✝️ CHRIST TEMPLE-PRODDATUR
-పొట్టి జక్కయ్య – ఆరవ భాగం - యేసయ్యను హృదయంలోను, గృహములోను చేర్చుకొనెను.
యేసు ఆచోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా! త్వరగా దిగుము!
- నేడు నేను నీ ఇంట ఉండవలసియున్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి, సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
- లూకా 19:4-5. ఇక్కడ జక్కయ్య-యేసయ్య చేసిన పనులు వరుసగా చూద్దాం! మొదటగా యేసయ్య కన్నులెత్తి జక్కయ్యని చూసారు! ఆయన కన్నులకు మరుగైనదేది లేదు. చెట్టుమీద నున్న జక్కయ్యని యేసయ్య చూసారు. నీవు ఏ స్తితిలోనున్న యేసయ్య నిన్ను చూస్తున్నారని గ్రహించు! మరో విషయం ఏమిటంటే జక్కయ్య ఎక్కినది మేడిచెట్టు! మేడిచెట్టు గర్వానికి ప్రతీక అని పండితులు చెబుతారు!
మేడిచెట్టు చూడు మేలిమై యుండు- పొట్ట విప్పి చూడు పురుగులుండు అని మన వేమన కవి చెప్పాడు. (అయితే మేడిచెట్టు అని తర్జుమా చేయబడినా మనలాంటి మేడిచేట్లులేవంట ఇజ్రాయిల్దేశంలో. ఒకరకమైన ఫిగ్ ట్రీ/ అత్తిపండు లాగ ఉంటాయంట) ఏదీఏమైనా ఎంతగర్వం ఉన్నా, యేసయ్య పిలిచిన వెంటనే దిగిపోయాడు! తన ధన గర్వాన్ని, హోదా-అంతస్తు గర్వాన్ని విడచి వెంటనే దిగిపోయాడు.
ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం వ్రాయబడింది. యేసయ్యని అతడు సంతోషముతో చేర్చుకొన్నాడు! అదే దేవునికి కావాలి!! దేవుని మనసా వాచా నమ్మడమే కాకుండా, ఎట్టి పరిస్తితులు ఎదురైనా సంతోషముతో ఆయనను వెంబడించాలి!
ఆరోజు యేసయ్య జక్కయ్య గృహములో ప్రవేశించారు. మొట్టమొదట జక్కయ్య యేసయ్యని హృదయంలోనికి ఆహ్వానించాడు, తర్వాత సంతోషముతో తన గృహములోనికి ఆహ్వానించాడు. అంతేనా!! యేసయ్యని ప్రభువా! అంటున్నాడు. నా ఆస్తిలో సగభాగం బీదలకిచ్చుచున్నాను! మొదటగా తన ఆస్తిని విడచి, యేసయ్యని ప్రభువా అని పిలచి, తన యజమాని ఆస్తి కాదు- నీవే అంటున్నాడు!
రెండవదిగా నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను అన్నాడు. అంటే ఇంతవరకు అక్రమముగా సంపాదించిన దానిలో సగం బీదలకిచ్చాడు! తద్వారా పరలోకంలో ఆస్తిని కూర్చుకొన్నాడు!
యేసుప్రభులవారు ఏమైనా ప్రసంగం చేసారా? తనని వేలెత్తి చూపారా? అద్భుతం చేసారా? లేనేలేదు!!
ఏ ప్రసంగం లేకుండా కేవలం యేసయ్యని హృదయంలో చేర్చుకోవడం ద్వారా, తన జీవితం పూర్తిగా మారిపోయింది. నవజీవనం కలిగింది.
మూడవదిగాఎవరిదగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకొంటే దానికి నాలుగింతలు ఇస్తాను అంటున్నాడు!! (19:7,8). ఇక్కడ గమనిచండి ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? లేవీ 6:1-5, సంఖ్యా 5:5-7 ... ఎవరికైనా ఏమైనా అన్యాయం చేస్తే, ఆ మొత్తం తిరిగి పూర్తిగా చెల్లించాలి, ఇంకా దానిలో 5వ భాగం కలిపి ఇవ్వాలి! అయితే జక్కయ్య ధర్మశాస్త్రం విధించిన దానికన్నా ఎక్కువగా నాలుగింతలు చెల్ల్సిస్తానని చెప్పాడు. అంటే 100/ కి 400/- చెల్లిస్తాను అంటున్నాడు. ఎంతగా మారిపోయాడో చూసారా?!!!
సమరయస్త్రీ జీవితంలోనికి యేసయ్యని స్వీకరించిన వెంటనే తన పాపపు జీవితాన్ని వదలి, సాక్షిగా మారి, సాక్ష్యార్ధమైన జీవితం జీవించి తన గ్రామాన్ని రక్షించుకొంది. ఇక్కడ జక్కయ్య యేసయ్య ని తన హృదయములోనికి/గృహములోనికి చేర్చుకొని, సాక్ష్యార్ధమైన జీవితం జీవించి, తనలాంటి సుంకరులను యేసయ్య దగ్గరికి నడిపించగలిగాడు!
మరి నీవు రక్షింపబడి ఎన్నిరోజులైంది? ఎంతమందిని యేసయ్య దగ్గరికి నడిపించావు? నీజీవితాన్ని చూసి నేర్చుకొంటున్నారా/ అసహ్యించుకుంటున్నారా?!!
యేసయ్యని చేర్చుకొని అంచెలంచెలుగా ఎదిగిపోయాడు జక్కయ్య! నీవు యేసయ్యని చేర్చుకొని ఏం సాధించావ్?
దేవుణ్ణి పెదవులతో మాత్రమె సేవిస్తున్నావా/లేక హృదయపూర్వకంగా సేవిస్తున్నావా?
కేవలం రోగాలు/భాదలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్ధించి, అవసరం తీరిన వెంటనే ప్రార్ధన, విశ్వాసం వదలివేస్తున్నావా?
నీవు మార్పుచెందిననాటి విశ్వాసం, రక్షింపబడినప్పుడున్న ప్రార్ధన ఇపుడున్నాయా?!!!
ఏదైనా సభలకు వెళ్లి, దైవసేవకుని ఉద్రేకమైన ప్రసంగాలు విని – ఉజ్జీవింపబడి- సమర్పించుకొని- సభలు ముగిసిన తర్వాత మరలా చల్లారిపోయావా?
జక్కయ్య తీసుకొన్న నిర్ణయం కడవరకు కొనసాగించాడు!
మరి నీవు ఆవిధంగా చేయడానికి ఇష్టపడుతున్నావా?
ఒకవేళ జారిపోయావా? అయితే కృంగిపోకు!
యేసయ్య దగ్గరకు మరలా రా!
యేసయ్యని సంతోషంగా ఆహ్వానించి, సంతోషంగా సేవించు!
యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు!!!
అట్టి ధన్యత మనందరికీ మెండుగా కలుగును గాక! ఆమెన్!
దైవాశీస్సులు! (సశేషం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments