✝️ CHRIST TEMPLE-PRODDATUR
- తప్పిపోయి మరలా దొరికిన కుమారుడా..! ఎలా ఉన్నావు?
Luke(లూకా సువార్త) 15:21
21.అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక!
ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టారు గాని, తండ్రియోద్దకు తిరిగి చేరాడు కాబట్టి తప్పిపోయి దొరికిన కుమారుడు అనడమే సమంజసం అని నా అభిప్రాయం.
యేసుప్రభుల వారు తన ప్రసంగాలలో అనేక ఉపమానాలు చెప్పారు.
మార్కు 4:33,34 లో ఉపమానం. ఆయన ప్రసంగాలన్నీ ఉపమానాలతో నిండి ఉండేవి. వాటిలో బోలెడు నిఘూడ సత్యాలు, పరమరాజ్య రహస్యాలు దాగి ఉండేవి. నేటిదినాల్లో వాడుచున్న ఉపమానాలు ప్రజల్ని నవ్వించడం తప్ప దేవునిరాజ్య ఆత్మీయ మర్మాలు తక్కువ.
లూకా గారు వ్రాసిన సువార్త యొక్క ప్రాముఖ్యత గత భాగాలలో వివరించాను. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో గల ఉపమానాలు మిగతా సువార్తలలో లేవు. ఈ 15వ అధ్యాయం బైబిల్ గ్రంధములోనే చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఇందులోగల పాత్రలు నేటికీ మనలో ప్రతీ ఒక్కరికి సరిపోతాయి. (These relates each and every one of us). ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానం మనలో ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది. ఈ ఉపమానం నాకు చెందదు అంటే ఆ వ్యక్తీ పచ్చి అబద్ధికుడు. అయితే చిన్న కుమారుని పోలి ఉంటాం. లేదా పెద్ద కుమారుని పోలి యుంటాము. అంతేకాదు క్రైస్తవ భక్తిగల తల్లిదండ్రులకు తమ పిల్లలలో చాలామందికి తప్పిపోయిన కుమారుని అనుభవం ఎదురయ్యి ఉంటుంది.కాబట్టి ఇది ఉపమానమే తప్ప నిజం కాదులే అనుకోవద్దు. నేను ఏ విషయంలోనూ తప్పిపోలేదు కాబట్టి ఈ ఉపమానం నాకు కాదు అనుకోవద్దు. మనందరం ఎప్పుడో ఒకప్పుడు, చాలాసార్లు తప్పిపోయి ఉంటాము మాటలోనో, పవిత్రతలోనో, చూపులోనో, తలంపులోనో, ప్రవర్తనలోనో, ప్రార్ధించుటలోనో, దేవునికిచ్చుట లోనో తప్పిపోయినవారమే!!! మనం మానవ మాత్రులం కనుక మనందరికీ ఈ అనుభవం ఉంది. అయితే ఈ చిన్న కుమారుడు పశ్చాత్తాపపడినట్లు మనం కూడా మరలా దేవునియొద్దకు వచ్చాం కాబట్టి కనికరించబడ్డాము. ఒకవేళ దీని చదువుచున్న ప్రియ సహోదరీ, సహోదరుడా! ఇంకా నీవు సమాధాన పడలేదా? ఇప్పుడే పశ్చాత్తాప పడి దేవుని యొద్దకు మరలి రా! తండ్రి తన చిన్నకుమారుని చేర్చుకొన్నట్లు నిన్నుకూడా చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ 15వ అధ్యాయంలో గల ఉపమానాలలో దేవుని ఉద్దేశ్యం చాలా ప్రస్ఫుటంగా స్పష్టం అవుతుంది. అదేమిటంటే: నీవు తప్పిపోయావా? దేవుణ్ణి విడచి, దేవుని సంఘాన్ని, సహవాసాన్ని విడచిపెట్టి తిరుగుతున్నావా? లోకస్తులతో కలసి వారిపాపంలో పాలివాడవై వారిలో ఒకనిగా ఉంటున్నావా? దేవుడు తన చేయి చాపి నిన్ను పిలుస్తున్నారు. నీవు ఇప్పడు ఎంత ఘోర పాపివైనా సరే! ఇంకా దేవుని బిడ్డవే!!! చిన్న కుమారుడు తన తప్పు తెలిసికొని తండ్రి యొద్దకు వచ్చినట్లు నేడే ఆయన యొద్దకు రా! వెంటనే ఆయన నిన్ను కౌగలించుకొని, ముద్దుపెట్టుకొని (నీవు ఎంత పాపమనే మురికిలో ఉన్నా సరే)తన హక్కున చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.
వస్తావా?
అట్టి పశ్చాత్తాపం దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments