✝️ CHRIST TEMPLE-PRODDATUR
- పొట్టి జక్కయ్య -రెండవ భాగం - సుంకపు గుత్తదారుడు.
ప్రియ సహోదరీ/సహోదరులారా! మనం జక్కయ్య గురించి ధ్యానిస్తున్నాం. లూకా 19:2 ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అనుపేరు గల ఒకడు..
జక్కయ్య వృత్తి సుంకపు గుత్తదారుడు- Tax Collector. ఇతనికి ఈ వృత్తి ఎలావచ్చిందో తెలుసుకోవాలంటే మనం కొంచెం చరిత్ర తెలుకోవాల్సిన అవుసరం ఉంది.
క్రీ.పూ. 63 నుండి ఇశ్రాయెలీదేశం రోమా సామ్రాజ్యపు స్వాధీనంలో ఉంది. అప్పటినుండి రోమీయులు ఇశ్రాయేలీయులకు పన్నులు, సుంకాలు విధించడం మొదలుపెట్టారు. అయితే అక్కడ తిరుగుబాటు మొదలైంది. రోమీయులకు స్వయంగా పన్నులు వసూలు చేయడం కష్టమైంది. కాబట్టి వారు ఆలోచించి – ఇశ్రాయేలీయులు దేవునికి భయపడువారు, యాజకులకు ఎదురుచెప్పరని గ్రహించి, ఇశ్రాయెలీ ప్రధాన యాజకులతో లాలూచీ పడ్డారు. ప్రధాన యాజకులు కూడా అధికారం కావాలని ఆశించారు. అందుకే వారు రోమీయులతో ఏకీభవించారు. ఇక రోమీయులు, యాజకులు కలసి ప్రజలమీద పన్నులు సుంకాలు విధించడం మొదలుపెట్టారు. ఇక ప్రధాన యాజకుడైన అన్న(క్రీ.శ. 6-15) తన ఐదుగురు కుమారులకు, తన అల్లుడైన కయపకు, తన మనవడికి మాత్రమె వంతు వచ్చేలాగా మరి ఎవరికీ వంతు రాకుండా చేసేసాడు. మిగతా యాజకులని బెదిరించాడు. దేవాలయంలో దుకాణాలు ఏర్పాటుచేశాడు. ఎవరైనా బలి అర్పణ తెస్తే తప్పకుండా వారి దుకాణాలలో అమ్మబడిన బలిపశువు మాత్రమె అర్పించాలి. వాళ్ళ సొంత పశువులు అర్పించకుండా ఏవో వంకలు చెప్పేవారు. ఈరకంగా చేసి, ప్రజలు రూకలు తెస్తే వాటిని మార్చి పశువులు, పక్షులు ఇచ్చేవారు. ఈవిధముగా రూకలు మార్చే దుకాణాలు కూడా దేవాలయంలో ప్రారంభమయ్యాయి. ఎదిరించేవారిని బెదిరించేవాడు. వారిని మొట్టమొదటగా ఎదిరించిన వారు మన యేసయ్య మాత్రమే. (ఆయన త్రాళ్ళతో కొరడాచేసి వాటితో వారందరినీ చెల్లాచెదురు చేసారు. యోహాను 2:13-19).
సరే. ఇలాంటి పరిస్తితిలో వారికి పన్నులు సుంకాలు వసూలు చేసేవారు దేశమంతా కావాలి. దానికోసం మూర్కులు, దేవుడంటే భయం లేని వారు, నిరంకుశంగా ప్రవర్తించేవారు, మాట చాతుర్యం గల వారికి ఈ పని అప్పగించేవారు. వీరు రోమీయులు, యాజకులు విధించిన పన్నుకి ఇంకా కొన్ని కలిపి తమ జేబులు నింపుకొని, ధనవంతులుగా మారేవారు. దానిలో సెలెక్ట్ అయినవాడు ఈ జక్కయ్య.
అయితే ఇలాంటివారిని రక్షించడానికి యేసయ్య పాపపు పట్టణమైన యెరికోకి వచ్చి, పాపియైన ఒకవ్యక్తిని మార్చడం అత్యద్భుతం!
అయితే మీరనొచ్చు, ఇలాంటివారిని మార్చడమెందుకు? శపించవచ్చు కదా అని.
యేసయ్య వచ్చింది పాపుల్ని రక్షించడానికి, నశించిన దాని వెదకి రక్షించడానికి మనుష్యకుమారుడు ఈలోకమునకు వచ్చెను. లూకా 19:10.
పాపియైన ఒక మనుష్యుని ప్రేమించి, పేరుపెట్టి పిలచి, వాని ఇంటికి వెళ్లి, తద్వారా అతనిలాంటి మరికొంతమందిని చేర్చుకొని, వారిలో పరివర్తన తెచ్చి, తద్వారా వారిని మార్చిన వైనం మన ఊహలకు అందదు. ఆయన పరమ జ్ఞాని! ఆయన ఆలోచనలు అగమ్యగోచరములు.
ఆ యేసయ్య కి మనం కావాలి. సుంకరులలో ఉన్న పాపాన్ని ప్రేమించలేదు కాని, సుంకరులను ప్రేమించారు యేసయ్య. ఉదా: మన ఇంట్లో ఎవరైనా వ్యాధితో బాదపడుచుంటే, మనం మన వారిని ప్రేమిస్తాం గాని ఆ వ్యాదిని ద్వేషిస్తాం. అలానే యేసయ్య పాపుల్ని ప్రేమించి, పాపాన్ని ద్వేషించారు, వారికి మెత్తని మనస్సిచ్చి,పరివర్తననిచ్చి, పరలోకవాసులుగా చేర్చారు.
ఆ మార్పు నీకు కావాలా? అయితే నేడే యేసయ్యకి నీ హృదయం ఇవ్వు!
ఆయన నీ జీవితంలో ప్రవేశించి అద్భుతం చేస్తారు.
అట్టి కృప మనందరికీ కలుగును గాక! ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments