పొట్టి జక్కయ్య – ఐదవ భాగం - పొట్టివాడు

✝️ CHRIST TEMPLE-PRODDATUR
-పొట్టి జక్కయ్య – ఐదవ భాగం - పొట్టివాడు

ప్రియ దైవజనమా! జక్కయ్యకున్న ఐదవ గుణగణం పొట్టివాడు. “ యేసు ఎవరో చూడగోరెను గాని, 1) పొట్టివాడైనందున, 2) జనులు గుంపుకూడినందున చూడలేకపోయెను. లూకా 19:3.

జక్కయ్య యేసయ్యను చూడాలని ఎంత తహతహలాడాడో గతభాగంలో చూసాము. అయితే పొట్టివాడైనందున, ప్రజలు గుంపుగా ఉన్నందున చూడలేక, మేడిచెట్టు ఎక్కినట్లు చూస్తున్నాం.
పొట్టితనం అంటే ఆదేశ ప్రజల సామాన్య ఎదుగుదల కంటే తక్కువగా ఎదగడం. పొట్టితనం తల్లిదండ్రుల జీన్స్ వలన గాని, హార్మోన్ల లోపం వలన గాని లేక ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగినా గాని పొట్టితనం వస్తుంది. మరి జక్కయ్య ఎందువలన పొట్టిగా ఉన్నాడో మనకు తెలియదు!
అయితే గమనించవలసినదేమిటంటే పొట్టితనం , యేసయ్యని చూడాలనే అతని ఆకాంక్షను ఆపలేకపోయింది. ఒక మేడిచెట్టు ఎక్కి కూర్చొన్నాడు. యేసయ్య ఆ దారిలో వస్తారు, నేను చూస్తాను అని. ఎన్నిసార్లు చెట్టు ఎక్కలేక క్రింద పడిపోయాడో తెలియదు. అయినా ప్రయత్నం ఆపలేదు! చివరకు సాధించాడు. చెట్టు ఎక్కాడు! ఇప్పుడు ప్రజలందరికన్నా ఎత్తులో ఉండి చూస్తున్నాడు! ఇదంతా ఎరిగిన యేసయ్య అదే చెట్టు క్రిందకు వచ్చి పిలుస్తున్నారు – జక్కయ్యా! త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట దిగవలసి యున్నది. వెంటనే బహుశా దిగడం రాక చెట్టుమీద నుండి దూకేశాడేమో!! లేక జారిపోయాడేమో! గాని యేసయ్యను సంతోషంగా చేర్చుకొన్నాడు!

జక్కయ్యకు బౌతికమైన పొట్టితనం! మరి నీకో?!! ఏ విషయంలో పొట్టిగా ఉన్నావో ఆలోచించు!
• దేవునికివ్వడంలో వెనుకబడి పోయావా?
• ప్రార్ధన చేయడంలో వెనుకబడ్డావా?
• పాటలు పాడటం లోనా?
• దేవుని గూర్చి సాక్ష్యం చెప్పడంలోనా?
• వరాలు పొందుకోవడంలోనా?
• ఆత్మల సంపాదన లేక పొట్టితనమా?

రక్షణ పొంది ఎన్నాళ్ళు అయ్యింది? ఇంతవరకు నీకు ప్రార్ధన చేయడమే సరిగా రాదు. కొంతమంది పాటలు పాడమంటే ధైర్యంగా పాడేస్తారు, ప్రార్ధన చెయ్యమంటే భయపడిపోతారు. సాక్ష్యం చెప్పమంటే చెప్పలేరు.

దేవుడు మనకు శ్రమల అనుభవం ద్వారా ఒక మెట్టునుండి మరో మెట్టుకు చేర్చుతారు. ప్రార్ధన చెయ్యడం వచ్చిన నీవు సాక్ష్యం చెప్పడం నేర్చుకోవాలి! సాక్షార్ధమైన జీవితం జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను మరో మెట్టు ఎక్కిస్తారు!
మొదట పరిచారికుడిగా, తర్వాత సువార్తికుడిగా, అద్భుతాలు చేసేవానిగా, ప్రవక్తగా, ఇంకా ఆయనకిష్టమైతే దైవసేవకునిగా, అపొస్తులునిగా నిన్ను తీర్చిదిద్దుతారు. దానికోసం నిన్ను నీవు సంపూర్తిగా దేవునికి సమర్పి౦చుకోవాలి!! నీపిలుపును ఏర్పాటును ప్రార్ధన ద్వారా నిశ్చయం చేసుకొని, గురియొద్దకు పరుగెత్తాలి! కాని ప్రస్తుతం నీవున్న ఆత్మీయస్తితితో సరిపెట్టుకొని మరుగుజ్జుగా బ్రతుకకూడదు!!
బైబిల్ ఏం చెబుతుంది? ప్రియుడా! నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలోనూ వర్దిల్లుచూ, సౌక్యముగా ఉండాలని ప్రార్ధించుచున్నాను!! 

- 3 యోహాను:2 అన్ని విషయాలలోనూ వర్ధిల్లాలని తండ్రి చిత్తము. ధనం సంపాదించాలని, కార్లు మేడలు సంపాదించాలని ఎలా తాపత్రయ పడుతున్నావో, అలాగే దేవునిలో ఎదగటానికి, దేవునితో ఐక్యమవడానికి, తాపత్రయపడాలి!!
జక్కయ్య ప్రజలకి భయపడలేదు, తన ఆస్తి-అంతస్తు ప్రక్కన పెట్టాడు. తన పొట్టితనాన్ని లెక్కచెయ్యలేదు! చెట్టు ఎక్కాడు, అదే యేసయ్యని అతని యొద్దకు నడిపించింది!!! నీవు అలా చేయగలవా?
నేడే ప్రయత్నించు!!
దైవాశీస్సులు!!!
(సశేషం)
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments