✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మీ పిల్లలు ఆశీర్వాదాలకు సూచనలు..
ఇదిగో, నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. యెషయా 8:18
నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేడు ఈ సందేశమును చదువుచున్న మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని కోరుచున్నాడు. అంతమాత్రమే కాదు, మీ పిల్లలు మార్గము తప్పిపోకుండా, దేవుని వలన సూచనలుగాను, మహత్కార్యములుగాను ఉండుటకు తీసుకొనవలసిన జాగ్రత్తలేమిటి ? అని మనము చూచినట్లయితే, మన పిల్లలను చిన్న తనమునుండే దేవుని మార్గములో నడిపించినవారము అవుతాము. అప్పుడే, వారు ఆ మార్గము తొలగిపోకుండా వుంటారని బైబిల్ చెబుతుందిలా,
" బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు'' (సామెతలు 22:6)
మీ పిల్లల స్థితి ఎలాగున వున్నదో ఒక్కసారి మిమ్మును మీరు పరీక్షించుకొనండి. మీ పిల్లల జీవితాలు ఏలా వున్నాయో? ఒక్కసారి గుర్తించండి. మరియు " ఇదిగో నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండ మీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వలని సూచనలనుగా మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము'' (యెషయా 8:18)
ఈ వచనము ప్రకారము మరియు ప్రతి కుటుంబము దైవీకమైన సంతతిని పొందవలెనని దేవుని చిత్తమై యున్నది. కాబట్టి, ఆలాగుండుటకు మీ హృదయాలను దేవునికివ్వండి, దేవుడే మీ పిల్లలను వృద్ధిపొందిస్తాడు.
బైబిల్‌లో మోషే తల్లిదండ్రులైన అమ్రాము మరియు యాకెబెదు (సంఖ్యాకాండము 26:59). మోషే తల్లిదండ్రులను చూచినట్లయితే, వారు రాజు ఆజ్ఞను లక్ష్యపెట్టక తమ కుమారుడైన మోషేను మూడు నెలలు దాచిపెట్టిరి (నిర్గమకాండము 2:2). దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించెను. ఈ గొప్ప కార్యములో మోషేకు సహాయంగా తన సహోదరుడైన ఆహరోనును కూడ దేవుడు ఏర్పరచుకొనెను. మోషే సహోదరి అయిన మిరియాము కూడ నృత్యముతోను సంగీతముతోను దేవుని నిత్యం స్తుతించుచు ప్రవక్తిగా మారెను. వారి తల్లిదండ్రులు తమ పిల్లలను భక్తిగల మార్గములో పెంచారు గనుక వారందరు దేవుని యందు భయభక్తులతో నడుచుకొని దేవుని నామాన్ని మహిమపరిచారు. దేవుడు తన సేవకై వారిని బహుబలంగా వాడుకొన్నాడు.
అంతమాత్రమే కాదు, మన పిల్లలు దేవుని చేత పెంచబడిన సంతతిగా మారాలని ఆయన మన పట్ల వాంఛకలిగియున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి,
" దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా. కాబట్టి, మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొనుడి '' (మలాకీ 2:15)
ఈ వచనము ప్రకారము దేవుడు మీ పిల్లలను శ్రద్ధాభక్తులతో పెంచుటకును, దైవీకమైన సంతానమును అనుగ్రహించాలని ఆశించుచున్నాడు. మీ సంతానమును దేవుని యందు భయభక్తులతో పెంచుట మీ చేతిలోనే వున్నది.
ముందుగా తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులతో జీవించుచు పిల్లలకు మార్గదర్శకముగా ఉండవలెను. ఆలాగున చేసినప్పుడు మీ పిల్లలను దైవీకమైన మార్గములో నడిపించగలరు. ఆలాగున కాకుండ, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుటే ఒకరిని ఒకరు తిట్టుకొని పోట్లాడుకొంటారు, మరికొందరు తన్నుకొంటారు కూడ. ఇది పిల్లల మనస్సులో ఒక రకమైన భయమును, బాధను కలిగిస్తుంది. కనుక వారు తమ జీవితములో ఆసక్తిని కోల్పోయి, వారి చదువులో శ్రద్ధ చూపించరు. ఆలాగున నేడు ఈ సందేశము చదువుచున్న మీరుండకుండ, మీ సంతతిని దేవుని మార్గములో నడిపించుటకు మీ పిల్లల జీవితాలను, మీ వ్యక్తిగత జీవితాలను దేవుని చేతికివ్వండి, ఆయన మీ కుటుంబము పట్ల బాధ్యత వహిస్తాడు.
అదే విధముగా, ఒకసారి నేను ఒక చర్చిలో దేవుని సందేశమును అందించి, పుల్ పీట్ మీద నుండి క్రిందకు దిగాను. ఆ సమయములో పది సంవత్సరముల వయస్సుగల ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, " అంకుల్ మా అమ్మ నాన్న ఎప్పుడూ పోట్లాడు కొంటారెందుకు? మా అమ్మ ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది. కనుక ఆమె మాకు భోజనం కూడ పెట్టదు. దేవుడు మాకు సహాయము చేయాలని ప్రార్థించండి '' అని అడిగింది. ప్రియులారా, నేడు అనేక కుటుంబాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో పెరిగిన పిల్లలు ఏ విధంగా దేవుని మహిమకై సూచనలుగాను, మహత్కార్యములుగా ఉంటారు? కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలు తమ ఇష్ట ప్రకారముగా ఉండుటకు వదలిపెడతారు. అటువంటి పిల్లలు తను స్నేహితులతో సమయము గడుపుతూ ఉంటారు. చివరికి వారు సమస్త దురాశలకు బానిసలై దైవోగ్రతకు పాత్రులగుచున్నారు, ఆ తరువాత తల్లిదండ్రులు తమ పిల్లల నిమిత్తము ఏడుస్తూ ఉంటారు.
" వారితో కలిసి మన మందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మన యెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడ బ్రదికించెను. కృప చేత విూరు రక్షింపబడియున్నారు '' (ఎఫెసీయులకు 2:3-5).
అవును, నా ప్రియులారా, ఈ సందేశం ధ్యానం చేయుచున్న మిమ్మును ఆశీర్వదించుటకు దేవుడు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ భూమి మీద ఎలా నీతివంతమైన జీవితమును జీవించాడో, అదేవిధముగా మనము కూడ ఈ భూమి మీద జీవించిన కాలము నీతిగా జీవించాలని ఆ ప్రభువు కోరుచున్నాడు.
" యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమి మీద బలవంతులగుదురు, యథార్ధవంతుల వంశపువారు దీవింపబడుదురు'' అని బైబిల్ చెప్పిన విధంగా ఎప్పుడైతే యథార్ధంగా నీతిగా జీవిస్తారో అప్పుడు ఆయన మీ తల మీద ఆశీర్వాదములు కుమ్మరించి, మిమ్మును మరియు మీ పిల్లలను సూచనలుగాను, మహత్కార్యములు జరిగించేవారినిగా మార్చి మీ పిల్లలను వర్ధిల్లజేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments