🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
BIBLE SERMONS BY PASTOR NAKKOLLA BALASUBRAMANYAM (DANIAL)
*పశ్చాత్తాపముతో చేయు ప్రార్ధన*
దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము
నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము.
నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము
నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.
నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము
సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.
కీర్తనలు 51:10-12
గొల్యాతుపై విజయము దావీదును అతని కీర్తిని పతాకస్థాయి వరకు తీసుకు వెళ్ళగలిగితే, ఆ కీర్తిని బెత్సేబతో చేసిన పాపము అక్కడ నుండి అతనిని పతనము అంచులకు త్రోసేసింది.
ఆపాపము అతనిని ఒక వ్యభిచారునునిగా , ఒక నరహంతకునిగా మార్చేసింది.
ఆ సందర్భములో దావీదు చేస్తున్న పశ్చాత్తాప ప్రార్ధన ఇది
1. దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము.
దేవునిచేత "నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందిన దావీదు హృదయం మలినమయిపోయింది.
చూపులలో! (బెత్సేబాను చూచుటద్వారా)
తలంపులలో! ( తనను ఇంటికి తెచ్చుకోవాలనే తలంపు)
క్రియలలో! ( తనతో పాపం , తనభర్తను చంపించడం )
పరిశుద్దతను కోల్పోయాడు.
దేవుని హృదయానుసారుడు, సాతాను హృదయనుసారుడుగా మారిపోయాడు
పరిశుద్ద హృదయం మలినమయిపోయింది. కోల్పోయిన స్థితిని తిరిగి పొందడానికి హృదయ పూర్వకంగా ప్రార్దిస్తున్నాడు.
2. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
దావీదు పాపం చేసినట్లు ఎవరికి తెలియదు కాబట్టి, పైకి ఏదో నటించగలుగుతున్నా, అంతరంగములో మాత్రం గందరగోళం.
తన మనసులో స్థిరత్వంలేదు . రోజుకు ఏడుసార్లు ప్రార్ధించే దావీదు, ఇప్పుడు దేవుని సన్నిధిలో గడపలేని పరిస్థితి. అనుక్షణం తప్పుచేసాననే భావన తనలో స్థిరత్వం లేకుండా చేసింది.
అందుకే ఇట్లా ప్రార్దిస్తున్నాడు . నేను కోల్పోయిన ఆ మనసును నూతనముగా పుట్టించమని.
3. నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము.
తలిదండ్రులు త్రోసివేస్తే స్నేహితులను ఆశ్రయించ వచ్చు. వారుకూడా త్రోసివేస్తే దేవునిని ఆశ్రయించవచ్చు. దేవుడే త్రోసివేస్తే? అది ఊహించుకొంటేనే భయంకరం. అందుకే దావీదు దేవుని బ్రతిమాలుతున్నాడు. నీ నుండి నన్ను త్రోసివేయవద్దని.
4. నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.
రక్షించబడి, బాప్తిస్మం తీసుకున్న
వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. ఆవ్యక్తి పాపంచేస్తే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడా?
అట్లా జరుగదు . లేదంటే? మన పాపం పరిశుద్దాత్మను పని చెయ్యనివ్వకుండా కప్పివేస్తుంది.
మన పాపము ఒప్పుకొని క్షమించబడిన తర్వాత మరళా పరిశుద్దాత్ముడు తన పని ప్రారంభిస్తాడు.
ఒకవేళ తన పాపఫలితముగా పరిశుద్దాత్ముడు వెళ్ళిపోతే? దావీదులో అసలు పశ్చాత్తాపం వచ్చివుండేది కాదు. పాపమును ఒప్పించేది పరిశుద్దాత్ముడే.
పరిశుద్దాత్మను కోల్పోలేదుగాని, ఆ ఆనందాన్ని కోల్పోయాడు. ఇప్పుడున్నంత వాక్యప్రత్యక్షత ఆకాలంలో లేదు. అందుకే, దావీదు భయపడుతూ ప్రార్దిస్తున్నాడు.
5.నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము.
"రక్షణానందము రక్షించబడిన వారు మాత్రమే అనుభవించే మహానందం. అది మనమాటల్లో వర్ణించలేనిది. రక్తం రుచిచూచిన పులి దానికోసమే ఎదురుచూస్తుంది. అట్లానే, రక్షణానందంను రుచిచూచిన దావీదు మరళా దానికోసమే దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు.
6. సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.
పాపంచేసి నీకు అవిధేయుడనై పోయాను. విధేయత కలిగిన మనసు నాకు అనుగ్రహించి, నన్ను బలపరచు. అంటూ ప్రార్దిస్తున్నాడు.
NOTE: ఒక అనుమానం రావొచ్చు.
దావీదు వ్యభిచారం చేసాడు , నరహత్య చేయించాడు కాబట్టి అతడు ఇట్లా ప్రార్ధించాడు. నేను చెయ్యలేదుకదా? నేనెందుకు ఇట్లా ప్రార్ధించాలని?
1. ప్రియుడైన యేసును విడచి సాతానుతో సాంగత్యం చేస్తున్నాము. అందుచే, మనము ఆత్మీయ వ్యభిచారులం.
2. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
1యోహాను 3:15
మన హృదయమంతా ద్వేషముతో నిండి వుంది. అందువల్ల మనము నరహంతకులం.
అందుచే, దావీదు చేసిన ప్రార్ధన మనమూ చెయ్యగలగాలి.
విరిగినలిగిన హృదయంతో మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ అద్భుతమయిన ఆనందాన్ని అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments