మీ పిల్లలు తప్పిపోవడానికి ముమ్మాటికీ మీదే తప్పు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మీ పిల్లలు తప్పిపోవడానికి ముమ్మాటికీ మీదే తప్పు..

క్రైస్తవ తల్లిదండ్రులకోసం ఒక ముఖ్య గమనిక.. ఈ చిన్నకుమారుని ఉపమానం ప్రకారం ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలను ఎంత భక్తిలో పెంచినా, ప్రార్ధనలో పెంచినా, వాక్యంలో పెంచినా సరే, మీరుకూడా ఎంత భక్తిగా జీవించినా సరే, మీ పిల్లలు మీలాగే భక్తిలో, సత్యములో, ప్రార్ధనలో జీవిస్తారనే గ్యారంటీ లేదు. మీరు వారికోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత ప్రార్ధన చేసినా వారు పడిపోకుండా ఉండరు అని గ్యారంటీ లేదు. దానికి చిన్న కుమారుడే గొప్ప ఉదాహరణ. అందుకే భక్తుడైన యోహాను గారు 

- 3John(మూడవ యోహాను) 1:4

4.నా పిల్లలు సత్యమును అనుసరించి(సత్యములో) నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు. అని పొంగిపోతున్నారు.
అయితే మీరు చేస్తున్న ప్రార్ధన, మీ భక్తి, మీరు మీ పిల్లలను ప్రార్ధనలోను, భక్తిలోను, వాక్యానుసారంగా పెంచడం వేస్ట్ అని నేను ఎంతమాత్రము చెప్పడం లేదు.
1. బాలుడు నడువ వలసిన మార్గం వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలిగిపోడు అంటున్నారు సోలోమోను గారు. (సామెతలు 22:6 )

2. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని వ్రాయబడింది.
 యెషయా 40:30.ఈ రెండు ఒకదానికి వ్యతిరేకంగా ఉన్నాయి గాని రెండూ కరెక్టే! 

ఎందుకంటే మీరు మీ పిల్లలను ఎంత భక్తిలో పెంచినా –బాలుని హృదయంలో దుష్టత్వం స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని తొలగించును అని వ్రాయబడింది.(సామెతలు 22:15) కాబట్టి బాలుడు పెద్దవాడైనప్పుడు, శిక్షాదండము తగ్గినప్పుడు, యవ్వన ప్రాయంలో అడుగుపెట్టినప్పుడు, తనమిత్రులతో కలిసి చాలామంది లోకంలో పడిపోతుంటారు(అందరు యవ్వనస్తులు పడిపోతారు అనికాదు). ఎందుకంటే దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును (1 కొరింథీ 15:33) ఇది సహజం!

అయితే మీ పిల్లలు లోకంలో జారిపోయినప్పుడు మీరు మీ ఆశ వదిలివేయ వద్దు. మీరు పెంచిన మంచి పెంపకం అనగా వాక్యంలో, ప్రార్ధనలో పెంచినందువలన వారు పెద్దవారైనప్పుడు, జీవితంలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు, వారు తమ తప్పు తాము తెలిసికొని తిరిగి తప్పకుండా యేసయ్య వద్దకు, మీ దగ్గరకి వస్తారు. మీ ప్రార్ధన తప్పకుండా ఒకరోజు వారిని పట్టుకొంటుంది. మీరు చెప్పిన వాక్యాలు వారిని గద్దిస్తూ ఉంటాయి. నీఎదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీవాక్యమును ఉంచుకొంటాను అంటున్నారు దావీదు గారు కీర్తన 119:11. ఒకరోజు కార్యరూపం దాల్చి తప్పకుండా వస్తారు. దానికి చిన్న కుమారుడే ఉదాహరణ. మనం నిశ్చింతగా ఈ ఉపమానం పరిశీలిస్తే చిన్న కుమారునికి ఎవరూ బుద్ధిచెప్పలేదు, ఎవరూ తండ్రియొద్దకు రమ్మని చెప్పలేదు. తనకుతానుగా తప్పుతెలిసికొనిపశ్చాత్తాప పడి అంటున్నాడు: తండ్రి నేను పరలోకమునకు విరోదముగాను, నీ ఎదుటను పాపము చేసాను నన్ను క్షమించు అని అడిగాడు(18). పరలోకంలో ఎవరుంటారు? దేవుడు! అనగా నేను దేవుని వ్యతిరేఖంగా పాపం చేసాను అని తండ్రిదగ్గర, దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని తిరిగి దేవునిరాజ్యములోనికి వచ్చాడు. కాబట్టి మీపిల్లలుకూడా తప్పకుండా తమ తప్పులు తెలిసికొని దేవుని దగ్గరకు, మీ దగ్గరకు వస్తారు.

ఒకవేళ ఓ తల్లీ/తండ్రీ! మీ పిల్లలను భక్తిలో పెంచకుండా, మీరు మాత్రమే ఆరాధనకు వెళ్తూ, మీ పిల్లలను వారికిష్టమొచ్చినట్లు వదిలేశారా? జాగ్రత్త!దుష్టసాంగత్యము మంచినడవడికను చెరిపివేయును. *ఒకవేళ నీ పిల్లలు నిన్ను ఏడిపిస్తున్నారా? నీమాటలు వినడం లేదా? త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మంచి పేరు కోల్పోయినవారిగా పాపులుగా తిరుగుతున్నారా? దానికి కారణం ఓతల్లీ/తండ్రీ! ముమ్మాటికి నీవే*!!!

ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసేద్దుము గాని ఛీ..ఆ కులం వారిని ప్రేమించినది అని భాదపడే వారున్నారు, ఒక అన్యుడిని/అన్యురాలిని ప్రేమించి పెళ్ళి చెయ్యమంటున్నారు అని భాదపడే తల్లిదండ్రులు ఉన్నారు. త్రాగిన మైకంలో మాకొడుకు మమ్మల్ని కొడుతున్నాడు అని ఏడ్చేవారున్నారు. డ్రగ్స్ ఎడిక్ట్గా మారిపోయాడు అని కన్నీరుకార్చేవారున్నారు. నా కూతురు/కొడుకు మా పరువు దేవుని పరువు తీసేసింది/తీసేసాడు అని ఏడుస్తున్నారు కదా! మీ పిల్లలు అలా మారడానికి కారణం ముమ్మాటికి నీవే!

 *ఎందుకంటే వారికోసం మీరు ఏడవాల్సిన సమయంలో, వారి బాగుకోసం ప్రార్ధించాల్సిన సమయంలో మీరు ఏడవలేదు. కావున ఇప్పుడు వారు మిమ్మల్ని ఏడిపిస్తూన్నారు*!!!

అందుకే భక్తుడైన యిర్మియా గారు రాస్తున్నారు: స్త్రీలారా! యెహోవా మాట వినుడి,. . . . మీ కుమార్తెలకు రోదనం చేయు విద్య నేర్పుడి, . . .వీదులలో పసిపిల్లలు లేకుండా, వారిని నాశనం చేయుటకు మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, ,మన గదులలో ప్రవేశించుచున్నది. యిర్మీయా 9:20,21. మన పిల్లలు ఆత్మీయంగా /శారీరకంగా చనిపోయేలా సాతానుగాడు వాడి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాడు. దానిని ఎదుర్కోవాలంటే : మన కన్నులు కన్నీళ్ళు విడచునట్లు గాను, మన కన్నులనుండి నీళ్ళు ఒలుకునట్లు గాను,త్వరపడి రోదన చేయవలెను. యిర్మియా 9:18. మన దేశంలో ఎంతో మంది యవ్వనస్తులు అకాలమరణం చెందుతున్నారు అతివేగం వలన, త్రాగుడు వలన, అక్రమ సంభందాల వలన, ప్రేమ వైఫల్యాల వలన, సాతాను ప్రేరేపణవలన! వారు క్షేమంగా ఉండాలంటే ప్రియమైన తల్లీ తండ్రీ! *ప్రతీరాత్రి కొన్ని నిమిషాలైనా వారు పడుకున్న తర్వాత వారి పడక దగ్గర మోకరించి ప్రార్ధించాలి. నీ కళ్ళనుండి నీరు వారి పడకల దగ్గర కారాలి*!!!.

భక్తురాలు, తల్లి సూసన్నగారు తనకున్న 13మంది పిల్లల పడక దగ్గర ప్రార్ధన మొదలుపెడితే పదముగ్గురి దగ్గర ప్రార్ధన ముగించేసరికి తెల్లవారిపోయేదంట. ఆమె ప్రార్ధన ఆమె బిడ్డలనందరిని దైవసేవకులను చేసింది. జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు ఆమె సంతానమే!
నా తల్లి కన్నీటిప్రార్ధనా ప్రవాహంలో దేవునిరాజ్యానికి కొట్టుకొని వచ్చాను అంటున్నారు భక్తుడైన అగస్టీన్. కాబట్టి నీబిడ్డలకోసం ప్రార్దిస్తున్నావా? వారిని వాక్యంలో ప్రార్ధనలో పెంచుతున్నావా?

కావున ప్రియ తల్లిదండ్రులారా!
మీరు ప్రార్దిస్తున్నారా?
అయితే మీ ఆశ వదులుకోవద్దు!
ఇంకా ప్రార్ధించడం లేదా?
నేడే మీ పిల్లలకోసం ప్రార్ధించడం మొదలుపెట్టండి.

అట్టి కృప, ధన్యత మనందరికీ కలుగును
గాక!
ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments