✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మీ ప్రార్థన పరిమళ ధూపముగా..
...పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను... యెహెజ్కేలు 20:41
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునికి పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించుచున్నాడు. అందుకే నేడు బైబిల్ నుండి ఈ రోజు వాగ్దానంగా మనం
యెహెజ్కేలు 20:41వ వచనమును ధ్యానముగా తీసుకొనబడియున్నాము. ఆ వచనమేమనగా, " జనములలో నుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశములలో నుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనుల యెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును ''
అని చెప్పబడిన వాగ్దాన వచనాన్ని ధ్యానించబోవుచున్నాము. అవును నా స్నేహితులారా, ఆలాగుననే మీరు దేవునికి అటువంటి పరిమళ ధూపంగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు ప్రభువునందు ఎల్లప్పుడు ఆనందించండి.
అయితే దీని అర్థం ఏమిటి? బైబిల్‌లో, లూకా 18:9-14 వ వచనములలో చూచినట్లయితే, యేసు తన శిష్యులకు ఒక ఉపమానాన్ని తెలియజేశాడు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను.
అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశము వైపు కన్ను లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. దేవుడు ఎవరి ప్రార్థన విని యుంటాడని మీరు అనుకుంటున్నారు? నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు సుంకరిని కరుణించాడు మరియు ఆయన అతని ప్రార్థనను అంగీకరించి, అతనిని నీతిమంతునిగా తీర్చిదిద్దాడు.
అవును నా ప్రియులారా, మన జీవితాలలో కూడా పరిసయ్యుడు ప్రార్థించినట్లుగా, " ప్రభువా, నేను పరిశుద్ధుడను ! నేను నీతిమంతుడను ! నేను సమస్తమును చక్కగా నిర్వర్తించాను. నేను ఎంతో మందికి సహాయం చేస్తున్నాను మరియు సేవ చేస్తున్నాను '' అని చెప్పవచ్చును. అలాంటి ప్రార్థనలతో దేవుడు ఆనందించడు. ప్రజలు తమ స్వశక్తితో తమను తాము పవిత్రులమని చెప్పుకోవడం మరియు పిలుచుకోవడం ప్రభువుకు ప్రీతికరంగా ఉండదు. కాబట్టి, నా ప్రియ మిత్రులారా, మనం దేవుని యెదుట మనలను మనం తగ్గించుకున్నప్పుడు, మన పాపాలను గుర్తించి, ప్రభువు యొక్క క్షమాపణను మన పూర్ణ హృదయంతో అంగీకరించాలి. ఆలాగుననే ప్రార్థించాలి, ' ప్రభువా, దయచేసి నా పాపాలను క్షమించుము. మమ్మును పవిత్రంగాను, నీతిమంతులనుగాను మార్చగలిగేది నీవు మాత్రమే. ఇంకను ఎక్కువ మందికి సేవ చేయడానికి మరియు వారికి ఆశీర్వాదకరంగా ఉండటానికి మాకు సహాయం చేయుము '' అని ప్రార్థించినప్పుడు, ఈ వినయపూర్వకమైన ప్రార్థన దేవునికి ప్రీతిగాను, పరిమళ ధూపంగాను పైకి వెళ్లి చేరుతుంది. అప్పుడు ప్రభువు మన ప్రార్థనను, మన ఆరాధనను మరియు మన జీవితమంతా అంగీకరించడానికి ఆనందిస్తాడు. కాబట్టి ఈరోజు నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రార్థించే విధానాన్ని, మరియు మీ ప్రార్థనను దేవునికి ప్రీతికరంగా ఉండునట్లుగా మార్చుకోండి. తద్వారా మీరు దేవుని దృష్టిలో పరిమళమైన సువాసనగా ఉంటారు. మరియు ఆయన మిమ్మును ఆశీర్వదించి పైకి లేపుతాడు. అనగా ప్రతి పనిలోనూ నీకే పై స్థానము ఇస్తాడు. నీవు తలగా వుంటావు కానీ తోకగా వుండవు." తనను తాను తగ్గించుకొనేవాడు హెచ్చించబడతాడు '' మరియు ఆయన మీ కోసం ఆ గొప్పకార్యాన్ని జరిగిస్తానని కూడా ప్రభువైన యేసు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, ఉత్సాహంగా ఉండండి! ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితము సువాసన లేనిదిగా ఉన్నట్లయితే, సుంకరి వలె నేడు మిమ్మును మీరు తగ్గించుకుని, ప్రభువు పాదాల దగ్గర హృదయపూర్వకంగా సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు అనేకులకు ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను మీరు కనుపరచునట్లుగా, ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించి పరవశింపజేస్తాడు. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR
No comments:
Post a Comment