✝️ CHRIST TEMPLE-PRODDATUR
- శత్రువులపై పగ...
అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి (న్యాయాధి 16:28)
సంసోను:
▫️నాజీరు చేయబడినవాడు
▫️అత్యంత బలశాలి
▫️సింహమును చీల్చివేసిన వీరుడు.,
▫️ఇనుప గుమ్మమును పెకలించి విసిరివేయగలిగిన వీరుడు.
▫️౩౦౦ నక్కలను పట్టుకొని ఫిలిష్తీయుల పంటలను నాశనము చేసినవాడు.
▫️పచ్చి గాడిద దవడ ఎముకచే వెయ్యి మందిని చంపిన ధీరుడు.
▫️ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి
▫️విశ్వాసవీరుడు (హెబ్రీ 11:32)
సంసోను ప్రార్ధించిన రెండు సందర్భాలను మాత్రమే లేఖనాలలో వ్రాయబడినట్లు గ్రహించగలము.
1. పచ్చి గాడిద దవడ ఎముకచే వెయ్యి మందిని హతమార్చి, తాను దప్పికతో నున్నప్పుడు ప్రార్ధించిన సందర్భం.
2. దాగోను దేవతా గుడి స్థంభాలకు వ్రేలాడుతూ, శత్రువులమీద పగ తీర్చుకొనుటకు తాను చేసిన చివరి ప్రార్ధన
నేటి దినాన్న సంసోను ప్రార్ధించిన రెండవ సందర్భాన్ని ద్యానింతము.
దేవుని కొరకు ప్రతిష్ట చేయబడిన సంసోను, వేశ్యా సాంగత్యంతో చివరికి శత్రువుల చేతికి చిక్కాడు. ఏ కన్నులైతే వేశ్యను చూచాయో ఆ రెండు కన్నులూ పెరికివేయబడి, గానుగ విసిరే దయనీయమైన స్థితికి చేరుకున్నాడు. మరికొద్దిసేపట్లో దాగోను దేవతకు బలిగా మారబోతున్నాడు. అయితే, సంసోను చేసిన రెండు ప్రార్ధనలో మొదటిది పరోక్షంగా తన ప్రాణమును శత్రువుల చేతికి అప్పగించొద్దని ప్రార్ధించగా, రెండవ సందర్భములో శత్రువుల ప్రాణాలను అప్పగింపమని ప్రార్ధిస్తున్నాడు. శత్రువులపై పగ తీర్చుకోవడానికి ఒక్క అవకాశం దయచేయమని దేవునిని ప్రార్ధిస్తున్నాడు. నా రెండు కళ్ళూ పెరికేసారు. అందుచే వారి ప్రాణాలను నాకప్పగించు అన్నట్లుగా వుంది, పగ, ద్వేషం తప్ప ఏ మంచి ఆ ప్రార్ధనలో కనబడదు. అయినప్పటికీ అతని ప్రార్ధన అంగీకరించబడింది. “ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను. (న్యాయాధి 16:28,29)
ప్రియ నేస్తమా! మనలో ఏ మంచి లేనప్పటికీ మన ప్రార్థనలకు సమాధానం వస్తుందంటే? “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు”. (కీర్తనలు 103:14 ) అంతేగాని, మన పరిశుద్ధత, నీతి ఎంత మాత్రమూ కాదు. అట్లా అని, ఎట్లా జీవించినప్పటికీ మన ప్రార్థనలకు సమాధానం వస్తుందని తలంచడం మూర్ఖత్వం అవుతుంది. దేవుని కృపకు కూడా కొన్ని హద్దులుంటాయి. హద్దులు మీరితే కృప, ఉగ్రతగా మారబోతుంది జాగ్రత్త. ధర్మశాస్త్ర కాలంలో శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ప్రార్ధించడం న్యాయమైనదే. కారణం? వారు దేవుని పక్షముగా యుద్ధాలు చేశారు. అయితే, కృపాకాలంలో జీవిస్తున్న మనము మాత్రం పగ, ప్రతీకారం తీర్చుకొనే పనిని దేవునికి అప్పగించి, శత్రువులను క్షమించి వారి కొరకు ప్రార్ధించగలగాలి. ఆరీతిగా మనజీవితాలను సిద్ధపరచుకొని ప్రార్ధించి, ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments