సమ్సోను జీవితం..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- సమ్సోను జీవితం..

 *న్యాయాధిపతుల గ్రంధంలో,13 వ అధ్యాయం నుండి 16 వ అధ్యాయం వరకు "సమ్సోను" చరిత్ర మనకు వివరించబడింది. ఆనాడు మోషే యెహోషువాల నాయకత్వం తర్వాత సుమారు 350 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల సారద్యంలో నడిపించబడ్డారు,ఆ కాలంలోనే సమ్సోను కూడ ఏడవ న్యాయాదిపతిగా సుమారు 20 సంవత్సరాల పాటు పిలిష్తీయుల అణచివేత నుండి యూదా జనాంగాన్ని కాపాడి ముందుకు నడిపించాడు.*

✨️ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులు కాగా దేవుడు వారిని 40 సంవత్సరాలపాటు పిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. *ఆ సమయంలోనే దాను వంశంలో సమ్సోను జన్మిస్తాడు.*

👉 *సమ్సోను అనే పదం హిబ్రు బాషకు చెందినది ఆ మాటకు అర్ధం {సూర్యుని వంటి వాడు} అని. ఇంకా ""రక్షకుడు"" ""కాపాడువాడు"" అని అర్దాలు కూడ వస్తాయి.!*

👉 సమ్సోను తండ్రి పేరు "మనోహ" సమ్సోను తల్లి పేరు బైబిల్ లో ప్రస్తావించకపోయినా ఆమె పేరు "జెలెల్పోనిస్" లేదా [జెల్పోనిస్] అని ప్రాచీన హిబ్రు గ్రంధాలు చెప్తున్నాయి.!

✨️ యెరూషలేమునకు పశ్చిమాన 23 కిలోమీటర్ల దూరంలో ఉండే "జోర్యా" అనే పట్టణంలో వీరు నివసించేవారు. *దేవుని దూత సెలవిచ్చిన ప్రకారం సమ్సోను పుట్టగానే అతను నాజీరు చేయబడినవాడై దేవుని సేవకు అంకితం చేస్తారు అతని తల్లిదండ్రులు..*

✨️ అతి బలవంతుడు బహుపరాక్రమవంతుడైన సమ్సోను పిలిష్తీయులను ఎదిరించి తన జనులకు రక్షణగా నిలబడతాడు. సమ్సోనుకు దేవుని దయ తోడుగా ఉండటం వలన వట్టి చేతులతో సింహాన్ని చంపివేస్తాడు.

✨️ మరో మారు *గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యి మంది పిలిష్తీయులను అవలీలగ చంపేస్తాడు.* మొదట సమ్సోను పిలిష్తీయుల కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత సమ్సోను "శోరేకు" లోయలో నివసించే {దెలీలా} అనే పిలిష్తీయురాలిని కూడ వివాహం చేసుకుంటాడు, అక్కడి నుండే సమ్సోను జీవితం పతనం కావడం ప్రారంభమయ్యింది అని మనం అనుకోవచ్చు.

✨️ *సమ్సోనును ఎలాగైనా చంపాలి అని భావించిన పిలిష్తీయులలో కొంతమంది పెద్దలు ఒకరోజు దెలీలాను సంప్రదిస్తారు. సమ్సోను అంత గొప్ప బలవంతునిగా జీవించడానికి,అతనిలో దాగి ఉన్న ఆ అద్భుతమైన శక్తికి గల కారణం ఏంటో తెలుసుకొని తమకు తెలియ జేస్తే గొప్ప బహుమనాన్ని వెండి నాణేల రూపంలో ఇస్తామని ఆమెకు ఆశ పెడతారు. అందుకు ఆమె కూడ సరే అని వారితో ఒప్పందం చేసుకుంటుంది.*

✨️ ఆ తర్వాత ఆమె ఎన్నో సార్లు సమ్సోనులో దాగి ఉన్న అంత గొప్ప బలానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నిస్తుంది ఆమె గోళ తట్టుకోలేక ఏడు నిరవంజి చువ్వలతో బందిస్తే తన బలం మొత్తం హరించుకపోయి సామాన్యుడిలా మారిపోతానని ఒకసారి.. అప్పుడే కొనిన క్రొత్త తాళ్లతో తనను బందించిన యెడల తన బలం మొత్తం సన్నగిల్లిపోతుందని మరొక సారి.. నీవు నా జడలను అల్లిక అల్లిన యెడల దాంతో నా పని ఐపోతుందని ఇంకోసారి ఇలా ప్రతి సారి ఏదో ఒకటి చెప్పడం, ఆమె ఆ విధంగా ప్రయత్నించడం అది ఫలించకపోవడం జరుగుతుండేవి.

✨️ దాంతో దెలీలా సమ్సోనుతో నీవు ప్రతి సారి నన్ను ఎగతాళి చేస్తూ నీలో దాగి ఉన్న ఆ గొప్ప బలము దేనిలో ఉన్నదో చెప్పకుండ నన్ను అవమానిస్తున్నావు నన్ను నమ్మకనే కదా ఇలా చేస్తున్నావు అని అతడ్ని తన సూటిపోటి మాటలతో ఎంతగానో వేదిస్తుంది. ప్రతి రోజు ఆమె ఇలా తన మాటలతో వేదిస్తున్నందు వలన ఇక చివరికి ఆమె వేధింపుల కంటే చావడమే మేలని భావించి అతనిలో దాగియున్న ఆ శక్తికి గల కారణం ఏమిటో ఆ రహస్యాన్ని దెలీలాకు చెప్పేస్తాడు. *నేను నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడనవాడినైయున్నాను నా తల మీదకి మంగళి కత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోవును అప్పుడు నేను అందరిలాగే ఏ ప్రత్యేకత లేకుండ మామూలు మనిషిలా మారిపోతాను అని ఆమెతో చెప్తాడు.*

✨️ ఆ తర్వాత దెలీలా సమ్సోనును తన తొడ మీద నిద్ర పుచ్చి ఒక మనుషుని పిలిపించి సమ్సోను తల మీద ఉన్న ఏడు జడల్ని క్షౌరము చేయిస్తుంది. ఎప్పుడైతే అతని తల మీద ఉన్న ఆ ఏడు జడల్ని క్షౌరము చేసారో ఆ వెంటనే అతనిలో దాగి ఉన్న ఆ బలము అతని నుండి తొలగిపోతుంది *అప్పుడు పిలిష్తీయులు నిరాయుదుడైన సమ్సోను మీద పడి అతడ్ని బందిస్తారు.* అతని రెండు కళ్ళను పెకలించి గ్రుడ్డి వానిగా చేసి గాజాకు తరలించుకపోయి చెరసాలలో బంధించి ఉంచుతారు..

✨️ చెరసాలలో బందీగా ఉన్న సమ్సోనుని అతడ్ని తమ దేవతయైన దాగోనుకు మహా బలిగా అర్పించాలని భావిస్తారు. ఆ తర్వాత పిలిష్తీయులందరు దాగోను గుడిలో సామావేషమయ్యి తమ వారినందరిని అవలీలగ చంపిన సమ్సోనుని అవమానించాలని భావించి, బందించిన సమ్సోనును దాగోను గుడికి తీసుకువస్తారు. ఇత్తడి సంకెళ్ళతో శక్తిహీనుడిగా,గ్రుడ్డివానిగా ఉన్న సమ్సోనును చూసి అక్కడ చేరిన వేలాది మంది స్త్రీ పురుషులు పరిహాసం చేస్తారు...ఎగతాళి చేస్తున్న ఆ పిలిష్తీయుల కేకలను వింటూ నిస్సాహయునిగా నిలిచిన సమ్సోను తన చేతిని పట్టుకొని అక్కడకు తీసుకవచ్చిన బంటుతో ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను నన్ను తడమనిచ్చి విడువుము నేను ఆ స్తంభాలను ఆసరాగ చేసుకొని వాటి మీద ఆనుకుంటాను అని అతనితో అనగా ఆ సైనికుడు సమ్సోనును గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరకు తీసుక వెళ్ళి అతడ్ని నిలబెడతాడు.

✨️ *అప్పుడు సమ్సోను యెహోవా..ప్రభువా..! దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము పిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకి మొర పెట్టి ప్రార్థిస్తాడు.* సమ్సోను చేసిన ప్రార్ధనను ఆలకించిన దేవుడు అతడ్ని తిరిగి శక్తిమంతునిగా చేయగా ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు స్తంబాలను పెకలించి వేస్తాడు. దాంతో గుడి నిట్ట నిలువున కూలిపోతుంది,గుడిలో చేరిన సుమారు మూడువేల మందికి పైగా స్త్రీ పురుషులందరు ఆ గుడిలో పడి చనిపోతారు.

✨️ అలా సమ్సోను తమ చిరకాల ప్రత్యర్దులైన పిలిష్తీయులను వేల సంఖ్యలో చంపి వారితో పాటు తాను ఆ శిదిలాలలోనే చనిపోతాడు. అలా ఇశ్రాయేలు ప్రజలకు తమ శత్రువుల పీడను తొలగించి,ప్రశాంతంగా జీవించేలా చేసాడు.

✨️ తన జీవితంలోని చివరి క్షణాలు సమ్సోను చేసిన ఆ యొక్క గొప్ప పరాక్రమం యొక్క ప్రభావం మరో ఇరవై ఏళ్ళ పాటు పిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల వైపు చూడటానికే భయపడినట్లుగా చరిత్ర చెప్తుంది

👉 *సమ్సోను గాధ మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది.* ఎంతో శక్తిమంతునిగా జన్మించిన సమ్సోను కేవలం "మోహం" అనే పాపం కారణంగా తనను తాను కోల్పోవలసి వచ్చింది.

👉 మనల్ని ఆకర్షించి పాతాళానికి త్రోసి వేసే పాపపు ఆలోచనలు మనల్ని అంధులుగా మారుస్తాయి. మనల్ని మన కుటుంబానికి,దేవునికి,దూరం చేసి చివరికి మనల్ని మనం కోల్పోయేలా చేస్తాయి.

👉 దేవుడు ఆఖరి క్షణంలో కూడ మనల్ని కాపాడతాడు అనే సత్యానికి రుజువు సమ్సోను జీవితమే. *ఆఖరి క్షణంలో అతను దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపంతో చేసిన ప్రార్ధనను దేవుడు ఆలకించాడు.*

👉 *మనము ఎంతటి పాపంలో ప్రయాణిస్తున్న తప్పులు ఎరిగి ఆయన వైపు తిరిగి చూడగలిగితే తప్పకుండ మన పాపాలను క్షమిస్తాడు.* అక్కున చేర్చుకుంటాడు. తిరిగి మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు.!

👉 అలాంటి పాపపు జీవితం జీవిస్తున్నావా ? ఇప్పుడే మొకరించు.. దేవుని వైపు చూద్దాం..! ప్రార్ధించుదాం..! తిరిగి దేవునిలో జీవించడం,ప్రారభించుదాం...! అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక..ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments