మీరు చాలా బిజీగా ఉన్నారా ?

✝️ CHRIST TEMPLE-PRODDATUR
మీరు చాలా బిజీగా ఉన్నారా ?

తినడం, పని చేయడం, వ్యాయామం చేయడం, నిద్రపోవడం, చదవడం, వినోదం, సంభాషణలు, సువార్త ప్రకటించడం, ప్రార్థించడం వంటి పనులకు, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు ఎలా నిర్ణయించుకుంటారు? అయితే, ఈ విషయాలకు మన దినచర్యలో ఎంత సమయం కేటాయించాలో మీ సమయ నిష్పత్తిని నిర్దేశించే నిర్దిష్ట నియమాలు బైబిల్‌లో లేవు.

నా ఇంటి ముందు వాకిట ఒక చక్కని మొక్క ఉంది, అది తాజాగా కనిపిస్తుంది. ప్రతిరోజు నేను దానికి నీళ్ళు పోస్తూ సమయం గడుపుతున్నాను. ఆ మొక్క పచ్చగా ఉండడం గమించాను. నేను కొన్ని పనుల్లో బిజీగా ఉన్న సందర్భాల్లో, సమయం గడపలేకపోయాను.
అనుకోకుండా వర్షాకాలం కావడంతో దానికి నీళ్ళు సమృద్దిగా దొరకడం ద్వారా నేను నీళ్ళు పోయకపోయినా ఆ మొక్క పచ్చగా కనిపించింది. సరేలే ఆ మొక్క బాగానే ఉందనుకొని కొన్ని వారాల తరువాత నా బిజీ షెడ్యూల్‌తో, నేను మొక్క గురించి పూర్తిగా మరచిపోయాను.
అనుకోకుండా ఒకరోజు నా ఇంటి వాకిట వున్న మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మొక్కకు ఒక ఎండిన కొమ్మను గమనించాను. అయ్యో నీళ్ళు పోయలేకపోయానే.. అనుకొన్నాను, నాలో కొంత బాధ కలిగింది. ఒక పాస్టర్ గా మీ జీవితం కొరకైన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ఈ ఉపమానాన్ని మన సంఘానికి వివరిస్తున్నాను.

ఫిలిప్పీయులకు 2: 21
అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.

ప్రియమైన మిత్రులారా, ప్రభువు కొరకు సమయాన్ని వెచ్చించడంలో మన జీవితాలకు ప్రాధాన్యతనివ్వాలి. మనలో మనం చాలా బిజీగా ఉండకూడదు, అలాగని ప్రాముఖ్యమైన విషయాలను అనగా ప్రార్థన, స్తుతి, ఆత్మీయమైన పనులు, సేవ, సువార్త, సంఘ కార్యక్రమాలు,  నిర్లక్ష్యం చేయకూడదు. నేటి నుండైనా  ప్రార్థన మరియు వాక్యము ద్వారా క్రీస్తులో ఎదుగుతూ మన దినచర్యలో వీటిని సంసిద్ధం చేసి తగినంత సమయాన్ని వెచ్చించే నిర్ణయం తీసుకుందాం. దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ పచ్చని చెట్టువలే ఫలిస్తూ అనేకులను కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందే వారిగా ఆహ్వానిద్దాం. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments