ఫలించే చెట్టు

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

   Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details please contact me : +91 8142229281.

ఫలించే చెట్టు

యెరూషలేము వెళ్తూ ఆకలిగొన్న యేసు పండ్లు కోసుకొని తినేందుకు ఒక అంజూరపు చెట్టు వద్దకు వెళ్లాడు. నిండా ఆకులే తప్ప ఒక పండూ లేని ఆ చెట్టును యేసు శపించగా అది వెంటనే వాడిపోయింది. ‘పరిశుద్ధ వారం’లో ఈ ఉదంతాన్ని ధ్యానిస్తూ ఉంటాము. మానవుడు మంచి పనులు చేసినందుకు మెచ్చి దేవుడు రక్షణనివ్వడు. దేవుడు తన ఉచితమైన కృపతో రక్షించిన మానవుడు విశ్వాసిగా దేవుని విశ్వాసం, సహవాసం, ప్రేమలో ఎదుగుతూ సత్కార్యాలు చేస్తేనే దేవుడు మెచ్చి ఆశీర్వదిస్తాడని బైబిలు చెబుతోంది.

 దాన్నే యేసు ప్రభువు ఫలించడం అన్నాడు. అంజూరపు చెట్టు ఆకులు అత్యంత ఆకర్షణీయమైనవి, దాని పళ్లు మాత్రం అంత అందంగా ఉండవు. ఆకులతో ఆకర్షించిన అంజూరపు చెట్టు బాటసారికి పళ్లివ్వకపోతే దానికసలు విలువేముంది? క్రైస్తవమంటే ప్రసంగాలు, నీతి బోధలు చేయడం, సిద్ధాంతాలు వల్లించడం కాదు. తనను వలే తన పొరుగు వారిని ప్రేమించడమని యేసు చాలా స్పష్టంగా బోధించాడు. స్వార్థానికి దురాశకు, అసూయకు, దుర్మార్గతకు, కుతంత్రాలకు విశ్వాసిలో చోటు లేదు.

 ప్రభువులో వేరు పారి ఎదుగుతూ, పొరుగువారిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ వారి పక్షంగా నిలబడటమే నిజమైన క్రైస్తవమని, అలా ఫలించని చెట్టులాంటి విశ్వాసులకు చాలా ‘కఠినమైన తీర్పు’ తప్పదని యేసు బోధించాడు (యోహాను 15:1–11). యేసు తన ముప్ఫై మూడున్నరేళ్ల ఈ లోకజీవితంలో ప్రసంగాల ద్వారా కన్నా తన జీవితం ద్వారానే అందరినీ ప్రభావితం చేశాడు. తన ప్రేమనంతా ఆచరణలోనే చూపించాడు.

మరి మనం ఫలించే చెట్టువలే వుండాలంటే ఏమిచెయ్యాలి..? కీర్తన 1వ అధ్యాయం చదవండి.

"కీర్తన1:3 అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును"

మన జీవితం ఫలమిచ్చు చెట్టు వలే ఉండుటకు అవసరమయ్యే ఉపదేశం, హెచ్చరిక, పరిష్కార, మొదటి కీర్తనలో మనకు కనబడుతుంది.

ఇందులో మన సమస్యలకు కూడా పరిష్కారం కనబడుతుంది. లోకంలో అందరి జీవితాలలో అతి సామాన్యంగా కనబడే సమస్య “ఓటమి “లేదా విఫలత. వ్యక్తిగత జీవితాలలో, విద్యలో, పరిచార్యలో, నాయకత్వంలో, కుటుంబలో మనం ఎదుర్కొంటున్న సమస్య విఫలత. ఓటమి అవమాన కరమైనది. ఓటమి యొక్క బాధ భరించలేనిది.

విజయం కొరకైన అనేక గ్రంధాలు, పుస్తకాలు, సలహా కేంద్రాలు మనకు తరచుగా కనబడుతుంటాయి. మన భక్తి జీవితంలో, పరిచర్యలో, పెద్ద సమస్య ఓటమి. ఎందుకు మనం ఓడిపోతున్నాము? విజయాన్ని ఎందుకు అందుకోలేక పోతున్నాము? ఎందుకు ఫలించే చెట్టువలే ఉండలేక పోవుచున్నాము? ఫలములు లేని చెట్టువలే ఎందుకు ఉంటున్నాము...?

ఈ  ప్రశ్నలకు సమాధానం ఈ కీర్తనలో మనకు కనబడుతుంది. 3 వ వచనంలో ఫలమిచ్చు చెట్టు వలే నుండి  అతడు చేయునది అంత సఫలమగును అని వ్రాశాడు.  

కీర్తన1-1 వచనం "దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక"...

మన సఫలతను నిర్ణయించేది మన ఆలోచనే, దుష్టుల ఆలోచన చొప్పున నడవటం మన పతనానికి కారణం. దుష్ట ఆలోచన ఓటమికి కారణం. ఒక సమస్య దగ్గర మన ఆలోచన శరీర సంబంధమైనదైతే, పరిష్కారానికి బదులు పరితాపం మిగులుతుంది.

కావున మనం ఫలించి దేవునికి మహిమ కరంగా జీవిద్దాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪

Comments

Popular posts from this blog

యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానం

దావీదు దేవుని హృదయానుసారుడు..కానీ..

ప్రార్థన మందిరం