చచ్చిపోవాలని అనుకోవద్దు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- సమస్య వస్తే పోరాడాలి కాని..చచ్చిపోవాలని అనుకోవద్దు..

తాను ఒక దినప్రయాణము
 అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను. 1రాజులు 19 : 4

🔹ప్రార్ధించిన వ్యక్తి: ఏలియా
🔹దేనికొరకు : తన ప్రాణమును తీసుకొమ్మని 
🔹సందర్భము: యెజెబెలు తనను చంపజూచినప్పుడు 

కర్మెలు పర్వతం మీద 850మంది బయలు, అషారాదేవి ప్రవక్తలమీద సవాలు విసిరి, ఆకాశమునుండి అగ్నినిదింపి, నిజదేవుడెవరో నిరూపించి, ఆ ప్రవక్తలందరిని కీషోను వాగుదగ్గర వధించి, సర్వోన్నతుని శక్తిని లోకానికి చాటిన వ్యక్తి, నేటి దినాన్న, యెజెబెలుకు భయపడి, తన ప్రాణాన్ని తీసుకోమని దేవుని ప్రార్ధించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. 

పౌరుషం కలిగిన ప్రవక్త హృదయమంతా, నిరాశతో నిండిపోయిందా? తద్వారా, ఆయన మానసికంగా కృంగిపోయారా? అయితే, గొప్ప విజయం తర్వాత, ఇట్లాంటివి జరగవచ్చు కూడా. కొన్ని పరిస్థితులు ఎట్లాంటివారికైనా భయాన్ని కలిగించవచ్చు. ఆయనేమి మానవాతీతుడు కాదు. ఆయన కూడా మనవంటి స్వభావము కలిగిన మనుష్యుడే (యాకోబు 5:17). దేవుని సేవకులు దేవునిలో నిర్భయులై, ధైర్యవంతులై ఉన్నప్పటికీ, తమలో తాము పిరికివారును, బలహీనులునై యుండవచ్చు. గెత్సేమనే వనములో కత్తిదూసి ధైర్యాన్ని ప్రదర్శించిన పేతురుగారు, ఆ తరువాత ఒక చిన్నదాని మాటలకు భయపడి, ఆయనెవరో నాకు తెలియదన్నారు ( మత్తయి 26:69-74)

నా పితరులకంటే నేనెక్కువవాడను కానని ఆయన ప్రార్ధిస్తున్నారంటే? తన పితరులకంటే తాను గొప్పవాడిని అనే తలంపు ఆయనలో ఏదైనా మొలకెత్తిందేమో? దీనిని ఏలియా గారు గ్రహించాలని, ఈ పరిస్థితిని దేవుడు అనుమతించారేమో? తెలియదు. కొన్ని సందర్భాలలో దేవుని సేవకులకు నేను ఇతరులకంటే మంచివాడిని కాబట్టే, దేవుడు నాచే గొప్ప కార్యాలు చేయిస్తున్నారనే దుష్ ప్రేరణలు కలుగవచ్చు. 

ఏది ఏమైనా, ఏలియాగారి ప్రార్థనకు సమాధానం రాలేదు. దేవుని ఉద్దేశ్యమే నెరవేరింది. ఏలియా గారు తన ముందు పొంచియున్న ప్రమాదమునుండి తప్పించుకోవడానికి ప్రార్ధించారు గాని, తన శక్తికి మించిన ప్రయాణం ముందుందని ఆయనకు తెలియదు. నా ప్రాణమును తీసుకోమని ప్రార్ధిస్తే? యెహోవా దూతను పంపి ఆయన ప్రాణాన్ని బలపరిచారు. నా పితరుల దగ్గరకు నన్ను చేర్చు అని ప్రార్ధిస్తే? దేవుని పర్వతమైన హోరేబుకు చేర్చారు. 

అనుకూల పరిస్థితులను చూచి పొంగిపోకుండా,  అననుకూల పరిస్థితులను చూచి కృంగిపోకుండా, దేవునికి సలహాలిచ్చే విధంగా కాకుండా, ఆయన చిత్తమేదో మనజీవితాల్లో నెరవేరాలని ప్రార్ధిద్దాం! పొందుకుందాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments