✝️ CHRIST TEMPLE-PRODDATUR
- పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు
...అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. - రోమీయులకు 8:26
నా ప్రియమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ నూతన మాసమైన జనవరి నెలలో వున్నారు ఒక నెల గడచి త్వరలో ఫిబ్రవరి నెలలో ప్రవేశిస్తాము. మీ బలహీనతలలో దేవుడు మీకు సహాయపడాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే, బైబిల్‌లో ‘‘...అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ’’ అని రోమీయులకు 8:26 ప్రకారం ప్రభువు మీకు వాగ్దానం చేయుచున్నాడు.
నేడు మీ జీవితంలో ఏదో ఒక సమయంలో మీరు దీనిని అనుభవించి ఉండవచ్చని నేను నిశ్చయంగా తలంచుచున్నాను.
మనం ఏదో ఒక పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు, మనం ఏమి చేయాలో మరియు దానిని ఎలా అధిగమించాలో చెప్పుచున్న స్వరం మనలో పరిశుద్ధాత్మ ద్వారా కలిగి ఉంటాము.
ఈ రోజు ప్రభువు ఈ సందేశము చదువుచున్న మీకు ఇంతటి గొప్ప నిరీక్షణను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేనిని గురించి చింతించకండి. మీ కన్నీళ్లు దేవుడు చూసాడు.
అవును, నా ప్రియులారా, ప్రభువు ఎల్లప్పుడు మీతో ఉంటానని సెలవిచ్చుచున్నాడు; ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీ బలహీనతలో మీకు సహాయం చేస్తాడు. ఈరోజు, మీరు పరీక్షకు లేదా ఇంటర్వ్యూకు హాజరవుతున్నట్లయితే, లేదా ఎక్కడైనా అప్పు కట్టాల్సిన పరిస్థితి వుంటే, తినడానికి కుటుంబ పోషణ కష్టంగా వున్నట్లయితే.. ప్రభువు తన పరిశుద్ధాత్మను మీకు బోధించి నడిపిస్తాడని వాగ్దానం చేయుచున్నాడు.
మనం బయటకు రాలేమని, తల ఎత్తుకొని తిరగలేని గుండె బాధలో వున్న స్థితి భావించే ప్రతి క్లిష్టమైన పరిస్థితుల నుండి బయటికి రావడానికి కూడా ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేయును గాక.
మీరు చిక్కుకొనిపోయి ఉన్నామని తలంచే కొన్ని పాపాలలో, కొన్ని అప్పుల్లో, కుటుంబ సమస్యలలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆ చిక్కుల నుండి బయటకు రావడానికి ఆయన మీకు శక్తిని దయచేస్తాడు. యేసయ్య ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు, శిష్యులు ఎలా భావించారో ఊహించండి. ఆయన లేకుండా వారు సమస్తమును కోల్పోయినట్లు భావించియుండవచ్చును. కానీ, ఆ దినములలో ప్రతిక్షణము యేసు తమతో కూడ ఉన్నాడని గుర్తించినను వారు, ఇప్పుడు ఆయన వారితో కూడ లేనందున, వారిని విడిచిపెట్టి వెళ్లినందున వారు చింతించి ఉండి ఉండవచ్చును. కానీ, ఆయన వారి యొద్ద నుండి వారిని విడిచి, వెళ్లిపోయినప్పటి నుండి తరువాత ఏమి చేయాలో వారికి తెలియక వారు దుఃఖించి ఉండవచ్చును. అప్పుడే యేసు ప్రభువు తన పరిశుద్ధాత్మ అను ఆదరణ కర్తను వారి యొద్దకు పంపుతానని వారికి తెలియజేసెను. కాబట్టి, ధైర్యము తెచ్చుకొనుడి. ఇప్పుడే మీ కన్నీళ్లు తుడుచుకోండి. మీ అందరి కోసము వేకువ జాము మొదటి ఘడియలో కన్నీళ్ళతో ప్రార్థన చేసి ఈ సందేశం మీకు అందిస్తున్నాను.
అదేవిధంగా, నా ప్రియులారా, ప్రభువు శిష్యుల వలె, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయన బలాన్ని పొందేందుకు తన పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ప్రతి అడుగు ఎంతో సుళువుగా మారుతుంది. ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎవరితో మాట్లాడాలో మరియు ఎలా ప్రవర్తించాలో కూడా ఆయన మీకు నేర్పిస్తాడు. అవును, పరిశుద్ధాత్మ మీకు సమస్తమును నేర్పించి, నడిపిస్తాడు. బైబిల్‌లో చూచినట్లయితే,
కీర్తనలు 46:1లో మనం చదువుగలము, ‘‘ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు’’
అన్న వచనము ప్రకారం, నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ప్రభువు మీకు సహాయం చేయబోవుచున్నాడు. అంతమాత్రమే కాదు, మీ బలహీనతలో ఆయన ఆత్మ మీకు బలంగా మారుతుంది. నేడు ఎన్నో సమస్యల ద్వారా మీరు ప్రార్థించలేని స్థితిలో బలహీనంగా ఉన్నట్లయితే, చింతించకండి, ఆయన మీ బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు.
ఏలయనగా మీరు యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మీకు తెలియనప్పుడు, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో మీ కొరకు తానే విజ్ఞాపనము చేసి, మీ బలహీనతలో మీకు బలమును దయచేసి, మిమ్మును బలపరుస్తాడు. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments