సమస్యను చూచి టెన్షన్ పడకు.. ఊరక నిలుచుండి చూడు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR.

- సమస్యను చూచి టెన్షన్ పడకు.. ఊరక నిలుచుండి చూడు..

- యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి.- (నిర్గమ 14:13)

ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వమునుండి విమోచించబడి వాగ్ధాన దేశమునకు తిరిగి వస్తున్న సందర్భములో ఎదురుగా ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం, అంటే ముందు నుయ్య వెనుక గొయ్యి. భయబ్రాంతులైన ఇశ్రాయేలీయులు దేవునిని ప్రార్ధిస్తూనే, మోషే మీద తిరుగుబాటు చేసే పరిస్థితి. అప్పటికే వారొక నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. తిరిగి ఐగుప్తు బానిసత్వానికి వెళ్లడం, లేదా వారి చేతిలో మరణించడం. అంతేతప్ప, ఐగుప్తు ప్రజలను తెగుళ్లతో బాధిస్తూ, ఇశ్రాయేలు ప్రజలను ఎట్లా ప్రత్యేకపరిచారో, ఆయన ఎంతటి సర్వశక్తిమంతుడో అనుభవపూర్వకంగా ఎరిగియుండికూడా, ఆయన శక్తిని ఆశ్రయించలేని పరిస్థితి. వారికి ముందు ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యం తప్ప వీరికేమి కనిపించడం లేదు. 

అట్లాంటి పరిస్థితులలో సాత్వీకుడైన మోషేగారు వారికిచ్చే సమాధానం, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి (నిర్గమ 14:13) యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. (నిర్గమ 14:14) మీరు వారితో యుద్ధము చెయ్యాల్సిన అవసరం లేదు. మీ పక్షమున దేవుడే యుద్ధము చేయబోతున్నారు. యెహోవా మీకు అనుగ్రహించబోయే రక్షణను ఊరకనే నిలచియుండి చూడుడి. 

*మాట యిచ్చిన దేవుడు తప్పిపోతాడా? *

నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను (నిర్గమ 15:8) వారు ఊరకనే నిలచియుండి చూస్తుండగానే ఎర్ర సముద్రం రెండు పాయలయ్యింది. ఆరిన నేలను నడిచిపోయారు. (నిర్గమ 14:21) శత్రువులయొక్క శవాలను సముద్రతీరమున చూచిరి (నిర్గమ 14:30) 

 ప్రియ స్నేహితా! నీ జీవితం కూడా ముందు ఎర్ర సముద్రం వెనుక శత్రు సైన్యం అన్నట్లు, సమస్యల సుడిగుండములో తిరుగుతూ గమ్యం కానరాని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నావా? ఒకానొక దినాన్న యాకోబు కూడా ఇదే పరిస్థితులలో వున్నారు. ముందు భీకర అరణ్యము, వెనుక శత్రువుగా మారిన అన్న. అన్నీ ప్రశ్నలే. సమాధానం మాత్రం లేదు. అట్లాంటి పరిస్థితి లో రాయిని తలగడగా చేసుకొని నిద్రపోయారు. ఇశ్రాయేలు ప్రజలముందు కూడా అన్నీ ప్రశ్నలే. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం. అట్లాంటి స్థితిలో మోషేగారు చెప్తున్న మాట “ఊరక నిలుచుండి చూడుడి”. 

నీవూ చెయ్యాల్సింది కూడా అదే. యాకోబు వలే క్రీస్తు అనే సజీవమైన రాయిని ఆశ్రయించు. ఎర్ర సముద్రము వంటి నీ సమస్యను కాదు నీవు చూడాల్సింది. ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుని శక్తిని చూడు. నిన్ను వెంటాడే శత్రు సైన్యాలను కాదు నీవు చూడాల్సింది. శత్రు సైన్యాలను శవాలుగా మార్చిన దేవుని శక్తిని చూడు. విశ్వసించు! ఊరకనే నిలుచుండు! నీ దేవుడే నీ పక్షముగా యుద్ధము చేస్తారు! ఆ విజయాన్ని బట్టి ప్రభువును స్తుతించు! అట్టి కృప, ధన్యత ప్రభువు  మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments