బానిసత్వం నుండి విడుదల..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- బానిసత్వం నుండి విడుదల..

ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిర్గమ 2:23

దేవుడు అబ్రాహాము గారికి తెలియజేసిన విధంగా, నీ సంతతివారు,  తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. (ఆది 15:13, 14) దీని నెరవేర్పులో భాగంగా, యోసేపును అతని అన్నలు ఇష్మాయేలీయులకు అమ్మడం, వారు తీసుకెళ్లి ఐగుప్తీయులకు అమ్మడం, అక్కడ యేసేపునకు దేవుడు తోడైయుండి ఆయనను ఆ దేశ ప్రధానిని చెయ్యడం, ఆ సమయంలో అతని తండ్రి ఇంటివారు నివసిస్తున్న కనానులో కరవు రావడం, యోసేపు సహోదరులు ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వెళ్లడం, యోసేపు వారిని గుర్తుపట్టి, తన తండ్రి ఇంటివారందరిని ఐగుప్తులో నివసించుట కొరకు ఫరోతో మాట్లాడడం, ఆరీతిగా యాకోబు గారి కుటుంబమంతా ఐగుప్తుకు చేరింది. యేసేపు జీవించియున్నంత కాలం, సమృద్ధి, సమాధానంతో గడిచాయి. ఇశ్రాయేలీయులు విస్తారంగా ఆ దేశములో విస్తరించారు. 

సంవత్సరాలు గడుస్తుండగా యోసేపు, అతని సహోదరులందరూ మరణించారు. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏల నారంభించి, అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు: “చూశారా, ఇశ్రాయేల్‌ ప్రజల సంఖ్య చాలా పెరిగిపోయింది. బలంలో మనల్ని మించిపోయారు. వాళ్ళింకా ఎక్కువమంది కాకుండేలా వాళ్ళపట్ల మనం యుక్తిగా వ్యవహరించాలి. లేకపోతే, యుద్ధం వస్తే వాళ్ళు మన శత్రువుల పక్షం చేరి, మనతో పోరాడి దేశంనుంచి వెళ్ళిపోతారేమో.” అందుచేత వాళ్ళు ఇశ్రాయేల్ ‌ప్రజలను భారాలతో అణగదొక్కే అధికారులను వారిమీద నియమించారు. ఈ విధంగా వాళ్ళు ఫరో కోసం సరుకులు నిలువచేసే పట్టణాలను కట్టించారు. (అవి పీతోం, రామెసేసు.) అయితే ఈజిప్ట్‌వాళ్ళు వారిని అణగదొక్కే కొలదీ ఇశ్రాయేల్ ప్రజ పెరిగి వ్యాపించారు. గనుక ఈజిప్ట్‌దేశీయులకు వారి విషయంలో అసహ్యంతో పాటు భయాందోళన కలిగింది. అందుచేత వాళ్ళు ఇశ్రాయేల్ ‌ ప్రజలను కఠిన దాస్యంలో ఉంచారు. జిగటమట్టి పని, ఇటుక పని, అన్ని రకాల పొలం పనులు బలవంతంమీద వారిచేత చేయించుకొన్నారు. వారి పనంతా కఠినతరం చేస్తూ వారి జీవితాలను దుర్భరం చేశారు.

అంతటితో ఊరుకోకుండా, హెబ్రీ స్త్రీలకు మగపిల్లలు పుడితే కాన్పు పీటలమీదే వారిని చంపేయాలని, ఆడపిల్ల పుడితే బ్రతకనియ్యాలని మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి భయపడి వారు అట్లా చెయ్యని కారణంచే, హెబ్రీయులలో పుట్టిన ప్రతీ మగపిల్లవానిని నదిలో పారెయ్యాలనే ఆజ్ఞ ఇచ్చాడు ఫరో. (ఇదంతా దేవుడు అబ్రాహాము గారితో నీ సంతతి నాలుగు వందల సంవత్సరాలు పరాయి దేశములో శ్రమ అనుభవించాలని చెప్పినందుకు కాదుగాని, వారి పాపములే ఈ పరిస్థితికి కారణమయ్యాయి. భవిష్యత్ ను ఎరిగిన ప్రభువు దానిని ముందుగానే అబ్రాహాము గారికి తెలియజేసారు.)

ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బానిస బ్రతుకులనుండి. ఈ వెట్టిచాకిరి నుండి. విడిపించి, మనకు స్వేచ్ఛను అనుగ్రహించగలిగినవాడు మన దేవుడొక్కడే అనే నిజమైన గ్రహింపులోనికి వచ్చినప్పుడు, వారు కన్నీళ్లు విడచుచూ దేవునికి మొర పెట్టారు. వారి మొర నేరుగా ప్రభువు సన్నిధిని చేరింది. దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచారు ; దేవుడు వారియందు లక్ష్యముంచారు. చివరకు బానిసత్వాన్నుండి విడిపించి వాగ్ధాన భూమికి నడిపించారు. 

ప్రియ విశ్వాసి! ప్రార్ధించగలిగితే అలక్ష్యము చేసేవాడు కాదు నీ దేవుడు. ప్రార్థిస్తున్నాగాని ఫలితం లేదా? అయితే ఆ ప్రార్ధనలో భారం లోపించిందేమో? ఇశ్రాయేలీయులు మూలుగుతూ మొర పెట్టారట. అది ఆత్మతో ప్రార్ధించే అత్యున్నతమైన అనుభవం. భారము గలిగి ప్రార్ధించు. నీ దేవుడు నీయందు లక్ష్యముంచుతారు. సాతాను బానిసత్వాన్నుండి విడిపించబడతావు. సమాధానం నీ స్వంతమవుతుంది. ఆరీతిగా మనజీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments