✝ CHRIST TEMPLE-PRODDATUR
Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu
వారు చీట్లు వేసినప్పుడు..చీటి 'యోనా' పేరు మీద వచ్చింది..
అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా 1,2,3,4 అధ్యాయాలు
❇ యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా, ఓడ బ్రద్దలైపోయే తీవ్రమైన తుఫాను రేగింది. నావికులకు భయపడి ప్రతివాడు తన తన దేవుళ్ళకి మొర పెట్టాడు, ఓడ తేలిక చేయడానికి వారు దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అప్పటికే యోనా ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకొని బాగా నిద్రపోయాడు.
ఓడ నాయకుడు యోనాదగ్గరికి వెళ్ళి౼“ఓయ్! నువ్విక్కడ నిద్రపోతున్నావా?లేచి నీ దేవునికి ప్రార్ధన చెయ్!ఒకవేళ ఆయన మనల్ని కనికరించి నాశనం కాకుండా కాపాడతాడేమో"అన్నాడు
అప్పుడు నావికులు౼"ఎవరి కారణంగా ఈ ఆపద మనమీదికి వచ్చిందో చీట్లు వేసి తెలుసుకొందాం, రండి" అని చెప్పుకొన్నారు. వారు చీట్లు వేసినప్పుడు..చీటి 'యోనా' పేరు మీద వచ్చింది. ❇
■ దేవుడు ప్రవక్తయైన యోనాను నీనెవే మహా పట్టణానికి వెళ్లి ఆ ప్రజల ఘోర పాపాలను బట్టి హెచ్చరించమని చెప్పాడు. కానీ యోనా దేవుని మాట వినకుండా పారిపోయ్యాడు. అప్పుడు దేవుడు గొప్ప తుఫానును సముద్రం పైకి పంపాడు. పెద్ద గాలి తుఫానులతో నీటిలో నివసించే ప్రాణులు, అందులో ప్రయాణించే ఓడలు (మనుష్యులు) భయాందోళనకు గురైయ్యారు. ఓడను తేలిక చేయడానికి వారి వస్తువులు సముద్రంలో పడేశారు. ఎంతో నష్టం వారికి జరిగింది. ఒక్క మనిషి యొక్క అవిధేయతను బట్టి దేవుడు సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు.(ఆత్మీయతను లైటుగా తీసుకొనే విశ్వాసిని, దేవుడు కూడా లైటుగానే తీసుకుంటాడు కానీ) దేవుని చిత్తం నుండి యదార్థవంతుడైన, ఆత్మలో తీవ్రత కలిగిన విశ్వాసి బుద్ధిహీనంగా దేవుని చిత్తానికి ఎదురాడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఇందులో దేవుని ప్రేమ ఉంది. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించడం, దెబ్బ కొట్టటం వానికి ఎంతో మేలు! ఇది ఆ వ్యక్తిని గురించి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో, పట్టించుకుంటున్నాడో తెలియజేస్తుంది.
■ దేవుని నుండి వైదొలగిన విశ్వాసి (నులివెచ్చని)స్థితి, లోకానుసారుల స్థితి కంటే అద్వాన్నంగా ఉంటుందనేది సుస్పష్టమే! కొన్నిసార్లు లోకస్తులు, వారి విలువలు-ఆధ్యాత్మిక చింతన దిగజారిన విశ్వాసికి సిగ్గును కలిగించే విధంగా ఉంటాయి. లోకానికి దేవుని హెచ్చరికగా ఉండాల్సిన వారు, లోకం చేత హెచ్చరించబడే స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు నావికులు నమ్మే (చీట్లు వేసే)విధానాల్లో నుండే యోనాను దోషిగా నిలువబెట్టి, వారి మధ్యలో నుండి ప్రత్యేక పరచాడు. మన పడిన స్థితిని మనసాక్షి ద్వారా, కొన్నిసార్లు ఇతరుల చేత ఆయన గుర్తు చేస్తాడు. అవన్ని తిరిగి తండ్రి ఇంటికి బుద్ది తెచ్చుకుని మునుపటి స్థితికి తిరిగి రావాడానికి మేలుకొలుపులే! ఒకడు దేవుని(వాక్యం)లో మేధావిని అనుకుంటే, ఆ స్థాయికి తగిన వ్యక్తిగత విధేయతను, వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడు ఎదురుచూస్తాడు.దేవుని ప్రత్యక్షత, ఆయన వాక్కు యోనాతో, యోనా వద్ద ఉంది కనుక మిగితా వారందరి కంటే ఎక్కువ జవాబుదారీగా అతనున్నాడు. యోనాను ఆ ఓడ నుండి బయట పడేసేంత వరకు ఆ కల్లోలం ఆగలేదు. అప్పుడు ఆ ఓడలో వారంతా నివ్వెర పోయి, దేవుని ఆరాధించారు. దేవుడు సమకూడి జరిగించే పరిస్థితులను, ఆయన చిత్తాలను ఒకడు ఆత్మీయ సూక్ష్మ బుద్ధి (ఆత్మీయ నేత్రాలు, చెవులు కలిగి) తెల్సుకుంటూ, దానికి విధేయత చూపే జీవితం నిజంగా ఎంత ఆశీర్వాదకరమైన జీవితం! అదే నిజమైన ఆశీర్వాదం!
౼'దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి' అని కోరిక ఉన్న ప్రతివానికి ఆయన తెలియజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా, వివిధ విధానాల్లో ఆయన మనస్సును మనకు తెలియజేస్తాడు. ఆమెన్.
CHRIST TEMPLE-PRODDATUR
Pastor Nakkolla Daniel Balu
+91 8142229661
Comments