✝️ CHRIST TEMPLE-PRODDATUR
-పొట్టి జక్కయ్య – నాల్గవ భాగం - యేసు ఎవరో చూడగోరెను
“యేసు ఎవరో చూడగోరెను, గాని పొట్టివాడైనందున, జనులు గుంపు కూడియుండుట వలన చూడలేకపోయెను” లూకా 19:3
ప్రియ సహోదరీ/సహోదరులారా! మనం ఇంతవరకూ జక్కయ్య యెరికో పట్టణవాసి అని, సుంకపు గుత్తదారుడని, ధనవంతుడని చూసుకొన్నాము. పాపపు పట్టణంలో పాపిగా జీవిస్తున్నా, సుంకపు గుత్తదారుడిగా అన్యాయంగా జీవిస్తున్నా, ధనవంతుడిగా అహంకారిగా ఉన్నా సరే, తను చేస్తున్న అన్యాయాలు, పాపాలను తన అంతరాత్మ గద్ధిస్తున్నా, మొండిగా బ్రతికేస్తున్నాడు. ఈ స్తితిలో యేసుప్రభువు మాట విన్నాడు, చూడాలని ఆశపడ్డాడు. “ఆశగల ప్రాణమును దేవుడు తృప్తి పరచును”. ఇది నిజంగా జక్కయ్య జీవితంలో నెరవేరింది! తన జీవితంలో ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నా సరే తన జీవితంలో తృప్తిలేదు! శాంతి లేదు! యేసయ్య చేసే అద్భుతాలు, ఆయన సామాన్య జనాంగంతో కలసిపోయే విధానానికి ముచ్చట పడి, యేసయ్యని చూడాలని తపన చెందాడు! ఇలాంటి స్తితిలో ఉన్న జక్కయ్యని దర్శించడానికి దేవాదిదేవుడే దిగివచ్చి, పాపపు పట్టణంలో పాపిగా జీవిస్తున్న జక్కయ్యని కలవడానికి వచ్చారు! (4-6 వచనాలు)
యేసయ్య ఆ పట్టణం వస్తున్నారని తెలిసి, జక్కయ్య తన పనులన్నీ మానుకొని యేసయ్యని చూడాలని పరుగు పరుగున వెళ్ళాడు. అయితే 1) పొట్టి వాడైనందున, 2) జనులు గుంపుకూడి ఉన్నందున, చూడలేక పోయెను. ఈరోజు మనకు ఇలాంటి ఆటంకాలు ఎన్నో ఎదురౌతుంటాయి. మంచి మార్గంలో ప్రయానించాలంటే ఎన్నో అడ్డంకులు. చివరకు ప్రజలు ఏమనుకొంటారో అని కొందరైతే, మంచివారిని చెరిపేవారు కొందరు! వీటినన్నిటిని దాటుకొంటేనే నీకు యేసయ్య దర్శనం కలుగుతుంది!
అయితే ఇక్కడ జక్కయ్య తనకు కలిగిన పొట్టితనం వలన గాని, ప్రజా సమూహం వలన గాని, నిరుత్సాహపడకుండా, యేసయ్య ఏ మార్గంలో నడచుకొంటూ వస్తున్నారో, ఆ మార్గంలో పరుగెత్తి ఒక మేడిచెట్టు ఎక్కినట్లు చూస్తాం! ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం: ఒక ధనవంతుడు, అధికారంలో ఉన్నవాడు సామాన్యంగా ప్రవర్తించాల్సిన ప్రవర్తనకు భిన్నంగా, జక్కయ్య ప్రవర్తిస్తున్నాడు!! కొన్ని ప్రతులలో జక్కయ్య Chief Tax Collector అని వ్రాయబడింది. అనగా ప్రధాన సుంకపు గుత్తదారి. తనకున్న అధికారంతో ప్రజలను అడ్డు తొలగించుకొని, యేసయ్య దగ్గరికి వెళ్ళగలడు! లేదా ఎవరినైనా పంపి యేసయ్యని పిలిపించుకోగలడు! గాని జక్కయ్య ఈ రెండూ చెయ్యలేదు. ఆయన దగ్గర తనకున్న అధికారం పనికిరాదు అని తెలిసి, ఒక చెట్టు ఎక్కాడు! ఇదే యేసయ్యని ఆ మేడిచెట్టు దగ్గరికి నడిపించింది! యేసయ్య అందరి హృదయాలు ఎరిగినవాడు! జక్కయ్య మనసా వాచా కర్మేనా యేసయ్యని చూడాలనే తపనని గ్రహించి యేసుప్రభులవారే జక్కయ్య వద్దకు వచ్చి పిలిచారు. చెట్టుమీదనున్న జక్కయ్య ప్రజలకు కనపడకపోయినా యేసయ్యకు కనిపించారు! ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తి పరచే దేవుడు! పిలచి మరీ రక్షించారు!
మరి నీ ఆశ, నీధ్యాస, నీతపన దేనిమీద? ఎవరిమీద?
ధనం మీదా?
అధికారం మీదా?
అందం మీదా?
శరీరాసా?
నేత్రాశా?
జీవపుడంభమా?
లేక యేసయ్య మీదా!!!
ఒకవేళ యేసయ్య మీద కాకుండా పైనుదహరించిన వాటిమీద ఉంటే జాగ్రత్త! ఇప్పుడైనా మారుమనస్సు పొంది నీఆశ ఆయనపై పెట్టుకో!
నేనెంత కావాలనుకోన్నా యేసయ్య నన్ను దర్శించడం లేదు, మాట్లాడటం లేదు అనుకొంటున్నావా? కారణం నీవే!!! జక్కయ్యకున్న ఆశ, జిజ్ఞాశ, తపన నీకున్నాయా? దానికోసం ఎంత ప్రయత్నం చేసాడో!! ధనవంతుడు, ఎప్పుడూ చెట్టు ఎక్కి ఉండక పోవచ్చు! చెట్టు ఎక్కడం రాదేమో! గాని ప్రయత్నం చేసాడు! ఎన్నిసార్లు జారి పడ్డాడో తెలియదు! అటువంటి పట్టుదల నీకుంటే యేసయ్య నిన్నుకూడా దర్శిస్తారు!
అట్టి ధన్యత మనందరికీ కలుగును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments