EVERYDAY WE ARE PRAYING for - CT ADS @ 8142229281 - ( @ Sri.B.Rajarao BA LLB., St.MARY'S INFANT school, near muncipal park, proddatur.) * ( @ SURI STICKER SHOP , Proprietor.Sri.B.Suresh Babu, Four road circle, Holmaspeta, Proddatur.) * ( @ Sri.B.Ramesh Babu B.Ed.,LLB., RSR UP ENGLISH MEDIUM SCHOOL, Vaddhiraala.) * ( @ CHRIST TEMPLE family) * ( @ KEERTHANA SEVA SAMITHI , President.Sri.Munagi Raju, Secreatary.Srikanth, Joint Secreatary.Narasimha, Vasanthapeta, Proddatur.) * ( @ AMARESHWAR CEMENT WORKS, Proprietor.Sri.K.Kondal rao, near kotthapally bypass road, mydukur road, proddatur ) * ( @ MALLEMU KONDA CEMENT WORKS, Proprietor.Sri.K.Shivayya, near reliance petrol bunk, teachers colony, mydukur road, proddatur ) *
...Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm in Proddatur. For more Details : +91 8142229281...

Friday, 30 December 2022

అవన్నీ మరచిపోయి ఇకనుండైనా కొత్త జీవితం ప్రారంభించు.

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- అవన్నీ మరచిపోయి ఇకనుండైనా కొత్త జీవితం ప్రారంభించు.

జీవితమనే పరుగు పందెములో విజయం సాధించాలంటే? వెనుక ఉన్నవి మరవాలి ముందున్నవాటికొరకు పరుగెత్తాలి. 

సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీ 3:13,14

1️⃣ *- మన గత పాపములను మరచిపోవాలి:*

అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. (సామెతలు 28:13) మనము. పాపముల విషయమై పశ్చాత్తాప పడి వాటిని మరచిపోవాలి. అయితే, సాతాను గతములో మనము చేసిన పాపములను గుర్తుచేస్తూనే ఉంటాడు. పాపముల విషయంలో మనము పశ్చాత్తాపపడితే ప్రభువు తిరిగి వాటినెప్పటికిని ఆయన జ్ఞాపకం చేసుకోరు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యోహాను 1:9) క్షమింపబడిన గతకాలపు పాపములను నీవు మరచిపో. 

2️⃣ *- మన గత వైఫల్యాలను మరచిపోవాలి:*

పొంగిపోయిన పాల విషయం చింతించి ఏమి ప్రయోజనం? గతించిన కాలంలో నీవు ఆర్ధికంగా చాలా నష్టపోయి ఉండొచ్చు. వాటినే తలపోసుకొంటూ వుంటే, ఏమి ప్రయోజనం? అట్లా అని ఇట్లాంటి అనుభవాలు మరచిపోవడం అంత సులభం కాదు. మనము నష్టపోవడానికి కారణమైన వ్యక్తులను చూచినప్పుడు, ఆ సందర్భములు గుర్తొచ్చినప్పుడు, మనలోనున్న సమాధానమంతా కోల్పోతాము. నీవు ప్రశాంతంగా ఉండాలంటే, గత వైఫల్యాలు నీ జ్ఞాపకం లోనికి రాకుండా, ఇంత కఠినమైన పరిస్థితులలో సహితం నిన్ను ఆదరించి, జీవింపజేస్తున్న క్రీస్తు ప్రేమను నింపుకో. ఆ దివ్యమైన ప్రేమముందు, గత వైఫల్యాలేవీ నిలువలేవు. 

3️⃣ *- మన గత విజయాలను మరచిపోవాలి:*

గత కాలపు విజయాలు తలపోసుకున్నంత మాత్రాన వర్తమానములో విజయాలు వర్తించవు. అంతే కాకుండా, గతకాలపు విజయాలు గుర్తుచేసుకొంటూ నేను ఏదైనా చెయ్యగలను అనే గర్వం కూడా మనలో ప్రవేశించవచ్చు. అది అత్యంత ప్రమాదకరం. గతకాలపు విజయాలు, భవిష్యత్ ను గురించిన ఊహలకంటే, వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. 

4️⃣ *- మనము గతములో అనుభవించిన సౌఖ్యాలను మరచిపోవాలి.*

గతములో అనుభవించిన సౌఖ్యాలను జ్ఞాపకం చేసుకొంటూవుంటే, ప్రస్తుత కాలంలో దేవుడు నిన్ను ఏరీతిగా పోషిస్తావున్నారో గ్రహించలేవు. ఇశ్రాయేలీయులు గతించిన కాలంలో వారు మాంసము వండుకొని కుండల చుట్టూ కూర్చొని తిన్న అనుభవాలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా. ప్రస్తుత కాలంలో దేవుడు ఏరీతిగా మన్నా, పూరేళ్లతో వారిని  పోషిస్తావున్నారో అర్ధం చేసుకోలేకపోయారు. (సంఖ్యా  11:5,6; 20:5; 21:5)

5️⃣ *- గతకాలపు చేదు అనుభవాలను మరచిపోవాలి:*

ఆస్తులు పోయాయా? మరచిపో. తిరిగి వాటిని సంపాదించలేకపోవచ్చు. నిన్నెవరైనా నిరాశ పరిచారా? మరచిపో. పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా, వారికంటే మనకే ఎక్కువ కీడు వాటిల్లుతుంది. ఆప్తులు, ఆత్మీయుల మధ్య వచ్చిన అపార్ధాలు చేదు అనుభవాలనే మిగుల్చుతాయి. అవి సమాధానం లేకుండా చేస్తాయి. అయితే, వాటిని అధిగమించడం ఎట్లా? 

చేదు జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతున్నాయా? 
🔺క్షమించమని అడిగే మనస్సు 
🔺క్షమించే హృదయం 
ఈ రెండూ నీకుంటే చాలు. నీవు ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినైనా నొప్పించినాగాని , లేదా నిన్ను అపార్ధం చేసుకోవడం ద్వారా నొప్పింపబడినాగాని, క్షమాపణ అడగాల్సి వస్తే క్షమించమని అడుగు. క్షమించాల్సి వస్తే, మనః పూర్తిగా క్షమించు. సమాధానంతో నీ హృదయము నింపబడుతుంది. ఇక చేదు జ్ఞాపకాలను మరచిపో.

ఇట్లా వెనుకనున్నవన్నీ మరచి, ముందున్నవాటి కొరకు వేగిరపడుదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీయులకు 12:2) వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుదము. ఆరీతిగా నూతన వత్సరములో మన జీవితాలను సిద్ధపరచు కొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు  మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! 

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Sunday, 18 December 2022

అందరూ నిన్ను వెలివేసారా ?(సమరయ స్త్రీ)

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- అందరూ నిన్ను వెలివేసారా ?(సమరయ స్త్రీ)

దేవుని నామమునకు మహిమ కలుగును గాక! యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ మార్గమధ్యంలో సమరయ అనే ప్రాంతం వస్తారు. అక్కడ సుఖారు అనే గ్రామ శివారులో యాకోబుగారు యోసేపుకిచ్చిన బావి దగ్గర అలసినరీతిన కూర్చొన్నారు. అప్పుడు ఇంచుమించు పండ్రెండు గంటలయ్యింది అని వ్రాయబడింది.(4,6 వచనాలు)

ఏసుప్రభువు యూదుడు. వెళ్ళిన ప్రాంతం సమరయ. ఇశ్రాయేలు దేశం ప్రాముఖ్యంగా యూదయ, సమరయ, గలలియ అనే మూడు ప్రాంతాలుగా విభజింపబడింది. యూదయ గలలియ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉంది. అయితే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయుల నీరు త్రాగరు, మాట్లాడరు, భోజనం చేయరు. సమరయులను యూదులు పాపులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, *అంటరానివారుగా* పరిగనిస్తారు. చివరకి యూదయనుండి గలలియకు సమరయ మీదుగా దగ్గరదారి అయినా సరే చుట్టూ తిరిగివెల్తారు తప్ప సమరయలో అడుగుపెట్టరు. ఎందుకు అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి.

సమరయ అనగా Watch Tower (కాపలా కోట). అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది. ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ, షెమెరు అనే వ్యక్తిదగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను(సమరయ) అని పేరు పెట్టినట్టు చూస్తాం 1 రాజులు 16వ అధ్యాయం. 

కాలక్రమేనా ఈ పట్టణం అనేకసార్లు దాడికి గురిచేయబడ్డాది. (1,2వ రాజులు). సమరయులు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీ.పూ. 677- 721 మధ్యలో ఏషర్హద్దోన్ అనే అస్సూరు రాజు ఆప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, అస్సూరు రాజ్యానికి తీసుకోనిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు. ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారే సమరయులు.(2రాజులు 17: 24-41). ఇది దేవునికి ఇష్టంలేని పని. అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు. తర్వాత వారు తమ విగ్రహాలను విడచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడతారు. (ఎజ్రా 4:2,9,10; లూకా 17:18). అయితే యూదులు/ఇశ్రాయేలీయులు చెర విముక్తి పొందిన తర్వాత దైవజ్ఞ మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవున్నే ప్రార్దిస్తున్నాం. మేము కూడా మీతోపాటు మందిరాన్ని కడతాం అంటే జెరుబ్బాబెలు, యేశూవ అనే పెద్దలు దానికి అంగీకరించరు. నెహేమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను, స్వాస్త్యమైనను లేదని ఖరాఖండిగా చెబుతారు.అప్పటినుండి యూదులకు/ఇశ్రాయేలీయులుకు మధ్య వైరం మొదలైంది. చివరకు సమరయులు గెరీజీము కొండమీద ఒక మందిరాన్ని కట్టుకొంటే క్రీ.పూ. 139 లో ఒక యూదురాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండమీద ఒకమందిరాన్ని కట్టుకొని ఆరాదించడం మొదలు పెట్టారు. ఈ రకంగా ఈ రెండుజాతులకు మధ్య వైరం యేసయ్య వచ్చేవరకూ కూడా కొనసాగింది. ఇప్పటికి కూడా 160 సమరయ కుటుంబాలు ఈప్రాంతంలో నివాసం చేస్తున్నారు.
అయితే ఇటువంటి అంటరానిప్రాంతంగా, పాపపు ప్రాంతంగా,దొంగలతో నింపబడిన ప్రాంతంగా, ప్రజలందరితోను వెలివేయబడిన ప్రాంతానికి, ఏ ప్రవక్త, బోధకుడు కూడా వెళ్ళని, వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన యేసయ్య తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు. ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తికాదు. ఏ మాత్రం మంచిసాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అధ్బుతం! ఆయన ఆశ్చర్యకరుడు! ఆలోచనకర్త! నిత్యుడగు తండ్రి! సమాధాన కర్త!

ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా? అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా? నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా? నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా? భయపడొద్దు! పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు. ఈలోకంలో ఘనులైన వారిని వ్యర్ధం చేయడానికి ఎన్నికలేనివారిని ఆయన ఎన్నుకొన్నారు.

ఆయనకి నీవుకావాలి! ప్రయాసబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి అని పిలుస్తున్నారు. ఆయన వద్దకు వస్తావా? వస్తే ఆయన నీపాపాన్ని కడిగి నిన్ను శుద్ధిచేసి పరలోకవారసునిగా చేస్తారు. విలువలేని నీకు విలువ నిస్తారు. అట్టి కృప మనందరికీ కలుగును గాక!
ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Thursday, 15 December 2022

మీ పిల్లలు తప్పిపోవడానికి ముమ్మాటికీ మీదే తప్పు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మీ పిల్లలు తప్పిపోవడానికి ముమ్మాటికీ మీదే తప్పు..

క్రైస్తవ తల్లిదండ్రులకోసం ఒక ముఖ్య గమనిక.. ఈ చిన్నకుమారుని ఉపమానం ప్రకారం ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలను ఎంత భక్తిలో పెంచినా, ప్రార్ధనలో పెంచినా, వాక్యంలో పెంచినా సరే, మీరుకూడా ఎంత భక్తిగా జీవించినా సరే, మీ పిల్లలు మీలాగే భక్తిలో, సత్యములో, ప్రార్ధనలో జీవిస్తారనే గ్యారంటీ లేదు. మీరు వారికోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత ప్రార్ధన చేసినా వారు పడిపోకుండా ఉండరు అని గ్యారంటీ లేదు. దానికి చిన్న కుమారుడే గొప్ప ఉదాహరణ. అందుకే భక్తుడైన యోహాను గారు 

- 3John(మూడవ యోహాను) 1:4

4.నా పిల్లలు సత్యమును అనుసరించి(సత్యములో) నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు. అని పొంగిపోతున్నారు.
అయితే మీరు చేస్తున్న ప్రార్ధన, మీ భక్తి, మీరు మీ పిల్లలను ప్రార్ధనలోను, భక్తిలోను, వాక్యానుసారంగా పెంచడం వేస్ట్ అని నేను ఎంతమాత్రము చెప్పడం లేదు.
1. బాలుడు నడువ వలసిన మార్గం వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలిగిపోడు అంటున్నారు సోలోమోను గారు. (సామెతలు 22:6 )

2. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని వ్రాయబడింది.
 యెషయా 40:30.ఈ రెండు ఒకదానికి వ్యతిరేకంగా ఉన్నాయి గాని రెండూ కరెక్టే! 

ఎందుకంటే మీరు మీ పిల్లలను ఎంత భక్తిలో పెంచినా –బాలుని హృదయంలో దుష్టత్వం స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని తొలగించును అని వ్రాయబడింది.(సామెతలు 22:15) కాబట్టి బాలుడు పెద్దవాడైనప్పుడు, శిక్షాదండము తగ్గినప్పుడు, యవ్వన ప్రాయంలో అడుగుపెట్టినప్పుడు, తనమిత్రులతో కలిసి చాలామంది లోకంలో పడిపోతుంటారు(అందరు యవ్వనస్తులు పడిపోతారు అనికాదు). ఎందుకంటే దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును (1 కొరింథీ 15:33) ఇది సహజం!

అయితే మీ పిల్లలు లోకంలో జారిపోయినప్పుడు మీరు మీ ఆశ వదిలివేయ వద్దు. మీరు పెంచిన మంచి పెంపకం అనగా వాక్యంలో, ప్రార్ధనలో పెంచినందువలన వారు పెద్దవారైనప్పుడు, జీవితంలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు, వారు తమ తప్పు తాము తెలిసికొని తిరిగి తప్పకుండా యేసయ్య వద్దకు, మీ దగ్గరకి వస్తారు. మీ ప్రార్ధన తప్పకుండా ఒకరోజు వారిని పట్టుకొంటుంది. మీరు చెప్పిన వాక్యాలు వారిని గద్దిస్తూ ఉంటాయి. నీఎదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీవాక్యమును ఉంచుకొంటాను అంటున్నారు దావీదు గారు కీర్తన 119:11. ఒకరోజు కార్యరూపం దాల్చి తప్పకుండా వస్తారు. దానికి చిన్న కుమారుడే ఉదాహరణ. మనం నిశ్చింతగా ఈ ఉపమానం పరిశీలిస్తే చిన్న కుమారునికి ఎవరూ బుద్ధిచెప్పలేదు, ఎవరూ తండ్రియొద్దకు రమ్మని చెప్పలేదు. తనకుతానుగా తప్పుతెలిసికొనిపశ్చాత్తాప పడి అంటున్నాడు: తండ్రి నేను పరలోకమునకు విరోదముగాను, నీ ఎదుటను పాపము చేసాను నన్ను క్షమించు అని అడిగాడు(18). పరలోకంలో ఎవరుంటారు? దేవుడు! అనగా నేను దేవుని వ్యతిరేఖంగా పాపం చేసాను అని తండ్రిదగ్గర, దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని తిరిగి దేవునిరాజ్యములోనికి వచ్చాడు. కాబట్టి మీపిల్లలుకూడా తప్పకుండా తమ తప్పులు తెలిసికొని దేవుని దగ్గరకు, మీ దగ్గరకు వస్తారు.

ఒకవేళ ఓ తల్లీ/తండ్రీ! మీ పిల్లలను భక్తిలో పెంచకుండా, మీరు మాత్రమే ఆరాధనకు వెళ్తూ, మీ పిల్లలను వారికిష్టమొచ్చినట్లు వదిలేశారా? జాగ్రత్త!దుష్టసాంగత్యము మంచినడవడికను చెరిపివేయును. *ఒకవేళ నీ పిల్లలు నిన్ను ఏడిపిస్తున్నారా? నీమాటలు వినడం లేదా? త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మంచి పేరు కోల్పోయినవారిగా పాపులుగా తిరుగుతున్నారా? దానికి కారణం ఓతల్లీ/తండ్రీ! ముమ్మాటికి నీవే*!!!

ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసేద్దుము గాని ఛీ..ఆ కులం వారిని ప్రేమించినది అని భాదపడే వారున్నారు, ఒక అన్యుడిని/అన్యురాలిని ప్రేమించి పెళ్ళి చెయ్యమంటున్నారు అని భాదపడే తల్లిదండ్రులు ఉన్నారు. త్రాగిన మైకంలో మాకొడుకు మమ్మల్ని కొడుతున్నాడు అని ఏడ్చేవారున్నారు. డ్రగ్స్ ఎడిక్ట్గా మారిపోయాడు అని కన్నీరుకార్చేవారున్నారు. నా కూతురు/కొడుకు మా పరువు దేవుని పరువు తీసేసింది/తీసేసాడు అని ఏడుస్తున్నారు కదా! మీ పిల్లలు అలా మారడానికి కారణం ముమ్మాటికి నీవే!

 *ఎందుకంటే వారికోసం మీరు ఏడవాల్సిన సమయంలో, వారి బాగుకోసం ప్రార్ధించాల్సిన సమయంలో మీరు ఏడవలేదు. కావున ఇప్పుడు వారు మిమ్మల్ని ఏడిపిస్తూన్నారు*!!!

అందుకే భక్తుడైన యిర్మియా గారు రాస్తున్నారు: స్త్రీలారా! యెహోవా మాట వినుడి,. . . . మీ కుమార్తెలకు రోదనం చేయు విద్య నేర్పుడి, . . .వీదులలో పసిపిల్లలు లేకుండా, వారిని నాశనం చేయుటకు మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, ,మన గదులలో ప్రవేశించుచున్నది. యిర్మీయా 9:20,21. మన పిల్లలు ఆత్మీయంగా /శారీరకంగా చనిపోయేలా సాతానుగాడు వాడి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాడు. దానిని ఎదుర్కోవాలంటే : మన కన్నులు కన్నీళ్ళు విడచునట్లు గాను, మన కన్నులనుండి నీళ్ళు ఒలుకునట్లు గాను,త్వరపడి రోదన చేయవలెను. యిర్మియా 9:18. మన దేశంలో ఎంతో మంది యవ్వనస్తులు అకాలమరణం చెందుతున్నారు అతివేగం వలన, త్రాగుడు వలన, అక్రమ సంభందాల వలన, ప్రేమ వైఫల్యాల వలన, సాతాను ప్రేరేపణవలన! వారు క్షేమంగా ఉండాలంటే ప్రియమైన తల్లీ తండ్రీ! *ప్రతీరాత్రి కొన్ని నిమిషాలైనా వారు పడుకున్న తర్వాత వారి పడక దగ్గర మోకరించి ప్రార్ధించాలి. నీ కళ్ళనుండి నీరు వారి పడకల దగ్గర కారాలి*!!!.

భక్తురాలు, తల్లి సూసన్నగారు తనకున్న 13మంది పిల్లల పడక దగ్గర ప్రార్ధన మొదలుపెడితే పదముగ్గురి దగ్గర ప్రార్ధన ముగించేసరికి తెల్లవారిపోయేదంట. ఆమె ప్రార్ధన ఆమె బిడ్డలనందరిని దైవసేవకులను చేసింది. జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు ఆమె సంతానమే!
నా తల్లి కన్నీటిప్రార్ధనా ప్రవాహంలో దేవునిరాజ్యానికి కొట్టుకొని వచ్చాను అంటున్నారు భక్తుడైన అగస్టీన్. కాబట్టి నీబిడ్డలకోసం ప్రార్దిస్తున్నావా? వారిని వాక్యంలో ప్రార్ధనలో పెంచుతున్నావా?

కావున ప్రియ తల్లిదండ్రులారా!
మీరు ప్రార్దిస్తున్నారా?
అయితే మీ ఆశ వదులుకోవద్దు!
ఇంకా ప్రార్ధించడం లేదా?
నేడే మీ పిల్లలకోసం ప్రార్ధించడం మొదలుపెట్టండి.

అట్టి కృప, ధన్యత మనందరికీ కలుగును
గాక!
ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Wednesday, 14 December 2022

నీ తప్పు నీవు తెలుసుకొని వస్తే నీకే మంచిది..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- నీ తప్పు నీవు తెలుసుకొని వస్తే నీకే మంచిది..

ప్రియ దేవుని బిడ్డలారా.. ఈ లూకా సువార్త 15 వ అధ్యాయంలో మూడు ఉపమానాలు చెప్పబడ్డాయి. అయితే ఈ మూడింటి సారాంశం దాదాపు ఒక్కటే.

మొదటి ఉపమానంలో నూరు గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. (The Lost Sheep): 1% Lost.

రెండవ ఉపమానంలో పది నాణేలలో ఒక్కటి పోయింది. (The Lost Coin) : 10% Lost.

మూడవ ఉపమానంలో ఇద్దరు కుమారులలో ఒకడు తప్పిపోయాడు. (The Lost Son): 50% Lost.

ఇందులో దేవుని ఉద్దేశ్యం తేటతెల్లం అవుతుంది. దేవునికి ప్రతీ ఒక్కరు కావాలి. 50% కావాలి, 10% కావాలి, చివరకు 1% కూడా కావాలి. నీవు ఎలాంటివాడవైనా, తెలివైనవైనా, మూర్ఖుడివైనా, పరిశుద్దుడివైనా, పాపివైనా, ధనవంతుడివైనా, పేదోడివైనా నీవు ఎవరివైనా సరే! దేవునికి నీవే కావాలి!

మొదటి ఉపమానం లో గొర్రె -మంద నుండి తప్పిపోయింది.

రెండవ ఉపమానంలో నాణెం -ఇంటిలోనే తప్పిపోయింది.

మూడవ ఉపమానం లో చిన్ని కుమారుడు -తనకు తానే ఉద్దేశ్య పూర్వకంగా తప్పిపోయాడు.

మొదటి ఉపమానం లో గొర్రె మూర్ఖత్వం వలన తప్పిపోయింది. యెషయా 53:6 ప్రకారం మనమంతా గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి. గొర్రెల కాపరి యైన
యేసయ్య గొర్రెను వెదకి తీసుకుని వచ్చారు.

రెండవ ఉపమానంలో నాణెం ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యం వలన పడిపోయింది. గొర్రె, నాణెం రెండు చెడిపోయిన పాపి లేక దిగజారిపోయిన క్రైస్తవునికి సూచన. (చిన్న కుమారుడు కూడా). అయితే ఈ స్త్రీ *సంఘానికి, సంఘకాపరికి, సంఘపెద్దలకు* సూచనగా ఉన్నారు. చెడిపోయిన వారిని, దిగజారిపోయిన వారిని వెదకి తిరిగి క్రీస్తువద్దకు చేర్చాల్సిన భాద్యత వీరికుంది.
మూడవ ఉపమానంలో తనకుతానుగా తీసుకున్న తప్పుడు నిర్ణయానికి చిన్న కుమారునికి పందుల పొట్టు తినాల్సిన గతి పట్టింది. కాబట్టి తిరిగి తనకు తానుగా తప్పు తెలిసికొని, తిరిగి రావాలి. అప్పుడే చిన్న కుమారునికి రక్షణ వచ్చింది. చిన్న కుమారుని వెదకటానికి ఎవరూ వెళ్ళలేదు. తనకుతానుగా వచ్చాడు.
ఇదే ఈ మూడు ఉపమానాల సారాంశం.

ఈ అధ్యాయం లో ముఖ్య వచనాలు:

a) Luke(లూకా సువార్త) 15:7.
7.అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును.
కొన్ని ప్రతులలో ఈ విధముగా తర్జుమా చేయబడి యుంది.
అలాగే పశ్చాత్తాప పడనక్కరలేని తొంభై తొమ్మిది మంది న్యాయవంతులకంటే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.
ఒక్కపాపి పశ్చాత్తాప పడి తండ్రిని సమీపిస్తే పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది.

b) Luke(లూకా సువార్త) 15:18
18. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి-తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;

ఈ రెండు వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి మరియు ఒకదానితో ఒకటి సంభందం కలిగియున్నాయి. అయితే మొదట తన తప్పు తెలిసికొని పశ్చాత్తాపపడి దేవుని వేడుకొంటే- ఆ పాపి రక్షణ పొందుకుంటాడు. అది దేవునికి- దేవుని దూతలకు సంతోషం కలిగిస్తుంది.
అయితే ఆ పాపి/నీవు పశ్చాత్తాప పడకపోతే ఇవేమీ జరుగవు.
ఉదా: దప్పిగొనినవారలారా! నీళ్ళయొద్దకు రండి. యెషయా 55:1 అంటూ వ్రాయబడింది.

 దప్పిగొనిన వారలారా! అక్కడే ఉండండి. నీళ్ళు మీ దగ్గరకు వస్తాయి లేదా నేను మీ దగ్గరకు నీరు తెస్తాను అని వ్రాయబడలేదు. కాబట్టి నీపాపముల విషయమై నీవు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వస్తే, దేవుడు నీ దగ్గరకు వచ్చి, నీవు ఎంత పాపమనే మురికిలో ఉన్నా సరే, నిన్ను తన రక్తములో కడిగి, శుద్దునిగా చేసి పరలోకవారసునిగా చేస్తారు. నేడే ఆయన యొద్దకు రా!
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Tuesday, 13 December 2022

తప్పిపోయి మరలా దొరికిన కుమారుడా..! ఎలా ఉన్నావు?

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- తప్పిపోయి మరలా దొరికిన కుమారుడా..! ఎలా ఉన్నావు?

Luke(లూకా సువార్త) 15:21
21.అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టారు గాని, తండ్రియోద్దకు తిరిగి చేరాడు కాబట్టి తప్పిపోయి దొరికిన కుమారుడు అనడమే సమంజసం అని నా అభిప్రాయం.

యేసుప్రభుల వారు తన ప్రసంగాలలో అనేక ఉపమానాలు చెప్పారు. 

మార్కు 4:33,34 లో ఉపమానం. ఆయన ప్రసంగాలన్నీ ఉపమానాలతో నిండి ఉండేవి. వాటిలో బోలెడు నిఘూడ సత్యాలు, పరమరాజ్య రహస్యాలు దాగి ఉండేవి. నేటిదినాల్లో వాడుచున్న ఉపమానాలు ప్రజల్ని నవ్వించడం తప్ప దేవునిరాజ్య ఆత్మీయ మర్మాలు తక్కువ.

లూకా గారు వ్రాసిన సువార్త యొక్క ప్రాముఖ్యత గత భాగాలలో వివరించాను. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో గల ఉపమానాలు మిగతా సువార్తలలో లేవు. ఈ 15వ అధ్యాయం బైబిల్ గ్రంధములోనే చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఇందులోగల పాత్రలు నేటికీ మనలో ప్రతీ ఒక్కరికి సరిపోతాయి. (These relates each and every one of us). ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానం మనలో ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది. ఈ ఉపమానం నాకు చెందదు అంటే ఆ వ్యక్తీ పచ్చి అబద్ధికుడు. అయితే చిన్న కుమారుని పోలి ఉంటాం. లేదా పెద్ద కుమారుని పోలి యుంటాము. అంతేకాదు క్రైస్తవ భక్తిగల తల్లిదండ్రులకు తమ పిల్లలలో చాలామందికి తప్పిపోయిన కుమారుని అనుభవం ఎదురయ్యి ఉంటుంది.కాబట్టి ఇది ఉపమానమే తప్ప నిజం కాదులే అనుకోవద్దు. నేను ఏ విషయంలోనూ తప్పిపోలేదు కాబట్టి ఈ ఉపమానం నాకు కాదు అనుకోవద్దు. మనందరం ఎప్పుడో ఒకప్పుడు, చాలాసార్లు తప్పిపోయి ఉంటాము మాటలోనో, పవిత్రతలోనో, చూపులోనో, తలంపులోనో, ప్రవర్తనలోనో, ప్రార్ధించుటలోనో, దేవునికిచ్చుట లోనో తప్పిపోయినవారమే!!! మనం మానవ మాత్రులం కనుక మనందరికీ ఈ అనుభవం ఉంది. అయితే ఈ చిన్న కుమారుడు పశ్చాత్తాపపడినట్లు మనం కూడా మరలా దేవునియొద్దకు వచ్చాం కాబట్టి కనికరించబడ్డాము. ఒకవేళ దీని చదువుచున్న ప్రియ సహోదరీ, సహోదరుడా! ఇంకా నీవు సమాధాన పడలేదా? ఇప్పుడే పశ్చాత్తాప పడి దేవుని యొద్దకు మరలి రా! తండ్రి తన చిన్నకుమారుని చేర్చుకొన్నట్లు నిన్నుకూడా చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ 15వ అధ్యాయంలో గల ఉపమానాలలో దేవుని ఉద్దేశ్యం చాలా ప్రస్ఫుటంగా స్పష్టం అవుతుంది. అదేమిటంటే: నీవు తప్పిపోయావా? దేవుణ్ణి విడచి, దేవుని సంఘాన్ని, సహవాసాన్ని విడచిపెట్టి తిరుగుతున్నావా? లోకస్తులతో కలసి వారిపాపంలో పాలివాడవై వారిలో ఒకనిగా ఉంటున్నావా? దేవుడు తన చేయి చాపి నిన్ను పిలుస్తున్నారు. నీవు ఇప్పడు ఎంత ఘోర పాపివైనా సరే! ఇంకా దేవుని బిడ్డవే!!! చిన్న కుమారుడు తన తప్పు తెలిసికొని తండ్రి యొద్దకు వచ్చినట్లు నేడే ఆయన యొద్దకు రా! వెంటనే ఆయన నిన్ను కౌగలించుకొని, ముద్దుపెట్టుకొని (నీవు ఎంత పాపమనే మురికిలో ఉన్నా సరే)తన హక్కున చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.
వస్తావా?

అట్టి పశ్చాత్తాపం దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Thursday, 8 December 2022

బంగారము, బొళము, సాంబ్రాణి..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- బంగారము, బొళము, సాంబ్రాణి..

👉లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు తూర్పు దేశము నుండి జ్ఞానులు తీసుకువచ్చిన కానుకలకు బహు ప్రాధాన్యత కలదు.

👉రాజులకు రాజు ప్రభువుల ప్రభువుకు అర్పించిన కానుకలు బంగారము,బోళము, సాంబ్రాణి.. అర్పించుటకు కలిగిన కొన్ని ఆత్మీయ అర్దములు
గ్రహించుదాము. 

👉 కీర్తన 72:10, కీర్తన 68:29.

- బంగారము :

రాజుల యొద్దకు వెళుతున్నప్పుడు బహుమానముగా బంగారము తీసుకొని వెళతారు. దైవత్వానికి రాజరికానికి గుర్తుగా బంగారము ఉన్నది. దైవకుమారుడైన యేసు రాజాధిరాజు అని గుర్తించిన జ్ఞానులు ప్రభువునకు బంగారమును అర్పించిరి.

- బోళము :

పరిశుద్ధ తైలమందు వేసిన దినుసులలో ఇది ఒకటి. అరబ్బు దేశములనందుండు ఒక విధమైన ముళ్ళ చెట్టు నుండి వచ్చు  ఒక బంకయైయున్నది. బోళము పునరుత్థానమునకు, భద్రతకు గుర్తుయై యున్నది. సాధారణముగా బోళము చనిపోయిన వారి శరీరమును భద్రపరచుటకు వాడునది. యేసుప్రభువారు అందరి కొరకు చనిపోవుటకు జన్మించెను అని జ్ఞానులు గుర్తించి బోళము సమర్పించిరి.

- సాంబ్రాణి :

ప్రత్యక్షపు గుడారములో సాంబ్రాణి ధూపముగా వేయబడి దేవునికి సువాసన కలుగజేయునదిగా వుండును. నిర్గమకాండము 30:34-38. దీనిని యజ్ఞముల మీద వేసిరి. దేవుని సన్నిధికి, ఇంపైన సువాసనకు గుర్తుగా యున్నది. యేసుక్రీస్తు జీవితము దేవునికి ఇంపైనది, ఇష్టమైనది అని గుర్తించి సాంబ్రాణిని ఆయనకు సమర్పించిరి.

జ్ఞానులు బాలుడైన యేసుప్రభువును చూసి పూజకు అర్హుడని గుర్తించి సాగిలపడిరి. ఈ లోకములో మనము ఎంత జ్ఞానియైన, ఎంత ధనవంతుడైనా, పేరు ప్రఖ్యాలులు ఎన్ని కలిగియున్నను యేసుప్రభువు రక్షకుడని, పూజార్హుడని గుర్తించి హృదయాలను విప్పి, ఆయనను చేర్చుకొని,సాగిలపడి, పూజించి జ్ఞానలు వరుసలో నిలువబడి హృదయ పూర్వకముగా ఈ క్రిస్మస్ సందర్భమున ప్రభువును ఆరాధించుచూ, ప్రతిష్ఠితమైన కానుకలు సమర్పించుకొందాము.
దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Thursday, 1 December 2022

నీతిమంతుడైన యోసేపు..(క్రిస్మస్ మెసేజ్)

✝️ - CHRIST TEMPLE-PRODDATUR
- నీతిమంతుడైన యోసేపు..

"యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను”.(మత్తయి 1:24, 25)

బైబిలులో అనేకమంది యోసేపులు ఉన్నారు. అయితే వీరిలో ముఖ్యులు ఇద్దరు! వారు - పాత నిబంధనలోని యాకోబు పదకొండవ కుమారుడైన యోసేపు; క్రొత్త నిబంధనలో కన్య మరియకు ప్రధానము చేయబడిన యోసేపు. క్రొత్త నిబంధనలోని ఈ యోసేపును గూర్చి ఇప్పుడు ధ్యానిద్దాం!

1.యోసేపు నీతిమంతుడు..

మన నీతిక్రియలన్నియు మురికి గుడ్డవంటివని దేవుని వాక్యము చెప్పుచున్నది (యెషయా 64:6).

 అయితే యోసేపు యొక్క నీతి స్వనీతి కాదు. ఇది దేవుని నీతి! యోసేపు తనకు ప్రధానము చేయబడిన మరియ గర్భవతియైనదని తెలుసుకొనెను. ధర్మశాస్త్రమునందు ప్రధానము చేయబడిన స్త్రీలో దోషము కనబడిన యెడల ఆమెను బహిరంగముగా అవమానపరచి, రాళ్ళతో కొట్టి చంపవలెను అని వ్రాయబడి యున్నది (ద్వితీయో 22:21). కాని యోసేపు ఆమెను అవమానపరచనొల్లక, రహస్యముగా విడనాడదలచెను. దేవుని నీతి కలిగినవారు ఇతరులను అవమాన పరచుటకు ఇష్టపడరు గాని, క్షమించుటకు సిద్ధపడుదురు.

అయితే యోసేపు 'ఆమె ఏదో విధంగా గర్భవతి అయినదిలే! పోనీలే! నేనామెను నా భార్యగా స్వీకరిస్తానులే!' అని అనుకొనలేదు. యోసేపు మరియను అవమానపరచ లేకపోయెను, అదే సమయంలో స్వీకరించలేకపోయెను. అదే దేవుని నీతి! దేవుడు ఒక పాపిని ప్రేమించును గాని, అతనిలో వున్న పాపమును ద్వేషించును. దేవుడు పశ్చాత్తాప పడిన పాపిని కౌగలించుకొని చేర్చుకొనును గాని; ఒకడు
తన ఒడిలో పాపము దాచుకొంటే, దేవుడు అతనిని చేరదీసి ఆదరించలేడు. అదే దేవుని నీతి!

అటువంటి నీతి కలిగిన యోసేపు దేవుని సన్నిధిలో ఆలోచించుకొనుచుండగా దేవుని దూత అతనికి కనబడి, మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతియైనదనియు; ఆమె యొక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనియు తెలియజేయగా అతడు నమ్మి, దేవునికి లోబడి ఆమెను చేర్చుకొనెను (మత్తయి 1:20-25).

2.యోసేపు విధేయుడు...

విశ్వాసము లేనివాడు విధేయుడు కాలేడు. యోసేపు దేవుని మాటను నమ్మే విశ్వాసిగాను, దేవుని మాటలకు లోబడే విధేయుడుగాను కనిపిస్తున్నాడు. దేవుని నమ్మకుండా, దేవునికి లోబడకుండా మనము నీతిమంతులము కాలేము. “అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను” (గలతీ 3:6). దేవుని మాట నమ్మకుండా, ఆయనకు లోబడకుండా దేవుని పని మనము చేయలేము. 'కన్యక గర్భవతియైనది' అన్నది సామాన్యముగా కనిపించినా, ఎదురుమాట చెప్పకుండా నమ్మిన యోసేపు విశ్వాసము గొప్పది!

 గర్భవతిని చేర్చుకొన్నాడనే నిందకు, లోకానికి భయపడక; దేవుని చిత్తమును నెరవేర్చాలని మరియను చేర్చుకొనుట యందు యోసేపు చూపిన విధేయత బహు గొప్పది!

హేరోదు శిశువును చంపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి, ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపొమ్మని దూత చెప్పగానే; యోసేపు వెంటనే లేచి, ఆ రాత్రివేళ శిశువును, తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళుట - అతని విధేయతను, చురుకుదనమును చూపించుచున్నది. యోసేపు దూత మాటకు వెంటనే లోబడక, తామసము చేసినచో ఎంతో నష్టము వాటిల్లియుండెడిది. కాని యోసేపు వెంటనే లోబడెను.

ఎదురుచెప్పకుండా వెంటనే లోబడటం విధేయత. గనుక దేవుని ఆత్మ ప్రేరేపణలకు, పరిశుద్ధాత్మ నడిపింపులకు, మనస్సాక్షి గద్దింపులకు వెంటనే లోబడుట నేర్చుకొందాం!

3.యోసేపు మౌని...

యోసేపు ప్రతి విషయాన్ని గ్రహించి, స్వీకరించడానికే నిశ్చయించుకొనెను గాని; తర్కించి, వాదించుటకు ఇష్టపడలేదు. యోసేపు వినుటకు వేగిరపడువాడు గాను, మాటలాడుటకు నిదానించువాడుగాను ఉన్నాడు. మనము తక్కువ మాటలాడి, ఎక్కువ వినాలని దేవుడు మనకు ఒక నోరు, రెండు చెవులు ఇచ్చాడు. అయితే నేర్చుకొనుటకు ఇష్టము లేనివాడు తన నోటికి వచ్చినవన్నీ మాట్లాడుతూ యుంటాడు. కాని నేర్చుకొనుటకు ఇష్టపడువాడు మౌనంగా విని, గ్రహిస్తాడు. అలాగే లోబడుటకు ఇష్టము లేనివాడు తన్ను తాను సమర్థించుకొనుటకు, సాకులు చెప్పుటకు అధిక వాదన చేస్తాడు. అయితే లోబడుటకు ఇష్టపడేవాడు మారు మాట్లాడకుండా నేర్చుకొంటాడు. బుద్ధిహీనుడు పెక్కు మాటలు మాట్లాడునని (ప్రసంగి 5:3); జ్ఞాని మౌనముగా నుండునని (సామెతలు 17:28) బైబిలు చెప్పుచున్నది.

4.యోసేపు పరిశుద్ధుడు..

మీ దేవుడనైన నేను పరిశుద్ధుడనైయున్న ప్రకారము మీరును పరిశుద్ధులై యుండుడని ప్రభువు చెప్పెను. పరిశుద్ధత లేకుండా మనము దేవుని చూడలేము. 'యోసేపు మరియను చేర్చుకొని, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగ కుండెను' అని బైబిలు సెలవిస్తున్నది.

యోసేపు మరియను చేర్చుకొని, ఆమెకు భర్తగా ఉన్నప్పటికి; ఆమెను రక్షకుని తల్లిగా భావించి, యోసేపు ఆమెను శరీర మనస్సుతో ముట్టకుండుట; ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండుట అతని ఆశానిగ్రహతను, అతని పరిశుద్ధతను బయలుపరచుచున్నది. శరీర కోరికలకు, ఆశలకు స్థలమివ్వక; ఆత్మానుసారంగా ప్రవర్తించిన యోసేపు పరిశుద్ధుడు!

మనమును యోసేపువలె దేవుని నీతిని కలిగి; దేవునికి లోబడువారినిగాను, ఆశనిగ్రహము కలిగినవారమై పరిశుద్ధులముగాను బ్రతికి దేవుని మహిమ పరచుదుము గాక! ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR