మిక్కిలి జ్ఞానము కలిగిన నాలుగు చిన్న జీవులు.

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మిక్కిలి జ్ఞానము కలిగిన నాలుగు చిన్న జీవులు.

👉 _సామెతలు 30:24-28_

*1.చీమలు..*  దూరదృష్టి

బలము లేని జీవులు అవి ఆహారము సంపాదించుకొనుటకు సరియైన సమయం ముందుగా ఎంచుకొనును.
సామెతలు 6: 6-8.

సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను
అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.

ముందుచూపు అనేది తెలివైన లక్షణము. 

యేసు ప్రభువు గోపురము కట్టగోరిన వ్యక్తి, యుద్ధమునకు పోవు రాజు ముందుగా ఆలోచించుకొనుటను గూర్చి చెప్పెను.(లూకా 14:28-32) అన్యాయస్తుడైన గృహనిర్వాహకుడు ఉపమానము కూడా ఇదే సూత్రం నేర్పించును.(లూకా 16:1-8)

పేతురు తన రెండవ పత్రికలో దేవుని వాగ్దానాలు నమ్మి ఆత్మీయజీవితమునకు కావలసిన వాటిని అమర్చుకొనలేనివారు దూరదృష్టి లేనివారని వ్రాసెను. (2పేతురు 1:9)

*2.చిన్న కుందేళ్లు...* భద్రత.

సామెతలు 30: 26
చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.
కీర్తనలు 104: 18

గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
బండ అనేది పునాది మీద కట్టిన ఇల్లు ఉపమానము గుర్తు చేయును.(మత్తయి 7:24) పేతురు ఒప్పుకొనిన బండ -క్రీస్తు దేవుని కుమారుడు. (మత్తయి 16:18)

మనము ఎక్కడ నివసింపగోరుచున్నామో దానిని బట్టి మన జ్ఞానము వెళ్లడి అవుతుంది.
భద్రత అనేది మనందరి అవసరత. స్థిరనివాసము ఎక్కడ అనేది కూడా జ్ఞానవంతులే ఎంపిక చేసుకొంటారు.
కీర్తనలు 91: 1
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
యోహాను 14: 2
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
మనం మన నివాసం కల్పించుకోవాలి. ఆత్మీయజీవితమునకు అనువైన మంచి క్షేమకరమైన వాతావరణం క్రీస్తు సంఘమే.

*3.మిడతలు...* ఐక్యత

సామెతలు 30: 27
మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.

మిడతలు గుంపులు గుంపులుగా తిరుగుచుండునవి. 

కీర్తనలు 133: 1
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!

అపో.కార్యములు 4: 32
విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.
1కోరింథీయులకు 1: 10
సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

యేసు ప్రభువు  వాక్యము వలన అందరూ ఏకము కావలెనని ప్రార్థన చేసెను.(యోహాను17:21-22)

*4.బల్లి... ,సాలె పురుగు..* నిపుణత.

సామెతలు 30: 28
బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.

సామెతలు 30:28 లో రాజగృహములలో ఉండినట్లు చెప్పబడినది. కొందరు అది సాలెపురుగు అని తలంచుచున్నారు. ఏమైనను ఈ రెండు ఎలాంటి వైనను అవి ఉన్నతమైన స్థానములలో కనబడుతున్నాయి. సాలెపురుగు పట్టుదల చూచి నిరాశ చెందిన రాజు తన ప్రయత్నం మరలా చేసినట్లు మనం విన్నాము.

రాజుల గృహంలోనికి ఎందరో జ్ఞానులు తేబడినారు,చేరినారు, యేసేపు,దానియేలు, తూర్పు దేశపు జ్ఞానులు, పౌలు రాజుల ఎదుట నిలచి దేవుని జ్ఞానమును వెళ్లడి చేసారు.

సామెతలు 22: 29
తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదు టనే నిలుచును.

దానియేలు 12: 3
బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.

బైబిలు దేవుని జ్ఞానము. ఈ జ్ఞానమును పొందినవారు ఉన్నతమైన స్థితిలో ఉంటారని మనం నేర్చుకొంటున్నాము.
ప్రకటన గ్రంథం 3: 12
జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. 

మరి ఈ సందేశం ధ్యానం చేయుచున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఎలా వున్నారు..అల్పమైన ఆ చిన్న జీవులే అంత జ్ఞానంతో, ఆత్మీయంగా వుంటే మనం ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యము ప్రకారం జీవించాలో ఆలోచించండి.. మీ విశ్వాసం కాపాడుకోండి..అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక..ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments