✝️ 𝗖𝗛𝗥𝗜𝗦𝗧 𝗧𝗘𝗠𝗣𝗟𝗘 - 𝗣𝗥𝗢𝗗𝗗𝗔𝗧𝗨𝗥
- 2023 అనే తలుపు నీయెదుట తీయబడినది..
_("ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను. దానిని ఎవడును వేయనేరడు ప్రకటన 3:8)_
2022లో సాతానుడు మన జీవితంలో అనేక విషయాలకు తలుపులు మూసి బంధించాడు. సాతాను చేత మూయబడిన అనేక ఇత్తడి తలుపులను ఇనుప గడియలను ప్రభువు ఈ సంవత్సరం పగులగొట్టి నూతన ద్వారములను నీకు తీయనున్నాడు. (యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగుల గొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను)
కారణం..ప్రతి తలుపు యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నవి కనుక తలుపులు తీయుటకును వేయుటకును ఆయన సర్వాధికారి. ప్రభువు 2023లో నీ కొరకు తెరవనున్న కొన్ని తలుపులను మనం ఇప్పుడు గమనిద్దాం.
*1. విశ్వాస తలుపు:*
ఈ సంవత్సరమైనా మనం విశ్వాసపు ద్వారంలో ప్రవేశించాలి. (అపో.కా 14:27 వారు వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు *విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు*, వివరించిరి.)
పౌలు మొదటి సువార్త దండయాత్రలో ప్రభువు అనేక పట్టణాల్లో ప్రభువు అనేకులను విశ్వాస తలుపులు తీసాడు. అంతి యోకయ, ఈకొనియా దెర్బే, మొదలగు ప్రాతాలలో తలుపులు తెరువబడినవి. అపో. 14:19-24. పిసిదియా దేశమంతటా వారికి దేవుడు తలుపులు తీశాడు. మరి మన కొరకు కూడా ప్రభువు విశ్వాస తలుపులు తీయనున్నాడు.
*2. ప్రార్ధనా తలుపు:*
పేతురు కొరకు సంఘస్తులు చేసిన ప్రార్ధనకు దేవుడు అద్భుతమైన సమాధానం వారు తలుపు తీసిన తరువాత చూడగలిగారు. (అపో.కా 12:16 పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.) వారు హృదయ పూర్వకంగా ప్రార్థన చేశారు గాని వచనాలను బట్టి చూస్తే ఎక్కువ విశ్వాసంతో ప్రార్థన చేయలేదని అర్థమౌతుంది. అయినా అల్ప విశ్వాసంతో చేసిన వీరి ప్రార్థనకు కూడా దేవుడు జవాబిచ్చాడు.
నిజ దేవునికి ప్రార్థన చేసేవారందరికీ ఇది ప్రోత్సాహకరంగా ఉండాలి. దానియేలు అయితే ముమ్మారు కిటికీ తలుపులు తీసే ప్రార్ధన చేశాడు గనుక మరణం నుండి తప్పించబడ్డాడు. (దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి యుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.)
2022 సంవత్సరంలో చాలమంది జీవితాల్లో ప్రార్ధనా తలుపులు మూయ బడ్డాయి. కనీసం 2023లో ప్రార్ధనా తలుపు మరోసారి తెరవబడుచుండగా ప్రవేశిద్దాం.
*3. సహవాస తలుపు:*
నులివెచ్చని స్థితిలో ఉన్న లవొదికయ సంఘం, ప్రభువుతో సహవాసం చేయకుండా ప్రభువును బయటే ఉంచింది. (ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని *తలుపుతీసిన* యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.)
ఆయన తలుపు తట్టవలసి వచ్చింది. ఇది సూచించేదేమంటే, అనేకులు ప్రభువు యొక్క సహవాసం చేయలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఈ సంవత్సరమైన ప్రభువును నమ్మి, ఆయనను రక్షకునిగా స్వీకరించి వాస్తవంగా ఆయన కుటుంబంలో ప్రవేశించి దేవుని పిల్లలం అవుదాం.
*4. రక్షణ తలుపు:*
రక్షణ ద్వారం క్రీస్తే. క్రీస్తు ద్వారా ఎవరైనా లోపలికి వస్తే అతనికి రక్షణ లభిస్తుంది. అతడు లోపలికి వస్తూ, బయటికి వెళ్తూ మేత కనుక్కొంటాడు. (యోహాను 10:9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును)
2023సంవత్సరంలోనైనా రక్షణ ద్వారంలోనికి ప్రవేశించాలని తీర్మానం చేసుకుందామా? రక్షణ తలుపులు నీకొరకే తీయబడి ఉన్నవి. లోపలకు వస్తే, ఆయన నీ శరీరానికి, మనస్సుకు, ఆత్మకు కూడా అద్భుతమైన రక్షణ ఇవ్వగలడు. గనుక శక్తివంతమైన సువార్త ద్వారా రక్షణలో ద్వారంలోనికి ప్రవేశిద్దాం.
అతడు లోపలకు పోవుచు అనగా క్రీస్తులో బలపడుట, బయటకు వచ్చుచు అనగా సువార్త ప్రకటనకు అని అర్ధం. ప్రభువు నీకొరకు సువార్త తలుపు కూడా 2023 సంవత్సరంలో తీయనున్నాడు.
*5. పరిచర్య తలుపు:*
క్రీస్తు కొరకు పరిచర్య చేసే తలుపు ప్రభువు తెరచాడు. (యోబు 31:32 పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.) మార్త ప్రభువును తన ఇంటిలోనికి ఆహ్వానించి పరిచర్య చేసింది. జక్కయ్య ప్రభువు కొరకు తన తలుపులు తెరచి పరిచర్య చేశాడు. అబ్రహాము తన ఇంటి గుడారపు ద్వారా యొద్ద కూర్చొని ప్రభువును ఆహ్వానించి విందు పరిచర్య చేసి ఆశీర్వదించబడ్డాడు.
(ఆది కా 18:1 మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.)
మరి 2023 సంవత్సరంలోనైనా మనం పరిచర్య ద్వారంలో ప్రవేశించుటకు తీర్మానం చేద్దామా?
*6. దీవెన తలుపులు:*
2023లో ప్రభువు నీ కొరకు దీవెనల తలుపు తెరచాడు. మరి మనం ప్రభువుకివ్వడానికి కానుకల తలుపు తెరిస్తే, ప్రభువు మనకొరకు దీవెనల తలుపు తెరుస్తాడు.
(మలాకి 3:10 నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను *ఆకాశపువాకిండ్లను* విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు).
మనం ప్రభువుకు ఇచ్చేదానిమీదే నూతన సంవత్సరంలో ప్రభువు మనకిచ్చే దీవెన ఆధారపడి ఉంటుంది. (లూకా 6:38 ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.)
*7. రాకడ తలుపులు:*
ప్రభువు వచ్చే ఆ రోజు గానీ గడియ గానీ మీకు తెలియదు, గనుక మెళుకువగా ఉండండి. (లూకా 12:36 తమ ప్రభువు పెండ్లి విందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి.)
ఆధ్యాత్మికంగా సిద్ధమై ఉండండి. నిజమైన క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసినది లేకుండా, అంటే క్రీస్తు ఆత్మ లేకుండా, క్రైస్తవ జీవితం గడపాలని ప్రయత్నించడం బుద్ధి తక్కువ పని. అందుకే బుద్ధిలేని కన్యకలు విడువ బడ్డారు. వారికొరకు నరకం కాచుకొని ఉన్నది.
(మత్తయి 25:11-13 అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా, అయ్యా, మాకు *తలుపు తీయుమని* అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ దినమై నను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.)
రాకడ తలుపులో ప్రవేశించుటకు ఆలస్యం చేస్తే ప్రభువు మనకు దొరకడు. (పరమ 5:6 నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను.)
ఒకానొక దినాన ప్రభువు సువార్త తలుపు మూసి పరలోకపు తలుపు తెరచును. ప్రకటన 4:1 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను (యెషయా 22:22 నేను దావీదు ఇంటితాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు.)
ప్రియ దేవుని బిడ్డలారా! సమయం దాటకముందే *ద్వారంలో* ప్రవేశించాలి లేదా తీయబడిన తలుపు వేయబడుతుంది. అప్పుడు ఎవరును ద్వారములోనికి ప్రవేశించలేరు. నోవాహు ఓడ తలుపు మూసివేసినది దేవుడే.
(ఆది.కా 7:16 ప్రవేశించిన వన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని *మూసివేసెను.* ఆది.కా 7:21 అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.
ఆ శిక్ష మనకు రాక ముందే ప్రభువు మన కొరకు తెరచిన *ద్వారంలో ప్రవేశిద్దాం.* ఆయనే ద్వారమై యున్నాడు. (యోహాను 10:9 నేనే ద్వారమును;)
ఈ నూతన సంవత్సరం 2023లో మన కొరకు తీయబడిన ఏడు తలుపులలో అనగా ద్వారం అనబడిన యేసులో ప్రవేశించి ప్రభువును గొప్పగా మహిమ పరచే భాగ్యం మనకు ఆత్మ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక! ఆమెన్!!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments