మీది తెగిపోని..విడిపోని కుటుంబ బంధం..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- మీది తెగిపోని..విడిపోని కుటుంబ బంధం..

మన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య లేదా మన బంధువుల మధ్య లేదా మన కుటుంబ సభ్యులు మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా విభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది.

 ఏ బంధం లేని సంబంధం, బంధుత్వం లేదా అన్నదమ్ముల అనుబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ ఉంటాయి. తీపి జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.

 ఒకసారి ఆ బంధం ఏర్పడ్డాక తమ సంతోషాలే మన సంతోషాలుగా అనుకునే కుటుంబ బంధంలో భావాల మధ్య విభేదాలు మొదలవుతే... అది మనల్ని కృంగదీస్తుంది..కన్నీరు తెప్పిస్తుంది.

సరే మనసు మార్చుకొని, గుండెను రాయిచేసి, వారితో నాకు సంబంధం లేదు అని అనుకుంటూ పొతే మనతో ఎవరు ఉండరు, ఆ తరువాత మనం ఒంటరైపోతాము. ఏకాకిలా మిగిలిపోవాలి. 

ఎదుటి వ్యక్తి మనల్ని అర్ధం చేసుకోలేదు, మన మనోభావాలను గౌరవించలేదు వారితో మాట్లాడి ఇంక ప్రయోజనం ఉండదు అని అనుకుంటే పొరపాటే. మరి ముఖ్యంగా మనం రోజు మన కుటుంబ సభ్యుల మధ్య ఎవరితోనైతే అనుదినం మనం కలిసి జీవిస్తామో వారితో ఉన్న సంబంధం మధ్య సమాధానం పొందుకోవడం అతి ప్రాముఖ్యం.

ప్రియ స్నేహితులారా నేనంటాను..గొడవపడకుండా ఉండే బంధం కన్నా, గొడవ పడినాకూడా కలిసిపోతేనే కదా మీ బలం ఏమిటి అనేది తెలుస్తుంది.  ఎంత గొడవపడినా తెగిపోని బంధం దొరకడం దేవుడిచ్చే వరం.ఆమెన్..

ఈ బంధం సమాధానమును గూర్చిన మన ఆలోచనల్లో ఉంటుంది... క్షమాపణ కలిగిన మన గుణంలో ఉంటుంది. గుర్తు పెట్టుకోండి విశ్వాసికి ఇది అత్యంత అవసరం.

కొన్ని సార్లు బాధ లేదా మౌనం మన సంబంధాల్లోకి చొచ్చుకొని వచ్చినప్పుడు, వాటిని బాగు చేసుకోవడం మన చేతుల్లో లేదనిపిస్తుంది. 

అపో. పౌలు తాను బంధకాల్లో ఉన్నప్పటికీ సంఘంలోని విశ్వాసుల ఐక్యతను గూర్చి ప్రోత్శాహిస్తూ ఎఫేసి సంఘానికి ఇలా వ్రాశాడు (ఎఫేసి 4:1) “కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను, సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను”

మన సంబంధాల్లో స్వస్థతను వెదుకుతున్నప్పుడు దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వీకమును ధరించుకొని నడుచుకోవడానికి దేవుని సమాధానమను బంధము చేత ఆత్మకలిగించు ఐక్యమును కాపాడుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఐక్యంగా ఉండాలనేదే ప్రభువు యొక్క ఉద్దేశము.

 విశ్వాసుల మధ్య ఇక్యతనే సంబంధం బలపడినప్పుడే ఆ కుటుంబాల కుటుంబమైన సంఘంపై క్రీస్తు శిరస్సై యుంటాడు. ఇట్టి సమాధానం కలిగిన బంధాన్ని కలిగియుండుటకు ప్రయత్నిద్దామా? కుటుంబాలను కలుపుకొని వెళ్దామా ? 

మరి ప్రభువును నమ్ముకున్నా అని చెప్పే నువ్వే బంధాలను ఎందుకు తుంచుకుంటున్నవు ? బంధుత్వాలు తెంచుకుంటున్నావు ? అన్నా, అక్కా, నాన్న అన్నే ఆ ఆప్యాయత మూగబోయింది ఎందుకు ? నా తమ్ముడు, నా అన్న, నా కుటుంబ సభ్యులు అని చెప్పుకునే గొంతు ఆగిపోయింది ఎందుకు ? 

నా వాళ్ళు అని చెప్పుకునే నీ ప్రేమ స్వరం మూగబోయింది ఎందుకు ? ఎవ్వరూ నీకు అవసరం లేదా ? ప్రాణం పోయినా కూడా ఒక్కరే వెళ్లిపోతారా స్మశానానికి ? కొద్ది కాలం వుండే ఈ జీవితానికి కుటుంబ బంధం చాలా అవసరం వుంది. నిజం తెలుసుకో మిత్రమా ! ఇప్పుడైనా తెలుసుకో ఓ మానవా ? బంధాలు తెంచుకోవద్దు, తుంచుకోవద్దు విడిపోని కుటుంబ బంధం మీది..కలిసి వుంటే కలదు సుఖము అన్నారు పెద్దలు. మనం కలిసి వుంటే దేవునికి మహిమ. దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక..ఆమెన్.

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Comments