తన సోదరులకంటే ఘనుడు అయ్యాడు

✝ CHRIST TEMPLE-PRODDATUR

Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu

        తన సోదరులకంటే ఘనుడు అయ్యాడు

❇ యబ్బేజు తన సోదరులకంటే ఘనుడయ్యాడు. అతని తల్లి “బాధతో ఇతణ్ణి కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు ఇశ్రాయేలు ప్రజల దేవునికి ఇలా మొర పెట్టాడు౼“దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.(1దిన 4:9,10) ❇

■ 'యబ్బేజు' అనే పేరు(వేదన) అతనికి తన ప్రమేయమేమి లేకుండానే వచ్చింది. మన ప్రమేయమేమి లేకుండా మన జీవితంలోకి వచ్చినవి దేవుని అనాదికాల ప్రణాళికల నెరవేర్పుకు దేవుని చేత పంపబడినవే..అవి అలాగే ఉండటం సరైనదే! వాటిని ఆయన తన సంకల్పాల నెరవేర్పుకు అవి ఉండవాల్సి ఉన్నది. ఉదాహరణకు మన రూపం,శరీర ఆకృతి, జనన-సమయాలు,మన తల్లిదండ్రులు, జీవనశైలి, సామాజిక-ఆర్ధిక పరిస్థితులు, అభిరుచులు (భావోద్రేకాలు), పుట్టుకతోనే వచ్చే కొన్ని సమర్ధతలు-అసమర్ధతలు మె||నవి. అంతేకాకుండా మన జీవితాల్లో అకస్మాత్తుగా సంభవించి, మనల్ని బలహీనులుగా మార్చిన చేదైన సంఘటనలు. ఇలా కొన్ని మనం కోరుకోకుండానే మనకు దేవుని చేత ఇవ్వబడ్డాయి. దేవుని చేత నియమించబడినవి, కొన్నిసార్లు మనకు నిరుస్సాహన్ని, దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటాయి గనుక ఇలా కాకుండా, 'మరొకనిలా(మరొక విధంగా) ఉంటే బాగుంణ్ణు' అనిపిస్తుంది. 'యబ్బేజు' తన పేరును పిలుస్తున్న ప్రతిసారి తన సహోదరుల కంటే ఎక్కువ తన తల్లిని దుఃఖపెట్టిన నష్టజాతకులా అందరి ముందు కనిపించాడు.

■ ఎక్కడ అవమానం, కృంగుదల ఉంటాయో అక్కడ దేవుని కృప మరి యెక్కువగా విస్తరిస్తుంది (మీకా 5:2). ఒక నిస్సహాయత వాణ్ని దేవునికి మరింత దగ్గరగా చేర్చితే అదే వానికి నిజమైన బలం. అందుకే పౌలు తన బలహీనతల్లో దేవుని కృపను చూస్తూ..దాని బట్టి సంతోషించి అతిశయించాడు (2 కోరింథి 12:9). సహజంగా ఒకడు తన బలహీన సమయంలోనే ఎక్కువగా దేవునిపై ఆధారపడతాడు. అందుకే పాపులు, సుంకరులు క్రీస్తు దగ్గరకు రాగలిగారు. మేము బలవంతులం అనుకున్న మత పెద్దలు క్రీస్తును తిరస్కరించడానికి ఇదొక కారణం. తాను బలవంతుడ్ని అనుకునేవారికి దేవుని అవసరం ఏముంటుంది? ఇది అర్ధం చేసుకున్నప్పుడు మన బలహీనతలు దేవుని నుండి మనల్ని తొలగి పోనియ్యాక, ఆశ్రయించి అంటిపెట్టుకునటానికి సాధకాలని గ్రహించి వాటిని బట్టి పౌలు వలె అతిశయిస్తాము.

■ 'యబ్బేజు' తన సహోదరులందరి కంటే మరి యెక్కువగా దేవుణ్ని ఆనుకొనే వానిగా, ప్రార్ధనాపరునిగా ఉన్నాడు. అతని ప్రార్ధనను దేవుడు ఆలకించాడు. మన స్థితికి కారకులుగా కనిపిస్తున్న వారెవరిని నిందించకూడదు గాని అందులో ఉన్న దేవుని ప్రణాళికలను, ఆయన యొక్క సర్వభౌమ ఆధిపత్యాన్ని గుర్తించి, ఆయన చిత్తాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు, బలహీన ఘటాల్లో శ్రేష్ఠమైన దేవుని మహిమ మరియెక్కువగా కుమ్మరించబడుతుంది. అప్పుడు మన వేదన ఆశీర్వాదంగా మారిపోతుంది. యబ్బేజు అనే వేదన పుత్రుడు, అనేకులకు ఆశీర్వాద పుత్రునిగా మారాడు. యదార్థవంతుడైన ప్రతి ఒక్కడూ తాను బలహీనుడనని గ్రహిస్తాడు. దేవుని అవసరం సమస్త మానవాళికి ఉంది. నీ బలహీనతల్లో దేవుడు మాత్రమే నింపగలిగిన ఖాళీ ప్రదేశం ఉంది. తన ఆత్మ శక్తితో నింపమని ఆయన్ను అడుగు..!అదే నీ బలంగా మారుతుంది.. అప్పుడు మనం వట్టి వారమని గ్రహిస్తూ దేవునికే సంపూర్ణ మహిమను ఆపాదిస్తాము. ఆమెన్.

CHRIST TEMPLE-PRODDATUR
Pastor Nakkolla Daniel Balu
+91 8142229661

Comments