✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మనల్ని దేవునికి దగ్గరగా నడిపించేవి సమస్యలే..
ప్రతీ సమస్య వెనుక దేవునికి ఒక ఉద్దేశ్యమున్నది. మన గుణశీలతను మెరుగుపరచడానికి ఆయన పరిస్థితులను వాడుకుంటారు.
లోకములో సమస్యలు వుంటాయని యేసు మనలను హెచ్చరించారు.
యోహాను 16: 33
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
బాధకు, శ్రమకు ఎవ్వరూ అతీతులు కారు. సమస్యలేని జీవితము లేదు. జీవితము సమస్యల వలయమైయున్నది. ప్రతీసారి ఒక సమస్య పరిష్కరింపబడగానే, మరొకటి సిద్ధంగా ఉంటుంది. వాటిలో అన్నీ పెద్దవికావు. కానీ నీ ఎదుగుదల విధానములో దేవుని దృష్టిలో ఒక పాఠము, అర్ధము కలిగినవే.
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. (1 పేతురు 4:12)
తనకు సన్నిహితముగా నిన్ను ఆకర్షించుటకు దేవుడు సమస్యలను ఉపయోగిస్తాడు.
విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. (కీర్తనలు 34:18)
నీ చీకటి రోజుల్లోనే నీ ఆరాధన యొక్క లోతైన, సన్నిహితమైన అనుభవాలుంటాయి.
👉నీ హృదయం పగిలినప్పుడు.
👉 నీ బాధలు అధికమైనప్పుడు. ఒంటరిగా దేవునివైపు తిరుగుతావు. శ్రమపడు సమయంలోనే మనము ప్రార్ధించుట నేర్చుకుంటాము. మనము బాధలో వున్నప్పుడు పై పై పూత ప్రార్థనలకు మన బలము చాలదు. శ్రమలలోనే ప్రామాణికమైన, హృదయవేదన, నమ్మకమైన ప్రార్ధనలు నేర్చుకుంటాము.
👉 చెరసాలలో పడకుండా యోసేపును,
👉 సింహముల బోనులో పడకుండా దానియేలును,
👉 బురద గుంటలో పడకుండా యిర్మియాను,
👉 మూడుసార్లు ఓడ ప్రమాదంలో పడకుండా పౌలును,
👉 అగ్ని గుండములో పడకుండా హెబ్రీ యువకులైన షద్రకు, మెషెకు, అబేద్నగోలను,..
దేవుడు తప్పించవచ్చు. కానీ ఆయన తప్పించలేదు. ఆ సమస్యలకు దేవుడే సెలవిచ్చారు. ఫలితంగా వీరందరూ దేవునికి సన్నిహితంగా వచ్చారు. దేవునివైపుకు చూచుటకు సమస్యలు బలముగా పనిచేస్తాయి, మనమీద కాకుండా దేవునిమీద ఆధారపడేటట్లు చేస్తాయి. పౌలుగారి మాటలను గమనించగలిగితే, మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. (2 కొరింథీ 1:9,10)
కారణమేదైనా దేవుడు నీ జీవితంలోనికి అనుమతించే శ్రమ ఏదైనా, అది నీ మేలు కొరకే ఉద్దేశించబడింది. నీ జీవితంలోని ప్రతీ దినము నీవు పుట్టకముందే దేవుడు గ్రంథస్థం చేశారు. నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను ( కీర్తనలు 139:16) అందుచే, శ్రమలు వచ్చినప్పుడు ప్రభువుకు మరింత సన్నిహితంగా వెళ్ళు. శ్రమలలో నీ విశ్వాస్యతను, శోధనలలో నీ పరిశుద్ధతను కాపాడుకో! ప్రభువు అనుగ్రహించబోయే నిత్యమైన ఆశీర్వాదములు అనుభవించు! ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
Comments