పొట్టి జక్కయ్య – మూడవ భాగం - ధనవంతుడు.

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- పొట్టి జక్కయ్య – మూడవ భాగం - ధనవంతుడు.

ప్రియ చదువరీ! మూడవదిగా పొట్టి జక్కయ్య ధనవంతుడు అని వ్రాయబడింది. “ఇదిగో సుంకపు గుత్తదారుడును, ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు. . . లూకా 19:2.
బైబిల్ గ్రంధంలో ధనవంతులకు అనుకూలమైన మాటలు లేవు. చివరకు యేసుప్రభువుల వారు కూడా చాలా కఠోరమైన మాటలన్నారు.
 ఉదా: లూకా 18:24,25 ఆస్తిగలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవునిరాజ్యంలో ప్రవేశించుట కంటే, సూదిబెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇక యేసుప్రభుల వారు తన ఉపమానాల్లో ధనవంతుల కోసం చెప్పారు. మరి ధనవంతులకు ఐశ్వర్యం ఇచ్చింది ఆయనే కదా! మరి ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదా? !!! మరి ఇక్కడ జక్కయ్య ధనవంతుడు కదా! అలాంటప్పుడు జక్కయ్యని ఎందుకు ఏర్పాటు చేసుకొన్నారు? కొంచెం లోతుగా ఆలోచిద్దాం.
యేసుప్రభుల వారి మాటలు పేదలకు, దీనులకు అనుకూలంగా ఉంటాయి, మరి ధనవంతులను కోరుకోలేదా? కానేకాదు. మొదటగా దేవుడు అబ్రహాము గారిని ఎన్నుకొన్నారు. అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, గిద్యోను, ఎలీషా గారు, ఇంకా ఘనురాలైన స్త్రీ వీరంతా ధనవంతులే! ఇక క్రొత్త నిభందనలో బర్నబా గారు బహు ధనవంతుడు, మార్కు ఇంకా అనేక మంది ధనవంతులను ఆయన ఏర్పరచుకొన్నారు. దీని అర్ధం ఏమిటంటే ధనము కలిగి ఉన్నాసరే దీనమనస్సు కలవారంటే దేవునికి ఇష్టం. పేదలను, దీనులను ఆదరించు వారంటే ఇష్టం ఆయనకు. ధనము కలిగిన తర్వాత విర్రవీగి, దేవునిని, ప్రజలను లెక్కచేయని వారంటే దేవునికి అసహ్యం!!!!
ఇంకా యేసయ్య ఏమన్నారంటే..

- భూమిమీద మీకొరకు ధనము కూర్చుకొనకుడి.. . . . . . . . . 
- పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి . . . . 

నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయముండును. మత్తయి 6:19-21. భూమిమీద ధనం కూర్చుకోవద్దు. పరలోకంలో కూర్చుకోమంటున్నారు. మరి అది ఎలా సాధ్యం?!!! మత్తయి 25:31-46 వరకు చెప్పబడిన ఉపమానంలో ఎవరైతే తోటివారికి, పొరుగువారికి, సహోదరులకు, అవసరంలో ఉన్నవారికి, పేదవారికి సహాయం చేస్తారో, వారు దేవునికి చేసినట్లే! అంటే పరలోకంలో ధనం కూర్చుకొన్నట్లే!!! యాకోబు 1:27 ప్రకారం దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తననుతాను కాపాడుకోవడమే భక్తి అంటే! అటువంటి భక్తి చేస్తే దేవుని దృష్టిలో ధనవంతులవుతారు. యాకోబు 2:5 ఈలోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. . . . . తాను వాగ్ధానము చేసిన రాజ్యానికి వారసులను గాను చేయుటకు దేవుడు ఏర్పరచుకొన్నారు.

లూకా 18:22 నీకింక ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినది అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును!
కాబట్టి బీదలకిస్తే దేవునికిచ్చినట్లే! బీదలకిచ్చువారు యెహోవాకు అప్పిచ్చువారు అని సామెతలు గ్రంధంలో వ్రాయబడింది.

అయితే జక్కయ్య బీదలకివ్వలేదు! యెరికో పట్టణస్తుడు, పాపులతో కలసి పాపియైనవాడు, సుంకపు గుత్తదారిగా మారి అన్యాయముగా డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు! ధనవంతుడు, గాని యేసయ్య జక్క్య్యని కోరుకొన్నారు. ఎందుకంటే మనం 19:7-9 వచనాలు చూసుకొంటే యేసయ్యను తన హృదయంలో, గృహములో చేర్చుకొని ఏమంటున్నాడు. . ఇదిగో ప్రభువా! నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. . . ఇంతవరకు తనకొరకు ఆస్తి కూర్చుకొన్న జక్కయ్య – అది పేదలకిచ్చి పరలోకంలో ధనం కూర్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకొంటే, దానికి నాలుగింతలు తిరిగి చెల్లిస్తానంటున్నాడు.
అంతేకాదు 8వ వచనంలో ప్రభువా! అంటున్నాడు. ఇంతవరకూ ధనమే తన యజమాని, కాని ఇప్పుడు యేసయ్యని ప్రభువా అనగా నా యజమానివి నీవే అంటున్నాడు!తద్వారా పరలోక రాజ్యానికి వారసులైన అతికొద్దిమంది ధనికులలో ఒకనిగా జక్కయ్య మారిపోయాడు.

అయితే ఇక్కడ లూకా 18:24-25 లో చెప్పబడిన ధనిక యువకునికి- జక్కయ్యకు, లూకా 12:16 లో చెప్పబడిన ఆస్తిపరునికి-జక్కయ్యకు చాలా తేడా ఉంది. ధనిక యువకుడు యేసయ్య మాట విని నొచ్చుకొంటూ వెళ్ళిపోయాడు, 12:16లో గల ఆస్తి గలవాడు చచ్చాడు! అయితే జక్కయ్య యేసయ్యను చేర్చుకొని, కేవలం మాటలతో మాత్రమె ప్రభువా అని పిలవడం కాకుండా, చేతలతో తనకు కలిగినది బీదలకిచ్చి, తను అన్యాయం చేసినవారికి న్యాయం చేసి, తన చర్యలద్వారా యేసయ్యని నిజముగా వెంబడించి మాదిరి జీవితం జీవించాడు!

👉 ఒకవేళ నీవు ధనవంతుడివా? ధనం మీద నమ్మిక ఉంచుకొన్న్నావా? ధనాశలో కూరుకుపోయావా? జాగ్రత్త! నేడే బయటకు రా! ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని సెలవిచ్చారు యేసయ్య! నీ ఆస్తిని పేదలకోసం, దేవుని సేవకోసం, పొరుగువారి సహాయార్ధం ఖర్చుచేసి పరలోకంలో ధనం సంపాదించుకో! జక్కయ్యలా మాదిరి జీవితం జీవించు!
అట్టి కృప, ధన్యత మన అందరికీ కలుగును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR.

Comments