✝️ CHRIST TEMPLE-PRODDATUR
- పొట్టి జక్కయ్య - పార్ట్ : 1
దేవుని నామమునకు మహిమ కలుగును గాక! యేసయ్య నామంలో అందరికీ శుభములు. ఈ సారి మనం పొట్టి జక్కయ్య కోసం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 19:1-10 వరకు జక్కయ్య యొక్క కొన్ని గుణగణాలు మనకు కనిపిస్తాయి.
1.యెరికో పట్టణస్తుడు
2. సుంకపు గుత్తదారుడు
3. ధనవంతుడు
4. యేసు ఎవరో చూడగోరెను
5. పొట్టివాడు
6. యేసయ్యని తన హృదయంలో/గృహములో చేర్చుకొనెను
7. అబ్రహాము కుమారుడు,
1.యెరికో పట్టణస్తుడు.
యెరికో పట్టణం చాలా చారిత్రాత్మిక పట్టణం. పూర్వపు పాలస్తీనాలో పశ్చిమాన గల ముఖ్యమైన పట్టణం, కోటగల పట్టణం, యోర్దాను లోయ ప్రాంతంలో ముఖ్యమైన పట్టణం. యెహోషువా 2-10 అధ్యాయాలు. దైవజనుడైన యెహోషువా గారి ద్వారా, దైవస్తుతి ద్వారా పడగొట్టబడిన పట్టణం, ఆయనచే శపింపబడిన పట్టణం. యెహోషువా 7వ అధ్యాయం.
మనకు ప్రాముఖ్యంగా మూడు యెరికోలు కనిపిస్తాయి.
1.యెహోషువా కాలం నాటి యెరికో
2. హేరోదు కట్టించిన యెరికో
3. క్రూసేడ్ ల(పవిత్ర యుద్ధాలు) నాటి యెరికో(ఏర్-రిహా). క్రీ. శ. 1840లో తుర్కులు(టర్కీ) దానిని ఆక్రమించుకొని సర్వనాశనం చేసినా ఇంకా కొన్ని అవశేషాలు నేటికి కనిపిస్తాయి. అయినా తిరిగి కట్టబడింది.
యెరికో అనగా సువాసన గల పట్టణం అని అర్ధం. అయితే అది పాపభూయిష్టమైన పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది యోర్దాను లోయలో యోర్దాను నది వలన సారవంతమైన ప్రాంతంగా సస్యశ్యామలముగా మారిపోయి సర్వ సమృద్ధి కలిగి పాలుతేనెలు ప్రవహించు ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. దాని వలన ప్రజలు ధనవంతులుగా మారి, ఆ ధనసంపాదనచే దేవునిని మరచిపోయి పాపులుగా మారిపోయారు. చివరకి యేసయ్య కాలం వరకు అలానే వున్నారు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. వీరిని రక్షించటానికి లోక రక్షుకుడైన యేసుప్రభుల వారు సంచరించుచూ యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. {యేసయ్య కాలంలో రెండు యెరికోలున్నాయి పాత యెరికో, క్రొత్త యెరికో. పాత యెరికో పట్టణం బయట బర్తిమయిని స్వస్తపరిచారు. క్రొత్త యెరికో పట్టణము- ఇది హేరోదు కట్టించింది. యేసయ్య జక్కయ్యని కలిసింది క్రొత్త యెరికో లోనే.}
పట్టణంలో ప్రవేశించక ముందు తీమయి కుమారుడైన బర్తిమయి అనే గుడ్డిభిక్షకుని స్వస్తపరిచారు. ఆయన తన ప్రజల ఆర్తనాదాలు విని దాటిపోలేడు. ఆగి స్వస్తపరిచారు. చివరకి పట్టణంలో ప్రవేశించి పాపిగా, అన్యాయస్తునిగా, సుంకరిగా పిలువబడే జక్కయ్యను పిలచి మరీ రక్షించారు.
నీవు ఎలాంటివాడివైనా సరే, యేసయ్యకి నీవు కావాలి! నీవు త్రాగుబోతువైనా లంచగొండివైన, వ్యభిచారివైనా, అందరిచే ద్వేషించబడుతున్నా సరే యేసయ్యకి నీవు కావాలి, యేసయ్యకు నీ హృదయం అర్పిస్తే ఆయన నిన్ను మారుస్తారు. జక్కయ్య యేసయ్యకు హృదయంలో,గృహములో చోటిచ్చి "అన్యాయస్తుడు – అబ్రహాము కుమారునిగా" మారిపోయాడు.
అట్టి భాగ్యం నీకు కావాలా?
అయితే నేడే యేసయ్య యొద్దకు రా!
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments