✝️ CHRIST TEMPLE-PRODDATUR
నమ్మకమైన వానికి దీవెనలు మెండు..
నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20
నా ప్రియమైనవారలారా, ఈలోకములో జీవించుచున్న మనలను దేవుడు నమ్మకమైన వారినిగా చేయాలని కోరుచున్నాడు. ఎప్పుడైతే, మనము ఆలాంటి నమ్మకమైనవారముగా ఉంటున్నామో అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదము మన మీదికి దిగివస్తుంది. ఈ సందేశము ధ్యానిస్తున్న మీ జీవితములో నేడు దీవెనలు లేవని చింతించుచున్నారా ? కలవరపడకండి, మన దేవుడు నమ్మకస్థుడు. కాబట్టి, మీరు కూడ ఆయన యందు నమ్మకము కలిగి జీవించాలని ఆయన మీ పట్ల వాంఛించుచున్నాడు. అందుకే " నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును '' (సామెతలు 28:20) అని బైబిల్ చెప్పిన విధంగా మీరు ఎప్పుడైతే దేవుని యందు నమ్మకము కలిగియుందురో, అప్పుడు దేవుని దీవెనలు మీ జీవితములో మెండుగా కుమ్మరించబడతాయి. మెండైన దీవెనలు ఏలాగున కలుగుతాయనగా, మనము దేవుని యందు అన్ని విషయములలోను నమ్మకమైన వారలముగా జీవించాలి. అప్పుడు దేవుడు మనలను మెండైన దీవెనలతో నింపుతాడు. నమ్మకమైనవాడు మెండైన దీవెనలు పొందవలయునని దేవుని ఉద్దేశము. మన శక్తిమంతుడైన దేవుడు మన వ్యక్తిగత జీవితంలో మరియు మన కుటుంబ జీవితంలో నివసిస్తూ మనలను కాపాడుతూ బహు ఆనందముతో మనయందు సంతోషిస్తుంటాడు. దేవుని యందు నమ్మకము కలిగి జీవించాలని బైబిల్ చెప్పిన విధంగా, మన కష్టాలు, సమస్యలు ఎటువంటివాటిలో అయినా దేవుని యందు నమ్మకముతో నడిచినట్లయితే, దేవుని యొక్క గొప్ప శక్తి మీ సమస్యలను, కష్టాలను తొలగించి మీకు మెండైన దీవెనలను కుమ్మరిస్తుంది.
ఆవిధంగానే, బైబిల్లో నమ్మకత్వానికి తండ్రియైన అబ్రాహామును చూచినట్లయితే, అతడు ఎంతో నమ్మదగినవాడైయున్నాడు. అబ్రాహామును గూర్చి బైబిల్లో ఇలా వ్రాయబడియున్నది, " దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సుగలవాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే '' (నెహెమ్యా 9:7,8) అను వచనములలో అబ్రాహాము ఎంతో నమ్మకమైన వ్యక్తిగా మనకు కనిపించుచున్నాడు. కావుననే, దేవుడు అతని నమ్మకత్వాన్ని చూచి అతనిని విస్తారముగా ఆశీర్వదించియున్నాడు.
అవును నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు అబ్రాహాము వలె మనలను కూడ ఆలాంటి నమ్మకమైన వ్యక్తులనుగా దేవుడు చేయాలని కోరుచున్నాడు. ఈనాటి నుండి మనము ఆలాంటి నమ్మదగిన వ్యక్తులముగా వుండుట ద్వారా దేవుడు మనలను ఆశీర్వదించబోవుచున్నాడు. అబ్రాహామును ఆశీర్వదించినట్లుగానే, అబ్రాహాము విషయములో దేవుడిచ్చినటువంటి, ఆశీర్వాదములన్నిటిని గూర్చి, మనము ఆలోచన చేస్తే.. " యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పెను '' (ఆదికాండము 12:1-3) వ వచనములలో మనము ఈ విషయాలను చదువుతాము. ఈనాడే అట్టి ఆశీర్వాదాలను మనము కోరుకుందాము. తద్వారా ఆ ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి.
నా ప్రియ స్నేహితులారా, అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు నమ్మకమైన వ్యక్తుల కొరకు ఎదురుచూస్తున్నాడు. నమ్మకమైన వ్యక్తులు ఎవరైన వున్నారా? అని ఎంతో ఆశతో ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. ఎప్పుడైతే, ఒక వ్యక్తి నమ్మకముగా వుంటాడో, వాని హృదయములోనికి దేవుడు వస్తున్నాడు. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడని " మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును'' (1 సమూయేలు 16:7; సామెతలు 21:2) వ వచనములు కూడ ఈ మాటలనే చెబుతున్నాయి. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నా డు. ఎప్పుడైతే, మన హృదయము నమ్మదగినదిగా వుంటున్నదో అప్పుడు ఆయన అట్టి నమ్మకమైన హృదయములోనికి వస్తాడు. నేడు ఆయన తన యొక్క ఆశీర్వాదాలను మన మీద వుంచబోతున్నాడు.
ఒక దేశములో ఒక యువరాజు వున్నాడు. ఆ యువరాజు జైలులో వున్న ఖైదీలను చూడడానికి ఒకరోజు వెళ్లాడు. ఎప్పుడైతే, ఆ యువరాజు ఆ జైలుకు వెళ్లియున్నాడో, ఆ ఖైదీలను గూర్చిన వివరాలన్నిటిని ఒకరి తరువాత ఒకరిని అడుగుతూ వచ్చాడు. అప్పుడు ఆ ఖైదీలందరు ఏమి చెప్పారో తెలుసా? ప్రతి ఒక్కరు, ' అయ్యా, నేను ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, నన్ను తీసుకొని వచ్చి, ఇక్కడ పడవేశారు అని చెప్పేవారు.' ఇలాగున ఆ ఖైదీలుగా వున్న ప్రతి ఒక్కరు ఏమన్నారంటే, నేను అమాయకుడను, నేను ఏ నేరము చేయలేదు, నేను అనవసరముగా ఖైదీగా బంధింపబడ్డాను అని చెప్పారు. ఎవ్వరు కూడ వారు చేసిన తప్పిదమును మరియు నేరమును ఒప్పుకున్నవారు కాదు.
అయితే, వారందరిని చూస్తూ, వారి మధ్యలో నడుస్తున్నప్పుడు, వారిలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా చూశాడు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి, అతని యొద్ద కూడ ఇదే ప్రశ్న అడిగాడు. నీవు ఏ నేరం చేసి ఇక్కడకు వచ్చావు? అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి యువరాజుతో ఇలా అన్నాడు, ' యువరాజా! నేను ఒక తప్పు చేశాను, నేను ఒక వ్యక్తిని చంపేశాను, నరహత్య చేశాను, నేను ఎవరినైతే, చంపానో, ఆ యింటి వారిని గూర్చి నేను చాలా విచారిస్తున్నాను. అతని యొక్క భార్య విషయములో నేను చాలా దుఃఖిస్తున్నాను. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఆమె యొక్క భర్త చనిపోయాడు గనుక, ఆమె గతి ఏమిటి? ఆ దినము నేను కోపముతో అతనిని చంపేశాను. కానీ, ఈదినాన నేను అతని నిమిత్తము పశ్చాత్తాప పడుచున్నాను. యువరాజా, నేను ఏ వ్యక్తినైతే చంపానో ఆ వ్యక్తి కుటుంబాన్ని మీరు పరామర్శించండి. దయచేసి ఆ కుటుంబమును మీరే పోషించాలి అని చెప్పాడు.' ఆ ఖైదీ " నన్ను బయటకు తీసుకురమ్మని'' చెప్పలేదు, ఏ కుటుంబానికి గాయము చేశాడో ఆ కుటుంబాన్ని మీరు పోషించాలని చెప్పాడు. అప్పుడు ఆ యువరాజుకు అతని మాటలకు చాలా ఆశ్చర్యమనిపించినది. అప్పుడు రాజు, ' స్నేహితుడా, నీవు నీ తప్పును అంగీకరించావు. అంతమాత్రమే కాదు, నీవు చేసిన నేరమును కూడ ఒప్పుకున్నావు, దానిని బట్టి, ఈ రోజు నిన్ను ఈ జైలునుండి విడుదల చేస్తున్నాను.నీవు నీ తప్పిదాన్ని ఒప్పుకున్నావు కనుకనే ఈ రోజు నుండి నీవు స్వతంత్రుడవు, నీవు ఖైదీవి కాదు, నేను నిన్ను క్షమిస్తున్నాను, అని చెప్పాడు. అంతమాత్రమే కాదు, నీవే వెళ్లి ఆ కుటుంబ పోషణ అంతయు చూడాలి దానికి కావలసిన ధనమునంతటిని నేను నీకిస్తాను అని చెప్పాడు. '
చూశారా నా ప్రియ స్నేహితులారా, " మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును '' (1యోహాను 1:9; అపొస్తలుల కార్యము 10:35), ఈ వచనములను మనము చదివినట్లయితే, మనము దేవుని యొద్దకు వెళ్లినప్పుడు, మన తప్పిదములను మనము ఒప్పుకున్నప్పుడు, పై చెప్పబడిన ఆ యొక్క ఖైదీ తన పాపాన్ని ఎలా ఒప్పుకున్నాడో, ఆలాగుననే, మీరు కూడ మీ దేవునితో " ప్రభువా, నేను ఒక పొరపాటు చేశాను, నేను పాపము చేశాను ప్రభువా, నా సహోదరునికి లేక నా తల్లిదండ్రులకు లేక నా యొక్క బిడ్డలకు విరోధముగా నేను పాపమ చేశాను, దయచేసి ప్రభువా, ఈ రోజు నన్ను క్షమించు,'' అని చెప్పండి. ఖచ్చితముగా ఆ ప్రభువు మనలను క్షమిస్తాడు. ఆయన కనికరము గలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని నమ్మదగిన వ్యక్తులనుగా చేస్తున్నాడు, కాబట్టి, ఈదినమున మనము ఏ తప్పిదమైనను, పొరపాటుయైనను, చేసినట్లయితే, అది ఆ ప్రభువు దగ్గర ఒప్పుకుందాము. ఎప్పుడైతే, మనము ఆలాగుననే ఒప్పుకుంటామో ఆయన మన యొక్క హృదయాన్ని నమ్మకమైన హృదయాన్నిగా మార్చును. అప్పుడు అబ్రాహాము వలె దేవుని యొక్క ఆశీర్వాదములను సంపాదించుకొనగలము.
ఈ ఉదయకాల సమయములో నా ప్రియులారా, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, మనము పొరపాటులన్నిటిని ఒప్పుకొని, నమ్మకమైన బిడ్డలుగా జీవించవలెను. ఈ ఆశీర్వాదాలను పొందుకొనుటకు ఇదొక్కటే మార్గముగా వున్నది. ఈరోజు మనము ఆలాగున మన పాపములను ఒప్పుకున్నట్లయితే, దేవుడు మనలను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మనలందరిని కూడ నమ్మకమైన వ్యక్తులనుగా చేస్తున్నాడు. ఈ సందేశం ధ్యానం చేయుచున్న మీరు కూడా మీ పనులన్నింటిలో, మీ జీవితములోను నమ్మకస్థులై వుంటే ఏ ఒక్కరూ మీపై తప్పుడు ఆరోపణ చేయలేరు. మీరు నిత్యము దేవునికి నమ్మకస్థులుగా జీవించాలని దేవుని చిత్తమై యున్నది. ఎప్పుడైతే మీరు దేవుని యందు నమ్మకముగా వుంటారో అప్పుడు తప్పక కృపాక్షేమాలు మీకు కలుగుతాయి. మీరు చిరకాలము దేవుని మందిరములో నివాసము చేయుచు ఆయన మీలో నివసించి మీ కార్యాలన్నిటిని సఫలపరచి మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments