🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Telugu Bible Sermons by Pastor. Nakkolla Daniel Balu.
రహస్య పాపాలు - వేషాలు
చాలామంది ప్రార్ధనకు సమాధానం రాకపోవడానికి గల ముఖ్య కారణం - వారు చేసే పాపాలే. దేవుడు పాపాన్ని విపరీతంగా ద్వేషిస్తాడు, పాపుల మొరకు ఆయన ఏ మాత్రం సమాధానం యివ్వడు.
"దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును." యోహాను 9:31
ఈరోజు అనేకులు పాప హృదయంతో దేవుణ్ణి ప్రార్ధిస్తున్నారు. దురుద్దేశములతో దేవుని అడుగుతున్నారు. అందుకే దేవుడు సమాధానం అనుగ్రహించుటలేదు. (యాకోబు 4:1-3).
▪ఒక పక్క మద్యం త్రాగుతారు, మరో పక్క జాబ్ కావాలి అంటారు.
▪ ఒక పక్క వ్యభిచారం చేస్తారు, మరో పక్క వ్యాపారంలో అభివృద్ధి కావాలని ప్రార్ధిస్తారు...
▪ఒక పక్క నోటితో బండబూతులు మాట్లాడతారు, మరో పక్క అదే నోటితో ఆశీర్వాదాలు కావాలి తండ్రి అని ప్రార్ధిస్తారు...
ఇతరులని క్షమించే గుణం వుండదు గాని వీరు చేసే పాపాలను మాత్రం దేవా క్షమించు అని ప్రార్థన చేస్తారు... డబ్బు అధికంగా ఉంటుంది కాని ఒకరికీ సహాయం చేయరు, దేవుని పరిచర్యకు కూడా ఇవ్వరు కాని వారి ఇంట్లో శాంతి సమాధానం కావాలి అంటారు....
ఈ విధంగా
▪పొరుగువారిని ప్రేమించరు,
▪యితరుల పట్ల ద్వేషం కలిగి ఉండటం.
▪అత్తామామలను సరిగ్గా చూసుకోక పోవడం.
▪ కన్న తల్లి తండ్రులను మర్చిపోవడం.
▪నోరు తెరిస్తే అబద్దాలు ఆడటం, దూషించడం.
▪ఇతరులని మోసం చేయడం, హింసించడం లాంటి పనులను చేస్తూనే ప్రభువా నా ప్రార్ధన విను, ప్రభువా నా ప్రార్ధన విను, నేను అడిగింది యివ్వు అని ప్రార్ధిస్తుంటారు.... యిట్టి హృదయంతో ప్రార్దిస్తే జవాబు ఎలా వస్తుంది? అప్పుడు దేవుడు శిక్షిస్తాడు తప్ప నీవు అడిగింది మాత్రం యివ్వడు. (జెకర్యా 7:8-14; సామెతలు 28:12; 1 పేతురు 3:11,12).
పైగా వీరు తాము చేస్తుంది పాపం అని కూడా గుర్తించరు, వదిలిపెట్టడానికి ప్రయత్నించరు... అవును చాలా మంది తాము చేస్తున్న తప్పులను కూడా గుర్తించట్లేదు, దేవుని సన్నిధిలో ఒప్పుకోవట్లేదు. ఒకవేళా దేవుని వాక్యానికి విరోధంగా ఏదైనా పని చేసినప్పుడు అది పాపం అని గుర్తించి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు. కాని ఒక పక్క పాపములు చేస్తూనే ఏ పాపం చేయనట్టు నీతిమంతులమనే గర్వంతో ప్రార్ధిస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు. గర్వం దేవునికి అసహ్యం. (సామెతలు 8:13; లూకా 15:18-20 ; లూకా 18:10-14).
నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా, ఒకవేళ నీ ప్రార్ధనకు సమాధానం రాకపోవడానికి గల కారణం నీవు హృదయంలో పాపం వుంచుకొని ప్రార్దిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. దావీదు అంటున్నాడు -
పాపమును మన హృదయంలో లక్ష్యం చేసినప్పుడు దేవుడు మన మనవి వినడు అని (కీర్తనలు 66:18).
"మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను ; మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ." (యెషయా 59:1,2)
"అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. " (సామెతలు 28:13)
" ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది." (1 పేతురు 3:12).
కనుక మిమ్మును మీరు వాక్యంతో పరీక్షించుకోండి, దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి... అప్పుడు దేవుడు తప్పక నీ ప్రార్ధన విని నిన్ను ఆశీర్వదిస్తాడు...
అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక. ఆమేన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪
Comments