నీతిమంతుడైన యోసేపు..(క్రిస్మస్ మెసేజ్)

✝️ - CHRIST TEMPLE-PRODDATUR
- నీతిమంతుడైన యోసేపు..

"యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను”.(మత్తయి 1:24, 25)

బైబిలులో అనేకమంది యోసేపులు ఉన్నారు. అయితే వీరిలో ముఖ్యులు ఇద్దరు! వారు - పాత నిబంధనలోని యాకోబు పదకొండవ కుమారుడైన యోసేపు; క్రొత్త నిబంధనలో కన్య మరియకు ప్రధానము చేయబడిన యోసేపు. క్రొత్త నిబంధనలోని ఈ యోసేపును గూర్చి ఇప్పుడు ధ్యానిద్దాం!

1.యోసేపు నీతిమంతుడు..

మన నీతిక్రియలన్నియు మురికి గుడ్డవంటివని దేవుని వాక్యము చెప్పుచున్నది (యెషయా 64:6).

 అయితే యోసేపు యొక్క నీతి స్వనీతి కాదు. ఇది దేవుని నీతి! యోసేపు తనకు ప్రధానము చేయబడిన మరియ గర్భవతియైనదని తెలుసుకొనెను. ధర్మశాస్త్రమునందు ప్రధానము చేయబడిన స్త్రీలో దోషము కనబడిన యెడల ఆమెను బహిరంగముగా అవమానపరచి, రాళ్ళతో కొట్టి చంపవలెను అని వ్రాయబడి యున్నది (ద్వితీయో 22:21). కాని యోసేపు ఆమెను అవమానపరచనొల్లక, రహస్యముగా విడనాడదలచెను. దేవుని నీతి కలిగినవారు ఇతరులను అవమాన పరచుటకు ఇష్టపడరు గాని, క్షమించుటకు సిద్ధపడుదురు.

అయితే యోసేపు 'ఆమె ఏదో విధంగా గర్భవతి అయినదిలే! పోనీలే! నేనామెను నా భార్యగా స్వీకరిస్తానులే!' అని అనుకొనలేదు. యోసేపు మరియను అవమానపరచ లేకపోయెను, అదే సమయంలో స్వీకరించలేకపోయెను. అదే దేవుని నీతి! దేవుడు ఒక పాపిని ప్రేమించును గాని, అతనిలో వున్న పాపమును ద్వేషించును. దేవుడు పశ్చాత్తాప పడిన పాపిని కౌగలించుకొని చేర్చుకొనును గాని; ఒకడు
తన ఒడిలో పాపము దాచుకొంటే, దేవుడు అతనిని చేరదీసి ఆదరించలేడు. అదే దేవుని నీతి!

అటువంటి నీతి కలిగిన యోసేపు దేవుని సన్నిధిలో ఆలోచించుకొనుచుండగా దేవుని దూత అతనికి కనబడి, మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతియైనదనియు; ఆమె యొక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనియు తెలియజేయగా అతడు నమ్మి, దేవునికి లోబడి ఆమెను చేర్చుకొనెను (మత్తయి 1:20-25).

2.యోసేపు విధేయుడు...

విశ్వాసము లేనివాడు విధేయుడు కాలేడు. యోసేపు దేవుని మాటను నమ్మే విశ్వాసిగాను, దేవుని మాటలకు లోబడే విధేయుడుగాను కనిపిస్తున్నాడు. దేవుని నమ్మకుండా, దేవునికి లోబడకుండా మనము నీతిమంతులము కాలేము. “అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను” (గలతీ 3:6). దేవుని మాట నమ్మకుండా, ఆయనకు లోబడకుండా దేవుని పని మనము చేయలేము. 'కన్యక గర్భవతియైనది' అన్నది సామాన్యముగా కనిపించినా, ఎదురుమాట చెప్పకుండా నమ్మిన యోసేపు విశ్వాసము గొప్పది!

 గర్భవతిని చేర్చుకొన్నాడనే నిందకు, లోకానికి భయపడక; దేవుని చిత్తమును నెరవేర్చాలని మరియను చేర్చుకొనుట యందు యోసేపు చూపిన విధేయత బహు గొప్పది!

హేరోదు శిశువును చంపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి, ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపొమ్మని దూత చెప్పగానే; యోసేపు వెంటనే లేచి, ఆ రాత్రివేళ శిశువును, తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళుట - అతని విధేయతను, చురుకుదనమును చూపించుచున్నది. యోసేపు దూత మాటకు వెంటనే లోబడక, తామసము చేసినచో ఎంతో నష్టము వాటిల్లియుండెడిది. కాని యోసేపు వెంటనే లోబడెను.

ఎదురుచెప్పకుండా వెంటనే లోబడటం విధేయత. గనుక దేవుని ఆత్మ ప్రేరేపణలకు, పరిశుద్ధాత్మ నడిపింపులకు, మనస్సాక్షి గద్దింపులకు వెంటనే లోబడుట నేర్చుకొందాం!

3.యోసేపు మౌని...

యోసేపు ప్రతి విషయాన్ని గ్రహించి, స్వీకరించడానికే నిశ్చయించుకొనెను గాని; తర్కించి, వాదించుటకు ఇష్టపడలేదు. యోసేపు వినుటకు వేగిరపడువాడు గాను, మాటలాడుటకు నిదానించువాడుగాను ఉన్నాడు. మనము తక్కువ మాటలాడి, ఎక్కువ వినాలని దేవుడు మనకు ఒక నోరు, రెండు చెవులు ఇచ్చాడు. అయితే నేర్చుకొనుటకు ఇష్టము లేనివాడు తన నోటికి వచ్చినవన్నీ మాట్లాడుతూ యుంటాడు. కాని నేర్చుకొనుటకు ఇష్టపడువాడు మౌనంగా విని, గ్రహిస్తాడు. అలాగే లోబడుటకు ఇష్టము లేనివాడు తన్ను తాను సమర్థించుకొనుటకు, సాకులు చెప్పుటకు అధిక వాదన చేస్తాడు. అయితే లోబడుటకు ఇష్టపడేవాడు మారు మాట్లాడకుండా నేర్చుకొంటాడు. బుద్ధిహీనుడు పెక్కు మాటలు మాట్లాడునని (ప్రసంగి 5:3); జ్ఞాని మౌనముగా నుండునని (సామెతలు 17:28) బైబిలు చెప్పుచున్నది.

4.యోసేపు పరిశుద్ధుడు..

మీ దేవుడనైన నేను పరిశుద్ధుడనైయున్న ప్రకారము మీరును పరిశుద్ధులై యుండుడని ప్రభువు చెప్పెను. పరిశుద్ధత లేకుండా మనము దేవుని చూడలేము. 'యోసేపు మరియను చేర్చుకొని, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగ కుండెను' అని బైబిలు సెలవిస్తున్నది.

యోసేపు మరియను చేర్చుకొని, ఆమెకు భర్తగా ఉన్నప్పటికి; ఆమెను రక్షకుని తల్లిగా భావించి, యోసేపు ఆమెను శరీర మనస్సుతో ముట్టకుండుట; ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండుట అతని ఆశానిగ్రహతను, అతని పరిశుద్ధతను బయలుపరచుచున్నది. శరీర కోరికలకు, ఆశలకు స్థలమివ్వక; ఆత్మానుసారంగా ప్రవర్తించిన యోసేపు పరిశుద్ధుడు!

మనమును యోసేపువలె దేవుని నీతిని కలిగి; దేవునికి లోబడువారినిగాను, ఆశనిగ్రహము కలిగినవారమై పరిశుద్ధులముగాను బ్రతికి దేవుని మహిమ పరచుదుము గాక! ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments