యేసయ్య ప్రేమ

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
 యేసయ్య ప్రేమ

‘ఆ తర్వాత’ యేసుప్రభువు తిబెరియ సముద్రతీరంలో శిష్యులకు ‘మళ్లీ’ తనను ప్రత్యక్షపర్చుకున్నాడంటుంది బైబిలులోని యోహాను సువార్త (21:1). ఈ వాక్యంలోని ‘ఆ తర్వాత’, ‘మళ్లీ’ అనే మాటలు చరిత్ర గతినే మార్చిన ఒక మహోన్నత ఘటనకు సాదృశ్యాలు. రోమా ప్రభుత్వం, యూదులు కలిసి యేసును సిలువ వేయగా ఆయన చనిపోయిన ‘తర్వాత’, ప్రాణభయంతో శిష్యులంతా ఆయన్ను వదిలి పారిపోయి తమ భవిష్యత్తుంతా అంధకారమైందన్న నిరాశావాదంలో కూరుకుపోయిన ‘తర్వాత’, యేసు పునరుత్థానుడయ్యాడని తెలిసినా, ఆయనకు ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి పారిపోయిన తమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఇక దగ్గరకి రానివ్వరని శిష్యులు నిర్ధారణకు వచ్చిన ‘తర్వాత’, యేసు వారిని వెంబడిస్తూ యెరూషలేము నుండి తెబిరియ సముద్ర తీరానికి రావడం, వారికి ‘మళ్లీ’ ప్రత్యక్షమై వారితో సహవసించడం తిరుగులేని, ఎన్నటికీ తరగని దేవుని అద్భుత ప్రేమకు తార్కాణం!

మూడేళ్ల క్రితం ఇదే సముద్రతీరంలో నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులను చేస్తానన్న ప్రభువు వాగ్దానంతో (లూకా 5:10) వారి విశ్వాస యాత్ర ఆరంభమైంది. ఇపుడు భవిష్యత్తంతా అంధకారమయంగా కనిపించగా, యేసు లేకుండా మళ్లీ అదే ప్రదేశానికొచ్చారు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేపను కూడా పట్టలేకపోయిన ‘వైఫల్యం’ వారిని మరింత కృంగదీసిన నేపథ్యంలో, ‘సూర్యోదయవేళ’ (యోహాను 21:4) యేసు వారికి తీరంలో కనిపించి పలకరించాడు. పిరికితనం, విద్రోహం, ఇప్పుడు వైఫల్యంతో కూడిన వారి నిరాశావాదమంతా ప్రభువు సాక్షాత్కారంతో పటాపంచలయింది.

నిజమే, లోకాన్నంతా వెలుగుమయం చేసే సూర్యోదయం, ఇంటి కిటికీలు తలుపులు తెరిస్తేనే, మన గుండె ద్వారాలు తెరిస్తేనే మన సొంతమవుతుంది. యేసు సహచర్యంతో వారానాడు ఆ తర్వాత బోలెడు చేపలు పట్టారు. ప్రభువు వారితో అదే తీరంలో ఆనాడే పునరుత్థాన వినూత్న యుగానికి చెందిన ఒక కొత్త నిబంధన వారితో చేసుకోగా, నాటి నుండి అసమాన సువార్తవీరులయ్యారు, హతసాక్షులై మానవ చరిత్రను తిరగరాశారు. లోకాన్ని మనమెంత ప్రేమించినా అది మనకిచ్చేది అంధకారమే, నిరాశావాదమే, వైఫల్యమే!! కాని ప్రభువు మళ్లీ ప్రవేశించడంతో విశ్వాస జీవితంలో సూర్యోదయమవుతుంది, బతుకు బాటంతా వెలుగుమయమవుతుంది.

వెంటాడి మరీ చీకటిని పటాపంచలు చేసే శక్తి ఎన్నటికీ తరగని, మారని, వాడని దేవుని అద్భుతమైన ప్రేమది. అందుకే పాపులను, పడిపోయిన వారిని ప్రేమించి గుండెలకు నిండుగా హత్తుకొని వారి జీవితాలను దివ్యంగా పునరుద్ధరించే ప్రభువని యేసుకు పేరు. పిరికితనం, ద్రోహస్వభావం, పలాయనవాదం, నిరాశావాదం మనలోనే తిష్టవేసుకున్న మన అంతఃశత్రువులు. వైఫల్యం, అంధకారం అవి మనకిచ్చే బహుమానాలు. వాటి మీద విజయమిచ్చేవాడు, అలా మనల్ని అజేయులను చేసేవాడు మాత్రం ప్రభువే!

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.

 ✝️ *CHRIST TEMPLE-PRODDATUR.*

Comments