✝️ CHRIST TEMPLE-PRODDATUR
- అవన్నీ మరచిపోయి ఇకనుండైనా కొత్త జీవితం ప్రారంభించు.
జీవితమనే పరుగు పందెములో విజయం సాధించాలంటే? వెనుక ఉన్నవి మరవాలి ముందున్నవాటికొరకు పరుగెత్తాలి.
సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీ 3:13,14
1️⃣ *- మన గత పాపములను మరచిపోవాలి:*
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. (సామెతలు 28:13) మనము. పాపముల విషయమై పశ్చాత్తాప పడి వాటిని మరచిపోవాలి. అయితే, సాతాను గతములో మనము చేసిన పాపములను గుర్తుచేస్తూనే ఉంటాడు. పాపముల విషయంలో మనము పశ్చాత్తాపపడితే ప్రభువు తిరిగి వాటినెప్పటికిని ఆయన జ్ఞాపకం చేసుకోరు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యోహాను 1:9) క్షమింపబడిన గతకాలపు పాపములను నీవు మరచిపో.
2️⃣ *- మన గత వైఫల్యాలను మరచిపోవాలి:*
పొంగిపోయిన పాల విషయం చింతించి ఏమి ప్రయోజనం? గతించిన కాలంలో నీవు ఆర్ధికంగా చాలా నష్టపోయి ఉండొచ్చు. వాటినే తలపోసుకొంటూ వుంటే, ఏమి ప్రయోజనం? అట్లా అని ఇట్లాంటి అనుభవాలు మరచిపోవడం అంత సులభం కాదు. మనము నష్టపోవడానికి కారణమైన వ్యక్తులను చూచినప్పుడు, ఆ సందర్భములు గుర్తొచ్చినప్పుడు, మనలోనున్న సమాధానమంతా కోల్పోతాము. నీవు ప్రశాంతంగా ఉండాలంటే, గత వైఫల్యాలు నీ జ్ఞాపకం లోనికి రాకుండా, ఇంత కఠినమైన పరిస్థితులలో సహితం నిన్ను ఆదరించి, జీవింపజేస్తున్న క్రీస్తు ప్రేమను నింపుకో. ఆ దివ్యమైన ప్రేమముందు, గత వైఫల్యాలేవీ నిలువలేవు.
3️⃣ *- మన గత విజయాలను మరచిపోవాలి:*
గత కాలపు విజయాలు తలపోసుకున్నంత మాత్రాన వర్తమానములో విజయాలు వర్తించవు. అంతే కాకుండా, గతకాలపు విజయాలు గుర్తుచేసుకొంటూ నేను ఏదైనా చెయ్యగలను అనే గర్వం కూడా మనలో ప్రవేశించవచ్చు. అది అత్యంత ప్రమాదకరం. గతకాలపు విజయాలు, భవిష్యత్ ను గురించిన ఊహలకంటే, వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి.
4️⃣ *- మనము గతములో అనుభవించిన సౌఖ్యాలను మరచిపోవాలి.*
గతములో అనుభవించిన సౌఖ్యాలను జ్ఞాపకం చేసుకొంటూవుంటే, ప్రస్తుత కాలంలో దేవుడు నిన్ను ఏరీతిగా పోషిస్తావున్నారో గ్రహించలేవు. ఇశ్రాయేలీయులు గతించిన కాలంలో వారు మాంసము వండుకొని కుండల చుట్టూ కూర్చొని తిన్న అనుభవాలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా. ప్రస్తుత కాలంలో దేవుడు ఏరీతిగా మన్నా, పూరేళ్లతో వారిని పోషిస్తావున్నారో అర్ధం చేసుకోలేకపోయారు. (సంఖ్యా 11:5,6; 20:5; 21:5)
5️⃣ *- గతకాలపు చేదు అనుభవాలను మరచిపోవాలి:*
ఆస్తులు పోయాయా? మరచిపో. తిరిగి వాటిని సంపాదించలేకపోవచ్చు. నిన్నెవరైనా నిరాశ పరిచారా? మరచిపో. పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా, వారికంటే మనకే ఎక్కువ కీడు వాటిల్లుతుంది. ఆప్తులు, ఆత్మీయుల మధ్య వచ్చిన అపార్ధాలు చేదు అనుభవాలనే మిగుల్చుతాయి. అవి సమాధానం లేకుండా చేస్తాయి. అయితే, వాటిని అధిగమించడం ఎట్లా?
చేదు జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతున్నాయా?
🔺క్షమించమని అడిగే మనస్సు
🔺క్షమించే హృదయం
ఈ రెండూ నీకుంటే చాలు. నీవు ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినైనా నొప్పించినాగాని , లేదా నిన్ను అపార్ధం చేసుకోవడం ద్వారా నొప్పింపబడినాగాని, క్షమాపణ అడగాల్సి వస్తే క్షమించమని అడుగు. క్షమించాల్సి వస్తే, మనః పూర్తిగా క్షమించు. సమాధానంతో నీ హృదయము నింపబడుతుంది. ఇక చేదు జ్ఞాపకాలను మరచిపో.
ఇట్లా వెనుకనున్నవన్నీ మరచి, ముందున్నవాటి కొరకు వేగిరపడుదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీయులకు 12:2) వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుదము. ఆరీతిగా నూతన వత్సరములో మన జీవితాలను సిద్ధపరచు కొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
Comments