ఆయన ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం మాత్రం చెయ్యడు...

✝️ CHRIST TEMPLE-PRODDATUR

- ఆయన ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం మాత్రం చెయ్యడు...

 *యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.* - కీర్తనలు 40:1

👉మన జీవితాల్లో ప్రార్ధనలకు  ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం అంటే, *ప్రధాన కారణం కనిపెట్టలేక పోవడం. సహనం లేకపోవడం.* 

*రాత్రి ప్రార్ధిస్తే ఉదయానికి అది జరిగిపోవాలి.* 

👉కాస్త ఆలస్యం అయితే సహనం కోల్పోయి, విసిగిపోయి, ప్రార్ధించడమే మానేస్తాం. 

ఆయన ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం మాత్రం చెయ్యడు. అనే విషయాన్ని మరచిపోతాం. 
*ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి వుంటుంది అనే విషయాన్ని గుర్తించలేం.* 

*అనేక సందర్భాలలో దేవుడు మన ప్రార్ధనలకు సమాధానాన్ని సిద్దపరుస్తాడు.*
 
*ఇక అది మన చేతికి వచ్చే సమయానికి సహనం కోల్పోయి, కనిపెట్టలేక ప్రార్ధించడం మానేస్తాం.*
 
ఆ ఆశీర్వాదాలు మన కండ్లముందే నిలిచిపోతాయి గాని, మన చేతికి దక్కవు. 

ఆయన తగిన సమయమందు నీ ప్రార్ధన ఆలకించి ప్రతిఫలమిస్తాడు. 
అయితే, 
*ఆ క్షణం కోసం సహనంతో కనిపెట్టుకొని వుండాలి.* 

*దానికి ఎంత కాలం పట్టొచ్చు?* 

🔹 *కాలేబు* వాగ్ధాన నెరవేర్పు కోసం 45 సంవత్సరాలు,
🔹 *అబ్రాహాము* 25 సంవత్సరాలు సహనంతో కనిపెట్టవలసి వచ్చింది. 

🔹 *సిలువలో దొంగ* అయితే, తన ప్రార్ధనకు ప్రతిఫలాన్ని అదేరోజు పొందగలిగాడు. 

👉అది ఎప్పుడు నీకవసరమో నీకంటే ఆయనకే బాగా తెలుసు. అప్పటివరకు సహనంతో ఆయన కొరకు కనిపెట్టుకొనివుండు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

వాగ్ధాన ఫలాలను అనుభవిద్దాం! 

 *నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను*         కీర్తనలు 40:2

*నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబి*

👉 ఇది  ఘోరమైన కష్టం, అపాయం, దీనావస్థతో కూడిన అనుభవం. 
జీవిత పునాదులే కుప్పకూలే పరిస్థితులు. 

*హృదయం, మనస్సు, ఆత్మ నిలిచేందుకు ఆధారం లేక ఎక్కడో అగాధంలోకి దిగిపోతున్నట్లు అనిపించే పరిస్థితులు.* 

👉 అందుకే దావీదు ఇట్లా అంటున్నాడు. 

*"నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి."*
కీర్తనలు 69:2

అవును!!
*ఈ పరిస్థితికి కారణం మన పాపమే.* 

👉నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబి
*ఇవే నిత్య మరణానికి అసలైన సాదృశ్యాలు.* 

👉 ఈ పరిస్థితి నుండి తప్పించి, విడిపించడానికి ఆయన తన ప్రియ కుమారుని పంపించి క్రీస్తు అనే బండ పైన మన పాదములు స్థిర పరిచాడు. 

అందును బట్టి దేవుని స్తుతిద్దాం! 

స్థిరపరచ బడిన పాదములు తొట్రిల్లకుండా కాపాడుకుందాం! 

*తనకు స్తోత్రరూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మిక యుంచెదరు.*  
కీర్తనలు 40:3

👉 నాశనకరమైన గుంట, 
జిగటగల దొంగ ఊబి నుండి విడిపించబడిన వ్యక్తినుండి ఒక నూతనమైన విమోచనా స్తోత్రగీతం పెల్లుబికి వస్తుంది. ఆ గీతాన్ని ఆ వ్యక్తి మాత్రమే ఆలపించగలడు.
అది కృతజ్ఞతా గీతం. 

విశ్వాసులకు విడుదల కలగడం, వారు దేవుని స్తుతించడం ఇతరులు చూసి, వారు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మికయుంచుతారు.

*ఇంతకీ, నీవు ఆ దొంగ ఊబి నుండి విడిపించబడ్డావా? ఇంకా దానిలోనేనా?* 

👉అయితే, ఆ నూతనమైన విమోచనా స్తోత్రగీతాన్ని నీవు పాడలేవు.

👉నిన్ను బట్టి ఇతరులు దేవుని తెలుసుకొనే అవకాశమే లేదు. 

ఒక్క నిమిషం ఆలోచించు!!!

 *ఒకవేళ  నిన్ను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య దూషించ బడుతుందేమో?* 

*అట్లా జరగడానికి వీల్లేదు. నిన్ను బట్టి దేవుని నామం మహిమ పరచబడాలి. అనేకులు ఆయనయందు విశ్వాసముంచాలి.* 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

విమోచనా స్తోత్రగీతాన్ని ఆలపిద్దాం! 

 *గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.*        కీర్తనలు 40:4

👉నాశన కరమైన గుంటనుండి తప్పించ బడిన నీవు. పాపపు ఊబి నుండి విడిపించబడిన నీవు, 

1. *గర్విష్టుల జోలికిపోవద్దు. ఎందుకంటే?* 
వారి మాటలుగాని, వారి ప్రవర్తనగాని కనీసం దేవునిని కూడా లెక్కచెయ్యకుండా వుంటాయి. 

వారికి ఒక విషయం తెలియదు. 
*పతనానికి ముందు గర్వం నడుస్తుందని. వాళ్ళు పతనం అంచులలో వున్నారని.* 

2. *సక్రమమైన మార్గం  విడచి అక్రమమైన మార్గములలో నడిచే  వారి తట్టు చూడొద్దు.*
 దేవునికి ఆయాసకరమైన మార్గమేదైనా  అది అక్రమమైన మార్గమే. 

👉ఈ మార్గం  కొన్ని రోజులు నీకు సంతోషాన్ని కలిగించొచ్చు. కాని ఒక క్షణాన్న నీకళ్ళ ముందే ఆ సంతోషం ఆవిరై ఆవేదన మాత్రమే మిగులుతుంది. 

3. *అబద్ధములతట్టు తిరుగు వారిని  లక్ష్య పెట్టొద్దు.* 
ఎందుకంటే? 
అబద్దములకు జనకుడు సాతాను. అబద్దముల తట్టు తిరుగువారు వాడి పిల్లలే. 

ఇక, *నీవు చెయ్యాల్సింది ఒక్కటే.ఆయన యందు విశ్వాసముంచు.ధన్యతను పొందుకోగలవు.*

👉ధన్యుడు అంటే?
 *"ఆశీర్వదించబడిన వాడు."*

👉నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే? 
*ఆ నిత్య రాజ్యంలో చేరడమే.* 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

 *యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.*          
కీర్తనలు 40:5

నాశనకరమైన గుంట, 
జిగటగల దొంగ ఊబి నుండి దేవుడు నిన్ను రక్షించాడంటే? 
*నీ పట్ల దేవునికొక ప్రత్యేకమైన ప్రణాళిక వుంది.* 

👉ఆయన మన యెడల జరిగించిన, జరిగిస్తున్న ఆశ్చర్యక్రియలు బహు విస్థారమైనవి. 

*అవి కంటికి కనబడవు. చెవికి వినబడవు మనకు అర్ధం కావు.* 
*మన పట్ల ఆయన కలిగియున్న తలంపులు లెక్కలేనన్ని.* 

👉అందుకే, సృష్టిలోనే అత్యంత ఉన్నతమైన సృష్టముగా నిన్ను, నన్ను సృష్టించాడు. 
దేవదూతల కంటే అధికముగా మనలను హెచ్చించాడు. 
కాని, 
*దేవునిని గురించిన తలంపే మనకు లేదు.* 

*ఆయనకు సాటియైన వాడొకడును లేడు.*

అవును!
👉నీ కోసం ఆయన తన ప్రాణాన్నే ఫణంగా పెట్టాడు. 
*అంతగా నిన్ను ప్రేమించిన వారెవరన్నా వున్నారా?* 

🔹గతించిన కాలంలో లేరు!
🔹వర్తమాన కాలంలోనూ లేరు!!
🔹భవిష్యత్ కాలంలోనూ వుండబోరు!!!

*ఆయనకు సాటి లేరేవ్వరూ లోకాన.*
 
👉ఆ సాటిలేని దేవునికి నీవేమివ్వగలవు?
*నీహృదయంలో చోటివ్వు చాలు.* 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్.

✝️ CHRIST TEMPLE - PRODDATUR

Comments