EVERYDAY WE ARE PRAYING for - CT ADS @ 8142229281 - ( @ Sri.B.Rajarao BA LLB., St.MARY'S INFANT school, near muncipal park, proddatur.) * ( @ SURI STICKER SHOP , Proprietor.Sri.B.Suresh Babu, Four road circle, Holmaspeta, Proddatur.) * ( @ Sri.B.Ramesh Babu B.Ed.,LLB., RSR UP ENGLISH MEDIUM SCHOOL, Vaddhiraala.) * ( @ CHRIST TEMPLE family) * ( @ KEERTHANA SEVA SAMITHI , President.Sri.Munagi Raju, Secreatary.Srikanth, Joint Secreatary.Narasimha, Vasanthapeta, Proddatur.) * ( @ AMARESHWAR CEMENT WORKS, Proprietor.Sri.K.Kondal rao, near kotthapally bypass road, mydukur road, proddatur ) * ( @ MALLEMU KONDA CEMENT WORKS, Proprietor.Sri.K.Shivayya, near reliance petrol bunk, teachers colony, mydukur road, proddatur ) *
...Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm in Proddatur. For more Details : +91 8142229281...

Wednesday, 24 May 2023

నీకు అంతా మంచే జరుగుతుంది..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
 నీకు అంతా మంచే జరుగుతుంది..

నేను దేవుణ్ణి ఎల్లప్పుడూ ఏ సందర్భాలోనైనా స్తుతిస్తాను అని ఒక స్నేహితునికి చెప్తూ ఉండేవాణ్ణి. అనుకోకుండా ఒకరోజు వేరే ఊరికి వెళుతున్నానని వీడ్కోలు చెప్పి బస్టాండ్ కు వెళ్ళాను. నేను ఆలస్యంగా వెళ్లేసరికి బస్సు ముందే వెళ్ళిపోయింది. ప్రయాణాన్ని వాయిదా వేసుకొని ఇంటికి తిరిగివచ్చిన నన్ను చూసి నా స్నేహితుడు నాకు సూటిగా ఒక ప్రశ్న వేశాడు. ఈ సందర్భాల్లో కూడా మీరు దేవుణ్ణి స్తుతిస్తారా అని నన్ను అడిగితే, నేను అవుననే చెప్పాను. 

ఎలాగైతేనేం అన్ని పరిస్థితుల్లో అనగా నష్టంలో, కష్టంలో, అప్పుల్లో, బాధల్లో, అనారోగ్యం కూడా దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాలన్న నా నమ్మకానికి ఒక క్రొత్త అర్ధం చేకూరింది. ఆరోజు బస్సు మిస్సయింది అనుకున్నాను కాని మరుసటి రోజు వార్తల్లో యాక్సిడెంటుకు గురైందని వార్తా పత్రికలో చదివినప్పుడు మేము ఆశ్చర్యపోయాము. ఈ సందర్భం మాలో గొప్ప అనుభూతిని కలుగజేసింది.

మనం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో  “ప్రభువా నీకు వందనాలు” అని చెప్పడం కష్టమనిపిస్తుంది. దేవుని ఉద్దేశాలు మనం చూడగలిగినా, లేకపోయినా ప్రతి పరిస్థితిలో దేవునిపై సంపూర్ణ నమ్మకం కలిగి ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించడం అనుదిన జీవితంలో అలవాటు కలిగి యుండాలి. దేవుడు మననుండి కోరుకునేది కూడా ఇదే.. “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” (1 థెస్స 5:18). 

క్రైస్తవ విశ్వాసంలో ఈ అనుభవం మన విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా రోజువారి జీవితంలో సానుకూల ఆలోచనను కలుగజేసి అనుదిన జీవితానికి సానుకూల వైఖరిని సృష్టిస్తుంది. దేవుని చిత్తమైన ప్రణాళికలో నేను కూడా ఉన్నాను అనే నిశ్చయతలో కృతజ్ఞత కలిగిన జీవితాలకు అంతా మంచే జరుగుంది అనే నమ్మకాన్ని బలపరుస్తుంది. ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

ఆనందాల నది..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
ఆనందాల నది..

 నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. - కీర్తనల గ్రంథము 36:8 

ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ అనేక విషయాలు జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అన్యాయం మరియు ప్రమాదాలవంటి  వార్తలు వింటూ ఉంటాము. అంతేకాదు, మనలో అనేకమంది అనేక సవాళ్ళతో అంటే సమస్యలతో పోరాడుతున్నారు.

అయితే, కొన్నిసార్లు ఆనందాన్ని కనుగొనడంలో శ్రమలు మనకు సహాయపడతాయి. ఎలా అంటే మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి దగ్గరగా బ్రతికినప్పుడు మనం ఆయనలో నిలిచియున్నప్పుడు దేవుడు తన విశిష్ట మార్గంలో మనల్ని ఆనందాలతో ఎలా నింపుతాడో, ఆ ఆత్మీయ సంతోషం, అనుభూతి, ఆనందబాష్పాలు అవన్నీ ఖచ్చితంగా దేవునితో సహవాసం మరింత పెరిగేలా సహాయపడుతుంది.

నా ప్రియమైన స్నేహితులారా, మనం ఎప్పుడు ఏడుస్తూ వుండాలని దేవుని కోరిక కాదు.. మనం సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషభరితమైన ఫలాలతో మనలను పోషించాలని అనుదినం కోరుకుంటున్నాడు.
మన చుట్టూ ఉన్న ప్రపంచం చీకటి వంటి పరిస్థితులగుండా ప్రయాణిస్తున్నప్పుడు, అదే చీకటి ప్రపంచంలోని దేవుని పిల్లలు ఆనందంతో గొప్ప వెలుగులో ప్రకాశిస్తారు.
మనం ఆయన బిడ్డలం కాబట్టి యేసు క్రీస్తు మనల్ని ఆనందాల నదిలో పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ ఆనంద ప్రవాహం రుచి చూడాలంటే ఈ ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. సిద్దంగా వున్నవా ?

యేసు క్రీస్తును తమ స్వంత రక్షకునిగా తెలుసుకున్నవారికే ఈ ఆనందాల నది. ఈ రోజు మీ ప్రార్థన ఈ రీతిగా ఉండనివ్వండి.

 యేసయ్యా  "మీ ఆనందాల నదిలో ప్రవహించే నీరు నాలో ప్రవహించనివ్వండి". బిగ్గరగా ఆమెన్ చెపుదామా. ఆమెన్. 

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

నీటి ఊటలు

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
 నీటి ఊటలు..

ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా,నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా.. - యోహాను 4:15 

నీటి ఊటలను వీక్షించడం ఒక అందమైన ప్రశాంతమైన అనుభవం. నీటి ఊటలు భూమి నుండి ఉద్భవించే మంచినీటి వనరులు మరియు తరచుగా దట్టమైన వృక్షసంపద వన్యప్రాణులచే చుట్టుముట్టబడతాయి. నీటి ఊటలు ఎల్లప్పుడూ కదులుతూ ఉల్లాసంగా ఉంటాయి.

ఆధ్యాత్మిక నీటి ఊటలు మన రక్షణకు సాదృశ్యమైన జీవజలాన్ని సూచిస్తాయి. ప్రయాసలో ఉన్నవారికి, వారి భారాన్ని తొలగించుకొని, శాంతిని కోరుకునే వారికి, ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి ఈ నీటి ఊటల దగ్గర సేదదీరమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు.  

ఈ సజీవమైన నీటి ఊటలైన యేసు క్రీస్తు వద్దకు మనం వచ్చినప్పుడు, ఎడారి మోడైన మన స్థితిని తిరిగి పునరుద్ధరిస్తుంది, మన జీవితాలను పవిత్రపరుస్తుంది.

ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవడానికి యేసు క్రీస్తు ఒక్కడే ఏకైక మార్గం, అది మనల్ని రక్షణ కోసం, శాంతి మరియు ప్రశాంతత యొక్క స్థానానికి నడిపిస్తుంది. ఈరోజు మనం చేయవలసిందల్లా ఆయన యెదుట సాగిలపడి, మన హృదయాన్ని జీవితాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని ఈ నీటి ఊటల వద్ద సేదదీరడమే.

 ఈ రోజు మీ హృదయాన్ని తెరిచి, ఆయన్ను ఆహ్వానించండి మరియు దాహాన్ని తీర్చడానికి రక్షణ యొక్క ఈ జీవజలాన్ని ప్రార్ధన ద్వారా అడగడానికి ప్రయత్నించండి. మీకు ఏ సహాయం కావాలి అడగండి. దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక.. ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

కష్ట సమయాల్లో

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
 కష్ట సమయాల్లో..

 ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. - కీర్తనల గ్రంథము 20:1

కష్ట సమయాల్లో ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసం చాలా అవసరం. ఈ వాక్యంలో కీర్తనాకారుడు తన కష్ట సమయాల్లో దేవుని సహాయం కోసం హృదయపూర్వక ప్రార్థనను వ్యక్తం చేశాడు. తనకు అవసరమైన సంపూర్ణ సహాయాన్ని దేవుడు మాత్రమే అందించగలడని విశ్వాసముతో ప్రార్ధన చేస్తున్నాడు.

విశ్వాసులుగా, మనకు కలిగే ప్రతికూల పరిస్థితులలో ఏ బంధువు, ఏ స్నేహితుడు సహాయం చేయరు. సహాయం చేయగలిగిన శక్తి వారికి ఉన్నాకూడా చేయరు. ఎందుకంటే నీవు అలా దీన స్థితిలో వుండడం వారికి సంతోషం కలిగిస్తూ వుంటుంది. నీవు కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో నీ గురించి హీనంగా వారు మాట్లాడతారు. ఎవ్వరూ నిన్ను ఆధరించకపోయినా , సహాయం చేయకపోయినా యేసయ్య మనకు సహాయం చేస్తాడు. ఆయనే జవాబిస్తాడని విశ్వసిస్తూ ప్రార్ధన చేయాలి. మనం సవాళ్లు మరియు పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు, మనం ప్రార్థనలో దేవుని వైపు తిరగవచ్చని మరియు ఆయన సహాయం మరియు రక్షణ కోసం అడగవచ్చని తెలుసుకోవడం ద్వారా మనం ఓదార్పు పొందవచ్చు.

నేడు, ఈ వాక్యం మనల్ని దేవునిపై నమ్మకం ఉంచడానికి మరియు కష్ట సమయాల్లో ఆయన వైపు తిరిగి ఆయన సహాయాన్ని కోరేలా ప్రోత్సహిస్తుంది. ఇది మనకు దేవునితో ఒడంబడిక సంబంధాన్ని కలిగియుందని మరియు ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానాలపై నమ్మకంగా ఉన్నాడని మనకు గుర్తుచేస్తుంది. విశ్వాస ప్రార్థనలో దేవుని వద్దకు చేరుకొని,  ఆయన మనకు జవాబిస్తాడని నమ్మి, మనలను రక్షిస్తాడనే నమ్మకంతో మనం ఓదార్పు పొందుదాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

సేవకునికి తోడుగా..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- సేవకునికి తోడుగా..

బైబిలులోని కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి. వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఇశ్రాయేలీయులను మోషే నడిపించే సమయంలో, అమాలేకీయులు వారిపై యుద్ధానికి వచినప్పుడు; మోషే తన చేతి కఱ్ఱను చేతపట్టుకొని కొండ శిఖరము మీద నిలబడి, తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారని, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేకీయులు గెలిచారని (నిర్గమ 17:8-15) మనందరికీ తెలుసు. అయితే, మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆహారోను, హూరులు మోషే చేతులను ఇరువైపులా పట్టుకొని అతని చేతులను ఆదుకొనగా…అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండినందున ఇశ్రాయెలీయులు గెలిచేలా సహాయపడ్డారు.

ఆహారోను గూర్చి మనందరికీ తెలిసినప్పటికీ, హూరు గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ వ్రాయబడలేదు. క్షుణ్ణంగా గమనిస్తే ఇశ్రాయేలీయుల చరిత్రలో అమాలేకీయులపై యుద్ధం చేసినప్పుడు వారు పొందిన విజయం వెనుక అతనొక కీలకమైన పాత్రను పోషించాడు. బయటకు తెలియకపోయినా వెనకనుండి నడిపించి... సహాయం చేసి గుర్తింపు లేని పాత్రను పోషించే వారు కొందరుంటారు.

 గొప్ప గొప్ప పరిచర్యలు చేసిన సేవకులు, నాయకులను చూసినప్పుడు వారి విజయం వెనుక నెమ్మదిగా, నమ్మకంగా సాక్ష్యం కలిగి సేవ చేసిన హూరు వంటి వారు తప్పకుండా ఉంటారు. వీరి సేవను నాయకులు లేదా ప్రజలు గుర్తించకపోయినా ప్రభువెన్నడు విస్మరించడను సంగతి గమనించాలి. 

ప్రతి ఆదివారం దేవుని మందిరాన్ని శుభ్రపరచి, కుర్చీలు సర్ది, సిద్ధపరచి కష్టపడి చేసే ప్రతి పరిచర్యను దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఈ పరిచర్య అల్పమైనదిగా ఉండవచ్చు కాని, మనం చేసే పని అల్పమైనదైనా, దేవుడు మనలను గొప్పగా వాడుకుంటాడు. చేసే ప్రతి అల్పమైన పరిచర్యను గుర్తించిన దేవుడు తగిన ప్రతిఫలితాన్ని మనకు దయజేయగలడని గమనించాలి. ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

ఛా.. నా టైమ్ బాలేదు !

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
 ఛా.. నా టైమ్ బాలేదు !

సిరియా రాజు... ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయుటకు తన దండు పేటను సిద్ధపరచుకొని, చీకటిలో నెమ్మదిగా ఇశ్రాయేలీయులను చుట్టుముట్టారు. బలం బలగం ఇశ్రాయేలీయులతో పోల్చుకుంటే సిరియా సైన్యం లెక్కించలేని గుఱ్ఱములు రథములు; గెలుపు తమదే అనుకున్నారు సిరియనులు. 

మరోవైపు...పెందలకడనే లేచిన ఎలీషా పనివాడు, తమను చుట్టుముట్టారని తెలుసుకొని ఎలీషాకు కబురుపెట్టాడు. భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని (2 రాజులు 6:16) ఎలీషా చెప్పినప్పుడు ఆకాశమువైపు కన్నులెత్తి చూశాడు... పరలోక సైన్యం ఎలీషా చుట్టు పర్వతము వంటి అగ్ని గుఱ్ఱములచేత రథములచేత నిండియుండుట ఆశ్చర్యానికి గురిచేసింది. సిరియనుల ఆలోచనలు తారుమారయ్యాయి. కత్తి యెత్తలేదు విల్లు విరువలేదు ఇశ్రాయేలీయులు తప్పించబడ్డారు.

పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండవు. ఎల్లప్పుడు విశ్వాసంతో జీవించే మనకు, ఒక వేళ నలు దిశలనుండి సమస్యలు చుట్టుముట్టినప్పుడు లేదా మనలను ముంచివేద్దాం అనేవారు మనలను సమాపించేలోపే దేవుడు మన చుట్టూ అగ్ని కంచె వేయగల సమర్ధుడు. మన టైం బాలేదు అని మనం అనుకుంటాం; అయితే, దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది. సమస్యలు మనలను చేరేలోపే దేవుడు దానికి పరిష్కారాన్ని సిద్ధంచేసి మనలను భద్రపరుస్తూనే ఉంటాడు. 

నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును (కీర్తన 91:11). మన అనుదిన జీవితంలో మనం నడిచే దారిలో, మనం ప్రయాణించే మార్గంలో, ఏ స్థితిలో మనమున్నా, ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా... మనలను కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. హల్లెలూయా..

దేవుడు మన పక్కన ఉన్నాడని గుర్తుంచుకున్నప్పుడల్లా పరిస్థితులు మనం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటాయి. అట్టి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించును గాక.. ఆమేన్.
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Thursday, 18 May 2023

మీది తెగిపోని..విడిపోని కుటుంబ బంధం..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- మీది తెగిపోని..విడిపోని కుటుంబ బంధం..

మన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య లేదా మన బంధువుల మధ్య లేదా మన కుటుంబ సభ్యులు మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా విభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది.

 ఏ బంధం లేని సంబంధం, బంధుత్వం లేదా అన్నదమ్ముల అనుబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ ఉంటాయి. తీపి జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.

 ఒకసారి ఆ బంధం ఏర్పడ్డాక తమ సంతోషాలే మన సంతోషాలుగా అనుకునే కుటుంబ బంధంలో భావాల మధ్య విభేదాలు మొదలవుతే... అది మనల్ని కృంగదీస్తుంది..కన్నీరు తెప్పిస్తుంది.

సరే మనసు మార్చుకొని, గుండెను రాయిచేసి, వారితో నాకు సంబంధం లేదు అని అనుకుంటూ పొతే మనతో ఎవరు ఉండరు, ఆ తరువాత మనం ఒంటరైపోతాము. ఏకాకిలా మిగిలిపోవాలి. 

ఎదుటి వ్యక్తి మనల్ని అర్ధం చేసుకోలేదు, మన మనోభావాలను గౌరవించలేదు వారితో మాట్లాడి ఇంక ప్రయోజనం ఉండదు అని అనుకుంటే పొరపాటే. మరి ముఖ్యంగా మనం రోజు మన కుటుంబ సభ్యుల మధ్య ఎవరితోనైతే అనుదినం మనం కలిసి జీవిస్తామో వారితో ఉన్న సంబంధం మధ్య సమాధానం పొందుకోవడం అతి ప్రాముఖ్యం.

ప్రియ స్నేహితులారా నేనంటాను..గొడవపడకుండా ఉండే బంధం కన్నా, గొడవ పడినాకూడా కలిసిపోతేనే కదా మీ బలం ఏమిటి అనేది తెలుస్తుంది.  ఎంత గొడవపడినా తెగిపోని బంధం దొరకడం దేవుడిచ్చే వరం.ఆమెన్..

ఈ బంధం సమాధానమును గూర్చిన మన ఆలోచనల్లో ఉంటుంది... క్షమాపణ కలిగిన మన గుణంలో ఉంటుంది. గుర్తు పెట్టుకోండి విశ్వాసికి ఇది అత్యంత అవసరం.

కొన్ని సార్లు బాధ లేదా మౌనం మన సంబంధాల్లోకి చొచ్చుకొని వచ్చినప్పుడు, వాటిని బాగు చేసుకోవడం మన చేతుల్లో లేదనిపిస్తుంది. 

అపో. పౌలు తాను బంధకాల్లో ఉన్నప్పటికీ సంఘంలోని విశ్వాసుల ఐక్యతను గూర్చి ప్రోత్శాహిస్తూ ఎఫేసి సంఘానికి ఇలా వ్రాశాడు (ఎఫేసి 4:1) “కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను, సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను”

మన సంబంధాల్లో స్వస్థతను వెదుకుతున్నప్పుడు దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వీకమును ధరించుకొని నడుచుకోవడానికి దేవుని సమాధానమను బంధము చేత ఆత్మకలిగించు ఐక్యమును కాపాడుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఐక్యంగా ఉండాలనేదే ప్రభువు యొక్క ఉద్దేశము.

 విశ్వాసుల మధ్య ఇక్యతనే సంబంధం బలపడినప్పుడే ఆ కుటుంబాల కుటుంబమైన సంఘంపై క్రీస్తు శిరస్సై యుంటాడు. ఇట్టి సమాధానం కలిగిన బంధాన్ని కలిగియుండుటకు ప్రయత్నిద్దామా? కుటుంబాలను కలుపుకొని వెళ్దామా ? 

మరి ప్రభువును నమ్ముకున్నా అని చెప్పే నువ్వే బంధాలను ఎందుకు తుంచుకుంటున్నవు ? బంధుత్వాలు తెంచుకుంటున్నావు ? అన్నా, అక్కా, నాన్న అన్నే ఆ ఆప్యాయత మూగబోయింది ఎందుకు ? నా తమ్ముడు, నా అన్న, నా కుటుంబ సభ్యులు అని చెప్పుకునే గొంతు ఆగిపోయింది ఎందుకు ? 

నా వాళ్ళు అని చెప్పుకునే నీ ప్రేమ స్వరం మూగబోయింది ఎందుకు ? ఎవ్వరూ నీకు అవసరం లేదా ? ప్రాణం పోయినా కూడా ఒక్కరే వెళ్లిపోతారా స్మశానానికి ? కొద్ది కాలం వుండే ఈ జీవితానికి కుటుంబ బంధం చాలా అవసరం వుంది. నిజం తెలుసుకో మిత్రమా ! ఇప్పుడైనా తెలుసుకో ఓ మానవా ? బంధాలు తెంచుకోవద్దు, తుంచుకోవద్దు విడిపోని కుటుంబ బంధం మీది..కలిసి వుంటే కలదు సుఖము అన్నారు పెద్దలు. మనం కలిసి వుంటే దేవునికి మహిమ. దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక..ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Saturday, 6 May 2023

దేవుడే ఫస్ట్..మిగతావి అన్ని నెక్స్ట్..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- దేవుడే ఫస్ట్..మిగతావి అన్ని నెక్స్ట్..

 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. - మత్తయి 6:33

మొదట ఆయన రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెదకడం మన ప్రాధాన్యతగా చేయగలిగితే, మిగిలిన వాటిని దేవుడు చూసుకుంటాడని మనం నేర్చుకోవచ్చు. జీవితంలో ప్రాపంచిక విషయాల ముసుగులో చిక్కుకోవడం సులభం. కొన్నిసార్లు, మన లక్ష్యాలు మరియు ఆశయాలపై మనం ఎంతగా దృష్టి కేంద్రీకరిస్తామంటే దేవునినే వెతకడం మర్చిపోతాము. అయితే మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే మిగిలిన వాటిని ఆయన చూసుకుంటాడని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. 

నేనంటాను, దేవుడు మన అవసరాలను తీర్చగల సమర్ధుడు, మనకు ఏది అవసరమో, ఏది ఎప్పుడు మనకు కావాలో ఆయనకు ముందే తెలుసు. కాబట్టి మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఆయన మనకు అవసరమయ్యే ప్రతీది దయజేస్తాడనుటలో ఎట్టి సందేహం లేదు. భవిష్యత్తు గురించి చింతించకుండా మనం దేవునిపై మరియు ఆయన నీతిపై దృష్టి సారిస్తే, ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు.

 మనకు అందించడానికి మనకు మార్గనిర్దేశం చేసేందుకే మన దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. గుర్తుంచుకోండి, దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. కావున ప్రభువును నిర్లక్షం చేయకండి, ప్రార్థన నిర్లక్షం చేయకండి , దేవుని కంటే ముఖ్యమైన పని నీకు ఏది వుండకూడదు. అలాంటి ఆత్మీయ జీవితం అలవాటు చేసుకోండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.  ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Friday, 5 May 2023

రథం వెంట పరుగులు...

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- రథం వెంట పరుగులు...

గెహాజీ నమ్మకముగా నుండినట్లయితే, ఎలీషా ఏ విధముగా ఏలియా తరువాత ప్రవక్తగా అయ్యాడో అదే విధముగా గెహాజీ ఎలీషా తరువాత ప్రవక్తగా అయ్యుండే వాడు. కాని గెహాజీ మొదట పరీక్షింపబడవలసియుండెను. 

సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైన నయమాను తన కుష్టురోగము బాగుపడిన తరువాత తిరిగి ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఈ పరీక్ష జరిగెను. అతడు స్వస్థపర్చబడినాననే కృతజ్ఞతతో లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారము వెండిని మరియు అందమైన పది సిరియా దేశపు వస్త్రములను ఇవ్వబోయెను. ఎలీషా కంటే తక్కువైన మానవునికి అది ఎంతటి శోధన! కాని ఎలీషా ఒక్క క్షణమైనా సంకోచించకుండా వాటన్నిటిని వద్దని చెప్పెను. నయమాను ఒక అవిశ్వాసి మరియు రాజీ పడేవాడు అందువలన ఎలీషా అతడి యొద్ద నుండి ఏమీ తీసుకొనలేదు. 

నయమాను స్వస్థపడిన తరువాత ఎలీషాతో చెప్పిన విషయములో అతడు రాజీపడువాడని తేటగా తెలుస్తుంది. అతడి యొక్క అధికార స్థానమును బట్టి అతడు విగ్రహారాధన తప్పనిసరిగా చేయవలెనని చెప్పెను. విగ్రహారాధన తప్పని నయమానుకు తెలియును. కాని ఈనాడు అనేకులవలె అతడు కూడా సత్యము కొరకు తన ఉద్యోగమును త్యాగము చేయుటకు యిష్టపడలేదు. 

నయమాను ఎలీషాతో ''నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాక...'' అని చెప్పెను (2రాజులు 5:18). 

ఎలీషా అటువంటి వాని నుండి ఏమీ తీసుకోడు. మొదటి కాలపు అపొస్తలులు ఈ పద్ధతినే పాటించిరి. ''....వారు అన్యజనుల వలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి....'' (3యోహాను 7). 

నయమాను ఇవ్వజూపిన ధనము విషయములో ఎలీషా యొక్క వైఖరిని గెహాజీ గమనించెను. కాని నయమాను ఇవ్వబోయిన దానిని తిరస్కరించుటలో ఎలీషా తెలివి తక్కువగా ప్రవర్తించెనని గెహాజీ అనుకొనెను. అందువలన అతడు నయమాను వెనుక పరిగెత్తి, కొన్ని అబద్దములు చెప్పి విలువైన వెండిని మరియు రెండు సిరియా దేశపు వస్త్రములను తీసికొనెను. 

వక్రబుద్ధి కలిగిన మనుష్యుని లోనికి సులువుగా చూడగలిగిన ఎలీషా వెంటనే గెహాజీ దురాశను బయటపెట్టెను. అతడు నయమాను యొక్క ధనాన్ని ఆశతో పొందు కొన్నాడు కాబట్టి నయమాను యొక్క కుష్టురోగమును కూడా అతడు పొందుకొనునని అతడు గెహాజీతో చెప్పాడు. 

''కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలె తెల్లనైన కుష్టము గలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్లెను'' (2రాజులు 5:27). 

ఎలీషా ఆత్మలో రెండు పాళ్ల ఆత్మను పొందుకొనుటకు బదులు గెహాజీ కుష్ఠును పొందుకొనెను. 

ఆ రోజున అతడు దేవునిచేత పరీక్షింపబడుచుండెనని గెహాజీ గ్రహించలేదు. ఒకవేళ అతడికి రానున్నకాలములో ఎటువంటి విషయములు పొంచియుండెనో తెలిసియుంటే అతడు మరి ఎక్కువ జాగ్రత్త పడియుండేవాడు. 

కాని మనము పదే పదే చూచినట్లు, దేవుడు మనలను పరీక్షించునప్పుడు మరి ముఖ్యముగా సిరికి సంబంధించిన విషయములలో పరీక్షింపబడునప్పుడు మనము దానిని గ్రహించము. 

ఇది గెహాజీ విషయములోనూ నిజమయ్యింది. ఏ ఒక్కరూ చూడని పరిస్థితిలో ఉండుటకు దేవుడు అతనిని అనుమతిచ్చెను. కేవలము ఆవిధముగానే అతడు పరీక్షింపబడగలడు. 

👉 *- దురాశ యొక్క చివరి ఫలితము.*

అనేక సంవత్సరముల ముందు యెరికోలో ఆకాను విషయంలో అలాగే జరిగెను. దేవుడు నిషేధించినది ఆకాను తీసుకొనునా లేదా పరీక్షించుటకు ఒక యింట్లో ఆకాను ఒంటరిగా నుండుటకు దేవుడు అనుమతించాడు. ఆకాను అందులో తప్పిపోయెను. 

ఆకాను తన పతనమును ఇలా వర్ణించెను: 

''నేను చూచితిని,... దురాశపడితిని,.... తీసుకొంటిని,..... దాచితిని'' (యెహోషువ 7:21). 

అదే క్రమము గెహాజీ విషయములో తిరిగి జరిగెను. 

ఆకాను మరియు తన కుటుంబము ఆ విధంగా కనానులో తమ స్వాస్థ్యమును పోగొట్టుకొన్నారు. అలాగే గెహాజీ దేవుని మనసులో అతడి కొరకుండిన పిలుపును పోగొట్టుకొనెను. 

ఆకాను గెహాజీ కూడా ''ఒక పూట కూటి కొరకు జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసుకొన్న ఏశావు'' (హెబ్రీ 12:16) అడుగుజాడలను అనుసరించిరి. 

ఎలీషాకు మరియు గెహాజీకి మధ్య యుండిన తారతమ్యము కొట్టొచ్చినట్లుగా ఉంది. ఎలీషా రెండింతల ఆత్మ కొరకు ఏలియా వెన్నంటి వెళ్లగా, గెహాజీ కొంచెం ధనము కొరకు నయమానును వెన్నంటి వెళ్లెను. వారిరువురు ఈ రోజున ఉన్న రెండు రకాలైన క్రైస్తవ పనివారికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరికీ మనము ఏ రకమునకు చెందిన వారముగా యున్నామో తెలియును. 

గెహాజీకి బిలాము గూర్చిన కథ తెలియును అనే దాంట్లో అనుమానము లేదు. అయినప్పటికీ అతడి ముగింపుకూడా బిలాము ముగింపు వలె ఉండునని ఎప్పుడూ ఊహించియుండడు. బిలాము దేవుని యొక్క ఆత్మ ఒక సమయములో నిలిచిన ఒక ప్రవక్త. 

దేవుడు కొన్నిసార్లు మనము అభ్యర్థించినది ఆయన చిత్తము కాకపోయినను, ఆ విషయమును మనము బహుగా కోరుకొనుచుండుట చేత దానిని ఆయన ఇచ్చును. కాని దాని యొక్క ఆత్మీయ ఫలితము ఇశ్రాయేలీయులను గూర్చి వ్రాయబడినట్లు ''ఆయన వారు కోరినది వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను'' (కీర్తన 106:15) అన్నట్లుగా ఉండును. 

👉 *గెహాజీ తన కొరకు ఆ హెచ్చరికను తీసుకొనలేదు.*

కాని బిలాము మరియు గెహీజీల యొక్క ఉదాహరణలు హెచ్చరికలుగా కలిగి యున్నప్పటికీ త్రోవ తప్పిపోతున్న క్రైస్తవ సమూహములు గూర్చి మనము ఏమందుము. 

ధనాశ అన్ని కీడులకు మూలము. దేవుని యెడల మనకున్న నమ్మకత్వము మరియు అంకిత భావమును పరీక్షించుటకై వస్తు సంబంధమైన విషయములు మనలను ఆకర్షించునట్లు ఆయన అనుమతించును. 

యేసు ప్రభువు యొక్క శిష్యులు ఎప్పుడూ వస్తు సంబంధమైన విషయములను పొందుకొనుటకు వాటి వెంబడి వెళ్లునట్లు ఉద్దేశించలేదు. మనము ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుటకు పిలువబడ్డాము. మనకు అవసరమైన వస్తు సంబంధమైన విషయములు, మనకు అవసరమైనప్పుడు మన ఒడిలో పడునట్లుగా వచ్చును. 

తన బిడ్డలు వస్తు సామాగ్రిని వారు అవసరమునకు మించి కూడబెట్టుకొనవలెనని దేవుడు ఉద్దేశించలేదు. అంతేకాక మనలో ఎవ్వరమూ సంపద వెంబడి పరిగెత్తాలని కూడా ఉద్దేశించలేదు. మనము దేవునిని నమ్మినట్లయితే మనకు ఏది శ్రేష్టమైనదో దానిని ఆయన మనకు ఇచ్చును. అప్పుడు మనము ధనమును బట్టి నాశనమవ్వము. 

దేవుడు మనలను దీవించినప్పుడు, మనకు అవసరమైనవన్ని ఏర్పర్చబడును మరియు దానితో ఏ విచారము కలసిరాదు. 

''యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆశీర్వాదము ఎక్కువకాదు'' (దానికి ఏ విచారము కలసి రాదు (ఇంగ్లీషు బైబిలు సామెతలు 10:22). 

''కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' (ఫిలిప్పీ 4:19). 

మనము వెంటబడి సంపాదించుకొనిన సంపద దానితో పాటు ఎన్నో విచారములను మనకు తీసుకువచ్చును. 

పౌలు ఈ ప్రమాదము గూర్చి తిమోతిని హెచ్చరిస్తూ ఇలా చెప్పెను: ''ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి'' (1తిమోతి 6:10). 

మనము దేవునిని మరియు సిరిని (వస్తు సంబంధమైన వాటిని) సేవించలేము. మనము ''ఒకని ద్వేషించి ఒకని ప్రేమించుదుము, ఒకని అనుసరించి ఒకని తృణీకరించుదుము'' 
(లూకా 16:13).  
కావున ప్రియమైన సంఘమా ఈ సమయమున నిన్ను నీవు పరీక్ష చేసుకో.. ఆత్మీయంగా బలపరిచే సంఘం తో సహవాసం కలిగి జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక..ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

యేసయ్య ప్రేమ

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
 యేసయ్య ప్రేమ

‘ఆ తర్వాత’ యేసుప్రభువు తిబెరియ సముద్రతీరంలో శిష్యులకు ‘మళ్లీ’ తనను ప్రత్యక్షపర్చుకున్నాడంటుంది బైబిలులోని యోహాను సువార్త (21:1). ఈ వాక్యంలోని ‘ఆ తర్వాత’, ‘మళ్లీ’ అనే మాటలు చరిత్ర గతినే మార్చిన ఒక మహోన్నత ఘటనకు సాదృశ్యాలు. రోమా ప్రభుత్వం, యూదులు కలిసి యేసును సిలువ వేయగా ఆయన చనిపోయిన ‘తర్వాత’, ప్రాణభయంతో శిష్యులంతా ఆయన్ను వదిలి పారిపోయి తమ భవిష్యత్తుంతా అంధకారమైందన్న నిరాశావాదంలో కూరుకుపోయిన ‘తర్వాత’, యేసు పునరుత్థానుడయ్యాడని తెలిసినా, ఆయనకు ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి పారిపోయిన తమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఇక దగ్గరకి రానివ్వరని శిష్యులు నిర్ధారణకు వచ్చిన ‘తర్వాత’, యేసు వారిని వెంబడిస్తూ యెరూషలేము నుండి తెబిరియ సముద్ర తీరానికి రావడం, వారికి ‘మళ్లీ’ ప్రత్యక్షమై వారితో సహవసించడం తిరుగులేని, ఎన్నటికీ తరగని దేవుని అద్భుత ప్రేమకు తార్కాణం!

మూడేళ్ల క్రితం ఇదే సముద్రతీరంలో నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులను చేస్తానన్న ప్రభువు వాగ్దానంతో (లూకా 5:10) వారి విశ్వాస యాత్ర ఆరంభమైంది. ఇపుడు భవిష్యత్తంతా అంధకారమయంగా కనిపించగా, యేసు లేకుండా మళ్లీ అదే ప్రదేశానికొచ్చారు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేపను కూడా పట్టలేకపోయిన ‘వైఫల్యం’ వారిని మరింత కృంగదీసిన నేపథ్యంలో, ‘సూర్యోదయవేళ’ (యోహాను 21:4) యేసు వారికి తీరంలో కనిపించి పలకరించాడు. పిరికితనం, విద్రోహం, ఇప్పుడు వైఫల్యంతో కూడిన వారి నిరాశావాదమంతా ప్రభువు సాక్షాత్కారంతో పటాపంచలయింది.

నిజమే, లోకాన్నంతా వెలుగుమయం చేసే సూర్యోదయం, ఇంటి కిటికీలు తలుపులు తెరిస్తేనే, మన గుండె ద్వారాలు తెరిస్తేనే మన సొంతమవుతుంది. యేసు సహచర్యంతో వారానాడు ఆ తర్వాత బోలెడు చేపలు పట్టారు. ప్రభువు వారితో అదే తీరంలో ఆనాడే పునరుత్థాన వినూత్న యుగానికి చెందిన ఒక కొత్త నిబంధన వారితో చేసుకోగా, నాటి నుండి అసమాన సువార్తవీరులయ్యారు, హతసాక్షులై మానవ చరిత్రను తిరగరాశారు. లోకాన్ని మనమెంత ప్రేమించినా అది మనకిచ్చేది అంధకారమే, నిరాశావాదమే, వైఫల్యమే!! కాని ప్రభువు మళ్లీ ప్రవేశించడంతో విశ్వాస జీవితంలో సూర్యోదయమవుతుంది, బతుకు బాటంతా వెలుగుమయమవుతుంది.

వెంటాడి మరీ చీకటిని పటాపంచలు చేసే శక్తి ఎన్నటికీ తరగని, మారని, వాడని దేవుని అద్భుతమైన ప్రేమది. అందుకే పాపులను, పడిపోయిన వారిని ప్రేమించి గుండెలకు నిండుగా హత్తుకొని వారి జీవితాలను దివ్యంగా పునరుద్ధరించే ప్రభువని యేసుకు పేరు. పిరికితనం, ద్రోహస్వభావం, పలాయనవాదం, నిరాశావాదం మనలోనే తిష్టవేసుకున్న మన అంతఃశత్రువులు. వైఫల్యం, అంధకారం అవి మనకిచ్చే బహుమానాలు. వాటి మీద విజయమిచ్చేవాడు, అలా మనల్ని అజేయులను చేసేవాడు మాత్రం ప్రభువే!

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.

 ✝️ *CHRIST TEMPLE-PRODDATUR.*

తప్పిపోయి దొరికిన కుమారుడా..! మళ్ళీ తప్పిపోతున్నావే..!

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- తప్పిపోయి దొరికిన కుమారుడా..! మళ్ళీ తప్పిపోతున్నావే..!

Luke(లూకా సువార్త) 15:21
21.అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టారు గాని, తండ్రియోద్దకు తిరిగి చేరాడు కాబట్టి తప్పిపోయి దొరికిన కుమారుడు అనడమే సమంజసం అని నా అభిప్రాయం.

యేసుప్రభుల వారు తన ప్రసంగాలలో అనేక ఉపమానాలు చెప్పారు. 

మార్కు 4:33,34 లో ఉపమానం. ఆయన ప్రసంగాలన్నీ ఉపమానాలతో నిండి ఉండేవి. వాటిలో బోలెడు నిఘూడ సత్యాలు, పరమరాజ్య రహస్యాలు దాగి ఉండేవి. నేటిదినాల్లో వాడుచున్న ఉపమానాలు ప్రజల్ని నవ్వించడం తప్ప దేవునిరాజ్య ఆత్మీయ మర్మాలు తక్కువ.

లూకా గారు వ్రాసిన సువార్త యొక్క ప్రాముఖ్యత గత భాగాలలో వివరించాను. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో గల ఉపమానాలు మిగతా సువార్తలలో లేవు. ఈ 15వ అధ్యాయం బైబిల్ గ్రంధములోనే చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఇందులోగల పాత్రలు నేటికీ మనలో ప్రతీ ఒక్కరికి సరిపోతాయి. (These relates each and every one of us). ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానం మనలో ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది. ఈ ఉపమానం నాకు చెందదు అంటే ఆ వ్యక్తీ పచ్చి అబద్ధికుడు. అయితే చిన్న కుమారుని పోలి ఉంటాం. లేదా పెద్ద కుమారుని పోలి యుంటాము. అంతేకాదు క్రైస్తవ భక్తిగల తల్లిదండ్రులకు తమ పిల్లలలో చాలామందికి తప్పిపోయిన కుమారుని అనుభవం ఎదురయ్యి ఉంటుంది.కాబట్టి ఇది ఉపమానమే తప్ప నిజం కాదులే అనుకోవద్దు. నేను ఏ విషయంలోనూ తప్పిపోలేదు కాబట్టి ఈ ఉపమానం నాకు కాదు అనుకోవద్దు. మనందరం ఎప్పుడో ఒకప్పుడు, చాలాసార్లు తప్పిపోయి ఉంటాము మాటలోనో, పవిత్రతలోనో, చూపులోనో, తలంపులోనో, ప్రవర్తనలోనో, ప్రార్ధించుటలోనో, దేవునికిచ్చుట లోనో తప్పిపోయినవారమే!!! మనం మానవ మాత్రులం కనుక మనందరికీ ఈ అనుభవం ఉంది. అయితే ఈ చిన్న కుమారుడు పశ్చాత్తాపపడినట్లు మనం కూడా మరలా దేవునియొద్దకు వచ్చాం కాబట్టి కనికరించబడ్డాము. ఒకవేళ దీని చదువుచున్న ప్రియ సహోదరీ, సహోదరుడా! ఇంకా నీవు సమాధాన పడలేదా? ఇప్పుడే పశ్చాత్తాప పడి దేవుని యొద్దకు మరలి రా! తండ్రి తన చిన్నకుమారుని చేర్చుకొన్నట్లు నిన్నుకూడా చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ 15వ అధ్యాయంలో గల ఉపమానాలలో దేవుని ఉద్దేశ్యం చాలా ప్రస్ఫుటంగా స్పష్టం అవుతుంది. అదేమిటంటే: నీవు తప్పిపోయావా? దేవుణ్ణి విడచి, దేవుని సంఘాన్ని, సహవాసాన్ని విడచిపెట్టి తిరుగుతున్నావా? లోకస్తులతో కలసి వారిపాపంలో పాలివాడవై వారిలో ఒకనిగా ఉంటున్నావా? దేవుడు తన చేయి చాపి నిన్ను పిలుస్తున్నారు. నీవు ఇప్పడు ఎంత ఘోర పాపివైనా సరే! ఇంకా దేవుని బిడ్డవే!!! చిన్న కుమారుడు తన తప్పు తెలిసికొని తండ్రి యొద్దకు వచ్చినట్లు నేడే ఆయన యొద్దకు రా! వెంటనే ఆయన నిన్ను కౌగలించుకొని, ముద్దుపెట్టుకొని (నీవు ఎంత పాపమనే మురికిలో ఉన్నా సరే)తన హక్కున చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.
వస్తావా?

అట్టి పశ్చాత్తాపం దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
-  రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును

మనం కృంగిపోయినప్పుడు లేదా ఊహించనిది జరిగినప్పుడు, ప్రస్తుత పరిస్థితి నుండి ఎలా దాటిపోవాలో కష్టంగా అనిపిస్తుంది. జరగబోయే కార్యాలు ఏ విధంగా ఉంటాయో సంశయంగా ఉంటాయి. 

కానీ దేవుడే స్వయంగా మన సమస్యల్లో ప్రమేయం చేసుకొని, ఆశీర్వాదకరమైన నిరీక్షణ గురించి మనకు హామీ ఇచ్చినప్పుడు, ఆయన చెప్పిన మాట ద్వారా మనకు మంచి జరుగుతుందని ప్రోత్సహించబడతాము మరియు బలాన్ని పొందుతాము.

ఇశ్రాయేలీయులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు వారి భవిష్యత్తు కోసం నిరీక్షణను ప్రకటించాడు.

_యిర్మియా 31:17 రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు._

మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా లేదా ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న అప్పులు, అనారోగ్యం,  ఇబ్బందులు, కరువు మరియు పేదరికం, ఒంటరితనం..  ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందడం అసంభవం అనుకున్నా, దేవుడు ఈ రోజు తన వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు మరియు విశ్వాసకర్తయైన దేవుడు నిరీక్షణతో కూడిన భవిష్యత్తు గురించి *హామీ* కూడా ఇస్తున్నాడు. 

దేవుడు ఇశ్రాయేలీయులతో ఉన్నట్లే, మీ పక్షాన ఉన్నందున సంతోషకరంగా జీవించండి.

మీ భవిష్యత్తును మీకే కాకుండా రాబోయే తరానికి కూడా ఆశీర్వాదకరంగా ప్రకటిస్తున్నాడు...ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

ఏదో ఒక రోజు..దేవుడు నన్ను దీవించడా ?

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- ఏదో ఒక రోజు..దేవుడు నన్ను దీవించడా ?

 అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా.. - యోహాను 13:7

జీవితంలో జరిగే ప్రతీ విషయం అనగా ఈ నిందలు, అవమానాలు, ఈ కష్టాలు నష్టాలు వలన దేవుడు చేయుచున్న అద్భుతాలు ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి మనయెడల ఒక ప్రణాళిక ఉందని మరియు ఆయన మన మంచి కోసం ప్రతిదీ చేస్తున్నాడని మనం విశ్వసించవచ్చు. మనం పరిస్థితులను అర్థం చేసుకోలేనప్పుడు కూడా ఆయనపై విశ్వాసముంచమని యేసు క్రీస్తు ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసునని మరియు మన కోసం ఒక ఖచ్చితమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని ఈరోజు మనం సంపూర్ణంగా విశ్వసించవచ్చు..అందులో ఏ సందేహం లేదు. మనల్ని త్రునీకరించే వారు త్రునీకరించనీలే, నీ దగ్గర డబ్బు లేదని, ఏమీ చేతగాదు అని హీనంగా చూస్తే చూడనీలే..నీకంటూ ఒక టైమ్ వస్తుంది ఎదురుచూడడం నేర్చుకో..

ఈ సందేశం ధ్యానిస్తున్న ప్రియ స్నేహితులారా.. ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడనీ, మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడనీ మరచిపోవద్దు. దేవుడు ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన నియంత్రణ కలిగి ఉంటాడని ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని గ్రహించినప్పుడు మనం గొప్ప ఆదరణ పొందవచ్చు. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, సమస్యలు వలన దేవుని ప్రణాళిక నేడు మనకు అర్ధం కాకపోయినా, భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుతుందని సంపూర్ణంగా విశ్వసిద్దాం. అట్టి మనసు ప్రభువు మనందరికీ దయజేయును గాక.  ఆమెన్.
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

క్రైస్తవులు ఆర్మీ & పోలీస్ జాబ్ చేయవచ్చా ?

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- క్రైస్తవులు ఆర్మీ & పోలీస్ జాబ్ చేయవచ్చా ?

 క్రైస్తవులు ఆర్మీలో చేరవచ్చా ? యుద్ధంలో శత్రువులను చంపవచ్చా ? పోలీస్ జాబ్ చేయవచ్చా ? అనే ప్రశ్నకు చేయవచ్చు అనే సమాధానమే వస్తుంది.!

✨️ పాతనిబంధనలో మనం చూస్తే అబ్రాహాము తన సహోదరుడైనటువంటి లోతు నిమిత్తము తన ప్రైవేట్ సైన్యముతో ఆ రాజులతో యుద్ధం చేసి లోతుని అతని ఆస్తిని కాపాడటం చూస్తాము ఇది (ఆదికాండము,14:16) వ వచనంలో వ్రాయబడింది.!

 (ఆదికాండము 14: 14)
*అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను.*

 (ఆదికాండము 14: 15)
*రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి*

 (ఆదికాండము 14: 16)
*ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను.*

👉 *ఇక్కడ అబ్రాహాము అనవసరంగా వారితో యుద్ధము చేయలేదు. చెడ్డ వారి బారీ నుండి ప్రజలను కాపాడటానికే అబ్రాహాము గారు యుద్ధం చేసారు.!*

✨️ ఇక ఇశ్రాయేలీయులు కూడ తన ప్రయాణంలో ఎవరితోను అనవసరంగా యుద్ధం చేయలేదు వారు వెళ్ళే మార్గంలో అడ్డుగా ఉన్న దేశాల వారు వారిని వెళ్ళడానికి ఆటంకం కలిగించినప్పుడు వారికి తమ వలన నష్టం కలిగిన ఆ నష్టం మేము భరిస్తామని చెప్పిన వినకపోగా పైగా వారిని ఇబ్బంది పెట్టిన సందర్భంలో మాత్రమే ఇశ్రాయేలీయులు యుద్ధం చేసారు.!

✨️ ఇక తమ భూభాగాలను ఆక్రమించుకొని వెళ్ళని పక్షంలో వారితో యుద్ధం చేసారే తప్ప ఎక్కడ కూడ అన్యాయంగా వారు యుద్ధం చేయలేదు.!

✨️ ఇక గొల్యాతు విషయానికి మనం వస్తే గొల్యాతును చంపిన సందర్భం కూడ మనకి తెలుసు గొల్యాతు దేవునిని దేవుని ప్రజలను 40 దినాలు దూషిస్తూ వస్తున్నప్పుడు అతని పాపం పూర్తయిన తరువాత దావీదు ద్వార గొల్యాతును చంపిస్తాడు.!

 (1సమూయేలు 17: 26) వ వచనంలో దీనిని చూస్తాము 
*​దావీదు-జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి యీ నింద తొలగించెదను* ఇక్కడ కూడ దేవున్ని దేవుని సైన్యములను దూషించినందుకే దావీదు గొల్యాతును చంపడం జరిగింది ఇవి పాతనిబంధనలో ఉన్న కొన్ని యుద్దాలు.!

✨️ ఇక క్రొత్త నిబంధనలో కూడ మనము చూద్దాము క్రొత్త నిబంధనకు ముఖ్యమైన వ్యక్తి క్రీస్తు వారు ఈయన ఈ విషయంలో ఏమైనా చెప్పారా అంటే? దానికి చెప్పలేదు కానీ సైన్యంలో ఉన్నవారిని వారించలేదు తప్పుగా చూడలేదు.!

 (లూకా సువార్త 7) వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి దగ్గరకి ఒక శతాధిపతి వచ్చి నా దాసుడు చావసిద్ధమైయున్నాడు దయచేసి నా దాసుని స్వస్థపరచమని వేడినప్పుడు యేసుక్రీస్తు వారు అతని విశ్వాసమును చూసి ఇశ్రాయేలీయులలో కూడ ఇంత విశ్వాసమును నేను చూడలేదు అని అతని విశ్వాసాన్ని మెచ్చుకున్నాడే గానీ అతను చేస్తున్న ఆర్మీ జాబ్ ను తప్పు పట్టలేదు అతడు వంద మందికి పైన కమాండర్. 

✨️ ఇక పేతురు గారు కూడ కొర్నేలి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పుటకు దేవుడే స్వయాన ఆయనను పంపడం మనము చూస్తాము. కొర్నేలి కూడ వందమందికి పైన కమాండర్ అతని భక్తిని చూసాడే తప్ప అతడు చేస్తున్న మిలటరీ యాక్టివిటీస్ కాదు అతడు భక్తి పరుడని స్వయానా దేవుడే వ్రాయించాడు. పైగా అతడు అన్యుడు కూడా పై ఇద్దరు కమాండర్లు కూడ వారి వారి ఉద్యోగ రిత్యా ఫై నుండి వచ్చు ఏ ఆజ్ఞయైన ఖచ్చితంగా పాటించిన వారే. అందుకే ఆ స్థాయికి వెళ్లారు ఉద్యోగానికి భక్తికి సంబంధం లేదు.

✨️ ఒక వ్యక్తి చేస్తున్న ఉద్యోగము అన్యాయమైన ఉద్యోగమైతేనే తప్ప అది వ్యభిచార వృత్తి, మద్యం అమ్మటము( బ్రాందీ షాపులు) ఇలా సమాజాన్ని పాడు చేసి ప్రజలను పాడు చేసేటువంటి ఉద్యోగాలను దేవుడు సహించడు కానీ *మిలటరీ యాక్టివిటీస్ దేవుని దృష్టిలో తప్పు కాదు.*

✨️ ఐతే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది మిలటరీలో అవసరమైతే ఒకరిని చంపడానికి కూడ వెనుకాడరు అలాంటప్పుడు అది నరహత్య అవుతుంది కదా దేవుడు *నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు కదా* అని (మత్తయి సువార్త,5:44) వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం.!

 (మత్తయి 5: 44)
*నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.*

✨️ శత్రువులనైన ప్రేమించమని చెప్పిన దేవుడు ఇప్పుడు మిలటరీలో శత్రువులను చంపడం వాక్యానుసారం అవుతుందా అని అనవచ్చు? అది కూడ నిజమే అని అనిపిస్తుంది ఇక్కడే మనం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది ఇక్కడ దేవుడు నీ శత్రువులను నీ పర్సనల్ శత్రువులను క్షమించమని చెప్పాడు అంతే కానీ దేశాన్ని దేశ ప్రజలను నాశనం చేసే వారి గురించి మాత్రం కాదు.

✨️ ఇప్పుడు చైనా పాకిస్తాన్ వారిని మనం చూద్దాం మన దేశము ఊరకనే ఎవరి మీద యుద్ధం చేయడం లేదు. మన వారిని చంపడానికి వచ్చిన వారిని ఉగ్రవాదుల మీద మనము యుద్ధము చేస్తున్నాము.

✨️ అసలు ప్రభుత్వాలకు ఈ మిలటరీ వ్యవస్థ గానీ,పోలీస్ వ్యవస్థ గానీ,ఎందుకు ఉండాలి? ఈ విషయం మనకు అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఒక దేశము మరొక్క దేశాన్ని దోచుకొనకుండ తమకు నచ్చిన విధంగా పొరుగు దేశాలను ఆక్రమించుకొని ప్రజలను బాధ పెట్టకుండ మరియు ప్రజలలో ఉన్నటువంటి కొంతమంది చెడ్డ వారి దగ్గర నుండి కొంతమంది మంచి వారిని కాపాడటానికి అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఈ మిలటరీ వ్యవస్థ గానీ పోలీస్ వ్యవస్థ గానీ వచ్చింది.!

👉 ఇక యోహాను దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది సైనికులు అడిగిన ప్రశ్నను కూడ మనం చూడాలి.! 

 (లూకా 3: 14) వ వచనం చూడండి 
*సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడుఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.*

✨️ ఇక్కడ బాప్తిస్మము ఇచ్చు యోహాను మీ ఉద్యోగంను బట్టి మీరు ఇలా ఉండాలి అని చెప్తున్నాడే తప్ప మీరు చేసేది తప్పు అని సైనికులతో చెప్పడం లేదు. అంటే సైనికులలో కొందరు వారికి వచ్చే జీతముతో సంతృప్తి పొందరు అని లంచం తీసుకుంటారని అందుకే ఆయన ఈ మాట చెప్పారు. *అధికారం ఉంది కదా అని లంచము తీసుకోకూడదు. అధికారముంది కదా అని అన్యాయంగా ఎవరిని బాధ పెట్టకూడదు.* ఎవరిని అన్యాయంగా కష్టపెట్టకూడదు. *ప్రభుత్వం వారు మిలటరీ వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రజల మేలుకే తప్ప కీడు కొరకు కాదు.!*
✨️ ఇది ఫ్రెండ్స్ దేశ ఆర్మీలో యైనా,పోలీస్ వ్యవస్థలోనైనా,క్రైస్తవులు ఉద్యోగము చేయవచ్చు ఐతే మీ సొంత లాభం కొరకు మాత్రము ఎవరి మీద అన్యాయంగా ప్రవర్తించకండి.! మన భారతదేశ మిలటరీ సైనికులకు నా సెల్యూట్.. వారి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం.

👉 *దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికి తోడైయుండి బలపరచును గాక...!!!*
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు...

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు...

 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికి శుభములు..

👉 *గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది* (సామెతలు,31:10)

*నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటియైన సహాయం చేయాలని అలోచించి మరీ ఆరవ రోజున యెహోవా దేవుడు స్త్రీని అద్భుతమైన రీతిలో మలిచాడు* (ఆదికాండము,2:18) ఆ మలచడంలో కూడ ప్రభువు నందు *స్త్రీకి వేరుగా పురుషుడు లేడు,పురుషునికి వేరుగా స్త్రీ లేదు ఇద్దరూ సమానమే ఇద్దరూ ప్రధానమే*

 పురుషుని నుండే దేవుడు స్త్రీని సృజించి ఆమెకి ఎంతో విశిష్టమైన స్థానాన్ని అనుగ్రహించాడు.

ఒక తల్లిగా,చెల్లిగా,అత్తగా,కోడలిగా,కూతురుగా,భార్యగా ఇలా ఎంతో మంది తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన వారు బైబిల్ లో మనకు చాలామంది కనిపిస్తారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఎంతగానో ఉంటుందో చెప్పకనే చెప్పారు. ఆమె ఏ రీతిలో ఉండాలో,ఎలా ఉండకూడదో కూడ చాలా సున్నితంగా హెచ్చరించారు.!

*నెనరు గల స్త్రీ ఘనత నొందును* (సామెతలు,11:16) యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు,నిందించుటకు విరోదికి అవకాశమియ్యకుండవలెను (1తిమోతి,5:14) అలాంటి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము (సామెతలు,12:14) అని అంటూనే..

భార్యల పట్ల భర్తలు కూడ ఏ విధంగా తన బాధ్యతలు నిర్వహించాలో బైబిల్ స్పష్టంగా నిర్దేశించింది అది ఎలాగంటే?

 *పురుషుడు తన తండ్రిని,తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును..వారు ఏక శరీరమైయుందురు* (ఆదికాండము,2:24) అని చక్కగా భార్య భర్తల భాధ్యతలను బైబిల్ తెలియపరచింది.!

*అలాగే ఉత్తమమైన భార్య జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృప గల ఉపదేశము ఆమె భోదించును,ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండ ఆమె భోజనం చేయదు అని స్త్రీలోని కార్యదక్షత కుటుంబం యెడల ఆమెకు గల నిబద్దత ఎంత బలంగా ఉంటుందో కూడ వివరించింది* (సామెతలు,31:26)

కేవలం కుటుంబమే కాక దేవుని ఆశ్రయించిన పరిశుద్ద స్త్రీలును తన స్వపురుషులకు లోబడి యుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి అని భర్త యెడల ప్రేమ దేవుని యెడల భక్తి విశ్వాసాలను చాటుకున్న ఎంతో మంది స్త్రీ లను పరిశుద్ధ గ్రంధం మనకు మాదిరికరంగా చూపిస్తూ ఉంది (1పేతురు,3:5)

ఇక ఇంతేనా.. కాదు! నాణేమునకు రెండవ వైపు ఉన్నట్లే రూతు,హన్నా,దెబోరా,మగ్ధలేనా,కన్య మరియమ్మ తల్లి లాంటి ఉత్తమమైన స్త్రీలే కాదు..

 *యెజెబెలు,పోతీఫరు భార్య, దెలీలా వంటి మోసగత్తెలు మగ వాని జీవితాన్ని పతనం అంచుల వైపుకు లాక్కెళ్ళే స్త్రీలు కూడ మన చుట్టూనే ఉన్నారు జాగ్రత్త...*

*స్త్రీ అందము మోసకరము సౌందర్యము వ్యర్ధము యెహోవా యెడల భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును* (సామెతలు,31:30) అని స్త్రీ తాను ఏ విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వాలో,ఏ విషయాలకు ఇవ్వకూడదో కూడ బైబిల్ సున్నితంగా మనల్ని హెచ్చరిస్తుంది.!

*కుటుంబ వ్యవస్థకు మూల స్తంభమైన స్త్రీ తనను తాను సరిదిద్దుకుంటూ,తన కుటుంబాన్ని సరైనా మార్గంలో నడిపించగలిగితే ప్రపంచమే తన గతిని మార్చుకొని శాంతి సహనంతో పురోగమిస్తుంది అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.*

*పురుషుడని స్త్రీ అని లేదు,యేసుక్రీస్తు నందు..మీరందరును ఏకముగా ఉన్నారు* (గలతీ,3:28) అని అపోస్తులుడైన పౌలు గారు ప్రకటించినట్లే ఆడవారైనా..మగవారైనా..తాత్కాలికమైన అందం, ఐశ్వర్యాల వైపు పరుగులు పెట్టక దేవుని వైపు చూడాల్సిన అవసరం ఎంతగా ఉందో.. ఆడవారే కాదు మగవారు కూడ గ్రహించాలి.!

*స్త్రీ పురుషులు ఇద్దరు దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తే మన కుటుంబాలు,సంఘము,ఈ లోకము ఎంత మనోహరంగా ప్రశాంతంగా ఉంటుందో మనము ఊహించవచ్చు!*

కాబట్టి మనము మన కుటుంబాలు దేవునిలో బహుగా ఆశీర్వదించబడేలా హన్నా,మరియ,రూతులా దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ.. *మన పిల్లల్ని కుటుంబాల్ని దేవుని రక్షణ మార్గంలో నడిపించుదాం..!! దేవుని రాక కొరకు నిరీక్షణ కలిగి జీవించుదాం..!!*

👉 *అట్టి కృపా,కనికరం,నిరీక్షణ మనకు దయచేయుమని యేసయ్యను ప్రార్ధించుదాం..ఆమెన్.*

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
-ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును

ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును.. -కీర్తనలు 91: 4

ప్రియ సహోదరీ సహోదరులారా మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేదియూ లేదు దేవున్ని తప్ప ఎవర్ని ఆశ్రయించిన నిరాశ తప్ప ఏ విధమైన ప్రయోజనం ఉండదు..

ఆనాడు నయోమి దేవుడున్న సమృద్ధియైన బెత్లేహేము అనే స్థలము నుండి కొంత కాలం కరువు వచ్చిందని దేవుని గురించి తెలియని మోయాబీయుల దేశానికి వెళ్ళి తన భర్తను పిల్లలను సర్వస్వాన్ని కోల్పోయింది.. చివరకు దేవుడు బెత్లేహేమునకు ఇచ్చిన సమృద్ధిని చూసి తాను తిరిగి దేవుడున్న స్థలమైన బెత్లేహేముకు వచ్చి ఆశ్రయాన్ని పొందింది..

ఈరోజు నువ్వు దేవున్ని నమ్ముకొని ఆయననే ఆధారం చేసుకున్నందుకు కొంత కాలం కష్టం, నష్టం, బాధలు, అవమానాలు గుండా వెళ్తున్నావని బాధపడకు. నీవు దేవుని రెక్కల నీడ నుండి ప్రక్కకు వెళ్లినట్లయితే కచ్చితంగా సాతాను సిద్ధంగా ఉంటాడు నిన్ను సర్వనాశనం చేయడానికి..అందుకే దేవుని నీడ నుండి పక్కకు వెళ్లకు. సంఘంలో అంటు కట్టబడి వుండు.

ప్రార్థనాపరులైన షద్రక్ మేషక్ అబెద్నగో లకు ఎలాంటి కష్టం వచ్చింది తెలుసా అగ్ని గుండంలో పడేశారు. ప్రియమైన దేవుని బిడ్డా కష్టం , నష్టంకు దేవుడు అనుమతి ఇచ్చాడు కానీ ఆ సమస్యలో దేవుడు తోడు వుండి కాపాడినాడు, మరియు ఆ సమస్య ద్వారా దేవుడు మహిమ పొందాడు. ఇప్పుడు నీకు వున్న సమస్యల నుండి దేవుడు నిన్ను కాపాడతాడు అని నీకు నమ్మకం వచ్చిందా ? ఇప్పుడైనా దేవుని మీద విశ్వాసం వుంచి నడువు.. నీ సమస్యలలో నుండి యేసయ్య నిన్ను కాపాడగల సమర్థుడు అని నమ్మకం వుంచు. ఏ కష్టపరిస్థితి ఎదురైనా దేవుడ్నే నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు దేవునికి ప్రార్ధించినప్పుడు ఖచ్చితంగా ఏ కీడు నీ ధరిచేరకుండ దేవుడు తన రెక్కల క్రింద నిన్ను కప్పి నీకు ఆశ్రయంగా ఉంటారు కనుక ఏ స్థితైనా సరే ఆయన రెక్కల నుండి ప్రక్కకు జరగని జీవితం కోసం దేవునికి ప్రార్ధిద్దాం..!! ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి..

 భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు. - ద్వితీయోపదేశకాండము 31:6

పరుగెడుతున్న మన జీవితంలో ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి, యేసు క్రీస్తు మీకు అనుగ్రహించిన ఆశీర్వాదాల గురించి ఆలోచించండి. 

ఆయన మీకు తన ప్రేమను దయను అనుగ్రహించాడు మరియు అయన ప్రతిరోజూ మిమ్మల్ని కాపాడుతున్నాడు మరియు ఆశీర్వదిస్తున్నాడు.

 దేవుని ఆశీర్వాదాలన్నిటికీ కృతఙ్ఞతలు చెప్పడానికి కొన్ని క్షణాలు వెచ్చించండి. పొందుకున్న మెలులకు కృతజ్ఞత చెప్పడానికి దేవునికి సమయం ఇవ్వండి. ఆయన సృష్టి యొక్క అందం కోసం మీకు ఇచ్చిన అనేక ఆశీర్వాదాల కోసం మీ జీవితంలో దేవుడిచ్చిన అద్భుతమైన కుటుంబ వ్యక్తుల కోసం ఆయనకు కృతఙ్ఞతలు చేల్లిద్దాం. హల్లెలూయ. 

యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడని మరియు ఆయన నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడని తెలుసుకోండి. మీరు సంతోషంగా ఉండాలని మరియు ఆనందం శాంతి మరియు సంతృప్తిని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రోజు మీరు ఏమి అనుభవిస్తున్నా, మీకు మార్గనిర్దేశం చేయడానికి మిమ్ములను సరి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.

 ఆయననే మన బలం ఆయనే మన ఆశ. కష్టాల పోరాటంలో ఎంత అలదిపోయావో.. జీవితం అంటే విరక్తి పుట్టిందా ? అయినా పరవాలేదు ప్రియ స్నేహితులారా ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఇది నిజం. ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదించమని యేసును అడగడానికి కొంత సమయం కేటాయించండి. మీ హృదయాన్ని ఆనందం మరియు శాంతితో నింపమని దేవుణ్ణి అడగండి. 

మీకు ఏది వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం శక్తిని ఇవ్వమని ఆయనను అడగండి. 

యేసు క్రీస్తు ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ భయాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, మీ పోరాటాలను అధిగమించే శక్తిని మరియు జీవిత సవాళ్ల మధ్య ఆనందాన్ని పొందే ఆశను ఆయన మీకు తప్పక ఇస్తాడు. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

ఈ రోజే మీకు హామీ ఇస్తున్నాను..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- ఈ రోజే మీకు హామీ ఇస్తున్నాను..

నాలుగు మార్గాలు కలిసే రోడ్డు వంటి పరిస్థితిలో నిలబడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి తలెత్తినప్పుడు, లేదా మనం వెళ్లే మార్గంలో అడ్డంకులు ఉంటాయనీ తెలిసినప్పుడు, మీకు కావలసిందల్లా జీవితం అని పిలువబడే ఈ ప్రయాణానికి అత్యున్నత నిర్మాణం అయిన దేవుని నుండి హామీ. బ్రతకగలను, సాధించగలను, జయించగలను అనే ధైర్యం నీలో రావాలంటే దేవుని నుండి మనకు ఒక హామీ రావాలి..అప్పుడే మనం నిమ్మళంగా ఉండగలము.

ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పౌలుకు ఏవిధంగా హామీ ఇస్తున్నాడో తెలుసుకుందాము

 _నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా..- అపొస్తలుల కార్యములు 18:10_

దేవుని నుండి వచ్చిన ఈ హామీతో, అపో. పౌలు వివిధ ప్రదేశాలలో సువార్త ప్రకటించేటప్పుడు ఎలాంటి బాధనైనా భరించగలిగాడు. అంటే, క్రీస్తు శ్రమల వలన కలిగిన గాయపు మచ్చలు, మనం కూడా క్రీస్తు శ్రమలో పాలుపంపులు కలిగియున్నామని ప్రపంచానికి చూపించడానికి అవి సాక్ష్యంగా ఉంటాయి.

ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ అపొస్తలుడైన పౌలు వలె దేవుని నుండి హామీని పొందుకుందాము, ఈ భరోసా వలన జీవితం తెచ్చే ఎటువంటి సవాళ్ళనైనా, అనగా శ్రమలు, అప్పులు, సమస్యలు అన్నీ ఎదుర్కొనేలా చేస్తుంది.

 మనల్ని పిలిచిన దేవుడు దానిని అద్భుతంగా పూర్తి చేయగలడని మనకు తెలిసినప్పుడు, సవాళ్లతో సంబంధం లేకుండా ముందుకు కొనసాగడానికి, పైకి ఎదగడానికి  మనల్ని మనం ప్రోత్సాహించబడతాము.

దేవుడు మనకు తోడుగా ఉంటే, మనకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు. బాధపడాల్సిన అవసరం లేదు.. క్రీస్తులో దీవెనలలో మాత్రమే కాకుండా బాధలలో కూడా పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉంటామనే నిశ్చయత కలిగియుంటాము. 

ఈ లోకం క్రీస్తును సిలువ వేసిందని మరచి పోవద్దు, ఒకనాడు ఆ లోకం మనల్ని కూడా వదిలిపెట్టదు, సిలివ వేయకపోయినా అలాంటి నొప్పి కలిగించే వేదనలు , కష్టాలు , అవమానాలు, నిందలు మన మీద వేస్తారు. 

సమస్యలు లేని జీవితం ఎవరు జీవించలేరు, కానీ ప్రతి సమస్యలో దేవునికి దగ్గరగా,  విశ్వాసంలో ఉన్న అన్ని కోణాల్లో అనుభవాలు తెలుసుకోగలిగితే,  ఆ విశ్వాస పందెములో ఓపికతో అంతం వరకు పరిగెత్తే భాగ్యాన్ని పొందుకుంటాము.
దేవుని ఆశీర్వాదం గురించి గొప్పగా చెప్పుకోవడమే కాకుండా క్రీస్తులోని బాధలను గురించి కూడా గొప్పగా చెప్పుకోవడానికి దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఆమేన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

మీకు అప్పగించిన పని కచ్చితంగా నెరవేర్చండి..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- మీకు అప్పగించిన పని కచ్చితంగా నెరవేర్చండి..

(సంఘ పెద్దలకు, యవ్వనస్తులకు, సంఘస్తులకు ఒక హెచ్చరిక సందేశం)

 మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి. - కొలొస్సయులకు 4:17

మనలో ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య కోసం పిలువబడినవారము, బహుశా సంఘ కార్యాలలో, లైవ్ ప్రేయర్ మీటింగ్, గాస్పల్ మీటింగ్స్, పిల్లల మధ్య లేదా పెద్దల మధ్య పరిచర్య, ప్రార్థన సహవాసం లేదా మన ముందు ఉంచబడిన ఏదైనా ప్రత్యేక పిలుపు అయి ఉండవచ్చు.

గుర్తుంచుకోండి, ఈ పరిచర్య మీకు మీ పాస్టర్ గారు అప్పగించింది కాదు.. ప్రభువు వలన మీకు అనుగ్రహించబడినది. పరిచర్య లేదా పిలుపు ప్రభువు ద్వారా నేరుగా ఇవ్వబడింది, బహుశా ప్రవచనంలో లేదా ఉన్నతమైన పిలుపు ద్వారా ఇవ్వబడింది. అయితే, విధేయత మరియు విశ్వాసంతో ఈ పరిచర్యలో మన పనులను మనం నమ్మకంగా నెరవేర్చాలి.

కొన్ని సార్లు మనకు అప్పజెప్పిన పని చేయుటలో మనం వెనుకంజ వేస్తూ ఉంటాము? కారణం ఏమై యుండవచ్చు? మీరు పరిచర్య చేయడానికి అర్హులు కాదనే భయమా? లేక నిర్లక్షమా ? లేక సోమరితనమా ? లేదా ఈ రోజు మిమ్మల్ని ఆపేది ఏదైనా కావచ్చు. ఇప్పుడైనా దానిని పక్కన పెట్టేసి పవిత్రమైన దేవుని సేవకు, సేవకునికి అండగా వుంటే నీకే మేలు.

ప్రియమైన స్నేహితులారా, దేవుడు నిన్ను మళ్లీ అడుగు ముందుకువేయమని పిలుస్తున్నాడు. రండి మీ పాస్టర్ తో కలిసి అడుగులో అడుగు వేసి పరిచర్యను అభివృద్ధి బాటలో నడిపించండి. మీరు సందేహించాల్సిన అవసరం లేదు. మీరు గతాన్ని మార్చలేరు. మీరు ఇప్పటికే చేసిన దాన్ని రద్దు చేయలేరు. కానీ మీరు ఈరోజు ప్రభువు దగ్గరకు వచ్చి ఇలా చెప్పవచ్చు, "దేవా, సంకోచించినందుకు, నిర్లక్ష్యంగా ఉన్నందుకు నన్ను క్షమించు. నా జీవితంలో ఈ సమయంలో మీరు నాకు అప్పగించిన పని, నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. నేను నిన్ను పూర్తిగా అనుసరించాలనుకుంటున్నాను. నేను ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను." ఆమెన్.

మీకు అప్పజెప్పిన పరిచర్యలో దేవుని దిశానిర్దేశంతో ముందుకు సాగండి, ఆయన మీకు సహాయం చేయడానికి మీ పక్కనే నడుస్తాడని గ్రహించండి. ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Monday, 1 May 2023

గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు...

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
*- గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు...*

 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికి శుభములు..

👉 *గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది* (సామెతలు,31:10)

*నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటియైన సహాయం చేయాలని అలోచించి మరీ ఆరవ రోజున యెహోవా దేవుడు స్త్రీని అద్భుతమైన రీతిలో మలిచాడు* (ఆదికాండము,2:18) ఆ మలచడంలో కూడ ప్రభువు నందు *స్త్రీకి వేరుగా పురుషుడు లేడు,పురుషునికి వేరుగా స్త్రీ లేదు ఇద్దరూ సమానమే ఇద్దరూ ప్రధానమే*

 పురుషుని నుండే దేవుడు స్త్రీని సృజించి ఆమెకి ఎంతో విశిష్టమైన స్థానాన్ని అనుగ్రహించాడు.

ఒక తల్లిగా,చెల్లిగా,అత్తగా,కోడలిగా,కూతురుగా,భార్యగా ఇలా ఎంతో మంది తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన వారు బైబిల్ లో మనకు చాలామంది కనిపిస్తారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఎంతగానో ఉంటుందో చెప్పకనే చెప్పారు. ఆమె ఏ రీతిలో ఉండాలో,ఎలా ఉండకూడదో కూడ చాలా సున్నితంగా హెచ్చరించారు.!

*నెనరు గల స్త్రీ ఘనత నొందును* (సామెతలు,11:16) యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు,నిందించుటకు విరోదికి అవకాశమియ్యకుండవలెను (1తిమోతి,5:14) అలాంటి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము (సామెతలు,12:14) అని అంటూనే..

భార్యల పట్ల భర్తలు కూడ ఏ విధంగా తన బాధ్యతలు నిర్వహించాలో బైబిల్ స్పష్టంగా నిర్దేశించింది అది ఎలాగంటే?

 *పురుషుడు తన తండ్రిని,తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును..వారు ఏక శరీరమైయుందురు* (ఆదికాండము,2:24) అని చక్కగా భార్య భర్తల భాధ్యతలను బైబిల్ తెలియపరచింది.!

*అలాగే ఉత్తమమైన భార్య జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృప గల ఉపదేశము ఆమె భోదించును,ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండ ఆమె భోజనం చేయదు అని స్త్రీలోని కార్యదక్షత కుటుంబం యెడల ఆమెకు గల నిబద్దత ఎంత బలంగా ఉంటుందో కూడ వివరించింది* (సామెతలు,31:26)

కేవలం కుటుంబమే కాక దేవుని ఆశ్రయించిన పరిశుద్ద స్త్రీలును తన స్వపురుషులకు లోబడి యుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి అని భర్త యెడల ప్రేమ దేవుని యెడల భక్తి విశ్వాసాలను చాటుకున్న ఎంతో మంది స్త్రీ లను పరిశుద్ధ గ్రంధం మనకు మాదిరికరంగా చూపిస్తూ ఉంది (1పేతురు,3:5)

ఇక ఇంతేనా.. కాదు! నాణేమునకు రెండవ వైపు ఉన్నట్లే రూతు,హన్నా,దెబోరా,మగ్ధలేనా,కన్య మరియమ్మ తల్లి లాంటి ఉత్తమమైన స్త్రీలే కాదు..

 *యెజెబెలు,పోతీఫరు భార్య, దెలీలా వంటి మోసగత్తెలు మగ వాని జీవితాన్ని పతనం అంచుల వైపుకు లాక్కెళ్ళే స్త్రీలు కూడ మన చుట్టూనే ఉన్నారు జాగ్రత్త...*

*స్త్రీ అందము మోసకరము సౌందర్యము వ్యర్ధము యెహోవా యెడల భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును* (సామెతలు,31:30) అని స్త్రీ తాను ఏ విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వాలో,ఏ విషయాలకు ఇవ్వకూడదో కూడ బైబిల్ సున్నితంగా మనల్ని హెచ్చరిస్తుంది.!

*కుటుంబ వ్యవస్థకు మూల స్తంభమైన స్త్రీ తనను తాను సరిదిద్దుకుంటూ,తన కుటుంబాన్ని సరైనా మార్గంలో నడిపించగలిగితే ప్రపంచమే తన గతిని మార్చుకొని శాంతి సహనంతో పురోగమిస్తుంది అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.*

*పురుషుడని స్త్రీ అని లేదు,యేసుక్రీస్తు నందు..మీరందరును ఏకముగా ఉన్నారు* (గలతీ,3:28) అని అపోస్తులుడైన పౌలు గారు ప్రకటించినట్లే ఆడవారైనా..మగవారైనా..తాత్కాలికమైన అందం, ఐశ్వర్యాల వైపు పరుగులు పెట్టక దేవుని వైపు చూడాల్సిన అవసరం ఎంతగా ఉందో.. ఆడవారే కాదు మగవారు కూడ గ్రహించాలి.!

*స్త్రీ పురుషులు ఇద్దరు దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తే మన కుటుంబాలు,సంఘము,ఈ లోకము ఎంత మనోహరంగా ప్రశాంతంగా ఉంటుందో మనము ఊహించవచ్చు!*

కాబట్టి మనము మన కుటుంబాలు దేవునిలో బహుగా ఆశీర్వదించబడేలా హన్నా,మరియ,రూతులా దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ.. *మన పిల్లల్ని కుటుంబాల్ని దేవుని రక్షణ మార్గంలో నడిపించుదాం..!! దేవుని రాక కొరకు నిరీక్షణ కలిగి జీవించుదాం..!!*

👉 *అట్టి కృపా,కనికరం,నిరీక్షణ మనకు దయచేయుమని యేసయ్యను ప్రార్ధించుదాం..ఆమెన్.*

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*