- నూతన హృదయము నీకిచ్చెదను..
గలిలయకు 150 కిలో మీటర్ల దూరంలో యెరూషలేముంటుంది. యేసు బోధ విని బాగుపడేందుకు కాదు, ఆయన బోధల్లో లోపాలెత్తి చూపించి, ఆయనకే ఎదురు బోధ చేసేందుకు వాళ్లంతా అంత ప్రయాసపడి రావడం ఆశ్చర్యకరం!! యేసును చూసి, ఆయన బోధ వినే భాగ్యాన్ని పొందిన ఎంతోమంది నిరక్షరాస్యులు, అజ్ఞానులు తమ జీవితాన్ని ధన్యం చేసుకొంటుండగా, మహా మేధావులుగా ముద్రపడినవారు ఆ భాగ్యాన్ని చేజార్చుకొని, యేసుతో వాతలు వేయించుకొని భ్రష్టులుగానే తిరుగుముఖం పట్టిన పరిసయ్యులనేమనాలి?
కొందరంతే!! బోధ చేయడానికి, ఖండించడానికి, గద్దించడానికి ఇతరులకు బుద్ధి చెప్పడానికే తాము పుట్టామన్న దుర్భావనలో ఉంటారు .
వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.2 తిమోతికి 4:2
కాని దానికి ముందుగా తమలోని అజ్ఞానపు అంధకారాన్ని గుర్తించి సరిచేసుకోలేని గురివింద గింజలు వాళ్లు.
అలా పప్పులో కాలేసి చివరికి నరకంలో చేరే మాట అటుంచితే, లోపాలెత్తి చూపడం, విమర్శించడమే వ్యాపారంగా మారి విజ్ఞత లోపించిన తొందరపాటు నిర్ణయాలతో ఈ లోకంలోనే తమ జీవితాన్ని అశాంతితో నరకప్రాయం చేసుకుంటారు వాళ్లు. ఎంత ఉన్నా ఇంకేదో పొందలేకపోతున్నామన్న అభద్రతా, అసంతృప్తి భావన పరోక్షంగా వారి మాటలు, చేతల్లో ధ్వనిస్తూంటుంది. దేవుని బోధలు వినేందుకు ఈనాడు వందల మైళ్లు ప్రయాణించే అవసరం లేదు.
దేవుని మాటలు, బోధల సంగ్రహ సారాంశంగా బైబిలు గ్రంథం విశ్వాసులందరికీ అందుబాటులో ఉంది. బైబిలు గ్రంథం జీవితాన్ని సరైన బాటలో నడిపించే కాగడాలాంటిది. అయితే దాన్ని ^è దివినపుడు మాత్రమే అలా వెలిగే కాగడా అవుతుంది. చదవని బైబిలు గ్రంథం, వెలగని కాగడావంటిదే!
దైవ భయంతో, వినమ్రతతో, అత్యంత విధేయతతో చదివితే అది జీవితాన్ని కుటుంబాన్ని కూడా ఆనందమయం చేస్తుంది. విమర్శించడానికో, లోపాలు చూడడానికో మిడిమిడి జ్ఞానపు మేధావిలాగా చదివితే మాత్రం జీవితంలో మిగిలేది అంధకారమే, అశాంతే, భ్రష్టత్వమే.
కాని మానవుడు హృదయం చేసిన పాపం వల్ల దేవునికి దూరమైనాడు. ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో యిర్మియ 17-9లో ఇలా రాయబడి ఉన్నది.
హృదయము అన్నింటి కంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పటికీ మానవుడు హృదయంలో ఉద్భవించే పాపాన్ని బట్టి చెడిపోతున్నాడు. ఎట్లనగా, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, లోభములు, చెడుతనము, కామ వికారాలు, చెడ్డ కళ్లు, దైవ దూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నియూ లోపలి (హృదయం) నుండే బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుచునని ఆయన (యేసుక్రీస్తు) చెప్పెను. చెడు అనే పాపపు హృదయం తొలగించడానికి నీవు ఇష్టపడిన యెడల ప్రకటన గ్రంథం 3-20 వచనంలో హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చెదని అని దేవుని వాక్యం చెప్పబడియున్నది. కాబట్టి మన చెడుతనం, వ్యాధులు, బలహీనతల నుండి విడిపించి, మనల్ని కొత్త వ్యక్తిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.
యెహెజ్కేలు గ్రంథంలో 36-26 వచనంలో నూతన హృదయము నీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగ చేసెదను అని చెప్పుచున్నాడు. కావున గురివింద లాంటి మనసు వుంటే సరిచేసుకొని ప్రభువుకు మిమ్మల్ని సమర్పించుకోండి.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
Comments