EVERYDAY WE ARE PRAYING for - CT ADS @ 8142229281 - ( @ Sri.B.Rajarao BA LLB., St.MARY'S INFANT school, near muncipal park, proddatur.) * ( @ SURI STICKER SHOP , Proprietor.Sri.B.Suresh Babu, Four road circle, Holmaspeta, Proddatur.) * ( @ Sri.B.Ramesh Babu B.Ed.,LLB., RSR UP ENGLISH MEDIUM SCHOOL, Vaddhiraala.) * ( @ CHRIST TEMPLE family) * ( @ KEERTHANA SEVA SAMITHI , President.Sri.Munagi Raju, Secreatary.Srikanth, Joint Secreatary.Narasimha, Vasanthapeta, Proddatur.) * ( @ AMARESHWAR CEMENT WORKS, Proprietor.Sri.K.Kondal rao, near kotthapally bypass road, mydukur road, proddatur ) * ( @ MALLEMU KONDA CEMENT WORKS, Proprietor.Sri.K.Shivayya, near reliance petrol bunk, teachers colony, mydukur road, proddatur ) *
...Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm in Proddatur. For more Details : +91 8142229281...

Tuesday, 16 August 2022

🇮🇳 క్రైస్తవ స్వాతంత్య్రము

✝️ CHRIST TEMPLE-PRODDATUR
🇮🇳 క్రైస్తవ స్వాతంత్య్రము

- ప్రియ మిత్రులందరికి 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

_(యోహాను 8:31,32 లో ఇలా చెపుతుంది. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో- మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును *స్వతంత్రులుగా* చేయునని చెప్పగా...)_

*ఉపోద్ఘాతం:* ప్రతి ఆగష్టు 15న మనదేశం స్వాతంత్య్ర దినోత్సవమును జరుపుకుంటుంది. మన దేశానికి స్వాతంత్య్రము వచ్చి చాలా సంవత్సరములు అయ్యింది. రాజకీయ స్వేచ్ఛ వచ్చి మన దేశము స్వయం పరిపాలన చేసుకొనుచున్నను సగటు మనిషికి నిజ జీవితములో స్వేచ్ఛలేదు.

అపవాది అదృశ్య శక్తులు, మూఢ నమ్మకాలు, దుర్నీతి, అవినీతి, లంచగొండితనము మొదలగు సాతాను దుష్ట ప్రభావములకు లోనై మనుష్యులు స్వేచ్ఛగాను, నిర్భయముగాను జీవించలేక పోతున్నారు. చివరకు క్రైస్తవులు కూడా ఏదో బంధకాల్లో నలిగిపోతున్నారు. ఆత్మలో స్వేచ్ఛ లేక నశించిపోతున్నారు.

దేవుని వాక్యము యోహాను 8:31,32 లో ఇలా చెపుతుంది. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో- మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును *స్వతంత్రులుగా* చేయునని చెప్పగా...

అయితే క్రీస్తు ద్వార మనం స్వాతంత్య్రం పొందుకున్నాము. ఈ *క్రైస్తవ స్వాతంత్ర్యం* అను అంశం క్రింద మూడు సత్యాలు మనం నేర్చుకోవాల్సి యున్నది.

👉🇮🇳 *A. ఏ దాస్యం నుండి స్వాతంత్య్రం పొందుకున్నాము:*

👉🇮🇳 *B.ఎవరి ద్వారా స్వాతంత్య్రము పొందుకున్నాం:*

👉🇮🇳 *C. స్వాతంత్య్రము పొందుకున్నాక మనం ఏమి చేయాలి:*

మొదటిగా ఏ రకమైన దాస్యం నుండి మనం స్వాతంత్య్రము పొందుకున్నామో చూద్దాం.

🇮🇳 *A. ఏ దాస్యం నుండి స్వాతంత్య్రము పొందుకున్నాం:*  

👉 *1. సాతాను దాస్యం నుండి స్వాతంత్య్రము పొందుకున్నాం:* నిజదేవుని ఎరుగని వారు దేవుళ్ళుకాని వారికి అనగా దుష్ట విగ్రహాలకు దాసులై యుండే కోట్లాది ప్రజలను మన దేశములో చూస్తున్నాము. (గలతీ 4:8 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి) 

👉 *2.పాపపు దాస్యం నుండి స్వాతంత్య్రము పొందుకున్నాం:* (రోమ 6:14 పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.,18 పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.). 

👉 *3. రోగ బలహీనతల దాస్యం నుండి స్వాతంత్య్రము పొందుకున్నాం:* ఆయన పొందిన దెబ్బల మూలంగా మనకు రోగములనుండి విడుదల మరియు  మనకు ఆరోగ్యం కలిగింది. 

(లూకా 13:11  ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడ లేకుండెను. 12  యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనత నుండి *విడుదల* పొంది యున్నావని ఆమెతో చెప్పి..)

👉 *4. బ్రష్టాచారాల దాస్యం నుండి స్వాతంత్య్రము పొందుకున్నాం:* ఆనాటి యూదులు క్రీస్తు ప్రభువును అంగీకరించక బ్రష్టాచారాలకు దాసులైనట్లు ఈనాడు క్రైస్తవులు కొన్ని ఆచారములకు, మూఢ నమ్మకాలకు, స్వనీతికి లోనయి దాస్యములో నున్నారు. (2 పేతురు 2:19 తామే భ్రష్టత్వమునకు దాసులై యుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా) 

👉 *5. ధర్మశాస్త్రము దాస్యం నుండి స్వాతంత్య్రము పొందుకున్నాం:* పెండ్లయిన స్త్రీ తన భర్త బ్రతికి ఉన్నంతవరకూ ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కట్టుబడి ఉంటుంది గాని భర్త చనిపోతే భర్తను గురించిన చట్టం నుంచి ఆమె విడుదల అవుతుంది. 

(రోమా 7:2  భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును)

ఒక స్త్రీ భర్త చనిపోతే ఆమె వేరొకణ్ణి పెళ్ళాడేందుకు అనుమతి ఉంది. దీన్ని పౌలు ఆధ్యాత్మిక విషయంగా చెప్తున్నాడు. ఇందులో మొదటి భర్త ఎవరు? ఈ మొదటి భర్త దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రం. క్రీస్తు చనిపోయినప్పుడు విశ్వాసులకు సంబంధించినంత వరకు మొదటి భర్త ధర్మశాస్త్రం చనిపోయింది. ధర్మశాస్త్రం అధికారంనుంచి వారికి విడుదల కలిగింది. ఆధ్యాత్మికంగా మరో భర్తను చేసుకునే స్వేచ్ఛ వారికి లభించింది. అంటే దేవునితో ఒక కొత్త సంబంధం కలగడానికి స్వేచ్ఛ దొరికింది. రెండవ భర్త క్రీస్తును తమ ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించడం ద్వారా వారు ఆయన “వధువు సంఘము” అయ్యారు. 

👉 *6. దయ్యాల దాస్యం నుండి స్వాతంత్య్రము పొందుకున్నాం:*  సేన దయ్యములచే బంధింపబడిన వాడు క్రీస్తు ద్వారా విడుదల పొందినాడు. యేసు ఎవరో మనుషులకు తెలియనప్పటికీ దయ్యాలకు తెలుసు.  (లూకా 8:29  ఏలయనగా ఆయనఆ *మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను*. 35  జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.)

👉 *7. మరణభయం అను దాస్యం నుండి స్వాతంత్య్రము పొందుకున్నాం:* జీవిత కాలమంతా మరణ భయంనకు దాసులై పోవుచున్నవారికి విడుదల. (హెబ్రీయులకు 2:15 జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.) 

🇮🇳 *B. ఎవరి ద్వారా స్వాతంత్య్రము పొందుకున్నాం:* ఇటువంటి దాస్యము నుండి మనుష్యునికి *స్వాతంత్ర్యం ఇచ్చుటకు* నాలుగు విధానములు కలవని దేవుని వాక్యము సెలవిస్తుంది.

📖 *1. సత్యము ద్వార స్వాతంత్య్రము:* మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును *స్వతంత్రులుగా* చేయును.(యోహాను 8:31,32)

✝ *2.కుమారుని ద్వార  స్వాతంత్య్రము:* కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు.(యోహాను 8:36)

🔥 *3. పరిశుద్ధాత్మ ద్వార స్వాతంత్య్రము:* ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్య్రము ఉండును (2 కొరింధీ 3:17) 

🛐 *4. ప్రార్ధన ద్వార స్వాతంత్య్రము:* కీర్తన 50:15 ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను *విడిపించెదను* నీవు నన్ను మహిమ పరచెదవు.

🇮🇳  *C. స్వాతంత్య్రము పొందుకున్నాక మనం ఏమి చేయాలి:*  స్వాతంత్య్రము ఆనేది ఎంతో విలువైననది. ముందుగా దాని విలువ మనం గ్రహించవలసి యున్నది.

Freedom is not free. *It took the death of God’s son on the cross to purchase our freedom from the bondage of sin.* We should not misuse our freedom.

మూర్ఖుల చేతిలోనికి స్వాతంత్య్రము వస్తే ఇక వినాశనమే.

మనము స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడితిమి అని తెలియజేస్తూ ఆ స్వాతంత్య్రమును తిరిగి శరీర క్రియలకు వాడుకొనక ఈ స్వాతంత్య్రమందు స్థిరముగా నిలిచియుండి మరల దుష్టత్వమను కాడిక్రింద చుట్టుకోవద్దని పౌలు, పేతురు కూడా *హెచ్చరిస్తున్నారు.* (గలతీ 5:1,13, పేతురు 2:16).

మనము తిరిగి సైతానుకు, పాపానికి, స్వనీతికి దాసులము కాకుండా ఉండాలంటే ఏం చేయాలని వాక్యము హెచ్చరిస్తుంది.

✝ *1 యేసుక్రీస్తుకు దాసులుగా జీవించాలి:*   ఒకప్పుడు దేవుళ్ళు కానివారికి దాసులైనవారు ఇప్పుడు నిజదేవునికి అనగా మన ప్రభువైన *యేసుక్రీస్తుకు దాసులుగా* జీవించాలి.(రోమా 6:22, 1పేతురు 2:16).

💟 *2. నీతికి దాసులుగా జీవించాలి:*   ఒకప్పుడు పాపానికి దాసులై తమ అవయవ ములను దుర్నీతికి అప్పగించుకున్నవారు ఇప్పుడు  వాటిని *నీతికి సాధనములుగా* దేవునికి అప్పగించుకోవాలి (రోమా 6:13, 18:19).

💞 *3  ఒకనికి ఒకడు దాసులు జీవించాలి:* ఒకప్పుడు స్వనీతికి, మూఢ నమ్మకములకు లోనైనవారు ఇప్పుడు దేవుని నీతిలో నడుచుకొనుచున్న వారిగా ప్రేమ కలిగిన వారై *ఒకనికి ఒకడు దాసుడుగా* ఉండాలి (గలతీ 5:13)

*ముగింపు:* ఈ విధమైన జీవిత విధానాన్ని అవలంబించిన యెడల మనం సంపూర్ణమైన క్రైస్తవ స్వాతంత్య్రాన్ని మనం అనుభవించగలం.

దేవుడిచ్చిన స్వాతంత్ర్యంతో యేసుతో ఎల్లవేళల ముందుకు సాగిపోవడానికి ప్రభువు కృప మనకు నిత్యం తోడుగా ఉండునుగాక! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

పొట్టి జక్కయ్య – ఏడవ భాగం - అబ్రహాము కుమారుడు.

✝️ CHRIST TEMPLE-PRODDATUR
-పొట్టి జక్కయ్య – ఏడవ భాగం - అబ్రహాము కుమారుడు.

(గమనిక: బైబిల్ గ్రంధం ఆత్మీయ మర్మాల నిలయం. రోజూ చదువుతున్న.. ప్రతీరోజూ రోజుకో కోణంలో దేవుడు మాట్లాడుతారు. ఈ భాగం ద్వారా నాకు అర్ధమైంది మాత్రం నేను వ్రాస్తున్నాను. మరొకరికి దేవుడు మరో విధంగా మాట్లాడి ఉండొచ్చు!!)

అందుకు యేసు: ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. లూకా 19:9.
మనం ఇంతవరకు జక్కయ్య పాపపు పట్టణమైన యెరికోవాసి అని, సుంకపుగుత్తదారుడని, ధనవంతుడు గాని యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు గాని పొట్టివాడైనందున, జనులు గుంపుకూడి ఉన్నందున చూడలేక మేడిచెట్టు ఎక్కి కూర్చొంటే యేసుప్రభులవారు ఆ చెట్టు దగ్గరికే వచ్చి జక్కయ్యని పిలిచారు. అప్పుడు జక్కయ్య తనగృహములోనికి యేసయ్యని సంతోషముతో ఆహ్వానించినట్లు ధ్యానించాము.
అయితే ఇక్కడ ఎప్పుడైతే తన ఆస్తిలో సగం బీదలకిచ్చాడో, తను అన్యాయం చేసినవారికి న్యాయం చేసాడో, యేసుప్రభులవారు తన నోటితో ప్రాముఖ్యమైన మాట అంటున్నారు: ఇతడును అబ్రహాము కుమారుడే! ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. అంటే ఎవరైతే మార్పునొంది రక్షింపబడతారో వారందరూ అబ్రహాము సంతానమన్న మాట! తనను ఎందరంగీకరించెదరో వారందరినీ పిల్లలని పిలుచుటకు ఆయన అంగీకరించెను అని వ్రాయబడింది.
అయితే ఇక్కడ యేసుప్రభులవారే స్వయముగా అబ్రహాము కుమారుడు అని జక్కయ్యకోసం చెప్పారు! తద్వారా రక్షింపబడిన వారందరికోసం చెబుతున్నారు. అబ్రహాము మానవ మాత్రుడు. గాని ఆయనకోసం పరిశుద్ద గ్రంధంలో చాలా సార్లు వ్రాయబడింది. యేసయ్య తన ప్రసంగాలలో కొద్దిమందిని మాత్రం సంభోదించారు. వారిలో అబ్రహాము, దావీదు లాంటివారున్నారు. అబ్రహాము గారిని యేసయ్య తన ఉపమానాలలో వాడుకొన్నారు. ధనవంతుడు-లాజరు ఉపమానంలో “తండ్రివైన అబ్రహామా!” అనియు, అబ్రహాము రొమ్మున ఆనుకోనెను అని అన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనెను అంటే ఒకవిధముగా అబ్రాహాము – తండ్రియైన దేవునితో ఉపమానాలంకారముగా పోల్చారు! ఇక లూకా 19:9 లో ఇతడును అబ్రహాము కుమారుడే అంటున్నారు!
ఒక సామాన్య మానవునికి ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది? అబ్రాహాము గారి జీవితం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధిక్యతకు కారణాలు కనిపిస్తాయి:

1. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడచి, నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు చెబితే (ఆది 12, హెబ్రీ 11:8)- ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? నేను నిన్ను ఎందుకు నమ్మాలి? అక్కడ ఏముంటాయి? ఇలాంటివి ఏమీ అడగకుండా దేవునిని నమ్మి తనకున్నదంతా తీసుకొని కల్దీయ దేశం నుండి సుమారు 300 మైళ్ళు నడచి హారాను వెళ్ళిపోయారు. మరలా అక్కడనుండి ఐగుప్తు, కానాను ఇలా దేశాలు తిరుగుతూ ఉన్నారాయన తన జీవితమంతా! ధనవంతుడైన అబ్రాహాము గుడారాలలో జీవిస్తూ, అరణ్యాలలో, ఎడారులలో ఎండకు వానకు తిరుగుతూ జీవిస్తు గడిపారు.గాని ఎప్పుడూ దేవునిని ప్రశ్నించలేదు. ఇది చేస్తాను అది చేస్తాను అన్నావు. ఏదీ? అనలేదు. అదే అతనికి నీతిగా ఎంచబడింది, “అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను” ఆదికాండము 15:6, రోమా 4:3. ఈ అనుకూల ప్రవర్తనే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చింది, అందుకే యేసయ్య జక్కయ్యతో అంటున్నారు ఇతడునూ అబ్రహాము కుమారుడే!

2. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:17-23. ఎందుకంటే నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని వాగ్దానం చేసినవాడు దానిని నెరవేర్చుటకు సమర్డుడని విశ్వశించి బలముపొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

3. ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు చెబితే, ఏ అడ్డంకము చెప్పకుండా బలి అర్పించడానికి సిద్దమయ్యాడు, మృతులను సహితము ఆయన లేపడానికి శక్తిమంతుడని ప్రగాఢ విశ్వాసం కలియుండెను. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులందరికీ తండ్రిగా మారిపోయారు అబ్రహాము గారు!
జక్కయ్య యేసయ్యను స్వీకరించి, తనకున్నదానిలో సగం బీదలకిచ్చి, మరికొంత తను అన్యాయం చేసిన దానికి నాలుగింతలు చెల్లించి చాలా ఆస్తి కోల్పోయాడు . అయినా సరే దేవుని యందు విశ్వాసం తగ్గలేదు. తద్వారా అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు!
మరి నీకు అటువంటి అచంచలమైన విశ్వాసం ఉందా?!! అలాంటి విశ్వాసం, సమర్పణ ఉంటేనే అబ్రహాము కుమారునిగా మారగలవు!
నేడే అట్టి విశ్వాసం పొందుకో!
దైవకృప మీ అందరికి తోడుగా నుండును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!

(సమాప్తం)

✝️ CHRIST TEMPLE-PRODDATUR

పొట్టి జక్కయ్య – ఆరవ భాగం - యేసయ్యను హృదయంలోను, గృహములోను చేర్చుకొనెను.

✝️ CHRIST TEMPLE-PRODDATUR
-పొట్టి జక్కయ్య – ఆరవ భాగం - యేసయ్యను హృదయంలోను, గృహములోను చేర్చుకొనెను.

యేసు ఆచోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా! త్వరగా దిగుము!
-  నేడు నేను నీ ఇంట ఉండవలసియున్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి, సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. 
- లూకా 19:4-5. ఇక్కడ జక్కయ్య-యేసయ్య చేసిన పనులు వరుసగా చూద్దాం! మొదటగా యేసయ్య కన్నులెత్తి జక్కయ్యని చూసారు! ఆయన కన్నులకు మరుగైనదేది లేదు. చెట్టుమీద నున్న జక్కయ్యని యేసయ్య చూసారు. నీవు ఏ స్తితిలోనున్న యేసయ్య నిన్ను చూస్తున్నారని గ్రహించు! మరో విషయం ఏమిటంటే జక్కయ్య ఎక్కినది మేడిచెట్టు! మేడిచెట్టు గర్వానికి ప్రతీక అని పండితులు చెబుతారు!
మేడిచెట్టు చూడు మేలిమై యుండు- పొట్ట విప్పి చూడు పురుగులుండు అని మన వేమన కవి చెప్పాడు. (అయితే మేడిచెట్టు అని తర్జుమా చేయబడినా మనలాంటి మేడిచేట్లులేవంట ఇజ్రాయిల్దేశంలో. ఒకరకమైన ఫిగ్ ట్రీ/ అత్తిపండు లాగ ఉంటాయంట) ఏదీఏమైనా ఎంతగర్వం ఉన్నా, యేసయ్య పిలిచిన వెంటనే దిగిపోయాడు! తన ధన గర్వాన్ని, హోదా-అంతస్తు గర్వాన్ని విడచి వెంటనే దిగిపోయాడు.
ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం వ్రాయబడింది. యేసయ్యని అతడు సంతోషముతో చేర్చుకొన్నాడు! అదే దేవునికి కావాలి!! దేవుని మనసా వాచా నమ్మడమే కాకుండా, ఎట్టి పరిస్తితులు ఎదురైనా సంతోషముతో ఆయనను వెంబడించాలి!
ఆరోజు యేసయ్య జక్కయ్య గృహములో ప్రవేశించారు. మొట్టమొదట జక్కయ్య యేసయ్యని హృదయంలోనికి ఆహ్వానించాడు, తర్వాత సంతోషముతో తన గృహములోనికి ఆహ్వానించాడు. అంతేనా!! యేసయ్యని ప్రభువా! అంటున్నాడు. నా ఆస్తిలో సగభాగం బీదలకిచ్చుచున్నాను! మొదటగా తన ఆస్తిని విడచి, యేసయ్యని ప్రభువా అని పిలచి, తన యజమాని ఆస్తి కాదు- నీవే అంటున్నాడు!
రెండవదిగా నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను అన్నాడు. అంటే ఇంతవరకు అక్రమముగా సంపాదించిన దానిలో సగం బీదలకిచ్చాడు! తద్వారా పరలోకంలో ఆస్తిని కూర్చుకొన్నాడు!
యేసుప్రభులవారు ఏమైనా ప్రసంగం చేసారా? తనని వేలెత్తి చూపారా? అద్భుతం చేసారా? లేనేలేదు!!
ఏ ప్రసంగం లేకుండా కేవలం యేసయ్యని హృదయంలో చేర్చుకోవడం ద్వారా, తన జీవితం పూర్తిగా మారిపోయింది. నవజీవనం కలిగింది.
మూడవదిగాఎవరిదగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకొంటే దానికి నాలుగింతలు ఇస్తాను అంటున్నాడు!! (19:7,8). ఇక్కడ గమనిచండి ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? లేవీ 6:1-5, సంఖ్యా 5:5-7 ... ఎవరికైనా ఏమైనా అన్యాయం చేస్తే, ఆ మొత్తం తిరిగి పూర్తిగా చెల్లించాలి, ఇంకా దానిలో 5వ భాగం కలిపి ఇవ్వాలి! అయితే జక్కయ్య ధర్మశాస్త్రం విధించిన దానికన్నా ఎక్కువగా నాలుగింతలు చెల్ల్సిస్తానని చెప్పాడు. అంటే 100/ కి 400/- చెల్లిస్తాను అంటున్నాడు. ఎంతగా మారిపోయాడో చూసారా?!!!
సమరయస్త్రీ జీవితంలోనికి యేసయ్యని స్వీకరించిన వెంటనే తన పాపపు జీవితాన్ని వదలి, సాక్షిగా మారి, సాక్ష్యార్ధమైన జీవితం జీవించి తన గ్రామాన్ని రక్షించుకొంది. ఇక్కడ జక్కయ్య యేసయ్య ని తన హృదయములోనికి/గృహములోనికి చేర్చుకొని, సాక్ష్యార్ధమైన జీవితం జీవించి, తనలాంటి సుంకరులను యేసయ్య దగ్గరికి నడిపించగలిగాడు!
మరి నీవు రక్షింపబడి ఎన్నిరోజులైంది? ఎంతమందిని యేసయ్య దగ్గరికి నడిపించావు? నీజీవితాన్ని చూసి నేర్చుకొంటున్నారా/ అసహ్యించుకుంటున్నారా?!!
యేసయ్యని చేర్చుకొని అంచెలంచెలుగా ఎదిగిపోయాడు జక్కయ్య! నీవు యేసయ్యని చేర్చుకొని ఏం సాధించావ్?
దేవుణ్ణి పెదవులతో మాత్రమె సేవిస్తున్నావా/లేక హృదయపూర్వకంగా సేవిస్తున్నావా?
కేవలం రోగాలు/భాదలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్ధించి, అవసరం తీరిన వెంటనే ప్రార్ధన, విశ్వాసం వదలివేస్తున్నావా?
నీవు మార్పుచెందిననాటి విశ్వాసం, రక్షింపబడినప్పుడున్న ప్రార్ధన ఇపుడున్నాయా?!!!

ఏదైనా సభలకు వెళ్లి, దైవసేవకుని ఉద్రేకమైన ప్రసంగాలు విని – ఉజ్జీవింపబడి- సమర్పించుకొని- సభలు ముగిసిన తర్వాత మరలా చల్లారిపోయావా?
జక్కయ్య తీసుకొన్న నిర్ణయం కడవరకు కొనసాగించాడు!
మరి నీవు ఆవిధంగా చేయడానికి ఇష్టపడుతున్నావా?
ఒకవేళ జారిపోయావా? అయితే కృంగిపోకు!
యేసయ్య దగ్గరకు మరలా రా!
యేసయ్యని సంతోషంగా ఆహ్వానించి, సంతోషంగా సేవించు!
యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు!!!
అట్టి ధన్యత మనందరికీ మెండుగా కలుగును గాక! ఆమెన్!
దైవాశీస్సులు! (సశేషం)

✝️ CHRIST TEMPLE-PRODDATUR

పొట్టి జక్కయ్య – ఐదవ భాగం - పొట్టివాడు

✝️ CHRIST TEMPLE-PRODDATUR
-పొట్టి జక్కయ్య – ఐదవ భాగం - పొట్టివాడు

ప్రియ దైవజనమా! జక్కయ్యకున్న ఐదవ గుణగణం పొట్టివాడు. “ యేసు ఎవరో చూడగోరెను గాని, 1) పొట్టివాడైనందున, 2) జనులు గుంపుకూడినందున చూడలేకపోయెను. లూకా 19:3.

జక్కయ్య యేసయ్యను చూడాలని ఎంత తహతహలాడాడో గతభాగంలో చూసాము. అయితే పొట్టివాడైనందున, ప్రజలు గుంపుగా ఉన్నందున చూడలేక, మేడిచెట్టు ఎక్కినట్లు చూస్తున్నాం.
పొట్టితనం అంటే ఆదేశ ప్రజల సామాన్య ఎదుగుదల కంటే తక్కువగా ఎదగడం. పొట్టితనం తల్లిదండ్రుల జీన్స్ వలన గాని, హార్మోన్ల లోపం వలన గాని లేక ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగినా గాని పొట్టితనం వస్తుంది. మరి జక్కయ్య ఎందువలన పొట్టిగా ఉన్నాడో మనకు తెలియదు!
అయితే గమనించవలసినదేమిటంటే పొట్టితనం , యేసయ్యని చూడాలనే అతని ఆకాంక్షను ఆపలేకపోయింది. ఒక మేడిచెట్టు ఎక్కి కూర్చొన్నాడు. యేసయ్య ఆ దారిలో వస్తారు, నేను చూస్తాను అని. ఎన్నిసార్లు చెట్టు ఎక్కలేక క్రింద పడిపోయాడో తెలియదు. అయినా ప్రయత్నం ఆపలేదు! చివరకు సాధించాడు. చెట్టు ఎక్కాడు! ఇప్పుడు ప్రజలందరికన్నా ఎత్తులో ఉండి చూస్తున్నాడు! ఇదంతా ఎరిగిన యేసయ్య అదే చెట్టు క్రిందకు వచ్చి పిలుస్తున్నారు – జక్కయ్యా! త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట దిగవలసి యున్నది. వెంటనే బహుశా దిగడం రాక చెట్టుమీద నుండి దూకేశాడేమో!! లేక జారిపోయాడేమో! గాని యేసయ్యను సంతోషంగా చేర్చుకొన్నాడు!

జక్కయ్యకు బౌతికమైన పొట్టితనం! మరి నీకో?!! ఏ విషయంలో పొట్టిగా ఉన్నావో ఆలోచించు!
• దేవునికివ్వడంలో వెనుకబడి పోయావా?
• ప్రార్ధన చేయడంలో వెనుకబడ్డావా?
• పాటలు పాడటం లోనా?
• దేవుని గూర్చి సాక్ష్యం చెప్పడంలోనా?
• వరాలు పొందుకోవడంలోనా?
• ఆత్మల సంపాదన లేక పొట్టితనమా?

రక్షణ పొంది ఎన్నాళ్ళు అయ్యింది? ఇంతవరకు నీకు ప్రార్ధన చేయడమే సరిగా రాదు. కొంతమంది పాటలు పాడమంటే ధైర్యంగా పాడేస్తారు, ప్రార్ధన చెయ్యమంటే భయపడిపోతారు. సాక్ష్యం చెప్పమంటే చెప్పలేరు.

దేవుడు మనకు శ్రమల అనుభవం ద్వారా ఒక మెట్టునుండి మరో మెట్టుకు చేర్చుతారు. ప్రార్ధన చెయ్యడం వచ్చిన నీవు సాక్ష్యం చెప్పడం నేర్చుకోవాలి! సాక్షార్ధమైన జీవితం జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను మరో మెట్టు ఎక్కిస్తారు!
మొదట పరిచారికుడిగా, తర్వాత సువార్తికుడిగా, అద్భుతాలు చేసేవానిగా, ప్రవక్తగా, ఇంకా ఆయనకిష్టమైతే దైవసేవకునిగా, అపొస్తులునిగా నిన్ను తీర్చిదిద్దుతారు. దానికోసం నిన్ను నీవు సంపూర్తిగా దేవునికి సమర్పి౦చుకోవాలి!! నీపిలుపును ఏర్పాటును ప్రార్ధన ద్వారా నిశ్చయం చేసుకొని, గురియొద్దకు పరుగెత్తాలి! కాని ప్రస్తుతం నీవున్న ఆత్మీయస్తితితో సరిపెట్టుకొని మరుగుజ్జుగా బ్రతుకకూడదు!!
బైబిల్ ఏం చెబుతుంది? ప్రియుడా! నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలోనూ వర్దిల్లుచూ, సౌక్యముగా ఉండాలని ప్రార్ధించుచున్నాను!! 

- 3 యోహాను:2 అన్ని విషయాలలోనూ వర్ధిల్లాలని తండ్రి చిత్తము. ధనం సంపాదించాలని, కార్లు మేడలు సంపాదించాలని ఎలా తాపత్రయ పడుతున్నావో, అలాగే దేవునిలో ఎదగటానికి, దేవునితో ఐక్యమవడానికి, తాపత్రయపడాలి!!
జక్కయ్య ప్రజలకి భయపడలేదు, తన ఆస్తి-అంతస్తు ప్రక్కన పెట్టాడు. తన పొట్టితనాన్ని లెక్కచెయ్యలేదు! చెట్టు ఎక్కాడు, అదే యేసయ్యని అతని యొద్దకు నడిపించింది!!! నీవు అలా చేయగలవా?
నేడే ప్రయత్నించు!!
దైవాశీస్సులు!!!
(సశేషం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR

పొట్టి జక్కయ్య – నాల్గవ భాగం - యేసు ఎవరో చూడగోరెను

✝️ CHRIST TEMPLE-PRODDATUR
-పొట్టి జక్కయ్య – నాల్గవ భాగం - యేసు ఎవరో చూడగోరెను

“యేసు ఎవరో చూడగోరెను, గాని పొట్టివాడైనందున, జనులు గుంపు కూడియుండుట వలన చూడలేకపోయెను” లూకా 19:3
ప్రియ సహోదరీ/సహోదరులారా! మనం ఇంతవరకూ జక్కయ్య యెరికో పట్టణవాసి అని, సుంకపు గుత్తదారుడని, ధనవంతుడని చూసుకొన్నాము. పాపపు పట్టణంలో పాపిగా జీవిస్తున్నా, సుంకపు గుత్తదారుడిగా అన్యాయంగా జీవిస్తున్నా, ధనవంతుడిగా అహంకారిగా ఉన్నా సరే, తను చేస్తున్న అన్యాయాలు, పాపాలను తన అంతరాత్మ గద్ధిస్తున్నా, మొండిగా బ్రతికేస్తున్నాడు. ఈ స్తితిలో యేసుప్రభువు మాట విన్నాడు, చూడాలని ఆశపడ్డాడు. “ఆశగల ప్రాణమును దేవుడు తృప్తి పరచును”. ఇది నిజంగా జక్కయ్య జీవితంలో నెరవేరింది! తన జీవితంలో ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నా సరే తన జీవితంలో తృప్తిలేదు! శాంతి లేదు! యేసయ్య చేసే అద్భుతాలు, ఆయన సామాన్య జనాంగంతో కలసిపోయే విధానానికి ముచ్చట పడి, యేసయ్యని చూడాలని తపన చెందాడు! ఇలాంటి స్తితిలో ఉన్న జక్కయ్యని దర్శించడానికి దేవాదిదేవుడే దిగివచ్చి, పాపపు పట్టణంలో పాపిగా జీవిస్తున్న జక్కయ్యని కలవడానికి వచ్చారు! (4-6 వచనాలు)
యేసయ్య ఆ పట్టణం వస్తున్నారని తెలిసి, జక్కయ్య తన పనులన్నీ మానుకొని యేసయ్యని చూడాలని పరుగు పరుగున వెళ్ళాడు. అయితే 1) పొట్టి వాడైనందున, 2) జనులు గుంపుకూడి ఉన్నందున, చూడలేక పోయెను. ఈరోజు మనకు ఇలాంటి ఆటంకాలు ఎన్నో ఎదురౌతుంటాయి. మంచి మార్గంలో ప్రయానించాలంటే ఎన్నో అడ్డంకులు. చివరకు ప్రజలు ఏమనుకొంటారో అని కొందరైతే, మంచివారిని చెరిపేవారు కొందరు! వీటినన్నిటిని దాటుకొంటేనే నీకు యేసయ్య దర్శనం కలుగుతుంది!
అయితే ఇక్కడ జక్కయ్య తనకు కలిగిన పొట్టితనం వలన గాని, ప్రజా సమూహం వలన గాని, నిరుత్సాహపడకుండా, యేసయ్య ఏ మార్గంలో నడచుకొంటూ వస్తున్నారో, ఆ మార్గంలో పరుగెత్తి ఒక మేడిచెట్టు ఎక్కినట్లు చూస్తాం! ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం: ఒక ధనవంతుడు, అధికారంలో ఉన్నవాడు సామాన్యంగా ప్రవర్తించాల్సిన ప్రవర్తనకు భిన్నంగా, జక్కయ్య ప్రవర్తిస్తున్నాడు!! కొన్ని ప్రతులలో జక్కయ్య Chief Tax Collector అని వ్రాయబడింది. అనగా ప్రధాన సుంకపు గుత్తదారి. తనకున్న అధికారంతో ప్రజలను అడ్డు తొలగించుకొని, యేసయ్య దగ్గరికి వెళ్ళగలడు! లేదా ఎవరినైనా పంపి యేసయ్యని పిలిపించుకోగలడు! గాని జక్కయ్య ఈ రెండూ చెయ్యలేదు. ఆయన దగ్గర తనకున్న అధికారం పనికిరాదు అని తెలిసి, ఒక చెట్టు ఎక్కాడు! ఇదే యేసయ్యని ఆ మేడిచెట్టు దగ్గరికి నడిపించింది! యేసయ్య అందరి హృదయాలు ఎరిగినవాడు! జక్కయ్య మనసా వాచా కర్మేనా యేసయ్యని చూడాలనే తపనని గ్రహించి యేసుప్రభులవారే జక్కయ్య వద్దకు వచ్చి పిలిచారు. చెట్టుమీదనున్న జక్కయ్య ప్రజలకు కనపడకపోయినా యేసయ్యకు కనిపించారు! ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తి పరచే దేవుడు! పిలచి మరీ రక్షించారు!

మరి నీ ఆశ, నీధ్యాస, నీతపన దేనిమీద? ఎవరిమీద?
ధనం మీదా?
అధికారం మీదా?
అందం మీదా?
శరీరాసా?
నేత్రాశా?
జీవపుడంభమా?
లేక యేసయ్య మీదా!!!
ఒకవేళ యేసయ్య మీద కాకుండా పైనుదహరించిన వాటిమీద ఉంటే జాగ్రత్త! ఇప్పుడైనా మారుమనస్సు పొంది నీఆశ ఆయనపై పెట్టుకో!
నేనెంత కావాలనుకోన్నా యేసయ్య నన్ను దర్శించడం లేదు, మాట్లాడటం లేదు అనుకొంటున్నావా? కారణం నీవే!!! జక్కయ్యకున్న ఆశ, జిజ్ఞాశ, తపన నీకున్నాయా? దానికోసం ఎంత ప్రయత్నం చేసాడో!! ధనవంతుడు, ఎప్పుడూ చెట్టు ఎక్కి ఉండక పోవచ్చు! చెట్టు ఎక్కడం రాదేమో! గాని ప్రయత్నం చేసాడు! ఎన్నిసార్లు జారి పడ్డాడో తెలియదు! అటువంటి పట్టుదల నీకుంటే యేసయ్య నిన్నుకూడా దర్శిస్తారు!

అట్టి ధన్యత మనందరికీ కలుగును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Thursday, 11 August 2022

పొట్టి జక్కయ్య – మూడవ భాగం - ధనవంతుడు.

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- పొట్టి జక్కయ్య – మూడవ భాగం - ధనవంతుడు.

ప్రియ చదువరీ! మూడవదిగా పొట్టి జక్కయ్య ధనవంతుడు అని వ్రాయబడింది. “ఇదిగో సుంకపు గుత్తదారుడును, ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు. . . లూకా 19:2.
బైబిల్ గ్రంధంలో ధనవంతులకు అనుకూలమైన మాటలు లేవు. చివరకు యేసుప్రభువుల వారు కూడా చాలా కఠోరమైన మాటలన్నారు.
 ఉదా: లూకా 18:24,25 ఆస్తిగలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవునిరాజ్యంలో ప్రవేశించుట కంటే, సూదిబెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇక యేసుప్రభుల వారు తన ఉపమానాల్లో ధనవంతుల కోసం చెప్పారు. మరి ధనవంతులకు ఐశ్వర్యం ఇచ్చింది ఆయనే కదా! మరి ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదా? !!! మరి ఇక్కడ జక్కయ్య ధనవంతుడు కదా! అలాంటప్పుడు జక్కయ్యని ఎందుకు ఏర్పాటు చేసుకొన్నారు? కొంచెం లోతుగా ఆలోచిద్దాం.
యేసుప్రభుల వారి మాటలు పేదలకు, దీనులకు అనుకూలంగా ఉంటాయి, మరి ధనవంతులను కోరుకోలేదా? కానేకాదు. మొదటగా దేవుడు అబ్రహాము గారిని ఎన్నుకొన్నారు. అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, గిద్యోను, ఎలీషా గారు, ఇంకా ఘనురాలైన స్త్రీ వీరంతా ధనవంతులే! ఇక క్రొత్త నిభందనలో బర్నబా గారు బహు ధనవంతుడు, మార్కు ఇంకా అనేక మంది ధనవంతులను ఆయన ఏర్పరచుకొన్నారు. దీని అర్ధం ఏమిటంటే ధనము కలిగి ఉన్నాసరే దీనమనస్సు కలవారంటే దేవునికి ఇష్టం. పేదలను, దీనులను ఆదరించు వారంటే ఇష్టం ఆయనకు. ధనము కలిగిన తర్వాత విర్రవీగి, దేవునిని, ప్రజలను లెక్కచేయని వారంటే దేవునికి అసహ్యం!!!!
ఇంకా యేసయ్య ఏమన్నారంటే..

- భూమిమీద మీకొరకు ధనము కూర్చుకొనకుడి.. . . . . . . . . 
- పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి . . . . 

నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయముండును. మత్తయి 6:19-21. భూమిమీద ధనం కూర్చుకోవద్దు. పరలోకంలో కూర్చుకోమంటున్నారు. మరి అది ఎలా సాధ్యం?!!! మత్తయి 25:31-46 వరకు చెప్పబడిన ఉపమానంలో ఎవరైతే తోటివారికి, పొరుగువారికి, సహోదరులకు, అవసరంలో ఉన్నవారికి, పేదవారికి సహాయం చేస్తారో, వారు దేవునికి చేసినట్లే! అంటే పరలోకంలో ధనం కూర్చుకొన్నట్లే!!! యాకోబు 1:27 ప్రకారం దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తననుతాను కాపాడుకోవడమే భక్తి అంటే! అటువంటి భక్తి చేస్తే దేవుని దృష్టిలో ధనవంతులవుతారు. యాకోబు 2:5 ఈలోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. . . . . తాను వాగ్ధానము చేసిన రాజ్యానికి వారసులను గాను చేయుటకు దేవుడు ఏర్పరచుకొన్నారు.

లూకా 18:22 నీకింక ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినది అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును!
కాబట్టి బీదలకిస్తే దేవునికిచ్చినట్లే! బీదలకిచ్చువారు యెహోవాకు అప్పిచ్చువారు అని సామెతలు గ్రంధంలో వ్రాయబడింది.

అయితే జక్కయ్య బీదలకివ్వలేదు! యెరికో పట్టణస్తుడు, పాపులతో కలసి పాపియైనవాడు, సుంకపు గుత్తదారిగా మారి అన్యాయముగా డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు! ధనవంతుడు, గాని యేసయ్య జక్క్య్యని కోరుకొన్నారు. ఎందుకంటే మనం 19:7-9 వచనాలు చూసుకొంటే యేసయ్యను తన హృదయంలో, గృహములో చేర్చుకొని ఏమంటున్నాడు. . ఇదిగో ప్రభువా! నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. . . ఇంతవరకు తనకొరకు ఆస్తి కూర్చుకొన్న జక్కయ్య – అది పేదలకిచ్చి పరలోకంలో ధనం కూర్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకొంటే, దానికి నాలుగింతలు తిరిగి చెల్లిస్తానంటున్నాడు.
అంతేకాదు 8వ వచనంలో ప్రభువా! అంటున్నాడు. ఇంతవరకూ ధనమే తన యజమాని, కాని ఇప్పుడు యేసయ్యని ప్రభువా అనగా నా యజమానివి నీవే అంటున్నాడు!తద్వారా పరలోక రాజ్యానికి వారసులైన అతికొద్దిమంది ధనికులలో ఒకనిగా జక్కయ్య మారిపోయాడు.

అయితే ఇక్కడ లూకా 18:24-25 లో చెప్పబడిన ధనిక యువకునికి- జక్కయ్యకు, లూకా 12:16 లో చెప్పబడిన ఆస్తిపరునికి-జక్కయ్యకు చాలా తేడా ఉంది. ధనిక యువకుడు యేసయ్య మాట విని నొచ్చుకొంటూ వెళ్ళిపోయాడు, 12:16లో గల ఆస్తి గలవాడు చచ్చాడు! అయితే జక్కయ్య యేసయ్యను చేర్చుకొని, కేవలం మాటలతో మాత్రమె ప్రభువా అని పిలవడం కాకుండా, చేతలతో తనకు కలిగినది బీదలకిచ్చి, తను అన్యాయం చేసినవారికి న్యాయం చేసి, తన చర్యలద్వారా యేసయ్యని నిజముగా వెంబడించి మాదిరి జీవితం జీవించాడు!

👉 ఒకవేళ నీవు ధనవంతుడివా? ధనం మీద నమ్మిక ఉంచుకొన్న్నావా? ధనాశలో కూరుకుపోయావా? జాగ్రత్త! నేడే బయటకు రా! ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని సెలవిచ్చారు యేసయ్య! నీ ఆస్తిని పేదలకోసం, దేవుని సేవకోసం, పొరుగువారి సహాయార్ధం ఖర్చుచేసి పరలోకంలో ధనం సంపాదించుకో! జక్కయ్యలా మాదిరి జీవితం జీవించు!
అట్టి కృప, ధన్యత మన అందరికీ కలుగును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR.

పొట్టి జక్కయ్య -రెండవ భాగం - సుంకపు గుత్తదారుడు.

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- పొట్టి జక్కయ్య -రెండవ భాగం - సుంకపు గుత్తదారుడు.

ప్రియ సహోదరీ/సహోదరులారా! మనం జక్కయ్య గురించి ధ్యానిస్తున్నాం. లూకా 19:2 ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అనుపేరు గల ఒకడు..

జక్కయ్య వృత్తి సుంకపు గుత్తదారుడు- Tax Collector. ఇతనికి ఈ వృత్తి ఎలావచ్చిందో తెలుసుకోవాలంటే మనం కొంచెం చరిత్ర తెలుకోవాల్సిన అవుసరం ఉంది.

క్రీ.పూ. 63 నుండి ఇశ్రాయెలీదేశం రోమా సామ్రాజ్యపు స్వాధీనంలో ఉంది. అప్పటినుండి రోమీయులు ఇశ్రాయేలీయులకు పన్నులు, సుంకాలు విధించడం మొదలుపెట్టారు. అయితే అక్కడ తిరుగుబాటు మొదలైంది. రోమీయులకు స్వయంగా పన్నులు వసూలు చేయడం కష్టమైంది. కాబట్టి వారు ఆలోచించి – ఇశ్రాయేలీయులు దేవునికి భయపడువారు, యాజకులకు ఎదురుచెప్పరని గ్రహించి, ఇశ్రాయెలీ ప్రధాన యాజకులతో లాలూచీ పడ్డారు. ప్రధాన యాజకులు కూడా అధికారం కావాలని ఆశించారు. అందుకే వారు రోమీయులతో ఏకీభవించారు. ఇక రోమీయులు, యాజకులు కలసి ప్రజలమీద పన్నులు సుంకాలు విధించడం మొదలుపెట్టారు. ఇక ప్రధాన యాజకుడైన అన్న(క్రీ.శ. 6-15) తన ఐదుగురు కుమారులకు, తన అల్లుడైన కయపకు, తన మనవడికి మాత్రమె వంతు వచ్చేలాగా మరి ఎవరికీ వంతు రాకుండా చేసేసాడు. మిగతా యాజకులని బెదిరించాడు. దేవాలయంలో దుకాణాలు ఏర్పాటుచేశాడు. ఎవరైనా బలి అర్పణ తెస్తే తప్పకుండా వారి దుకాణాలలో అమ్మబడిన బలిపశువు మాత్రమె అర్పించాలి. వాళ్ళ సొంత పశువులు అర్పించకుండా ఏవో వంకలు చెప్పేవారు. ఈరకంగా చేసి, ప్రజలు రూకలు తెస్తే వాటిని మార్చి పశువులు, పక్షులు ఇచ్చేవారు. ఈవిధముగా రూకలు మార్చే దుకాణాలు కూడా దేవాలయంలో ప్రారంభమయ్యాయి. ఎదిరించేవారిని బెదిరించేవాడు. వారిని మొట్టమొదటగా ఎదిరించిన వారు మన యేసయ్య మాత్రమే. (ఆయన త్రాళ్ళతో కొరడాచేసి వాటితో వారందరినీ చెల్లాచెదురు చేసారు. యోహాను 2:13-19).
సరే. ఇలాంటి పరిస్తితిలో వారికి పన్నులు సుంకాలు వసూలు చేసేవారు దేశమంతా కావాలి. దానికోసం మూర్కులు, దేవుడంటే భయం లేని వారు, నిరంకుశంగా ప్రవర్తించేవారు, మాట చాతుర్యం గల వారికి ఈ పని అప్పగించేవారు. వీరు రోమీయులు, యాజకులు విధించిన పన్నుకి ఇంకా కొన్ని కలిపి తమ జేబులు నింపుకొని, ధనవంతులుగా మారేవారు. దానిలో సెలెక్ట్ అయినవాడు ఈ జక్కయ్య.

అయితే ఇలాంటివారిని రక్షించడానికి యేసయ్య పాపపు పట్టణమైన యెరికోకి వచ్చి, పాపియైన ఒకవ్యక్తిని మార్చడం అత్యద్భుతం!
అయితే మీరనొచ్చు, ఇలాంటివారిని మార్చడమెందుకు? శపించవచ్చు కదా అని.
యేసయ్య వచ్చింది పాపుల్ని రక్షించడానికి, నశించిన దాని వెదకి రక్షించడానికి మనుష్యకుమారుడు ఈలోకమునకు వచ్చెను. లూకా 19:10.

పాపియైన ఒక మనుష్యుని ప్రేమించి, పేరుపెట్టి పిలచి, వాని ఇంటికి వెళ్లి, తద్వారా అతనిలాంటి మరికొంతమందిని చేర్చుకొని, వారిలో పరివర్తన తెచ్చి, తద్వారా వారిని మార్చిన వైనం మన ఊహలకు అందదు. ఆయన పరమ జ్ఞాని! ఆయన ఆలోచనలు అగమ్యగోచరములు.

ఆ యేసయ్య కి మనం కావాలి. సుంకరులలో ఉన్న పాపాన్ని ప్రేమించలేదు కాని, సుంకరులను ప్రేమించారు యేసయ్య. ఉదా: మన ఇంట్లో ఎవరైనా వ్యాధితో బాదపడుచుంటే, మనం మన వారిని ప్రేమిస్తాం గాని ఆ వ్యాదిని ద్వేషిస్తాం. అలానే యేసయ్య పాపుల్ని ప్రేమించి, పాపాన్ని ద్వేషించారు, వారికి మెత్తని మనస్సిచ్చి,పరివర్తననిచ్చి, పరలోకవాసులుగా చేర్చారు.

ఆ మార్పు నీకు కావాలా? అయితే నేడే యేసయ్యకి నీ హృదయం ఇవ్వు!
ఆయన నీ జీవితంలో ప్రవేశించి అద్భుతం చేస్తారు.

అట్టి కృప మనందరికీ కలుగును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Tuesday, 9 August 2022

- పొట్టి జక్కయ్య - పార్ట్ : 1

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- పొట్టి జక్కయ్య - పార్ట్ : 1

దేవుని నామమునకు మహిమ కలుగును గాక! యేసయ్య నామంలో అందరికీ శుభములు. ఈ సారి మనం పొట్టి జక్కయ్య కోసం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 19:1-10 వరకు జక్కయ్య యొక్క కొన్ని గుణగణాలు మనకు కనిపిస్తాయి.
1.యెరికో పట్టణస్తుడు
2. సుంకపు గుత్తదారుడు
3. ధనవంతుడు
4. యేసు ఎవరో చూడగోరెను
5. పొట్టివాడు
6. యేసయ్యని తన హృదయంలో/గృహములో చేర్చుకొనెను
7. అబ్రహాము కుమారుడు,

1.యెరికో పట్టణస్తుడు.

యెరికో పట్టణం చాలా చారిత్రాత్మిక పట్టణం. పూర్వపు పాలస్తీనాలో పశ్చిమాన గల ముఖ్యమైన పట్టణం, కోటగల పట్టణం, యోర్దాను లోయ ప్రాంతంలో ముఖ్యమైన పట్టణం. యెహోషువా 2-10 అధ్యాయాలు. దైవజనుడైన యెహోషువా గారి ద్వారా, దైవస్తుతి ద్వారా పడగొట్టబడిన పట్టణం, ఆయనచే శపింపబడిన పట్టణం. యెహోషువా 7వ అధ్యాయం.
మనకు ప్రాముఖ్యంగా మూడు యెరికోలు కనిపిస్తాయి.

1.యెహోషువా కాలం నాటి యెరికో
2. హేరోదు కట్టించిన యెరికో
3. క్రూసేడ్ ల(పవిత్ర యుద్ధాలు) నాటి యెరికో(ఏర్-రిహా). క్రీ. శ. 1840లో తుర్కులు(టర్కీ) దానిని ఆక్రమించుకొని సర్వనాశనం చేసినా ఇంకా కొన్ని అవశేషాలు నేటికి కనిపిస్తాయి. అయినా తిరిగి కట్టబడింది.

యెరికో అనగా సువాసన గల పట్టణం అని అర్ధం. అయితే అది పాపభూయిష్టమైన పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది యోర్దాను లోయలో యోర్దాను నది వలన సారవంతమైన ప్రాంతంగా సస్యశ్యామలముగా మారిపోయి సర్వ సమృద్ధి కలిగి పాలుతేనెలు ప్రవహించు ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. దాని వలన ప్రజలు ధనవంతులుగా మారి, ఆ ధనసంపాదనచే దేవునిని మరచిపోయి పాపులుగా మారిపోయారు. చివరకి యేసయ్య కాలం వరకు అలానే వున్నారు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. వీరిని రక్షించటానికి లోక రక్షుకుడైన యేసుప్రభుల వారు సంచరించుచూ యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. {యేసయ్య కాలంలో రెండు యెరికోలున్నాయి పాత యెరికో, క్రొత్త యెరికో. పాత యెరికో పట్టణం బయట బర్తిమయిని స్వస్తపరిచారు. క్రొత్త యెరికో పట్టణము- ఇది హేరోదు కట్టించింది. యేసయ్య జక్కయ్యని కలిసింది క్రొత్త యెరికో లోనే.}
పట్టణంలో ప్రవేశించక ముందు తీమయి కుమారుడైన బర్తిమయి అనే గుడ్డిభిక్షకుని స్వస్తపరిచారు. ఆయన తన ప్రజల ఆర్తనాదాలు విని దాటిపోలేడు. ఆగి స్వస్తపరిచారు. చివరకి పట్టణంలో ప్రవేశించి పాపిగా, అన్యాయస్తునిగా, సుంకరిగా పిలువబడే జక్కయ్యను పిలచి మరీ రక్షించారు.
నీవు ఎలాంటివాడివైనా సరే, యేసయ్యకి నీవు కావాలి! నీవు త్రాగుబోతువైనా లంచగొండివైన, వ్యభిచారివైనా, అందరిచే ద్వేషించబడుతున్నా సరే యేసయ్యకి నీవు కావాలి, యేసయ్యకు నీ హృదయం అర్పిస్తే ఆయన నిన్ను మారుస్తారు. జక్కయ్య యేసయ్యకు హృదయంలో,గృహములో చోటిచ్చి "అన్యాయస్తుడు – అబ్రహాము కుమారునిగా" మారిపోయాడు.
అట్టి భాగ్యం నీకు కావాలా?
అయితే నేడే యేసయ్య యొద్దకు రా!
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR