అవసరమా? కోరికా?

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- అవసరమా? కోరికా?

విలాసవంతమైన జీవితాన్ని జీవించే ఒక రాజు ఉండేవాడు. తన జీవితంలో ఆ రాజు సంతోషం, సంతృప్తి చెందలేకపోయాడు. ఒకరోజు తన సేవకుడు ఆనందంగా పాటలు పాడుతూ పని చేయడం చూశాడు. ఆ రాజు తన సేవకుడు ఎలా సంతోషంగా జీవుస్తున్నాడో అడిగి తెలుసుకున్నాడు. ఆ సేవకుడు ఇలా సమాధానమిచ్చాడు, "నేను సేవకుడిని తప్ప మరొకటి కాదు, నా కుటుంబానికి నా స్థోమత మించిన అవసరతలు లేవు ,ఉండడానికి ఇల్లు కడుపు నిండా భోజనం ఉంది" చాలు..దేవునికి రోజు కృతజ్ఞత చెల్లిస్తూ బ్రతుకుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని సెలవిచ్చాడు.

  ఆ సమాధానంతో రాజు ఆశ్చర్యపోయాడు. నిజంగా ఇతడు జీవితంలో ఏ కోరికా లేకుండా జీవిస్తున్నాడా ? లేక నటిస్తున్నాడా ? తెలుసుకోవాలి అనుకొని.. ఆ రాత్రి తన సేవకుడిని పరీక్షిస్తూ, రాజు రహస్యంగా 99 బంగారు నాణాల సంచిని తన సేవకుడి వాకిలి గుమ్మం వద్ద వదలమని తన పనివారిని ఆదేశించాడు. గుమ్మము వద్ద సంచిని చూసిన ఆ సేవకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ సంచిని తెరిచి ఆశ్చర్యపోయిన అతడు, వాటిని లెక్కించడం ప్రారంభించాడు. 99 నాణేలే ఉన్నాయని నిర్ధారించుకొని, “ఆ ఒక్క బంగారు నాణెం ఏమైయ్యుంటుంది? ఖచ్చితంగా, ఎవరూ 99 నాణాలను వదిలిపెట్టరే! ” అనుకొని, కలిగినదానితో తృప్తి చెందకుండా..టెన్షన్ టెన్షన్ జీవితం ప్రారంభించాడు.. తనకు వీలైన ప్రతిచోటా వెతికాడు, చివరికి ఆ ఒక్క నాణెం దొరకలేకపోయింది. చివరగా, నిరాశతో అలసిపోయిన అతడు ఆ ఒక్క బంగారు నాణెం సంపాదించడానికి తన సేకరణను సంపూర్తి చేయడానికి గతంలో కంటే ఎక్కువ కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి, 100వ బంగారు నాణెం సంపాదించాలనే తపనలో, తనకు సహకరించే కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా దూషించడం మొదలుపెట్టాడు, పని చేస్తున్నప్పుడు పాటలు పాడటం కూడా మానేశాడు, దేవుణ్ణి స్తుతించడం మానేసి ఆ 100వ నాణెం కోసం దేవుని మీద సనగడం ప్రారంభించాడు, ప్రశాంతమైన జీవితం కోల్పోయాడు. 

సేవకుడు ఇలా మారిపోవడం , మనశ్శాంతి లేకుండా బ్రతకడం గమనించిన రాజు సేవకుని పిలిచి ఓ సేవకుడా నీవు ఇంతక ముందు వున్న మనశ్శాంతి కొలోయావు జీవితంలో ఆ 100వ నాణెం సాధించాలి అనే వేటలో కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను అందరినీ దూరం చేసుకున్నావు, ఆరోగ్యం పాడు చేసుకున్నావు నీ స్థితి కొంచము వున్నప్పుడే ఆనందంగా ఆడుతూ..పాడుతూ పని చేసుకుంటూ కుటుంబంతో గడుపుతూ వుంటివి ఇప్పుడు అన్ని కోలోయావు..నిన్ను చూసి రాజు అయిన నేను పాఠము నేర్చుకుంటున్నాను. నాకు దేవుడు ఇచ్చినదానిలో తృప్తిగా బ్రతకడం కంటే మించిన కోరిక నాకు వద్దు. నీవు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా ఎదో సాధించాలి..ఇంకా ఎదో సంపాదించాలి అనే అనవసరమైన కోరికలు లేకుండా ఉన్నదానితో తృప్తిగా జీవించడం కొనసాగించు అని చెప్పెను.

 _సామెతలు 11:23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది._

చిన్న చిన్న విషయాలలో కూడా మనం సంతోషంగా ఉండగలం. కానీ మన జీవితంలో ఏదైనా పెద్దది లేదా మెరుగైనది పొందుకున్న సమయంలో, దానికంటే ఇంకా ఎక్కువ పొందుకోవాలనే తపన మొదలవుతుంది!. దాని ద్వారా, మనం మన నిద్రను, మన ఆనందాన్ని కోల్పోతాము, మన చుట్టూ ఉన్న వ్యక్తులను బాధిస్తాము, ఇవన్నీ మనలో పెరుగుతున్న అవసరాలు, మించిన కోరికలే. మనకున్నదానిలో సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మన అవసరాలను కోరికలను సమతుల్యం చేసుకోవడం నేర్చుకోవాలి.  ఈ రోజు నుండి మనం ఒక మెరుగైన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం! దేవుని కృప మనందరితో ఉండునుగాక. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments