✝️ CHRIST TEMPLE-PRODDATUR
-పొట్టి జక్కయ్య – ఏడవ భాగం - అబ్రహాము కుమారుడు.
(గమనిక: బైబిల్ గ్రంధం ఆత్మీయ మర్మాల నిలయం. రోజూ చదువుతున్న.. ప్రతీరోజూ రోజుకో కోణంలో దేవుడు మాట్లాడుతారు. ఈ భాగం ద్వారా నాకు అర్ధమైంది మాత్రం నేను వ్రాస్తున్నాను. మరొకరికి దేవుడు మరో విధంగా మాట్లాడి ఉండొచ్చు!!)
అందుకు యేసు: ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. లూకా 19:9.
మనం ఇంతవరకు జక్కయ్య పాపపు పట్టణమైన యెరికోవాసి అని, సుంకపుగుత్తదారుడని, ధనవంతుడు గాని యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు గాని పొట్టివాడైనందున, జనులు గుంపుకూడి ఉన్నందున చూడలేక మేడిచెట్టు ఎక్కి కూర్చొంటే యేసుప్రభులవారు ఆ చెట్టు దగ్గరికే వచ్చి జక్కయ్యని పిలిచారు. అప్పుడు జక్కయ్య తనగృహములోనికి యేసయ్యని సంతోషముతో ఆహ్వానించినట్లు ధ్యానించాము.
అయితే ఇక్కడ ఎప్పుడైతే తన ఆస్తిలో సగం బీదలకిచ్చాడో, తను అన్యాయం చేసినవారికి న్యాయం చేసాడో, యేసుప్రభులవారు తన నోటితో ప్రాముఖ్యమైన మాట అంటున్నారు: ఇతడును అబ్రహాము కుమారుడే! ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. అంటే ఎవరైతే మార్పునొంది రక్షింపబడతారో వారందరూ అబ్రహాము సంతానమన్న మాట! తనను ఎందరంగీకరించెదరో వారందరినీ పిల్లలని పిలుచుటకు ఆయన అంగీకరించెను అని వ్రాయబడింది.
అయితే ఇక్కడ యేసుప్రభులవారే స్వయముగా అబ్రహాము కుమారుడు అని జక్కయ్యకోసం చెప్పారు! తద్వారా రక్షింపబడిన వారందరికోసం చెబుతున్నారు. అబ్రహాము మానవ మాత్రుడు. గాని ఆయనకోసం పరిశుద్ద గ్రంధంలో చాలా సార్లు వ్రాయబడింది. యేసయ్య తన ప్రసంగాలలో కొద్దిమందిని మాత్రం సంభోదించారు. వారిలో అబ్రహాము, దావీదు లాంటివారున్నారు. అబ్రహాము గారిని యేసయ్య తన ఉపమానాలలో వాడుకొన్నారు. ధనవంతుడు-లాజరు ఉపమానంలో “తండ్రివైన అబ్రహామా!” అనియు, అబ్రహాము రొమ్మున ఆనుకోనెను అని అన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనెను అంటే ఒకవిధముగా అబ్రాహాము – తండ్రియైన దేవునితో ఉపమానాలంకారముగా పోల్చారు! ఇక లూకా 19:9 లో ఇతడును అబ్రహాము కుమారుడే అంటున్నారు!
ఒక సామాన్య మానవునికి ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది? అబ్రాహాము గారి జీవితం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధిక్యతకు కారణాలు కనిపిస్తాయి:
1. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడచి, నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు చెబితే (ఆది 12, హెబ్రీ 11:8)- ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? నేను నిన్ను ఎందుకు నమ్మాలి? అక్కడ ఏముంటాయి? ఇలాంటివి ఏమీ అడగకుండా దేవునిని నమ్మి తనకున్నదంతా తీసుకొని కల్దీయ దేశం నుండి సుమారు 300 మైళ్ళు నడచి హారాను వెళ్ళిపోయారు. మరలా అక్కడనుండి ఐగుప్తు, కానాను ఇలా దేశాలు తిరుగుతూ ఉన్నారాయన తన జీవితమంతా! ధనవంతుడైన అబ్రాహాము గుడారాలలో జీవిస్తూ, అరణ్యాలలో, ఎడారులలో ఎండకు వానకు తిరుగుతూ జీవిస్తు గడిపారు.గాని ఎప్పుడూ దేవునిని ప్రశ్నించలేదు. ఇది చేస్తాను అది చేస్తాను అన్నావు. ఏదీ? అనలేదు. అదే అతనికి నీతిగా ఎంచబడింది, “అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను” ఆదికాండము 15:6, రోమా 4:3. ఈ అనుకూల ప్రవర్తనే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చింది, అందుకే యేసయ్య జక్కయ్యతో అంటున్నారు ఇతడునూ అబ్రహాము కుమారుడే!
2. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:17-23. ఎందుకంటే నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని వాగ్దానం చేసినవాడు దానిని నెరవేర్చుటకు సమర్డుడని విశ్వశించి బలముపొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
3. ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు చెబితే, ఏ అడ్డంకము చెప్పకుండా బలి అర్పించడానికి సిద్దమయ్యాడు, మృతులను సహితము ఆయన లేపడానికి శక్తిమంతుడని ప్రగాఢ విశ్వాసం కలియుండెను. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులందరికీ తండ్రిగా మారిపోయారు అబ్రహాము గారు!
జక్కయ్య యేసయ్యను స్వీకరించి, తనకున్నదానిలో సగం బీదలకిచ్చి, మరికొంత తను అన్యాయం చేసిన దానికి నాలుగింతలు చెల్లించి చాలా ఆస్తి కోల్పోయాడు . అయినా సరే దేవుని యందు విశ్వాసం తగ్గలేదు. తద్వారా అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు!
మరి నీకు అటువంటి అచంచలమైన విశ్వాసం ఉందా?!! అలాంటి విశ్వాసం, సమర్పణ ఉంటేనే అబ్రహాము కుమారునిగా మారగలవు!
నేడే అట్టి విశ్వాసం పొందుకో!
దైవకృప మీ అందరికి తోడుగా నుండును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!
(సమాప్తం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments