✝️ CHRIST TEMPLE-PRODDATUR
కీర్తనలు పాడుడి..విజయం నీదే..
కీర్తనలు పాడడం అనేది మన మనసును ఆహ్లాదపరిస్తూ మన మెదడును ప్రశాంతంగా మార్చుతుంది. మనం కీర్తనలు పాడినప్పుడు అది చింత, ఒత్తిడి నుండి ఉపశమనం కలుగజేస్తుంది. అదే కొంతమంది కలిసి పాటలు పాడినప్పుడు, వారి గుండె చప్పుళ్ళు ఒకరినోకరికి ఏకీభవిస్తాయని కొందరి పరిశోధకుల అభిప్రాయం.
అపోస్థలుడు పౌలు అంటాడు “ఒకని నొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువు గూర్చి పాడుచు కీర్తించమని ప్రోత్సాహిస్తున్నాడు (ఎఫెసీ 5:19). పరిశుద్ద గ్రంథంలోని అనేక సందర్భాల్లో కూడా దేవుని స్తుతించమనే చెబుతుంది. “దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.” కీర్తన 47:6.
శత్రువులు యూదా జనాంగంవైపు వస్తున్నప్పుడు, భయపడిపోయిన రాజైన యెహోషాపాతు అందరినీ యెహోవా సన్నిధిని సమకూర్చాడు. సమాజాన్నంతటిని తీవ్రమైన ప్రార్ధనలో నడిపించాడు. వారు తినక త్రాగాక కేవలం ప్రార్ధన మాత్రమే చేశారు. “ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మా దిక్కు” అని ప్రార్ధన చేశారు. మరుసటి దినము యుద్ధరంగంలోనికి నడిచి శత్రువుల మీదికి వెళ్ళారు. అక్కడ వారిని నడిపించింది గాయక బృందమేగాని శూరులు వీరులు కాదు. “ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు” అన్న దేవుని వాగ్దానాన్ని వారు విశ్వసించారు. వారు యుధభూమి వైపు పాడుతూ, నడుచుకుంటూ వెళ్ళగా వారి శత్రువులు తమలో ఒకరినొకరు చంపుకోనుటకు మొదలుపెట్టారు. దేవుని ప్రజలు ఆ యుద్ధభూమికి చేరే సరికి యుద్ధం ముగిసిపోయింది. వారు పాడుకుంటూ తెలియని దిశగా విశ్వాసంతో నడుచుకుంటూ వెళ్ళగా దేవుడు తన ప్రజలను రక్షించాడు. (2 దిన 20వ అధ్యా)
యుక్తమైన కారణాలను బట్టి ఆయనను స్తుతించమని దేవుడు ప్రోత్సాహిస్తున్నాడు. యుద్ధభూమిలోనికి మనం వెళ్ళినా, వెళ్లకపోయినా, మన ఆలోచనలను, హృదయాలను, జీవితాలను మార్చివేసి; ఎటువంటి సమస్యనైనా అధిగమించగల శక్తి దేవునిని స్తుతించడంలో ఉంటుంది. దేవునితో అనుసంధానమైన హృదయాలు ఆయన స్తుతులను ఆలపిస్తాయి. ఇక మన నోరు తెరచి దేవుని స్తుతించడానికి ఆలస్యం ఎందుకు? ఈ రోజే ఆనందంగా దేవుని కీర్తనలు పాడుతూ..జీవితాన్ని సాగిద్దామా ? హల్లెలూయ!! దేవుడు మిమ్ములను దీవించును గాక..ఆమెన్
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments