సమస్తము మేలు కోసమే..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- సమస్తము మేలు కోసమే..

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమీయులకు 8:28.

నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మరియు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నేను మీకు శుభాభి వందనములు తెలియజేస్తున్నాను. 

ఈరోజు మనం ధ్యానించబోయే ప్రాముఖ్యమైన వాగ్దాన వచనం, దేవుడు మన పట్ల సమస్తమును మేలు కొరకే జరిగించాలని మన పట్ల ఆయన కోరుచున్నాడు.

 అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:28 వ వచనము వాగ్దానముగా ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా, " దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము'' అని చెప్పినట్లుగానే, సమస్తమును మీ జీవితములో మేలు కొరకు జరుగునట్లుగా దేవుడు మీకు అటువంటి గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. మీరు ఈ మేలులు పొందుకోవాలంటే, దేవుని మీ హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఆయనను ప్రేమించే వారి మేలు కోసం సమస్త కార్యాలు జరిగిస్తాడని మనకు తెలుసు మరియు ఆయన తన ఉద్దేశ్యం ప్రకారం మనము పిలువబడినవారము. కాబట్టి, సమస్తము మేలు కొరకే జరుగుతుంది. 

అవును, నా ప్రియ దేవుని బిడ్డలారా, ' మీరు దేవుడిని మీ హృదయంతో ప్రేమిస్తున్నారా? కాపరిగా దేవుని ప్రేమించిన దావీదు జీవితాన్ని చూడండి. గొర్రెలు దొడ్డిలో జీవిస్తున్నాడు, మనం ఉండగలమా ? ఆ గొర్రెల దొడ్డిలో ? అందరూ వున్నా అనాధగా జీవిస్తున్న దావీదు ఎప్పుడూ తన దీన స్థితి చూసుకొని చింతించలేదు, అంతా నా మేలు కోసమే అని విశ్వాసంతో వున్నాడు. దేవుడు తగిన కాలమందు దావీదును మహా రాజుగా అభిషేకించి ఉన్నత పదవులు అధికారం ఇచ్చాడు. ఎంత అద్భుతం జరిగింది చూడండి. మీరు 23వ కీర్తన చదివినట్లయితే, " యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు '' అని చెప్పి దావీదు ప్రభువును తన కాపరిగా ఉంచుకున్నాడు. ఈ సందేశం చదువుతున్న ప్రియ బిడ్డలారా నీ స్థితి కూడా దేవుడు ఉన్నత స్థాయికి మారుస్తాడు..అంతా నీ మేలు కోసమే..ధైర్యంగా ఉండు.

 సర్వశక్తిమంతుడైన దేవుని నుండి ఆశీర్వాదం పొందిన తర్వాత అతను ఎలా ఆశీర్వాదం పొందాడో ఆ కీర్తన అంతయు మనకు వివరిస్తుంది. దావీదు, " నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు '' అని చెప్పాడు. అవును, నా ప్రియ బిడ్డలారా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని నీతిమార్గములలో నడిపిస్తాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను '' (కీర్తన 32:8)లో చెప్పినట్లుగానే, దేవుడు మీరు నడవవలసిన మార్గమంతటిని మీకు నేర్పిస్తాడు.

 ప్రభువు కార్యాలను అర్థం చేసుకోవడానికి ఆయన మీకు సమస్త బుద్ధి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, దేవుడు నేడు మీకు సమస్తమును బోధిస్తాడు.

23వ కీర్తనలోని చివరి వచనాన్ని చదవండి, " నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను '' అని చెప్పబడినట్లుగానే, నేడు మీ బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే మీ వెంట వచ్చునట్లు చేస్తాడు. 

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొందురు గాక.. హల్లెలూయ..

కీర్తనలు 23:5 మునుపటి వచనం ఇలా చెబుతోంది: " నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది'' అన్న వచనము ప్రకారము మీ శత్రువుల యెదుట ఆయన మీకు భోజనమును సిద్ధపరుస్తాడు. అవును, దావీదు దేవుని శక్తితో నింపబడ్డాడు. కాబట్టి, ఇంత ధైర్యముగా చెప్పగలిగాడు. ఆలాగుననే, " అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను

 '' (అపొస్తలుల కార్యములు 10:38) ప్రకారం యేసు ప్రభువు కూడా అదే శక్తిని పొందుకున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడా పరిశుద్ధాత్మను పొందడం ద్వారా దేవుని శక్తితో నింపబడతారు. దేవుడు మంచి కాపరిగా ప్రతి విషయంలోనూ మీతో కూడ ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఏ పని చేసినా, ఆయన మీకంటే ముందుగా వెళ్లి మిమ్మల్ని చక్కగా నడిపించి, ఆయనను ప్రేమించే మీకు సమస్తమును మేలు కొరకే జరుగునట్లు చేసి, మీ బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే మీ వెంట వచ్చునట్లు చేసి, మిమ్మల్ని వర్ధిల్లజేస్తాడు. ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments