✝️ CHRIST TEMPLE-PRODDATUR
- పరిశుద్ధ గ్రంధమును ప్రతి రోజు ఎందుకు ధ్యానించాలి..?
▫️పరిశుద్ధ గ్రంధమును ఎందుకు ధ్యానించాలంటే..?
🔅మన నడతను (ప్రవర్తన) సరిచేస్తుంది:
"యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?" కీర్తనలు 119:9
హృదయం నిండిన దానినిబట్టే మన మాటలు, తలంపులు, క్రియలు ఆధారపడి వుంటాయి. అందుచే మొట్టమొదటగా మన హృదయం సరిచేయబడాలి. మన హృదయం సరిచేయబడాలి అంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించాలి.
ఎందుకంటే? దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీ 4:12)
🔅దేవుని వాక్యము మనలను పాపము చెయ్యకుండా అడ్డగిస్తుంది
" నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను." (కీర్తనలు 119:11)
🔅దేవుని వాక్యము మనకు సంతోషాన్నిచ్చి, ఆలోచన పుట్టిస్తాయి.
"నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి." (కీర్తనలు 119:24)
నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నకు ఆనందమును కలుగజేయుచున్నవి. (యిర్మియా 15:16)
🔅దేవుని వాక్యము దేవుడంటే భయమును కలిగిస్తుంది.
దేవునికి ఎప్పుడు భయపడతామంటే? ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలిసినప్పుడు. ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలియాలంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ద్యానించాలి. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది" (కీర్తనలు 119:38)
దేవునికి భయపడేవాడు ఆయన ఏది అడిగినా ఇచ్చేస్తాడు. అబ్రాహామును పరీక్షించడానికి కుమారుని అడిగాడుగాని, నిన్నయితే, నీ హృదయాన్ని తప్ప మరి దేనిని అడగడు. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందు వలన నాకు కనబడు చున్నదనెను. (ఆది 22:12)
🔅దేవుని వాక్యము మనకు నెమ్మదినిచ్చి, జీవింపజేస్తుంది.
జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సర్వ సాధారణం. కొన్ని సందర్భాలలో అవి తారా స్థాయికి చేరుతాయి. ఎందుకీ జీవితం అనే ప్రశ్నను లేవనెత్తుతాయి. మరణమే శరణ్యం అనే పరిస్థితులను సహితం సృష్టిస్తాయి. అట్లాంటి పరిస్థితులలో ఒక్క చిన్న దేవునిమాట మన భాధలలో నెమ్మది, ఊరట, ఆదరణ కలిగిస్తుంది. జీవితం మీద ఆశను రేకెత్తిస్తుంది. జీవింపజేస్తుంది.
"నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది."
(కీర్తనలు 119:50)
🔅దేవుని వాక్యము జ్ఞానమును అనుగ్రహిస్తుంది.
a. శత్రువులకు మించిన జ్ఞానం:
మన ప్రధాన శత్రువు సాతానే. వాడు యుక్తి గలవాడు.
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను (ఆది 3:1) వాడి యుక్తి నుండి తప్పించబడాలంటే? వాడికి మించిన జ్ఞానం కావాలి. అది ఎట్లా లభిస్తుంది? దేవుని వాక్యం ధ్యానించడం ద్వారానే. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. (కీర్తనలు 119:98)
b. బోధకులకు మించిన జ్ఞానం:
నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. (కీర్తనలు 119:99)
c. వృద్ధులకు మించిన జ్ఞానం.
వృద్ధులు వారి అనుభవాల ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదిస్తారు. కాని, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా వారికి మించిన జ్ఞానమును పొందుకోగలము.
నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. (కీర్తనలు 119:100)
🔅దేవుని వాక్యము జుంటే తేనే ధారలకన్నా మధురమైనది.
అవును! ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ పరిశుద్ధ గ్రంధానికి సాటిరావు.
నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. (కీర్తనలు 119:103)
🔅దేవుని వాక్యం త్రోవచూపించే మార్గదర్శి.
నీవు చేరవలసిన గమ్యం తప్పక చేర్చుతుంది. సందేహం లేనేలేదు. అది కారు చీకటి అయినా సరే. నీ కాలు జారకుండా నడిపిస్తుంది. గమ్యం చేరేవరకు.
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. (కీర్తనలు 119:105)
🔅దేవుని వాక్యము పాపము అనే అంధకారంలో వున్నవారికి వెలుగును, తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది.
"నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును" (కీర్తనలు 119:130)
🔅దేవుని వాక్యము పాపము మనలను ఏలుబడి చేయకుండా, పాపము వైపు మన అడుగులు వేయకుండా అది మనలను స్థిర పరస్తుంది.
"నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము." (కీర్తనలు 119:133)
🔅దేవుని వాక్యం వలన ఒక విశ్వాసి తీవ్రమైన భాద, సంతోషం రెండు ఏక కాలంలో అనుభవించ గలడు.
"శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి" (కీర్తనలు 119:143)
🔅దేవుని వాక్యాన్ని ప్రేమించేవారికి నెమ్మది కలుగుతుంది. వారి అడుగులు జారిపోకుండా అది వారిని కాపాడుతుంది.
"నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు" (కీర్తనలు 119:165)
ఇట్లాంటి దివ్య గ్రంధాన్ని ధ్యానిస్తున్నావా? లేకపొతే? నేటి నుండే ప్రారంభించు. నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments