రథం వెంట పరుగులు...

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- రథం వెంట పరుగులు...

గెహాజీ నమ్మకముగా నుండినట్లయితే, ఎలీషా ఏ విధముగా ఏలియా తరువాత ప్రవక్తగా అయ్యాడో అదే విధముగా గెహాజీ ఎలీషా తరువాత ప్రవక్తగా అయ్యుండే వాడు. కాని గెహాజీ మొదట పరీక్షింపబడవలసియుండెను. 

సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైన నయమాను తన కుష్టురోగము బాగుపడిన తరువాత తిరిగి ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఈ పరీక్ష జరిగెను. అతడు స్వస్థపర్చబడినాననే కృతజ్ఞతతో లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారము వెండిని మరియు అందమైన పది సిరియా దేశపు వస్త్రములను ఇవ్వబోయెను. ఎలీషా కంటే తక్కువైన మానవునికి అది ఎంతటి శోధన! కాని ఎలీషా ఒక్క క్షణమైనా సంకోచించకుండా వాటన్నిటిని వద్దని చెప్పెను. నయమాను ఒక అవిశ్వాసి మరియు రాజీ పడేవాడు అందువలన ఎలీషా అతడి యొద్ద నుండి ఏమీ తీసుకొనలేదు. 

నయమాను స్వస్థపడిన తరువాత ఎలీషాతో చెప్పిన విషయములో అతడు రాజీపడువాడని తేటగా తెలుస్తుంది. అతడి యొక్క అధికార స్థానమును బట్టి అతడు విగ్రహారాధన తప్పనిసరిగా చేయవలెనని చెప్పెను. విగ్రహారాధన తప్పని నయమానుకు తెలియును. కాని ఈనాడు అనేకులవలె అతడు కూడా సత్యము కొరకు తన ఉద్యోగమును త్యాగము చేయుటకు యిష్టపడలేదు. 

నయమాను ఎలీషాతో ''నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాక...'' అని చెప్పెను (2రాజులు 5:18). 

ఎలీషా అటువంటి వాని నుండి ఏమీ తీసుకోడు. మొదటి కాలపు అపొస్తలులు ఈ పద్ధతినే పాటించిరి. ''....వారు అన్యజనుల వలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి....'' (3యోహాను 7). 

నయమాను ఇవ్వజూపిన ధనము విషయములో ఎలీషా యొక్క వైఖరిని గెహాజీ గమనించెను. కాని నయమాను ఇవ్వబోయిన దానిని తిరస్కరించుటలో ఎలీషా తెలివి తక్కువగా ప్రవర్తించెనని గెహాజీ అనుకొనెను. అందువలన అతడు నయమాను వెనుక పరిగెత్తి, కొన్ని అబద్దములు చెప్పి విలువైన వెండిని మరియు రెండు సిరియా దేశపు వస్త్రములను తీసికొనెను. 

వక్రబుద్ధి కలిగిన మనుష్యుని లోనికి సులువుగా చూడగలిగిన ఎలీషా వెంటనే గెహాజీ దురాశను బయటపెట్టెను. అతడు నయమాను యొక్క ధనాన్ని ఆశతో పొందు కొన్నాడు కాబట్టి నయమాను యొక్క కుష్టురోగమును కూడా అతడు పొందుకొనునని అతడు గెహాజీతో చెప్పాడు. 

''కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలె తెల్లనైన కుష్టము గలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్లెను'' (2రాజులు 5:27). 

ఎలీషా ఆత్మలో రెండు పాళ్ల ఆత్మను పొందుకొనుటకు బదులు గెహాజీ కుష్ఠును పొందుకొనెను. 

ఆ రోజున అతడు దేవునిచేత పరీక్షింపబడుచుండెనని గెహాజీ గ్రహించలేదు. ఒకవేళ అతడికి రానున్నకాలములో ఎటువంటి విషయములు పొంచియుండెనో తెలిసియుంటే అతడు మరి ఎక్కువ జాగ్రత్త పడియుండేవాడు. 

కాని మనము పదే పదే చూచినట్లు, దేవుడు మనలను పరీక్షించునప్పుడు మరి ముఖ్యముగా సిరికి సంబంధించిన విషయములలో పరీక్షింపబడునప్పుడు మనము దానిని గ్రహించము. 

ఇది గెహాజీ విషయములోనూ నిజమయ్యింది. ఏ ఒక్కరూ చూడని పరిస్థితిలో ఉండుటకు దేవుడు అతనిని అనుమతిచ్చెను. కేవలము ఆవిధముగానే అతడు పరీక్షింపబడగలడు. 

👉 *- దురాశ యొక్క చివరి ఫలితము.*

అనేక సంవత్సరముల ముందు యెరికోలో ఆకాను విషయంలో అలాగే జరిగెను. దేవుడు నిషేధించినది ఆకాను తీసుకొనునా లేదా పరీక్షించుటకు ఒక యింట్లో ఆకాను ఒంటరిగా నుండుటకు దేవుడు అనుమతించాడు. ఆకాను అందులో తప్పిపోయెను. 

ఆకాను తన పతనమును ఇలా వర్ణించెను: 

''నేను చూచితిని,... దురాశపడితిని,.... తీసుకొంటిని,..... దాచితిని'' (యెహోషువ 7:21). 

అదే క్రమము గెహాజీ విషయములో తిరిగి జరిగెను. 

ఆకాను మరియు తన కుటుంబము ఆ విధంగా కనానులో తమ స్వాస్థ్యమును పోగొట్టుకొన్నారు. అలాగే గెహాజీ దేవుని మనసులో అతడి కొరకుండిన పిలుపును పోగొట్టుకొనెను. 

ఆకాను గెహాజీ కూడా ''ఒక పూట కూటి కొరకు జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసుకొన్న ఏశావు'' (హెబ్రీ 12:16) అడుగుజాడలను అనుసరించిరి. 

ఎలీషాకు మరియు గెహాజీకి మధ్య యుండిన తారతమ్యము కొట్టొచ్చినట్లుగా ఉంది. ఎలీషా రెండింతల ఆత్మ కొరకు ఏలియా వెన్నంటి వెళ్లగా, గెహాజీ కొంచెం ధనము కొరకు నయమానును వెన్నంటి వెళ్లెను. వారిరువురు ఈ రోజున ఉన్న రెండు రకాలైన క్రైస్తవ పనివారికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరికీ మనము ఏ రకమునకు చెందిన వారముగా యున్నామో తెలియును. 

గెహాజీకి బిలాము గూర్చిన కథ తెలియును అనే దాంట్లో అనుమానము లేదు. అయినప్పటికీ అతడి ముగింపుకూడా బిలాము ముగింపు వలె ఉండునని ఎప్పుడూ ఊహించియుండడు. బిలాము దేవుని యొక్క ఆత్మ ఒక సమయములో నిలిచిన ఒక ప్రవక్త. 

దేవుడు కొన్నిసార్లు మనము అభ్యర్థించినది ఆయన చిత్తము కాకపోయినను, ఆ విషయమును మనము బహుగా కోరుకొనుచుండుట చేత దానిని ఆయన ఇచ్చును. కాని దాని యొక్క ఆత్మీయ ఫలితము ఇశ్రాయేలీయులను గూర్చి వ్రాయబడినట్లు ''ఆయన వారు కోరినది వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను'' (కీర్తన 106:15) అన్నట్లుగా ఉండును. 

👉 *గెహాజీ తన కొరకు ఆ హెచ్చరికను తీసుకొనలేదు.*

కాని బిలాము మరియు గెహీజీల యొక్క ఉదాహరణలు హెచ్చరికలుగా కలిగి యున్నప్పటికీ త్రోవ తప్పిపోతున్న క్రైస్తవ సమూహములు గూర్చి మనము ఏమందుము. 

ధనాశ అన్ని కీడులకు మూలము. దేవుని యెడల మనకున్న నమ్మకత్వము మరియు అంకిత భావమును పరీక్షించుటకై వస్తు సంబంధమైన విషయములు మనలను ఆకర్షించునట్లు ఆయన అనుమతించును. 

యేసు ప్రభువు యొక్క శిష్యులు ఎప్పుడూ వస్తు సంబంధమైన విషయములను పొందుకొనుటకు వాటి వెంబడి వెళ్లునట్లు ఉద్దేశించలేదు. మనము ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుటకు పిలువబడ్డాము. మనకు అవసరమైన వస్తు సంబంధమైన విషయములు, మనకు అవసరమైనప్పుడు మన ఒడిలో పడునట్లుగా వచ్చును. 

తన బిడ్డలు వస్తు సామాగ్రిని వారు అవసరమునకు మించి కూడబెట్టుకొనవలెనని దేవుడు ఉద్దేశించలేదు. అంతేకాక మనలో ఎవ్వరమూ సంపద వెంబడి పరిగెత్తాలని కూడా ఉద్దేశించలేదు. మనము దేవునిని నమ్మినట్లయితే మనకు ఏది శ్రేష్టమైనదో దానిని ఆయన మనకు ఇచ్చును. అప్పుడు మనము ధనమును బట్టి నాశనమవ్వము. 

దేవుడు మనలను దీవించినప్పుడు, మనకు అవసరమైనవన్ని ఏర్పర్చబడును మరియు దానితో ఏ విచారము కలసిరాదు. 

''యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆశీర్వాదము ఎక్కువకాదు'' (దానికి ఏ విచారము కలసి రాదు (ఇంగ్లీషు బైబిలు సామెతలు 10:22). 

''కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' (ఫిలిప్పీ 4:19). 

మనము వెంటబడి సంపాదించుకొనిన సంపద దానితో పాటు ఎన్నో విచారములను మనకు తీసుకువచ్చును. 

పౌలు ఈ ప్రమాదము గూర్చి తిమోతిని హెచ్చరిస్తూ ఇలా చెప్పెను: ''ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి'' (1తిమోతి 6:10). 

మనము దేవునిని మరియు సిరిని (వస్తు సంబంధమైన వాటిని) సేవించలేము. మనము ''ఒకని ద్వేషించి ఒకని ప్రేమించుదుము, ఒకని అనుసరించి ఒకని తృణీకరించుదుము'' 
(లూకా 16:13).  
కావున ప్రియమైన సంఘమా ఈ సమయమున నిన్ను నీవు పరీక్ష చేసుకో.. ఆత్మీయంగా బలపరిచే సంఘం తో సహవాసం కలిగి జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక..ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Comments