24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది..

 24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది..

సిరియా శత్రుసైన్యం షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసింది. ద్వారం మూసుకొని పట్టణం లోపల ఉన్న ఇశ్రాయేలీయులకు ఆహారం, నీరు తదితర అత్యవసర సరుకులు అందకుండా చేశారు. సిరియా సైనికులు పట్టణం లోపల కొంత కాలానికి ఆహారం నిండుకుంది. తర్వాత పక్షులు, గాడిదలూ చంపుకొని తిన్నారు. పిదప తల్లితండ్రులు తమ పిల్లల్నే చంపుకొని తినేంత దౌర్భాగ్యకరమైన దుర్భర క్షామం పట్టణంలో నెలకొంది. ఈ క్రీడంతా దేవుడే చేశాడు. ఇక ఆయన్ను నేనెందుకు ప్రార్ధించాలంటూ ఎదురు తిరిగారు షోమ్రోను రాజు (2 రాజులు 6:33). దేవుడు ఇంత భయంకరమైన క్షామాన్ని 24 గంటల్లో తొలగించి రేపు ఈ వేళకు సమృద్ధి ఆహారాన్నిస్తాడని ఎలీషా ప్రవక్త చెప్పాడు. పట్టణం లోపల కరవు రూపంలో, వెలుపల శత్రువుల రూపంలో మృత్యువు సంచారం చేస్తూంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి ఆహారమిస్తాడా? అని ఎకసెక్కాలాడాడు ఒక అధికారి.

ప్రవక్త మాటల్ని ఎవరూ నమ్మలేనంత నిరాకారమైన క్షామం అది. అయితే ఎవరు నమ్మినా నమ్మకున్నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చి తీరుతాడు. షోమ్రోనును చుట్టుముట్టిన సిరియా సైన్యంలో దేవుడు గందరగోళం సృష్టించాడు. ఇశ్రాయేలీయులు పెద్ద ఎత్తున దాడికి రానున్నారన్న భ్రమ కల్పిస్తూ గుర్రాలు, రథాల ఉరుకులు, పరుగుల ధ్వని వారికి వినిపించడంతో శత్రువులు తమ గుడారాల్లో రెండేళ్ల కోసం దాచుకున్న ఆహార సరుకుల్ని పడవేసి ప్రాణాలు దక్కించుకోవడానికి రాత్రికి రాత్రి పారిపోయారు. పట్టణం చుట్టూ శత్రువులు లేరు కాని వారు వదిలివెళ్లిన ఆహారం విస్తారంగా పడి ఉంది. దేవుణ్ణి నమ్మక, అది తెలియక పట్టణం లోపల ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. తన మాటల్ని రాజులు, అధికారులు, ప్రముఖులు నమ్మకపోతే దేవుడు కుష్ఠురోగులనైనా వాడుకుంటాడు. పట్టణం లోపలికి ప్రవేశార్హత లేని కుష్ఠు రోగులు నలుగురు ఆకలికి తాళలేక శత్రువుల వద్దనైనా ఆహారం దొరుకుతుందేమోనన్న ఆశతో సిరియన్ల శిబిరానికి వెళ్ళారు. అక్కడ శత్రువులెవరూ లేకపోగా వాళ్లు వదిలి వెళ్లిన ఆహారం కనిపించింది. కరువుతీరా తిన్నారు. అయితే అంత ఆహారాన్ని తామే తినాలనుకోవడం అన్యాయమనుకున్నారు.

ఆహారం సమృద్ధిగా పడి ఉందన్న ‘సువార్త’ను ఆ నలుగురు కుష్ఠురోగులూ పరుగెత్తుకెళ్లి పట్టణంలో ప్రకటించగా వాళ్లంతా వచ్చి తినగలిగినంతా తిని ఇళ్లకు సమృద్ధిగా ఆహారాన్ని తీసుకెళ్లారు. దేవుడు చెప్పినట్టే 24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది. అయితే రాజులు అధిపతులు అవిశ్వాసులు కాగా, దేవుడు అంటరానివారు, పరమ వికారమైన వ్యక్తులైన కుష్ఠురోగులను వాడుకున్నాడు. అందాన్ని వ్యక్తుల ముఖారవిందాల్లో వెదుకుతుంది లోకం. కాని పదిమందికీ సాయం చేయడానికి ఉరుకులు పరుగులెత్తే పాదాలల్లోనే నిజమైన అందం ఉందంటాడు దేవుడు. ‘నాకు నా కుటుంబానికే అంతా కావాలనుకునేవాడు చూసేందుకు పైకి ఎంత అందగాడైనా పరమ వికారి అంటాడు దేవుడు. పక్కవాడికి, పదిమందికి లాభం కలగాలని పాకులాడేవాడు పరమ వికారంగా ఉన్నా, అతడు కుష్ఠురోగిౖయెనా అతనే నా దృష్టిలో అందగాడంటాడు దేవుడు. సమాధాన సువార్తను ప్రకటించేవారి పాదాలు ఎంతో సుందరమైనవని బైబిలు అందుకే చెబుతోంది (రోమా 10:14–15).

కావున పదిమందికి మంచి జరిగేపని చేద్దాం. స్వార్థం, అసూయ వదిలివేసి మంచి నిర్ణయాలు తీసుకొని ఆశీర్వాదములు పొందుదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనలకు అనుగ్రహించును గాక. ఆమెన్.


Comments