నోవహు ఓడ

✝ CHRIST TEMPLE-PRODDATUR

Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu

                         నోవహు ఓడ

"దేవుడు నోవహుకు ఆజ్ఞ ఇచ్చినట్టే శరీరం ఉన్న ప్రతిదీ-  మగవీ, ఆడవీ ఓడలో ప్రవేశించాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశాడు" (ఆది 7:16)

■ దేవుడు నోవహు ముందు కొన్ని సవాలుకరమైన విషయాలు ఉంచాడు. కొన్ని ప్రశ్నలు నోవహు మదిలో మెదిలి ఏదో ఒక క్షణాన ఆ పని విరమించుకోవచ్చు.

"ఈ పని నా సామర్థ్యానికి మించింది. నేను చెయ్యగలనా?

నేను ఎప్పుడూ ఓడను కట్టలేదు. నాకు సహాయం ఎవరున్నారు?

మొదటికే నాతో ఎవ్వరూ ఏకీభవించరు. ఐనా వర్షం కురుస్తుందా? సకల జీవరాసులు జతలుజతలుగా రాగలవా?

జంతువులు, ఒకదానిని ఒకటి చంపుకొని తింటాయి..అవి ఏలా ఒకే చోట ఇన్ని నెలలు ఉండగలవు?"

● అవన్నీ చూపునకు అసాధ్యాలు, మునుపెన్నడూ విననివి. ఇవేమీ అతని పనిని  ఆపలేకపోయాయి. కారణం! నోవహు అతని సామర్ధ్యం వైపుగాని, ప్రకృతి సహజ నియమాలను గాని చూడలేదు. కానీ వీటన్నిటి పైనున్న దేవుని బలాన్ని మాత్రమే చూశాడు. సృష్టికర్తయైన దేవుని బలసామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయలేదు. దేవుడు తను చెప్పిన మాట తాను నెరవేర్చుకోగల సమర్థుడు. నోవహు దేవుణ్ని విశ్వసించాడు కనుక దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. దేవుని పని మన జీవితంలో జరగాలంటే లోకం వైపు చూడక, దాని అభిప్రాయాలను లక్ష్యపెట్టక, దేవునిపై చెరగని విశ్వాసం నిలిపితే చాలు!విశ్వాసం..తాను నమ్ముతున్న దానికి తగినట్లుగా తన పనిని కొనసాగిస్తుంది.

■ "తమ దేవుణ్ణి తెలుసుకొన్నవారు బలం పుంజుకొని గొప్ప క్రియలు చేస్తారు" (దానియేలు 11:32).

దేవుడు నోవహుతో 'ఓడ కట్టమని' మొట్టమొదటి సారిగా మాట్లాడ్డాడని మీరు అనుకుంటున్నారా? లేదు. దేవునితో అతని నడక అప్పటికే మొదలై చాలా రోజులు అవుతుంది(ఆది 6:9). దేవుణ్ని తెలుసుకోవడం అంటే బైబిల్ చదవడం కాదు..అలా చదివినప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం తలలోకి మాత్రమే చేరుతుంది. ఆ వాక్యంలో దేవుడు మన వ్యక్తిగత జీవితంలో కూడా పని చేయాలి. ఆ వాక్యాలు సత్యాలని మన జీవితం ద్వారా రూఢి చేసుకోవాలి. ఆయన్ను దగ్గర నుండి తెలుసుకోవాలి. విశ్వాసంతో దేవునితో నడుస్తున్న కొలది, మన పట్ల దేవుని నమ్మకత్వం పెరుగుతూ వెళ్తుంది. కొద్దివాటిలో నమ్మకం గల వానికి, గొప్పవాటిలో పాలువుంటుంది. అప్పటికే నోవహు స్వల్పమైన విషయాల్లో నమ్మకాన్ని కనబరచాడు. కనుక గొప్ప విశ్వాసంతో దేవునితో ధైర్యంగా నడిస్తూ, లోకంపై నేరస్థాపన చేశాడు. ఇవన్నీ విశ్వాసంలో మెట్లు. ఒక దానిని ఎక్కిన తర్వాత మరొకటి తరువాత స్థానానికి తీసుకెళ్తాయి.

■ నోవహు ఆ ఓడను సుమారు 120 యేండ్లు నిర్మించాడు. నిర్మిస్తున్న సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి పరిశుద్ధ దేవుని మార్గాన్ని ప్రకటించాడు(2పేతు 2:5). అతనితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఆ పనిని కొనసాగించాడు(1పేతు 3:20). చివరికి అతని కుటుంబం తప్ప ఎవ్వరూ ప్రవేశించలేదు. ఓడసిద్ధపరచి, నీతిని ప్రకటించడం మాత్రమే మన పని! విశ్వసించి ప్రవేశిస్తారో లేదో అది మనుష్యుని స్వేచ్ఛ నిర్ణయం! దాని గూర్చిన లెక్కను ప్రకటించు వానిని దేవుడు అడగడు(అకా 18:6, యెహె 33:7-9). నోవహు ఓడను సిద్ధపరచి,దాని తలుపు తెరిచివుంచాడు. ఒకానొక రోజున జీవరాశులు జతలుజతలుగా ఓడ వైపు ప్రయాణం చేశాయి.వాటికి ఆజ్ఞ ఇచ్చింది దేవుడే!ఆయన మాటను లెక్కచేయని, దేవుని సేవకుని కేకలను-దైవస్వరంగా గుర్తు పట్టలేని వారిపై దేవుడు ఒక దినాన నేరస్థాపన చేస్తాడు. సాక్షాత్తు దేవుడే ఆ ఓడ తలుపును మూసాడు.ఇక కృప కాలం ముగిసిపోతుంది. సమయం ఉండగానే విశ్వాసముంచి 'రక్షకుడైన యేసు' అనే ఓడలో ప్రవేశించి, దేవుని సంఘంలో చేరాలి. అక్కడ క్రూరత్వానికి తావులేదు. సకల జంతువులు ప్రేమతో మెలిగాయి.దేవుడు ఆదిలో నియమించిన సాధుత్వమే(క్రీస్తు స్వభావమే) వాటిని యేలాయి. దేవునికి సమస్తం సాధ్యమే! రండి! నోవహు వలె విశ్వాసంలో ఎదుగుదాం! ఆమెన్.

CHRIST TEMPLE-PRODDATUR
Pastor Nakkolla Daniel Balu
+91 8142229661.

Comments