- జ్ఞానులవలే నడుచుకొనుడి...

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- జ్ఞానులవలే నడుచుకొనుడి...

దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసి 5:15,16

జీవం, మరణం మన స్వాధీనంలో లేనప్పటికీ, గతించిన కాలంలో మనిషికివున్న బలాన్ని బట్టి, యవ్వనాన్ని  బట్టి, తన ప్రాణానికి కొంత భరోసా వున్నట్లుగా అనిపించేది. అయితే, నేటి దినాల్లో పైకి ఎదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, ప్రాణ భయం వెంటాడుతూనే వుంది. ఒకవైపు తెగుళ్లు మనిషిని వెంటాడుతుంటే, మరొక వైపు మనిషే మానవత్వం విడచి, మానభంగాలు, మారణహోమం సృష్టిస్తున్నాడు. ఏదిఏమైనా మన కళ్ళముందున్న పరిస్థితులు, మనము వింటున్న వార్తలను బట్టి, రాబోయే రేపటిదినం కంటే, గడచిన నిన్నటి దినమే మంచిదనిపిస్తుంది. కారణం దినములు చెడ్డవి. అట్లా అని చెడ్డదినాలను దేవుడు నియమించలేదు గాని, మనిషి జీవించే జీవితమే చెడ్డ దినాలకు కారణమవుతుంది. దినాలు చెడ్డవి అవుతున్నాయంటే, దేవుని కృప దూరమవుతుందనేది స్పష్టం. అంటే, కృపాకాలం ముగించబడితే, దేవుని రాకడ  సమీపమనేది మరింత స్పష్టం. 

💮  చెడ్డ దినములలో మనమేమి చెయ్యాలి?

దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, 
అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి. (ఎఫెసీ 5:15-18)

♻️ సమయాన్ని సద్వినియోగపరచాలి:

దేవుడిచ్చిన సమయం అదొక వరం. ఆ సమయాన్ని ఏ  రీతిగా ఉపయోగించుకొంటున్నామనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. (జెఫన్యా 2:1)
గాలికి ఎగిరిపోయిన పొట్టు అదెప్పటికీ మనకు కనబడదు. సమయం కూడా అంతే. గతించిపోయిన సమయం మరెన్నటికి తిరిగిరాదు. మనము గడిపే ప్రతీ క్షణం అత్యంత ప్రాముఖ్యమైనది. కొన్ని క్షణాలు ఎంతటి విలువైనవో, పరుగుపందెములో సిల్వర్ మెడల్ పొందిన వ్యకికి బాగా అర్ధమవుతుంది. దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని ఎట్లా టైం పాస్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాము తప్ప, ఎట్టిరీతిగా సద్వినియోగ పరచుకొంటున్నాము అనే కనీస తలంపులేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని. తర్వాత దానిని కొరకు కన్నీళ్లు విడచుచూ శ్రద్ధగా వెదకినాగాని, దానిని పొందుకోలేకపోయాడు. (హెబ్రీయులకు 12:17)
ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. (2 కొరింథీ 6:2) ఇక వాయిదాలు వెయ్యొద్దు. 

♻️ జ్ఞానులవలే నడుచుకోవాలి:

జ్ఞానులు అంటే? దేవుని నీతి, న్యాయములను అనుసరిస్తూ, ఆయన చిత్తానుసారం జీవించేవారు. 

జ్ఞానం అంటే? యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము (యోబు 28:28)

🔸యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము (సామెతలు 1:7)

🔸మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను,  (యాకోబు 1:5)

🔸పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది (యాకోబు 3:17)

 🔸జ్ఞానమును కొనియుంచు కొనుము. (సామెతలు 23:23)

🔸జ్ఞానము కలిగి నడుచు కొనుడి.(కొలస్సి 4:5)

♻️ ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి:

ప్రభువు యొక్క చిత్తమును ఎట్లా గ్రహించగలము? లోకమర్యాదను విడచిపెట్టి, సజీవయాగముగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించి, మనస్సు మారి, రూపాంతరము చెందాలి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
రోమీయులకు 12:1,2

♻️ మద్యముతో మత్తులు కావొద్దు:
🔸మద్యం వలన అల్లరి పుట్టును. సామెతలు 20:1
🔸మద్యం వలన జ్ఞానము లేనివారు 
అగును. సామెతలు 20:1
🔸మద్యం వలన శ్రమలు, దుఃఖము, గాయములు కలుగును. సామెతలు 23:29,30
🔸మద్యం వలన ఆజ్ఞలు మరతురు. సామె 31:4,5
🔸మద్యం వలన పరలోకం వెళ్లలేరు. 1కొరింది 6:10
🔸నరకానికి వెళ్లెదరు. మత్తయి 24:49-51, ప్రకటన 14:10
🔸త్రాగుబోతులకు శ్రమ. యెషయా 5:22
అందుచే, ఇటువంటి త్రాగుబోతులతో సహవాసము చేయకూడదు. (సామెతలు 23:20)

♻️ ఆత్మ పూర్ణులైయుండుడి.

ఆత్మతో నింపబడుట ప్రత్యేకమైన అనుభవం, ఆత్మతో నింపబడుటయే ప్రతీ విశ్వాసిపట్ల దేవుని చిత్తము. ఆత్మతో నింపబడిన వారు ఆత్మ ఆధీనంలో వుంటారు. అందుచే మన జీవితాంతం ఆత్మతో నింపబడుతూనే ఉండాలి. 

👉 యేసు ప్రభువు, యోహాను, స్తెఫను మరియు పౌలు మొదలగువారు ఆత్మతో నింపబడ్డారు. ( లూకా 4:1; 1:15 అపో. కా 7:55; 13:9; 4:1)
👉పరిశుద్ధాత్మ తో నిండినవారై ( అపో కా. 2:4)
👉ఆత్మతో నిండినవారై వాక్యమును ధైర్యముగా బోధించిరి ( అపో కా. 4:31)

ప్రియులారా! అంత్య దినాలలో, చెడ్డ దినాలలో జీవిస్తున్న మనము ఇట్లాంటి జీవితాన్ని జీవించగలిగితేనే తప్ప, శాశ్వతమైన, సమాధానకరమైన మంచి దినాలలోనికి ప్రవేశించలేము. వాక్యానుసారముగా మన జీవితాలను మలచుకొంటూ నిత్యమూ ప్రభువుతో జీవించెదము.  అట్టి కృప, ధన్యత ప్రభువు  మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments