అయితే, కుటుంబ ప్రార్ధన కలిగిన కుటుంబాలలో ఇవి కొనసాగలేవు. కలసి ప్రార్థిస్తే ద్వేషము, కోపము, అనుమానాలు తొలిగిపోయి వాటి స్థానంలో ప్రేమ వచ్చి చేరుతుంది. కలిసి ప్రార్థించకపోతే కలసి ప్రేమగా జీవించలేరు.
ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడియుందురో అక్కడ వారి మధ్యలో నేను వుంటాను అని యేసయ్య చెప్పారు కదా? (మత్తయి 18 :20 ) మరి ఈరోజు కలిసి ప్రార్థించే మనసే మీకు లేనప్పుడు మీ మధ్యలో లేక మీ ఇంటిలో యేసయ్య ఎలా ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి?
నీ ఇంటిలో కుటుంబ ప్రార్ధన లేకపోవడానికి నీవెన్నో కారణాలు చెప్పొచ్చు. వ్యాపార, ఉద్యోగ బాధ్యతల వల్ల అలసిపోయి కుటుంబ ప్రార్ధన చేయలేకపోతున్నానని. అవి లేకుండా చేసేస్తే ? అప్పుడు ప్రార్ధిస్తావా? మన కుటుంబమును కట్టుకోవడము మనవల్ల కాదు. కానీ కుటుంబ వ్యవస్థను స్థాపించినవాడే కట్టగలడు! ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.
మన ఇంటిలో యేసయ్య వుంటే? మన యిల్లే ఒక చిన్న పరలోకం. లేకపోతే అది దయ్యాలకు నిలయమవుతుంది.
(యేసయ్య ఉన్న ఇంటిలో పాపాము ఉండదు లూకా 19 ;1 -10) యేసయ్య ఉన్న ఇంటిలో రోగాలు వుండవు(మత్తయి 8 :14 ,15 )యేసయ్య ఉన్న ఇంటిలో కొదువలు వుండవు (యోహాను 2 :1 -10 ) అట్లా అని రోగాలు లేకుండుట కొరకు, ఏ కొదువ లేకుండుట కొరకు కుటుంబ ప్రార్ధన చెయ్యాలనేది నా ఉద్దేశ్యం కాదు. నిత్యమూ స్తుతి ధూపము మన ఇంటినుండి బయలువెల్లాలి.
👉మీ ఇంట్లో కుటుంబ ప్రార్ధన ఉందా? లేకుంటే, నేడే నీవు ప్రారంభించాలి.
👉అది కొంత మందితోనే కొనసాగుతుందా? సంపూర్ణ కుటుంబము ప్రభువు సన్నిధిలో మోకరించే రోజు కొరకు నీవు బహు భారంతో ప్రార్ధించాలి.
👉ప్రారంభించి మధ్యలో ఆగిపోయిందా? నేడే పునః ప్రారంభం కావాలి.
నేటి దినాన్న ఒక తీర్మానం చేసి, కుటుంబ ప్రార్ధన ప్రారంభించి చూడు. నిజమైన సమాధానం నీ కుటుంబములోనికి ప్రవేశిస్తుంది. అది అనుభవించే నీకు మాత్రమే అర్ధమవుతుంది. ప్రయత్నించి చూడు. తప్పక నిజమైన సమాధానమును అనుభవిస్తావు. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments