మాంత్రికుల శక్తి v/s దేవుని శక్తి..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మాంత్రికుల శక్తి v/s దేవుని శక్తి..

మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా 
యెహోవా మోషే మాటచొప్పున చేసెను. (నిర్గమ 8:12,13)

ఐగుప్తు దాస్యములో మ్రగ్గిపోతున్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి మోషే, అహరోనులు దేవుడు పంపించారు. అయితే, దేవుడు ముందుగానే తెలియజేసారు, ఫరో అంత తేలికగా నా ప్రజలను పంపించడని. దేవుని మాట చొప్పన ఫరో ఎదుట, మోషే, అహరోనులు అద్భుతాలు చెయ్యడం మొదలుపెట్టారు. కర్రను పాముగా మార్చారు. ఐగుప్తు మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. చివరకు అహరోను కర్ర.  ఆ మాంత్రికులు కర్రలను మ్రింగివేసింది. రెండవసారి నీటిని రక్తంగా మార్చగా. ఆ మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. మూడవసారి నదిలోని కప్పలను ఐగుప్తీయుల ఇండ్లలోకి రప్పింపగా. ఐగుప్తీయుల మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. దేశమంతా కప్పలతో నిండిపోయాయి. చివరకు పిండి పిసికే తొట్లలోకూడా కప్పలు. అడుగుతీసి అడుగువేస్తే కప్పలే. మోషే, అహరోనులవలే మాంత్రికులు నదీలోనున్న కప్పలను భూమిమీదకు రప్పించగలిగారుగాని వాటిని చంపడానికి గాని, తిరిగి నీటిలోకి పంపించడానికిగాని వారికి శక్తి లేదు. అప్పటికే తాము ఆరాధించే ఐగుప్తు దేవతల శక్తి ఎంతో మాంత్రికులతోపాటు, ఫరోకు కూడా అర్ధమయ్యింది. ఇక చేసేది ఏమి లేక, మొట్టమొదటగా ఫరో కాళ్ళ బేరానికి వస్తున్నాడు. కప్పలను వెళ్ళగొట్టండి, ఈ ప్రజలను యెహోవాకు బలి అర్పించడానికి పంపిస్తానని. 

అందుకు మోషే ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును, మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లునూ ప్రార్థిస్తానని,  యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతని కొరకు మొఱ పెట్టగా యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయాయి. ఆ దినాలలో ఐగుప్తీయులు ఆరాధించే దేవతలలో కప్పలకు కూడా స్థానముంది. ఇప్పుడు యెహోవా, ఆ దేవతలకంటే శక్తిమంతుడని రుజువయ్యింది. 

అయితే ఫరో కూడా మనవంటి స్వభావం కలిగినవాడే. అవసరం తీరింది. ఉపశమనం కలిగింది. మరలా అతని హృదయం కఠినమయిపోయింది. ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో తీర్మానాలు చేసి, ప్రార్ధించి, పొందుకున్న తర్వాత, మనము తీసుకున్న తీర్మానాలే గుర్తులేకుండాపోయిన సందర్భాలెన్నో కదా? అయితే, వాటి ప్రతిఫలాలు అత్యంత బాధాకరం. 

ప్రియులారా! మనము ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త, సర్వాధిపతి, మన ప్రార్ధనలు ఆలకించి, ప్రతిఫలమిచ్చేవాడు. మోషేగారు కొన్నిసాకులు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసినప్పటికీ, చివరకు ఆయనకు లోబడ్డారు. ఆయనచేత ఆశ్చర్య క్రియలు జరిగించాడు దేవుడు. నీవునూ నేటికిని తప్పించుకొనే ప్రయత్నంలోనే వున్నావేమో? వద్దు, ఆయనకు లోబడి, ఆయనపై ఆధారపడి ప్రార్ధించు చూడు, నీ ప్రార్ధన దేవుని సన్నిధికి చేరి ఆశ్చర్య క్రియలు జరిగిస్తుంది. ఆరీతిగా మనజీవితాలను సిద్ధపరచుకొని ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments