గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు...

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
*- గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు...*

 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికి శుభములు..

👉 *గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది* (సామెతలు,31:10)

*నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటియైన సహాయం చేయాలని అలోచించి మరీ ఆరవ రోజున యెహోవా దేవుడు స్త్రీని అద్భుతమైన రీతిలో మలిచాడు* (ఆదికాండము,2:18) ఆ మలచడంలో కూడ ప్రభువు నందు *స్త్రీకి వేరుగా పురుషుడు లేడు,పురుషునికి వేరుగా స్త్రీ లేదు ఇద్దరూ సమానమే ఇద్దరూ ప్రధానమే*

 పురుషుని నుండే దేవుడు స్త్రీని సృజించి ఆమెకి ఎంతో విశిష్టమైన స్థానాన్ని అనుగ్రహించాడు.

ఒక తల్లిగా,చెల్లిగా,అత్తగా,కోడలిగా,కూతురుగా,భార్యగా ఇలా ఎంతో మంది తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన వారు బైబిల్ లో మనకు చాలామంది కనిపిస్తారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఎంతగానో ఉంటుందో చెప్పకనే చెప్పారు. ఆమె ఏ రీతిలో ఉండాలో,ఎలా ఉండకూడదో కూడ చాలా సున్నితంగా హెచ్చరించారు.!

*నెనరు గల స్త్రీ ఘనత నొందును* (సామెతలు,11:16) యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు,నిందించుటకు విరోదికి అవకాశమియ్యకుండవలెను (1తిమోతి,5:14) అలాంటి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము (సామెతలు,12:14) అని అంటూనే..

భార్యల పట్ల భర్తలు కూడ ఏ విధంగా తన బాధ్యతలు నిర్వహించాలో బైబిల్ స్పష్టంగా నిర్దేశించింది అది ఎలాగంటే?

 *పురుషుడు తన తండ్రిని,తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును..వారు ఏక శరీరమైయుందురు* (ఆదికాండము,2:24) అని చక్కగా భార్య భర్తల భాధ్యతలను బైబిల్ తెలియపరచింది.!

*అలాగే ఉత్తమమైన భార్య జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృప గల ఉపదేశము ఆమె భోదించును,ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండ ఆమె భోజనం చేయదు అని స్త్రీలోని కార్యదక్షత కుటుంబం యెడల ఆమెకు గల నిబద్దత ఎంత బలంగా ఉంటుందో కూడ వివరించింది* (సామెతలు,31:26)

కేవలం కుటుంబమే కాక దేవుని ఆశ్రయించిన పరిశుద్ద స్త్రీలును తన స్వపురుషులకు లోబడి యుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి అని భర్త యెడల ప్రేమ దేవుని యెడల భక్తి విశ్వాసాలను చాటుకున్న ఎంతో మంది స్త్రీ లను పరిశుద్ధ గ్రంధం మనకు మాదిరికరంగా చూపిస్తూ ఉంది (1పేతురు,3:5)

ఇక ఇంతేనా.. కాదు! నాణేమునకు రెండవ వైపు ఉన్నట్లే రూతు,హన్నా,దెబోరా,మగ్ధలేనా,కన్య మరియమ్మ తల్లి లాంటి ఉత్తమమైన స్త్రీలే కాదు..

 *యెజెబెలు,పోతీఫరు భార్య, దెలీలా వంటి మోసగత్తెలు మగ వాని జీవితాన్ని పతనం అంచుల వైపుకు లాక్కెళ్ళే స్త్రీలు కూడ మన చుట్టూనే ఉన్నారు జాగ్రత్త...*

*స్త్రీ అందము మోసకరము సౌందర్యము వ్యర్ధము యెహోవా యెడల భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును* (సామెతలు,31:30) అని స్త్రీ తాను ఏ విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వాలో,ఏ విషయాలకు ఇవ్వకూడదో కూడ బైబిల్ సున్నితంగా మనల్ని హెచ్చరిస్తుంది.!

*కుటుంబ వ్యవస్థకు మూల స్తంభమైన స్త్రీ తనను తాను సరిదిద్దుకుంటూ,తన కుటుంబాన్ని సరైనా మార్గంలో నడిపించగలిగితే ప్రపంచమే తన గతిని మార్చుకొని శాంతి సహనంతో పురోగమిస్తుంది అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.*

*పురుషుడని స్త్రీ అని లేదు,యేసుక్రీస్తు నందు..మీరందరును ఏకముగా ఉన్నారు* (గలతీ,3:28) అని అపోస్తులుడైన పౌలు గారు ప్రకటించినట్లే ఆడవారైనా..మగవారైనా..తాత్కాలికమైన అందం, ఐశ్వర్యాల వైపు పరుగులు పెట్టక దేవుని వైపు చూడాల్సిన అవసరం ఎంతగా ఉందో.. ఆడవారే కాదు మగవారు కూడ గ్రహించాలి.!

*స్త్రీ పురుషులు ఇద్దరు దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తే మన కుటుంబాలు,సంఘము,ఈ లోకము ఎంత మనోహరంగా ప్రశాంతంగా ఉంటుందో మనము ఊహించవచ్చు!*

కాబట్టి మనము మన కుటుంబాలు దేవునిలో బహుగా ఆశీర్వదించబడేలా హన్నా,మరియ,రూతులా దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ.. *మన పిల్లల్ని కుటుంబాల్ని దేవుని రక్షణ మార్గంలో నడిపించుదాం..!! దేవుని రాక కొరకు నిరీక్షణ కలిగి జీవించుదాం..!!*

👉 *అట్టి కృపా,కనికరం,నిరీక్షణ మనకు దయచేయుమని యేసయ్యను ప్రార్ధించుదాం..ఆమెన్.*

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Comments